శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః
<< ఆళవందార్ల శిష్య పంచకము భగవద్రామానుజుల ఉత్తారకత్వమును ప్రతిపాదించుట
పూర్వ వ్యాసములో (https://granthams.koyil.org/2016/02/14/charamopaya-nirnayam-ramanujars-acharyas-telugu/) ఆళవందార్ల యొక్క శిష్య పంచకము భగవద్రామానుజుల ఉత్తారకత్వము నిరూపించిన విధమును చూచితిమి. ఈ వ్యాసములో ఇంకనూ విపులముగా భగవద్రామానుజుల ఉత్తారకత్వమును మరి కొన్ని దివ్యానుభావాల ద్వారా తెలుసుకొందాం!
ద్వాపర యుగమందు కృష్ణావతారము ధరించి భువికి వేంచేసిన శ్రియఃపతి అయిన శ్రీమన్నారాయణుడు అర్జునుని పట్ల అవ్యాజమైన అభిమానము చేత తన విషయమైన చరమ శ్లోకమును (‘సర్వధర్మాన్ …. మా శుచ!!’) అనుగ్రహించి తానే ప్రథమోపాయముగా నిశ్చయించిన విధముగా భగవద్రామానుజులు కూడా ఈ కలియుగ మందు జనులు గుర్తించ వలసిన చరమోపాయము తామే యని నిశ్చయించిన సందర్భము ఒకటి ఉన్నది. అది ఉడయవర్లు తిరునారాయణ పురమందు వేంచేసి ఉన్న కాలమందు జరిగినది. ఒకనాడు ముదలియాణ్డాన్ (దాశరథి) “యాదవగిరి మహాత్మ్యము” ను పారాయణ చేయుచుండగా ఒక శ్లోకము తటస్థించినది.
“అనంతశ్చ ప్రథమమ్ రూపం, లక్ష్మణశ్చ తతః పరమ్ !
బలభద్రః తృతీయస్తు, కలౌ కశ్చిత్ భవిష్యతి !! ”
అర్థము – ప్రథమ రూపమున అనంతుడై ఉండి పిదప లక్ష్మణ స్వామిగా అవతరించెను. పిదప బలభద్రునిగా అవతరించెను. ఈ కలియుగమున కూడా అవతరించి ఉన్నారు.
ఈ శ్లోకము వచ్చినంతనే పారాయణ ఆగినది. అక్కడ ఉన్న శిష్యులు, పండితులు ఆ శ్లోకములో చెప్పబడి నట్టుగా కలియుగమున అనంతుడు ఎవరి రూపములో అవతరించెను ? అని ముదలి యాణ్డాన్ని ప్రశ్నించెను. అంతట ముదలి యాణ్డాన్ పరమ భక్తి పూర్వకముగా భగవద్రామానుజుల వంక చూచి “ఉడయవర్లే చెప్పాలి!” అనెను. అంతట ఉడయవర్లు ముదలి యాణ్డాన్ మాటను అపేక్షించి “ఆళ్వార్లను ఉద్దేశించి ఋషి చెప్పి ఉంటారు. ” అని బదులిచ్చెను. అయితే ఉడయవర్ల బదులుకు గోష్టి సంతృప్తి చెందక, “మాపై దయుంచి ఇం కొంచెం విపులీకరించ వలసింది! ” అని ఉడయవర్లను వేడుకొనెను. అపుడు ఉడయవర్లు, “ముందు పారాయణము పూర్తి అవ్వనివ్వండి. ఇంకొకమారు చెప్పెదము”, అని విషయము గంభీరముగా దాటవేసెను. ఆనాటి రాత్రి ఉడయవర్ల శిష్యులైన ముదలి యాణ్డాన్, ఎంబార్, తిరునారాయణపురత్తరయర్ , మారుతియాణ్డాన్, ఉక్కలమ్మాళ్ ముదలగువారు ఉడయవర్లను సమీపించి ఆ శ్లోకమునకు అర్థమును తెలియపరచ వలసిందని ప్రార్థించగా, ఉడయవర్లు.”దాని రహస్యార్థమును మీకు తెలియపరచ వలెననిన ఒక షరతు! దీనిని ఎట్టి పరిస్థితులలోనూ ఇంకెవ్వరికీ చెప్పరాదు సుమా! ఋషి ఆ శ్లోకములో చెప్పిన భవిష్యదాచార్యులు మేమే!! మమ్ము ఆశ్రయించుటయే చరమోపాయము. అనంతుని యొక్క దివ్యాంశగా ఈ కలియుగమున జనోద్ధరణకై అవతరించితిమి”, అని బదులిచ్చి వారిని అనుగ్రహించెను. ఈ విషయము పరమ రహస్యముగా ఉన్ననూ బయటకు రాక తప్పలేదు.
