శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః
వార్తామాలైలో మన పూర్వాచార్యులు పరంపరగా అందించిన తత్వ నిర్ణయం, సంప్రదాయ సంబంధిత ముఖ్యమైన సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ ఉపదేశాలు, అలాగే వారి జీవితంలోని ముఖ్య సంఘటనలను, శ్రీ పిన్బళగియరామ్ పెరుమాళ్ జీయర్ (నంపిళ్ళై స్వామికి అత్యంత ప్రియ శిష్యులు, మరియు 6000 పడి గురుపరంపర ప్రభావం అనుగ్రహించిన వారు) సంక్షిప్తంగా అందించారు. ఐతిహ్యాలు మరియు చారిత్రక సంఘటనలు చదవడం ద్వారా సులభంగా అర్థమవుతాయి గాని, మన సిద్ధాంతంలోని చిత్, అచిత్, ఈశ్వరన్ వంటి అంశాలపై అనేక అనేక వార్తల్లో చేసిన విశ్లేషణలను గ్రహించడం కొంత క్లిష్టంగా ఉండవచ్చు. ఈ భాగాలను అర్థం చేసుకోవడానికి శాస్త్రాలలోనూ, వేదాంతపు ప్రాథమిక సిద్ధాంతాలలోనూ మంచి పరిజ్ఞానం అవసరం.
ఈ గ్రంథాన్ని ప్రచురించి, ఈ క్లిష్టమైన సిద్ధాంతాలకు విపులమైన వివరణను కూడా అందించిన పుత్తూర్ స్వామికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
క్రింద ఇచ్చిన వ్యాసం, శ్రీ ఉ.వే. సారథి తోతాద్రి స్వామివారు వార్తామాలై పై సాయించిన తమిళ కాలక్షేపముల లిఖిత రూపం. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరియు వీటిని ప్రచురించడంలో నిరంతరం సహకరిస్తున్నందుకు స్వామివారికి మన కృతజ్ఞతలు.
“వార్తై” అనగా ఆచార్యులు శిష్య పరంపర ద్వారా అందించిన ఉపదేశాలు, తర్వాత సంక్షిప్తంగా సమగ్ర పరచబడినవి.
గమనించవలసిన కొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయి, కొన్నిసార్లు అదే సిద్ధాంతం భిన్నమైన వార్తైల్లో కొద్దిగా భిన్నమైన వ్యాఖ్యానాలతో పునరావృతమవుతుంది. దీనికి కారణం, వివిధ ఆచార్యులు ప్రత్యేక అంశాలను ప్రధానంగా ఉద్భోదించేందుకు వేర్వేరు దృష్టికోణాలతో వివరణ ఇవ్వడం అని గ్రహించవలెను.
వార్తై 4
నాలుగవ వార్తై యొక్క సారాంశం:
- చిత్ యొక్క స్వరూపం మరియు స్వభావం
- అచిత్ యొక్క స్వరూపం మరియు స్వభావం
- ఈశ్వరన్ యొక్క స్వరూపం మరియు స్వభావం
- అచిత్ జడం; దానికి అనేక మార్పులు ఉంటాయి
- చిత్ అజడం; అది ఎమ్పెరుమాన్‌కు శేషభూతంగా (అధీనంగా) ఉంటుంది
- ఈశ్వరన్ శ్రియఃపతి (శ్రీమన్నారాయణుడు)
- ఈశ్వరుని స్వభావం ఇతరులను రక్షించడం
నాలుగవ వార్తై
ప్రకృతియినుడైయ స్వరూపమ్ జడమ్ స్వభావమ్ కొణ్డదు గుణమాయ్ ఇరుక్కు మ్; పురుషనుడైయ స్వరూపమ్ శేషత్వమ్ స్వభావమ్ స్వరూపత్తుక్కు అనురూపమాన వృత్తి. ఈశ్వరనుక్కు స్వరూపమ్ శ్రియ:పతిత్వమ్; స్వభావమ్ రక్షకత్వమ్. ఆత్మా వినుడైయ స్వరూపమ్ జ్ఞాతావాయ్ జ్ఞానమాయ్ జ్ఞేయమాయ్ ఇరుక్కు మ్;
స్వరూపమ్ జ్ఞాతావాయ్ స్వభావమ్ జ్ఞానమాయ్ స్వవిభూతి జ్ఞేయమాయ్ ఇరుక్కు మ్.
పరమాత్మా వుడన్ జీవాత్మా వుడన్ ఉళ్ళవైజ్ఞేయమాయ్ ఇరుక్కు మ్; స్వరూపమ్ అహమ్ ఎన్ఱిరుక్కు మ్ ఇదమ్ ఎన్నమాత్తాధు; అఱిగిఱదు తన్నైయాగైయాలే జ్ఞేయమాయ్ ఇరుక్కు మ్; అఱిగిఱాన్ తానాగైయాలే జ్ఞాతావాయిరుక్కు మ్; అఱివు తానాగైయాలే జ్ఞానముమాయ్ ఇరుక్కు మ్; అఱిగిఱవన్ తానాగైయాలే జ్ఞాతావామ్. ఇదు ఎన్ను డైయ స్వభావమ్ ఎన్ఱు తన్ స్వభావత్తై అఱియుమిదత్తు స్వభావన్తానే ఇదమ్ ఎన్గిఱ పరికరమాగైయాలే, స్వభావమ్ జ్ఞానముమాయ్ జ్ఞేయముమాయ్ ఇరుక్కు మ్.
వివరణము
ఈ వార్తై యొక్క అర్థాన్ని గ్రహించాలంటే, ముందు కొన్ని పదాల అర్థాలు తెలుసుకోవాలి.
- జడం – సాధారణంగా జ్ఞానం లేని వస్తువు అని అర్థం.
- అజడం – సాధారణంగా జ్ఞానం కలిగిన వస్తువు అని అర్థం.
- ప్రకృతి – ఇక్కడ అచేతనం (జ్ఞాన రహితమైనది) అని సూచిస్తుంది.
- స్వరూపం – ఒక వస్తువుకు ప్రత్యేక గుర్తింపును ఇచ్చే మూల స్వభావం.
- స్వభావం – ఆ వస్తువుకు ప్రత్యేక గుర్తింపు వచ్చిన తరువాత దానిలో ఉండే అదనపు గుణాలు. ఉదాహరణకు, మనిషి యొక్క స్వరూపం మనుష్య లక్షణాలు కాగా, స్వభావం అంటే అతనికి 2 చెవులు, 2 చేతులు, 2 కళ్లు ఉండటం, మంచి వ్యక్తి లేదా చెడు వ్యక్తి కావడం వంటి గుణాలు.
- జ్ఞాతా – తెలిసినవాడు, తెలుసుకునేవాడు.
- జ్ఞానం – జ్ఞానం, తెలిసే శక్తి.
- జ్ఞేయం – తెలుసుకోబడే విషయం లేదా వస్తువు.
- అహం – ఆత్మను సూచిస్తుంది.
- ఇదం – మనం చూపించి సూచించే అన్ని అచేతన వస్తువులను సూచిస్తుంది.
ప్రకృతియినుడైయ స్వరూపం జడం
మూడు తత్వాలు – చిత్, అచిత్, ఈశ్వరన్. ముందుగా ఈ తత్వాల స్వరూపం వివరించబడుతుంది. ప్రకృతి (మూలప్రకృతి) అచేతనం. ప్రకృతి యొక్క స్వరూపం ఏమిటంటే, దానికి జ్ఞానం ఉండదు. అందువల్ల జ్ఞానం లేనివన్నీ ప్రకృతి అని చెప్పబడతాయి. మనం చుట్టూ చూసే బల్లలు, కుర్చీలు, పాత్రలు, మన శరీరం మొదలైన వాటికి జ్ఞానం ఉండదు. జ్ఞానం లేని ఈ వస్తువులనే ప్రకృతి (అచేతనం) అంటారు. జ్ఞానం లేకపోవడమే ప్రకృతి యొక్క అసలు స్వభావం.
స్వభావం కొండదు గుణమాయ్ ఇరుక్కుమ్
“కొండదు గుణమాయ్ ఇరుక్కుమ్” అంటే ప్రకృతి నిరంతరం మారుతూ ఉంటుంది. అచేతన వస్తువులు పరిస్థితులను బట్టి మార్పులకు లోనవుతాయి. అవసరానుసారం మార్పు చెందడం ప్రకృతి సహజమైన స్వభావం. మార్పు చెందడమే ప్రకృతి యొక్క స్వభావం.
ప్రకృతిలో అనేక విధాలైన తన్మైలు (లక్షణాలు) కనిపిస్తాయి. ఉదాహరణకు, అనేక రకాల చెట్లు, మొక్కలు, రాళ్లు, కలప మొదలైనవి ఉన్నాయి. పంచభూతాలు ఉన్నాయి; వాటి మిశ్రమం ద్వారా ఇతర వస్తువులు ఏర్పడతాయి.
ఆత్మ గురించి మాట్లాడినప్పుడు, అన్ని ఆత్మలూ ఒకే స్థితిలో ఉంటాయి. ఒక ఆత్మకు మరో ఆత్మకు మధ్య స్వరూప భేదం కనిపించదు. శరీర భేదాల వల్ల జ్ఞానం పెరగడం లేదా తగ్గడం ఉండవచ్చు గాని, ఆత్మల మధ్య అసలు తేడా ఉండదు. కానీ ప్రకృతిలో, బల్లను లేదా కుర్చీని చూసినప్పుడు వాటి ఆకారాల ద్వారా మనం భేదాన్ని గుర్తించగలం. బల్ల లక్షణాలు కుర్చీ లక్షణాలకు భిన్నంగా ఉంటాయి. కాబట్టి వాటి స్వభావం పరస్పరం భిన్నంగా ఉంటుంది.
పురుషనుడైయ స్వరూపం శేషత్వం
ఇక్కడ “పురుషన్” అనగా చైతన్యం (చిత్), ఆత్మ. పురుషుని అసలు స్వరూపం, అదిమై (అధీనత్వం, సేవకత్వం).
స్వభావం – స్వరూపత్తుక్కు అనురూపమాన వృత్తి
పురుషుని స్వభావం ఏమిటంటే, తన అసలు స్వరూపానికి తగిన విధంగా ప్రవర్తించాలి. ఉదాహరణకు, ఎవరో ఒకరికి సేవకుడైతే, ఆ సేవకుడు తన యజమానికి ఆనందం కలిగించే పనులు చేయాలి. అలాంటి వృత్తియే పురుషుని స్వభావం.
ఈశ్వరనుక్కు స్వరూపం – శ్రీయఃపతిత్వం
ఈశ్వరుని అసలు స్వరూపం శ్రీయఃపతిత్వం. ఆయన పిరాట్టి యొక్క భర్త, “తిరుమగళ్ కేళ్వన్”. ఇదే ఎమ్పెరుమాన్ యొక్క స్వరూపం. “పెరుమాళ్ శ్రీమన్ నారాయణ” అని చెప్పినప్పుడు, ఎల్లప్పుడూ పిరాట్టితో (శ్రీ మహాలక్ష్మితో) కూడి ఉన్న తిరుమాల్ మనకు గుర్తుకు వస్తాడు. “తిరువుక్కుం తిరువాగియ సెల్వా”, “కః, శ్రీః, శ్రియః” వంటి వాక్యాలు ఎమ్పెరుమాన్ ఎల్లప్పుడూ పిరాట్టితో కలిసి ఉంటాడని తెలియజేస్తాయి. ఆయన పిరాట్టి ద్వారా గుర్తించబడేవాడు. ఆళ్వార్లు, “తిరువిల్లాత్ దేవరై తేరేల్మిన్ దేవు” అని చెప్పారు. ఇలాంటి అనేక ప్రమాణాల ద్వారా, శ్రియఃపతి (పిరాట్టి భర్త) కావడమే ఎమ్పెరుమాన్ యొక్క స్వరూపమని తెలుస్తుంది.
స్వభావం రక్షకత్వం
ఈశ్వరుని ప్రధాన గుణం రక్షకత్వం. సమస్తాన్ని రక్షించేవాడు ఆయనే. అన్ని స్వభావాలలో ఇతరులను రక్షించే గుణమే ఈశ్వరుని ముఖ్య లక్షణం. చిత్ అయినా, అచిత్ అయినా, ఆయన అందరినీ మరియు అన్నిటినీ రక్షిస్తాడు. ఇదే ఈశ్వర స్వభావం.
ఆత్మావినుడైయ స్వరూపం – జ్ఞాతావాయ్ జ్ఞానమాయ్ జ్ఞేయమాయ్ ఇరుక్కుమ్
ఇక్కడ ఆత్మ యొక్క స్వరూపం మరింత వివరించబడుతోంది.
- ఆత్మ యొక్క స్వరూపం జ్ఞాతా. ఆత్మ తెలుసుకునేవాడు. ఒక వస్తువును చూసినప్పుడు దాని గురించి జ్ఞానం పొందుతాడు; అందువల్ల అతడు జ్ఞాతా.
- ఆత్మ జ్ఞానమయం కూడా. అంటే అతడు జ్ఞాన స్వరూపుడు మరియు జ్ఞానం కలిగిన వాడు. ధర్మి జ్ఞానం ఆత్మ; ధర్మభూత జ్ఞానం ఆత్మకు ఉన్న జ్ఞానం. కాబట్టి ఆత్మ జ్ఞాతా కూడా, జ్ఞానం కూడా. ఆత్మ జ్ఞానమయం అని చెప్పినప్పుడు, అది ఏదో స్పృశించడానికి వీలయిన పదార్థంగా భావించ కూడదు. అది అణు స్వరూపం; అవిభాజ్యం; అవయవాలు లేనిది. ఆ అణువే జ్ఞానం.