ఒకనాడు తిరుమాలిరుంజోలై అళగర్ సన్నిధిలో అధ్యయనోత్సవము జరుగు చుండగా, పెరుమాళ్ళు గోష్టిని ఉద్దేశించి, “నమ్మిరామానుశముడైయార్కు అరుళప్పాడు”- అర్థము: మా రామానుజుల యొక్క శిష్యులను ఆహ్వానిస్తున్నాము, అనెను. అంతట, అందరు శ్రీ వైష్ణవులు, “నాయన్దే!” (నేను నీ దాసుడను), అని ముందుకు వచ్చెను.
కానీ కొందరు మహాపూర్ణుల శిష్యులు మాత్రం లేచి ముందుకు రాలేదు. అప్పుడు అళగర్ పెరుమాళ్ళు వారు రాకపోవుటకు కారణమేమని ప్రశ్నించగా వారు, “దేవరవారు భగవద్రామానుజుల శిష్యులను మాత్రం ఆహ్వానించియున్నారు. భగవద్రామానుజులు మా ఆచార్యులు పెరియ నంబిగారి శిష్యులగుట చేత మేము రాలేదు”, అని బదులిచ్చెను. అప్పుడు పెరుమాళ్ళు వారికి ఈ విధముగా సమాధానమిచ్చెను, “ఎమ్బెరుమానార్ల వారికి మహాపూర్ణులు ఆచార్యులు! అదెట్లనగా మాకు రామావతారములో దశరథునివలె అలాగే కృష్ణ వతారములో వసుదేవుని వలె మేము వారలకు కుమారునిగా జన్మించిననూ మా అవతార కార్యములో వారి పాత్ర నామమాత్రమే! అటులనే ఎమ్బెరుమానార్లు కేవలం సకల జీవోద్ధరణే ప్రథమ కారణముగా అవతరించియున్నారు. సర్వ జీవులు వారిని ఆశ్రయించియే ఉజ్జీవించగలరు. మీరు ఈ నిజమును గుర్తించుము! “.పిమ్మట అళాగర్ పెరుమాళ్ళు ఉడయవర్ల ప్రియ శిష్యులైన కిడంబి ఆచ్చాన్ ను ఆహ్వానించి ఒక పాశురము మధురముగా ఆలపించమని ఆజ్ఞాపించెను. అంతట పరమ వినయశీలులైన ఆచ్చాన్ లేచి నిలబడి ఆళవన్దార్ స్తోత్రమందలి “న ధర్మ నిష్టోస్మి న చ ఆత్మవేదీ న భక్తిమాన్ త్వచ్చరణారవిన్దే ! అకించనోऽనన్య గతిశ్శరణ్యః త్వత్పాదపద్మమ్ శరణం ప్రపద్యే !! ” అను శ్లోకమును శ్రావ్యముగా ఆలపించెను.
అర్థము – ‘ఓ స్వామి! నేను ధర్మనిష్టుడను కాను! ఆత్మా జ్ఞానిని కాను! నిను ఆశ్రయించుటకు ఏ విధమూ తెలియనివాడను. ఓ సర్వజీవులకు శరణ్యమైనవాడా! ఇదే నీ చరణారవిన్దములను ఆశ్రయించుచున్నాను’,
అంతట అళగర్ పెరుమాళ్ళు, “ఆచ్చాన్! అదేమి ఇలా అంటున్నారు. సకల జీవోజ్జీవకులైన ఉడయవర్లను ఆశ్రయించినాక ఇక ఉజ్జీవనకై భయమేల? మీరు ఒక గొప్ప ఆచార్యుని ఆశ్రయములో జీవించుచున్నారు. మీరు ఇలా అనుట పాడి కాదు”, అని బదులిచ్చిరి.
కాంచిపురములో ఒక బ్రాహ్మణుడికి కలిగిన కుమారుడు ఆరేళ్ళ వయస్సు వచ్చిననూ ఇంకా మాటలు రాక ఉండెను. ఆ బాలుడు రెండు సంవత్సరాలు కనపడ కుండా ఎక్కడికో పోయి తిరిగి వచ్చెను. తిరిగి వచ్చిన ఆ బాలుడు మంచి ముఖవర్చస్సు కలిగి మృదు మధురముగా మాటలాడు చుండెను. ఇంతకాలము ఎక్కడికి వెళ్ళావని అందరూ ఆ బాలుని ప్రశ్నించగా, “నేను క్షీరాబ్దికి వెళ్లి పెరుమాళ్ళను సేవించాను. అక్కడి జనులందరూ ఇలా మాట్లాడుకొను చున్నారు. పెరుమాళ్ళ సేనాపతి విశ్వక్సేనులవారు ఈ కలియుగములో జనులను ఉద్ధరించుటకు ఇళయాళ్వారుగా అవతరించెను.!”, అని చెప్పి ఆ బాలుడు అందరూ చూస్తూండగానే అంతర్ధానమయ్యెను. ఈ విధముగా క్షీరాబ్ది నాధుడైన భగవంతుడు ఆ బాలకుని మూలముగా ఉడయవర్ల జన్మ కారణత్వమును తెలియపరచెను.