- ఆత్మ జ్ఞేయం కూడా. ఒక ఆత్మ మరొక ఆత్మను తన జ్ఞానంతో తెలుసుకోగలదు. అలాగే భగవంతునిని కూడా తెలుసుకోగలదు. అందువల్ల ఆత్మ జ్ఞేయం కూడా అవుతుంది.
స్వరూపం జ్ఞాతావాయ్ స్వభావం జ్ఞానమాయ్ స్వవిభూతి జ్ఞేయమాయ్ ఇరుక్కుమ్
ఇక్కడ స్వరూపం మరింత వివరించబడుతోంది. జ్ఞాతా, జ్ఞానం, జ్ఞేయం అనే భావాలు వివరించబడుతున్నాయి.
- స్వరూపం, ఆత్మ యొక్క అసలు స్వభావం జ్ఞాతా (తెలుసుకునేవాడు).
- స్వభావం, ఆత్మకు జ్ఞానం ఉంటుంది.
- స్వవిభూతి, ఆత్మ యొక్క సంపదలు (విభూతి అంటే సంపద) ఆత్మ ద్వారా తెలుసుకోబడగలవిగా ఉంటాయి; అంటే జ్ఞేయములు.
పరమాత్మావుడన్ జీవాత్మావుడన్ ఉళ్ళవై జ్ఞేయమాయ్ ఇరుక్కుమ్
పరమాత్మ వద్ద ఉన్నవన్నీ, జీవాత్మ వద్ద ఉన్నవన్నీ తెలుసుకోబడగలవే.
(“జ్ఞేయమాయ్ ఇరుక్కుమ్”, తెలుసుకోబడగలవి)
స్వరూపం “అహం” ఎండ్రిరుక్కుం; “ఇదం” ఎన్నమాట్టాదు
“అహం” అంటే “నేను”. ఆత్మ యొక్క స్వరూపం తనను “నేను” అని గుర్తిస్తుంది. కాబట్టి దానిని “ఇది” అని సూచించలేం. “నేను” మరియు “ఇది” రెండూ భిన్నమైనవి. ఆత్మ స్వరూపమైన ధర్మి జ్ఞానం ఎల్లప్పుడూ ఆత్మకు “నేను” లేదా తమిళంలో “నాన్” అనే భావనను కలిగిస్తుంది.
అందుకే నిద్రలేచిన తరువాత కూడా నిద్రకు ముందు జరిగిన విషయాలు మనకు గుర్తుంటాయి. ఇది “నాన్” అనే భావన వల్ల. “అహం” భావం వల్ల గతంలో జరిగినది, ఇప్పుడు జరుగుతున్నది, నిద్రకు ముందు జరిగినది, నిద్రలేచిన తరువాత జరుగుతున్నది అన్నీ మనకు తెలుసుతాయి.
అందువల్ల ధర్మి జ్ఞానాన్ని “ఇదం” లేదా “ఇది” అని పిలవలేం. “ఇదం” అనేది అచేతన వస్తువులను సూచిస్తుంది. “ఇది ఉంది” అని చెప్పినప్పుడు అది అచేతన వస్తువును సూచిస్తుంది. “నేను ఉన్నాను” (“నాన్ ఇరుక్కిరేన్”) అనేది ఆత్మను సూచిస్తుంది. కాబట్టి ధర్మి జ్ఞానం (ఆత్మ) ను “నేను” లేదా “నాన్” అని మాత్రమే సూచించాలి; “ఇది” అని కాదు, ఎందుకంటే అది అచేతన వస్తువు కాదు.
అఱిగిఱదు తన్నైయాగయాలే జ్ఞేయమాయ్ ఇరుక్కుమ్
మనం “నేను” లేదా “నాన్” అని చెప్పినప్పుడు ఆత్మను తెలుసుకుంటాము. జ్ఞానం ద్వారా ఒక వస్తువును తెలుసుకుంటాం; తెలుసుకోబడేది జ్ఞేయం. అలాగే నా జ్ఞానం ద్వారా నేను నన్ను తెలుసుకుంటాను. కాబట్టి ఆత్మ కూడా తెలుసుకోబడగల వస్తువు; అందువల్ల అది జ్ఞేయం.
అఱివు తానాగైయాలే జ్ఞానముమాయ్ ఇరుక్కుమ్; అఱిగిఱవన్ తానాగైయాలే జ్ఞాతావామ్
ధర్మి జ్ఞానం స్వయంగా ఉన్నందున అది జ్ఞానం. అది తనను తాను తెలుసుకుంటున్నందున అది జ్ఞాతా (తెలుసుకునేవాడు).
ఇదు ఎన్నుడైయ స్వభావమ్ ఎన్ఱు తన్ స్వభావత్తై అఱియుమిదత్తు స్వభావన్తానే ఇదమ్ ఎన్గిఱ పరికరమాగైయాలే, స్వభావం జ్ఞానముమాయ్ జ్ఞేయముమాయ్ ఇరుక్కుమ్
ఇక్కడ ధర్మభూత జ్ఞానం వివరించబడుతోంది. “ఇది నా జ్ఞానం” అని మనం తెలుసుకున్నప్పుడు, ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడం కూడా అదే జ్ఞానం ద్వారా జరుగుతుంది. అందువల్ల స్వభావం జ్ఞానం కూడా, జ్ఞేయం కూడా అవుతుంది.
ఐదవ వార్తై
అచిత్తుక్కు స్వరూపమ్ శేశత్వే సతి జడత్వమ్; స్వభావమ్ సతతపరిణామిత్వమ్; ఆత్మా వుక్కు స్వరూపమ్ జ్ఞాత్రుత్వే సతి శేశత్వమ్; స్వభావమ్ కైంకర్యైక రసత్వమ్; ఈశ్వరనుక్కు స్వరూపమ్ జ్ఞాత్రుత్వే సతి శేశిత్వమ్; స్వభావమ్ సర్వరక్షకత్వమ్. తత్వన్దాన్, జడమెన్ఱుమ్ అజడమెన్ఱుమ్ ఇరణ్డు. జడన్దాన్ నిర్గుణమెన్ఱుమ్ సగుణమెన్ఱుమ్ ఇరణ్డు; సగుణన్దాన్ త్రిగుణమెన్ఱుమ్ ఏకగుణమెన్ఱుమ్ ఇరణ్డు; త్రిగుణన్దాన్, ప్రకృతియెన్ఱుమ్ ప్రాకృతమెన్ఱుమ్ ఇరణ్డు. అజడన్దాన్ పత్ర్యక్కెన్ఱుమ్ పరాక్కెన్ఱుమ్ ఇరణ్డు; పత్ర్యక్కు త్తాన్,ఆత్మా వెన్ఱుమ్ ఈశ్వరనెన్ఱుమ్ ఇరణ్డు; పరాక్కు త్తాన్ జ్ఞానమెన్ఱుమ్ జ్ఞేయమెన్ఱుమ్ ఇరణ్డు.
వివరణ
ఈ ఐదవ వార్తైలో తత్వత్రయం మళ్లీ వివరించబడుతోంది. ముందే చెప్పినట్లుగా, ఒక ఆచార్యుడు ఒక సందర్భంలో చెప్పిన విషయాన్ని, మరొక ఆచార్యుడు మరో సందర్భంలో మరింత వివరించి ఉండవచ్చు. ఆ ఉపదేశాలన్నీ ఇక్కడ క్రమపద్ధతిలో సమీకరించబడ్డాయి. అందువల్ల వివరణల్లో తేడాలు కనిపించినా, అవి వచ్చిన సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి.
ఇక్కడ కొత్తగా అర్థం చేసుకోవాల్సిన పదాలు, ప్రత్యక్ మరియు పరాక్.
- ప్రత్యక్ అంటే స్వయం ప్రకాశం; తనను తాను తెలుసుకోగలగడం.
- పరాక్ అంటే ఇతరులు తెలుసుకోగలగడం.
ఉదాహరణకి, ఆత్మ తన ఉనికిని తెలుసుకుంటుంది, “నేను ఉన్నాను” అని తెలుసుకుంటుంది. కానీ బల్ల లేదా కుర్చీ తన ఉనికిని తెలుసుకోదు; ఇతరులు చూసి తెలుసుకుంటారు. కాబట్టి ఇతరుల ద్వారా తెలుసుకోబడేది పరాక్; తనను తాను తెలుసుకోగలది ప్రత్యక్.
గుణాలు మూడు విధాలు, సత్వం, రజస్సు, తమస్సు. ఈ గుణాల మిశ్రమం వల్లనే, ఈ వార్తైలో వివరించినట్టుగా, వివిధ వస్తువులు ఉద్భవిస్తాయి.
అచిత్తుక్కు స్వరూపం శేషత్వే సతి జడత్వం
మునుపటి వార్తైలో అచిత్ యొక్క స్వరూపం జడం అని చెప్పబడింది. ఇక్కడ శేషత్వం కూడా చేర్చబడింది. ఇది విరుద్ధం కాదు; వేర్వేరు సందర్భాల్లో చెప్పబడిన ఉపదేశాల సమాహారం మాత్రమే.
అచిత్ యొక్క స్వరూపం జడత్వం (జ్ఞానం లేకపోవడం) మరియు శేషత్వం (అధీనత్వం) కలయిక. జ్ఞానం లేకపోయినా, అది శేషభూతంగా ఉంటుంది.
శేషం అంటే శేషికి (యజమానికి) మాత్రమే ఉపయోగపడేందుకు ఉనికిలో ఉండడం. ఉదాహరణకు గడియారం లేదా చరవాణి (మొబైల్ ఫోన్) మనకు శేషం; అవి మన ఉపయోగం కోసం ఉంటాయి. అలాగే అచిత్ తన కోసమే కాక భగవంతుని కోసం ఉనికిలో ఉంటుంది.
స్వభావం సతత పరిణామిత్వం
అచిత్ యొక్క స్వభావం నిరంతరం రూపాంతరం చెందడం.
మూల ప్రకృతి మొదటి స్థితి. దాని తరువాత మహత్ ఉద్భవిస్తుంది. మూల ప్రకృతి నుండి 23 అచేతన తత్వాలు ఉద్భవిస్తాయి. మొత్తం 24 అచేతన తత్వాలు: మూల ప్రకృతి, మహాన్, అహంకారం, మనసు, పంచభూతాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ తన్మాత్రలు. అందువల్ల అచేతన పదార్థాలు 24 తత్వాల రూపంలో ఉన్నాయి. మూలప్రకృతి నుండి ప్రారంభమై మహాన్, అహంకారం, మనసు, పంచభూతాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ తన్మాత్రలు అనే విధంగా అనేక పరిణామాలు సంభవిస్తాయని మనం అర్థం చేసుకోవచ్చు.
మనకు కనిపించే ఈ ప్రపంచం పంచభూతాల మిశ్రమ ఫలితం. పంచభూతాల కలయికల వల్లనే మనం భిన్నమైన వస్తువులను చూడగలుగుతున్నాం. ఉదాహరణకు, చెట్టు ఒక రూపం, మొక్క మరో రూపం, సముద్రం మరో రూపం; అలాగే ఇసుక, మట్టి మొదలైనవి కూడా భిన్న రూపాలు. ప్రతి వస్తువు అలా ప్రత్యేక స్వభావంతో ఉండటానికి కారణం పంచభూతాల కలయికే. ఈ కారణంగా అచిత్ ఎల్లప్పుడూ మార్పులోనే ఉంటుంది. అంతేకాక, ఒకసారి రూపాంతరం చెందిన తరువాత అది ఒకే స్థితిలో శాశ్వతంగా ఉండదు; నిరంతరం మారుతూ ఉంటుంది.
ఆత్మావుక్కు స్వరూపం జ్ఞాతృత్వే సతి శేషత్వం
ఆత్మ యొక్క స్వరూపం జ్ఞానం మరియు శేషత్వం కలిగినదిగా ఉంటుంది. అది శేషభూతంగా ఉన్నప్పుడే భగవంతునికి అధీనమైనదిగా భావించబడుతుంది. ఆత్మకు జ్ఞాతృత్వం (తెలుసుకునే స్వభావం) ఉన్నందున, అది అచేతన వస్తువుల నుండి భిన్నంగా గుర్తించబడుతుంది. ఈశ్వరునికీ జ్ఞానం ఉంది; కాబట్టి “జ్ఞానం” మాత్రమే చెప్పబడితే, అది పరమాత్మకీ జీవాత్మకీ రెండింటికీ వర్తించవచ్చు. కానీ “జ్ఞాతృత్వే సతి శేషత్వం” అంటే తెలుసుకునేవాడిగా ఉండి, అదే సమయంలో అధీనభూతుడిగా ఉండడం అనేది జీవాత్మను మాత్రమే సూచిస్తుంది.
స్వభావం కైంకర్యైక రసత్వం
ఆత్మ యొక్క నిజమైన స్వభావం, కైంకర్యం లోనే ఆనందం పొందడం. భగవంతునికి అధీనభావంతో ఉన్న స్థితిలో, ఆత్మ యొక్క స్వభావం కైంకర్యాన్ని ఆచరించడంలో ఆనందాన్ని అనుభవించడం.
ఈశ్వరనుక్కు స్వరూపం జ్ఞాతృత్వే సతి శేషిత్వం
ఈశ్వరునికి జ్ఞాతృత్వం మరియు శేషిత్వం ఉన్నాయి. ఆయనకు నాయకత్వ స్వభావం మరియు జ్ఞానం రెండూ ఉన్నాయి. కేవలం “జ్ఞానం కలిగినవాడు” అని మాత్రమే చేబితే, జీవాత్మ మరియు పరమాత్మ మధ్య భేదం స్పష్టంగా తెలియదు. అందుకే శేషిత్వం కూడా చెప్పబడింది. అంటే, జ్ఞాతృత్వం (జ్ఞానం కలిగి ఉండటం) తో పాటు శేషిత్వం (నాయకత్వ స్వభావం) కూడా ఈశ్వరునికి ఉంది. ఆయన జ్ఞానవంతుడు (జ్ఞానాన్ని కలిగినవాడు) మరియు శేషి (యజమాని). ఇదే ఈశ్వరుని స్వరూపం.