ఇళయాళ్వారు యాదవ ప్రకాశుల వద్ద సామాన్య శాస్త్రములను అభ్యసిస్తున్న రోజులలో ఒకనాడు ఆ దేశపు రాజు యొక్క కూతురికి బ్రహ్మ రాక్షస్సు (పూర్వ జన్మ యందు ఈ బ్రహ్మ రాక్షస్సు ఒక బ్రాహ్మణుడై ఉండి వేద, ధర్మ శాస్త్రార్థములకు వక్ర భాష్యములు చెప్పి ఆదాయమును గడించుట వలన అతనికి మరు జన్మయందు బ్రహ్మరాక్షస్సు గతి పట్టెను!) పట్టి తాను యువరాణిని విడిచిపెట్టవలెనన్న ఇళయాళ్వారు వచ్చి తమ పాదములతో తన శిరస్సును తాకి తనకు మోక్షము ఇప్పించవలెనని చెప్పెను. చిన్న పిల్లవాడైన ఇళయాళ్వారు వలన పిశాచి పీడ తొలగించటం ఏమవుతుందని భ్రమించిన యాదవ ప్రకాశులు తామే స్వయముగా రాజు ఆస్థానమునకు వెళ్లి ఎన్నో పిశాచ విమోచన మంత్రములు జపించి ప్రయత్నించి విఫలమయ్యెను. ఆ బ్రహ్మ రాక్షస్సు, “ఓరి వెర్రివాడా! నీవా నన్ను విడిపించునది? అది నీ వల్ల సాధ్యపడదు! పోయి నీ శిష్యుడు ఇళయాళ్వారుని పంపించుము ! అతను ఎవరో కాదు! శ్రియఃపతి అయిన శ్రీమన్నారాయణుని యొక్క నిత్య సూరులైన గరుడ విశ్వక్సేనాదులకు నాయకుడైన ఆదిశేషుడే మానవ రూపములో ఈ కలియుగములో జీవులను ఉద్ధరించుటకు అవతరించెను. అతడే నన్ను తరింపచేసి నాకు మోక్షము ప్రసాదించగలడు. మూర్ఖుడా! నీకును అతడే దిక్కు ! వెళ్లి అతనినే ఆశ్రయించుము ” అని యాదవప్రకాశులను హేళనగా మాట్లాడి ధిక్కరించెను. పిదప ఇళయాళ్వారు తమ పాదములను యువరాణి తలకు తాకించగా ఆ బ్రహ్మరాక్షస్సు యువరాణిని విడిచిపెట్టి సభలో అందరు చూస్తుండగా ఇళయాళ్వారుకు నమస్కరించి మోక్షమును పొందెను. ఈ విధముగా చిన్న వయస్సులోనే భగవద్రామానుజుల అవతార విశేషము జగద్విఖ్యాతమయ్యెను.
ఉడయవర్లు తాము రాసిన శ్రీ భాష్యమును దేశమంతటా ప్రచారము చేయుచు కాశ్మీరులోని శారదా పీఠమును దర్శించెను. ఆనాడు శారదా దేవి ఉడయవర్లను స్వయముగా ఆహ్వానించి వారు రాసిన శ్రీ భాష్యమును విని పరమ సంతోషపడెను. ముఖ్యముగా ఛాన్దోగ్య ఉపనిషత్తులోని “కప్యాసమ్ పుండరీకమేవమక్షిని” అను వాక్యముకు ఉడయవర్లు శాయించిన, “పరమ పురుషుడైన శ్రీ మన్నారాయణుని నేత్రములు నీరు త్రాగి ప్రకాశించుచున్న సూర్యుని యొక్క కిరణాలు పడి వికసించిన ఎర్రకలువ పుష్పపు రేకులవలే యున్నవి” అన్న వ్యాఖ్యానమునకు పులకితురాలైన సరస్వతీదేవి, “ఉడయవరే! మీరు కారణ జన్ములు. మీ యొక్క నిర్హేతుక కృప చేత ఈ చేతనాచేతన జీవరాశిని ఉద్ధరించి ఉజ్జీవింప చేయుటకే అవతరించినవారు! నేడు నా పుణ్య విశేషము చేత నాకు శ్రీ భాష్యము వినిపించి అనుగ్రహించినారు. మీరే “భాష్యకారులు”గా ప్రఖ్యాతి పొందుదురు గాక! ” అని తెలిపెను. ఈ విధముగా శారదాదేవి కూడా ఉడయవర్ల యొక్క అవతార వైశిష్ట్యమును ప్రకటించెను.
ఇక వచ్చే అధ్యాయములో పూర్వాచార్యులైన పెద్దలు భగవద్రామానుజుల వైభవ ప్రశస్తిని అనుభవించి తరించిన విధమును తెలుసుకొనెదము.
అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్
మూలము: https://granthams.koyil.org/2012/12/charamopaya-nirnayam-ramanujar-avathAra-rahasyam/
పొందుపరిచిన స్థానము: https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org
0 thoughts on “చరమోపాయ నిర్ణయం – భగవద్రామానుజుల అవతార రహస్యము”