స్వభావం సర్వరక్షకత్వం
ఈశ్వరుని స్వభావం సర్వరక్షకత్వం, ఆయన ప్రధాన గుణం అందరినీ, ఎల్లప్పుడూ రక్షించడం.
తత్వన్దాన్, జడమెన్ఱుమ్ అజడమెన్ఱుమ్ ఇరణ్డు
తత్వాలు రెండు విధాలుగా విభజించబడతాయి, జ్ఞానం కలిగిన తత్వాలు మరియు జ్ఞానం లేని తత్వాలు. జడం అంటే జ్ఞానం లేనిది, అజడం అంటే జ్ఞానం కలిగినది.
మొదట తత్వత్రయం వివరించబడుతుంది. తరువాత అన్ని తత్వాలు జ్ఞానం కలిగినవి మరియు జ్ఞానం లేనివి అనే రెండు వర్గాలుగా విభజించి మరింత వివరించబడతాయి. “తత్వం” అంటే నిజంగా ఉన్న వస్తువులు లేదా సత్య స్వరూపమైన పదార్థాలు. ఇవి జడం మరియు అజడం అనే రెండు రకాలు గా ఉంటాయి.
జడన్దాన్ నిర్గుణమెన్ఱుమ్ సగుణమెన్ఱుమ్ ఇరణ్డు
జ్ఞానం లేని వస్తువులు (జడం) రెండు వర్గాలుగా విభజించబడతాయి, నిర్గుణం మరియు సగుణం. నిర్గుణం అంటే గుణాలు లేని వస్తువులు, సగుణం అంటే గుణాలు కలిగిన వస్తువులు. గుణాలు మూడు, సత్వం, రజస్సు, తమస్సు. అందువల్ల, ఈ మూడు గుణాలు కలిగిన పదార్థాలు జడ పొరుళ్ (జ్ఞానం లేని వస్తువులు) ఒక వర్గం; ఈ గుణాలు లేనివి మరో వర్గం.
సగుణన్దాన్ త్రిగుణమెన్ఱుమ్ ఏకగుణమెన్ఱుమ్ ఇరణ్డు
సగుణం రెండు రకాలుగా ఉంటుంది: త్రిగుణం, ఏకగుణం
త్రిగుణం అంటే సత్వం, రజస్సు, తమస్సు మూడూ కలిసిన స్థితి. ఈ ప్రపంచంలో అన్నీ వాటి కలయిక ఫలితమే. పరమపదంలో మాత్రం శుద్ధ సత్వగుణమే ఉంటుంది. అందుకే దానిని ఏకగుణం అంటారు. త్రిగుణములతో కలిసి ఉన్న సగుణ జడ పొరుళ్ పదార్థములు ఒక వర్గం, ఏకగుణము మరో వర్గం.
త్రిగుణన్దాన్, ప్రకృతి యెన్ఱుమ్ ప్రాకృతమెన్ఱుమ్ ఇరణ్డు
త్రిగుణ స్వభావం కలిగిన వస్తువులు రెండు వర్గాలుగా విభజించబడతాయి, ప్రకృతి మరియు ప్రాకృతం. ప్రకృతి అంటే మూలప్రకృతి (ఆదిమ పదార్థం), మూలప్రకృతి అనేది అన్ని అచేతన పదార్థాల మొదటి స్థితి.
ప్రాకృతం అంటే ప్రకృతి నుండి ఉద్భవించిన మార్పులు- మహాన్, అహంకారం, మనసు, పంచభూతాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ తన్మాత్రలు. ఈ 23 తత్వాలనే ప్రాకృతం అంటారు. ఇవి ప్రకృతిలో జరిగిన పరిణామాల ఫలితంగా ఏర్పడిన స్థితిని సూచిస్తాయి. అందువల్ల త్రిగుణం రెండు స్థితులను కలిగి ఉంటుంది – ప్రకృతి మరియు ప్రాకృతం.
ప్రకృతి అనేది మూడు గుణాలు (సత్వం, రజస్సు, తమస్సు) సమస్థితిలో (సమతుల్యతలో) ఉండే స్థితి. నమ్మాళ్వార్ చివరలో చెప్పిన, “ముడివిల్ పెరుమ్ పాళ్” అను వాక్యంలో “పాళ్” అనేది మూల ప్రకృతి ని సూచిస్తుంది. ఈ “పాళ్” చాలా విస్తారమైనది. మూలప్రకృతి స్థితిలో సత్వం, రజస్సు, తమస్సు సమాన స్థాయిలో ఉంటాయి. అందువల్ల ఆ స్థితిలో వస్తువులను వాటి రూపాల నుండి వేరుగా గుర్తించడం వీలు కాదు. కానీ మహాన్, అహంకారం మొదలైన పరిణామాలు ఉద్భవించినప్పుడు, సత్వం, రజస్సు, తమస్సు స్థాయిలలో భేదం ఏర్పడుతుంది. మూడు గుణాలు సమస్థితిలో లేకపోయినప్పుడు అది ప్రాకృత స్థితిగా మారుతుంది. అప్పుడు వస్తువులు పేరు మరియు రూపంతో గోచరమవుతాయి. అందువల్ల జడ పొరుళ్ పదార్థాలు రెండు రకాలు- ప్రకృతి మరియు ప్రాకృతం.
ఇవే కాక, నిర్గుణ పదార్థం కూడా ఉంది. కాల తత్వం నిర్గుణం. కాలానికి గుణాలు ఉండవు. దీనిని “సత్వ శూన్యం” అని కూడా అంటారు.
అజడన్దాన్ ప్రత్యక్కెన్ఱుమ్ పరాక్కెన్ఱుమ్ ఇరణ్డు
అజడ పదార్థాలు రెండు విధాలు: ప్రత్యక్, పరాక్.
ప్రత్యక్ అంటే స్వయం ప్రకాశం. పరాక్ అంటే ఇతరులకు కనిపించేది.
ప్రత్యక్ రెండు రకాలుగా ఉంటుంది: ఆత్మ, పరమాత్మ. ఆత్మ “నేను ఉన్నాను” అని తెలుసుకుంటుంది; భగవంతుడు కూడా తనని తాను తెలుసుకుంటాడు.
జ్ఞానం మరియు జ్ఞేయం పరాక్ వర్గంలో చేర్చబడతాయి. ఇక్కడ “జ్ఞానం” అంటే ధర్మభూత జ్ఞానం, అది పరాక్ స్వరూపం కలిగినది.
అజడ పదార్థం అంటే జ్ఞానం కలిగిన వస్తువు. “జ్ఞానం” అంటే “జ్ఞానం కలిగి ఉండటం” అనే అర్థం ఉన్నందున, ఇది పరాక్ అయినటువంటి ధర్మ భూత జ్ఞానాన్ని సూచిస్తున్నది. అజడ పొరుళ్ జ్ఞానం ఉన్న పదార్థాలను సూచిస్తుంది. జ్ఞానం అన్న పదం, “తెలివి ఉన్నది” అని సూచిస్తున్నది కనుక, అది ధర్మభూత జ్ఞానాన్ని మరియు నిత్యవిభూతి లోని వస్తువులనూ సూచిస్తుంది. నిత్యవిభూతిలోని అన్ని వస్తువులు ప్రకాశవంతమైనవి మరియు ఇతరుల చూడబడునవి. చివరగా, జ్ఞేయం అంటే, ప్రకృతి, ప్రాకృత పదార్థాలు మరియు కాలం, మనం జ్ఞానం ద్వారా తెలుసుకునే వస్తువులు.
ఆరవ వార్తై
వార్తై 6 యొక్క సారాంశం:
- మూడు గుణాలు ఉన్నాయి- సత్వం, రజస్ మరియు తమస్.
- ఈ మూడు గుణాలలో ప్రతి ఒక్కదానికి మొదటి, రెండవ మరియు మూడవ స్థాయిలు ఉన్నాయి.
- ప్రతి స్థాయిలో ఒక వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు, అతని స్వభావం ఎలా ఉంటుంది అనే విషయాలు వివరించబడుతున్నాయి.
వార్తై 6
సత్వ రజస్ తమస్సు క్కళాగిఱ మూన్ఱు గుణన్గళుమ్ ఓరొన్ఱు మూన్ఱు వగైయాయ్ ఇరుక్కు మ్ తామసతామసమ్, తామసరాజసమ్, తామససాత్వి కమ్; రాజసతామసమ్, రాజసరాజసమ్, రాజససాత్వి కమ్; సాత్వి కతామసమ్,సాత్వి కరాజసమ్, సాత్వి కసాత్వి కమ్ ఎన్ఱు. ఇదిల్ తామసతామసమ్, నిద్రైయపవ్రర్తిప్పిక్కు మ్; తామసరాజసమ్, శోగత్తై పవ్రర్తిప్పిక్కు మ్; తామస సాత్వికమ్ పరహిమ్సైయిలే పవ్రర్తిప్పిక్కు మ్. రాజసతామసమ్ విషయాన్థరన్గళిలే మూట్టుమ్;రాజసరాజసమ్, కామ్యకర్మన్గళిలే మూట్టుమ్; రాజససాత్వి కమ్ భగవత్ స్తోత్రత్తిలే పవ్రర్తిప్పిక్కుమ్. సాత్వికతామసమ్, భగవన్మన్త్రఙ్గిళిలే పవ్రర్తిప్పిక్కు మ్; సాత్వి కరాజసమ్, ప్రకృత్యాత్మ వివేకన్గళిలే పవ్రర్తిప్పిక్కు మ్; సాత్వి కసాత్వికమ్, భగవత్సాక్షాత్కారత్తిలే పవ్రర్తిప్పిక్కు మ్.
వివరణ
ఇక్కడ సత్వం, రజస్ మరియు తమో గుణాలు వివరించబడుతున్నాయి; అలాగే వాటి ఉపవిభాగాలు కూడా వివరించబడుతున్నాయి. ఈ మూడు గుణాలు- సత్వం, రజస్ మరియు తమస్, మూడు రకాలుగా ఉంటాయి: తామస-తామసం, తామస-రాజసం మరియు తామస-సాత్వికం; రాజస-తామసం, రాజస-రాజసం మరియు రాజస-సాత్వికం; సాత్విక-తామసం, సాత్విక-రాజసం మరియు సాత్విక-సాత్వికం.
అందువల్ల సత్వం, రజస్ మరియు తమస్ మూడుగా విభజించబడతాయి; ప్రతి స్థితిలో మళ్లీ మరో మూడు స్థితులు ఉంటాయి. ఉదాహరణకు, సత్వంలో సాత్వికమైన సత్వగుణం, రాజసమైన సత్వగుణం మరియు తామసమైన సత్వగుణం ఉంటాయి. అదే విధంగా రజస్‌లో సాత్వికమైన రజస్, రాజసమైన రజస్ మరియు తామసమైన రజస్ ఉంటాయి. ఈ విధంగా ప్రతి గుణం మరింత విభజించి చూపబడుతోంది.
సాధారణంగా, సత్వగుణం జ్ఞానం మరియు స్పష్టతను ఇస్తుంది. రజస్ కోపం మరియు కోరికలను కలిగిస్తుంది. తామస గుణం అజ్ఞానం, నిద్ర మరియు మనస్సు గందరగోళాన్ని కలిగిస్తుంది.
తామస తామసం- తమో గుణం తమో స్థితిలో ఉన్నప్పుడు నిద్ర అధికమవుతుంది. ఇది అత్యల్ప స్థితి.
తామస రాజసం- ఈ స్థితి దుఃఖం మరియు నిరాశను కలిగిస్తుంది.
తామస సాత్వికం- ఈ స్థితి ఇతరులకు హాని చేయాలనే భావాన్ని కలిగిస్తుంది.
రాజస తామసం- ఈ స్థితి మనలో భౌతిక విషయాలపై ఆసక్తిని కలిగిస్తుంది.
రాజస రాజసం- ఈ స్థితి మనలను కామ్యకర్మలను ఆచరించడానికి ప్రేరేపిస్తుంది (ఏదైనా ఫలితాన్ని పొందాలనే ఉద్దేశంతో చేయబడే కర్మలు. శాస్త్రంలో చెప్పబడిన ఈ కర్మలు ఆచరించినప్పుడు కొన్ని ఫలితాలను ఇస్తాయి).
రాజస సాత్వికం- ఈ స్థితి భగవంతుని అనుభవించాలనే ఆసక్తిని కలిగిస్తుంది.
సాత్విక తామసం- ఈ స్థితి భగవన్ మంత్రాలలో నిమగ్నం కావడానికి ప్రేరేపిస్తుంది.
సాత్విక రాజసం- ఈ స్థితి “ప్రకృతి-ఆత్మ వివేకం” అనే జ్ఞానాన్ని పెంపొందిస్తుంది (ప్రకృతి మరియు ఆత్మ వేర్వేరు అని గ్రహించే జ్ఞానం).
సాత్విక సాత్వికం- ఈ స్థితి భగవత్ సాక్షాత్కారం (భగవంతుని అనుభవించడం) పట్ల జ్ఞానాన్ని పెంచుతుంది. ఇది సత్వగుణంలోని అత్యున్నత స్థితి. ఈ స్థితి వ్యక్తిని భగవత్ సాక్షాత్కారం వైపు నడిపిస్తుంది. ఇది వ్యక్తికి ఎమ్పెరుమాన్ దర్శనాన్ని కలిగిస్తుంది. భగవంతుడు తన దర్శనాన్ని అనుగ్రహించే విషయాలలో వ్యక్తిని నిమగ్నం చేస్తుంది.
ఏడవ వార్తై
తత్వ తయ్ర త్తుక్కు స్వరూపముమ్, స్వరూప నిరూపక ధర్మముమ్, నిరూపిత స్వరూప విశేషణముమ్, వ్యాపారముమ్ ఎన్ఱు నాలు పక్రారమాయ్ ఇరుక్కు మ్. ఇదిల్ ఈశ్వర స్వరూపమ్ సత్యమాయ్, జ్ఞానమయ్, అనన్తమాయ్, ఆనన్ధమాయ్, అమలమాయ్ ఇరుక్కు మ్. స్వరూప నిరూపక ధర్మమ్ సత్యత్వమ్, జ్ఞానత్వమ్, అనన్తత్వమ్, ఆనన్ధత్వమ్, అమలత్వమాగిఱ ఇవై. నిరూపిత స్వరూప విశేషణమ్, జ్ఞానశక్త్యాది సమస్త కల్యాణ గుణఙ్గళుమ్, గుణవత్ విశేషణముమాయ్, గుణ పక్రాశకముమాన దివ్య మంగళ విగ్రహఙ్గళుమ్; ఇప్పడి నిరూపితమాన వస్తు దమ్పతియాయ్ ఇరుక్కు మ్. ఇత్దమ్పతిక్కు ఉభయవిభూతియిలుళ్ళ చేతనాచేతఙ్గళుమ్ శరీరతయా శేషమాయ్ ఇరుక్కుమ్ వ్యాపారమ్ ఆవదు తన్ను డైయ ఆనన్ధత్తుక్కు ప్పోక్కు వీడాక ప్పణ్ణుమ్ సకలజగత్ సృష్టిస్థితి సంహారఙ్గలుమ్, మోక్ష పద్రత్వముమ్ ఇప్పడి సర్వదా సమానాతిశయత్తై ఉదైత్తాయ్ ఇరున్డుళ్ళ దమ్పతిగళై అన్యోన్యమతిశయకరరాగ శొల్లుగైక్కు హేతు. శ్రియఃపతిత్వమ్, విష్ణుపత్నీత్వ మాగిఱ ఇవత్తాలే. ఎమ్పెరుమానిఱ్కా త్తిల్ పిరాట్టిక్కు అధిక వ్యాపారమ్ అధికార సమ్పత్తియుమ్, పురుశకారత్వముమ్, ఎమ్పెరుమానుక్కు అధిక వ్యాపారమ్- దణ్దధరత్వముమ్, ఉపాయత్వముమ్.చేతన స్వరూపమ్ సత్యమాయ్, జ్ఞానమాయ్, ఆనన్దమాయ్, అమలమాయ్, అణువాయ్ ఇరుక్కు మ్. స్వరూప నిరూపక ధర్మమ్ సత్యత్వమ్, జ్ఞానత్వమ్, ఆనన్దత్వమ్, అమలత్వమ్, అణుత్వమాగిఱ వివై. నిరూపిత స్వరూప విశేషణమ్, శరీరవత్ శేషత్వముమ్, అనన్తజ్ఞానాధిగుణఙ్గళుమ్. వ్యాపారమ్, అనుభవజనిత ప్రీతికారిత కైంకర్యం.
అచిత్ స్వరూపమ్ మూన్ఱుపడి ప్పట్టిరుక్కు మ్. అతావతు అప్రాకృతమ్, ప్రాకృతమ్. కాలమ్ ఎన్ఱు. ఇదిల్, అప్రాక్రుతస్వరూపమ్ జ్ఞానమ్; స్వరూపనిరూపక ధర్మమ్ జ్ఞానత్వమ్;] నిరూపిత స్వరూప విశేషణమ్ శరీరవత్ శేశత్వమ్; వ్యాపారమ్ – ఇచ్చా నుగుణ పరిణామమ్. ప్రాకృత స్వరూపమ్ జడమ్; స్వరూపనిరూపక ధర్మమ్ జడత్వమ్; నిరూపిత స్వరూప విశేషణమ్ శరీరవత్ శేషత్వముమ్, గుణత్రయత్వముమ్, సతతపరిణామిత్వముమ్; వ్యాపారమ్ – బద్ధచేతననుక్కు స్వస్వరూప పరస్వరూపఙ్గళై మఱైక్కై. కాలత్తుక్కు స్వరూపమ్ విభువాయ్ జడమాయ్ ఇరుక్కు మ్. స్వరూప నిరూపక ధర్మమ్ విభుత్వ జడత్వఙ్గళ్. నిరూపిత స్వరూప విశేషమ్ శరీరవత్ శేషత్వముమ్, కలాకాష్టాదియాన పరిణామముమ్. వ్యాపారమ్ సృష్ట్యాదిగళుక్కు ఉపకరణమాయ్ ఇరుక్కుమ్.
తత్వ త్రయత్తుక్కు స్వరూపముమ్, స్వరూప నిరూపక ధర్మముమ్, నిరూపిత స్వరూప విశేషణముమ్, వ్యాపారముమ్ ఎన్ఱు నాలు ప్రకారమాయ్ ఇరుక్కుమ్.
తత్త్వత్రయానికి సంబంధించిన నాలుగు విషయాలు తెలుసుకోవాలి. ప్రతి తత్త్వానికి ఒక స్వరూపం (ఒక వస్తువును ప్రత్యేకంగా గుర్తించే ఒక అనన్యసాధారణమైన చిహ్నము), స్వరూప నిరూపక ధర్మం (ఆ స్వరూపాన్ని గుర్తించడానికి అవసరమైన ముఖ్య గుణాలు), నిరూపిత స్వరూప విశేషణం (ఉదాహరణకు, భగవాన్ యొక్క స్వరూపం స్థాపించబడిన తరువాత, ఆయనకు సంబంధించిన మిగిలిన గుణాలు విశేషణాలు అవుతాయి), మరియు వ్యాపారం (కార్యాలు) ఉంటాయి.
ఇదిల్ ఈశ్వర స్వరూపమ్ సత్యమాయ్, జ్ఞానమయ్, అనన్తమాయ్, ఆనన్ధమాయ్, అమలమాయ్ ఇరుక్కుమ్
ఈశ్వరుని స్వరూపం సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం మరియు అమలం. ఈ ఐదు గుణాల ద్వారా ఈశ్వరుని తెలుసుకోవచ్చు. ఈ గుణాల వివరణ ద్వారా ఈశ్వరుడు ఎలా ఉన్నాడో తెలుస్తుంది. ఆయన సత్యం (నిత్యుడు). నిత్యుడు అంటే ఎల్లప్పుడూ ఉన్నవాడు. ఆయన జ్ఞానం, జ్ఞానస్వరూపుడు. ఆయన అనంతుడు అంటే దేశ, కాల లేదా వస్తువులచే పరిమితం కాని వాడు. ఆయనకు అంతం లేదు. అన్నీ పద్రేశాలలో, అన్నీ కాలాలలో, అన్నీ వస్తువులలో ఆయన ఉన్నాడు. ఆయన ఆనందమయుడు. ఆయన అమలుడు, ఎలాంటి దోషాలు లేనివాడు. ఈ ఐదు గుణాలే ఈశ్వరుని స్వరూపం.
ఈశ్వరుని స్వరూప నిరూపక ధర్మాలు: సత్యత్వం, జ్ఞానత్వం, అనంతత్వం, ఆనందత్వం మరియు అమలత్వం. ఆయన సత్యస్వరూపుడు కాబట్టి సత్యం అని తెలుసుకుంటాము. ఆయన నిత్యుడు కాబట్టి నిత్యుడు అని తెలుసుకుంటాము. ఆయన అనంతుడు కాబట్టి అనంతుడు అని తెలుసుకుంటాము. ఆయన ఆనందస్వరూపుడు కాబట్టి ఆనందమయుడు అని తెలుసుకుంటాము. ఆయనకు దోషాలు లేనందున ఆయన అమలుడు అని తెలుసుకుంటాము. ఈ ఐదు గుణాలే భగవంతుని స్వరూపాన్ని స్థాపిస్తాయి.
నిరూపిత స్వరూప విశేషణమ్,- జ్ఞానశక్త్యాది సమస్త కల్యాణ గుణన్గళుమ్, గుణవత్ విశేషణముమాయ్
నిరూపిత స్వరూప విశేషణం -స్వరూపం స్థాపించబడిన ఈ భగవంతునికి సంబంధించిన అదనపు గుణాలు ఏమిటి? విశేషణం అంటే గుణాలు. అవి జ్ఞానం, శక్తి, బలం, ఐశ్వర్యం మరియు తేజస్.
“భగవాన్” అనే పదాన్ని భ + గ + వ అని విభజించవచ్చు. ఈ మూడు అక్షరాలు ఆరు గుణాలను సూచిస్తాయి, జ్ఞానం, బలం, ఐశ్వర్యం, వీర్యం, శక్తి మరియు తేజస్సు. ఈ ఆరు గుణాలతో పాటు ఆయనకు సమస్త కళ్యాణ గుణాలు ఉన్నాయి. సౌశీల్యం, సౌలభ్యం, సౌందర్యం, వాత్సల్యం, స్వామిత్వం, ఔదార్యం, మాధుర్యం, గాంభీర్యం, ధైర్యం, స్థైర్యం మొదలైన అనేక గుణాలను ఎంపెరుమానార్ గద్యత్రయంలో చూపించారు. ఈ గుణాలన్నీ పెరుమాళ్ యొక్క నిరూపిత స్వరూప విశేషణాలు. స్వరూపం స్థాపించబడిన పెరుమాళ్‌కు ఈ కళ్యాణ గుణాలే ఆయన నిజమైన గుర్తింపు.
గుణ ప్రకాశకముమాన దివ్య మంగళ విగ్రహన్గళుమ్
పెరుమాళ్ యొక్క దివ్య మంగళ విగ్రహం కూడా భగవంతునికి విశేషణం. భగవంతుని గుణాలు ఆయన నుండి వేరు కాకపోవడం లాగే, ఆయన తిరుమేని కూడా ఆయన నుండి వేరు కాదు. ఆయన తిరుమేని ఆయన గుణాలను ప్రకాశింపజేస్తుంది. ఉదాహరణకు, ఎంపెరుమాన్ యొక్క సౌలభ్య గుణం ఆయన అర్చావతారంలో కనిపిస్తుంది; అందువల్ల ఆయన సులభంగా చేరదగినవాడని తెలుస్తుంది. ఆయన తిరువడిని దర్శించడం ద్వారా ఆయనను చేరుకోవచ్చనే విశ్వాసం కలుగుతుంది. అలాగే, ఆయన తిరుమేనిని దర్శించడం ద్వారా సౌందర్య గుణం తెలుస్తుంది. మొత్తం తిరుమేని సౌందర్యంలో లావణ్య గుణం కనిపిస్తుంది. ఈ విధంగా ఆయన సంపూర్ణ తిరుమేని ఆయన గుణాలను తెలియజేస్తుంది. ఈ విగ్రహాలు కూడా భగవంతుని నిరూపిత స్వరూప విశేషణాలే.
ఇప్పడి నిరూపితమాన వస్తు దమ్పతియాయ్ ఇరుక్కుమ్
ఈ విధంగా స్థాపించబడిన ఈశ్వర తత్త్వం శేర్తి రూపంలో ఉంటుంది, మిథునంగా. అంటే ఆయన పిరాట్టితో (శ్రీమహాలక్ష్మి తాయార్‌తో) కలిసి ఉంటాడు. వారు ఎల్లప్పుడూ కలిసి ఉంటారు.
ఇత్దమ్పతిక్కు ఉభయవిభూతియిల్ ఉళ్ళ చేతనాచెతన్గళుమ్ శరీరతయా శేశమాయ్ ఇరుక్కుమ్
ఈ దంపతులకు (ఎంపెరుమాన్ మరియు పిరాట్టి) ఉభయ విభూతులలో (నిత్య విభూతి మరియు లీలా విభూతి) ఉన్న సమస్త చేతన మరియు అచేతన పదార్థాలు శరీరంలా శేషభూతాలుగా ఉంటాయి. ఎలా శరీరం ఆత్మకు అవిభాజ్యంగా ఉండి ఆత్మ కోరికలను నెరవేర్చుతుందో, అలాగే చేతనాలు మరియు అచేతనాలు ఎంపెరుమాన్ ఆనందం కోసం ఆయనకు శరీరంలా ఉంటాయి. ఇక్కడ ఎంపెరుమాన్ మరియు పిరాట్టి కలిసి చెప్పబడటానికి కారణం, పిరాట్టి ఎల్లప్పుడూ ఎంపెరుమాన్ సంకల్పాన్నే ప్రతిబింబిస్తుంది.
వ్యాపారమ్ ఆవదు తన్నుడైయ ఆనన్ధత్తుక్కుప్ పోక్కువీదాగప్ పణ్ణుమ్ సకలజగత్ సృష్టి స్థితి సంహారన్గలుమ్, మోక్ష ప్రదత్వముమ్ ఇప్పడి
ఈ లీలా విభూతి ఎంపెరుమాన్ ఆనందమయ లీలల కోసం ఉంది. సమస్త జగత్తు యొక్క సృష్టి, స్థితి, సంహారం మరియు మోక్ష ప్రదానం ఇవన్నీ ఇందులో చేరుతాయి. ఇది శాస్త్రంలో చూపబడింది.
సర్వదా సమానాతిశయత్తై ఉదైత్తాయ్ ఇరున్డుళ్ళ దమ్పతిగళై
ఈ దంపతులు పరస్పరం సమానమైన మరియు శ్రేష్ఠమైన గుణాలను కలిగి ఉంటారు.
అన్యోన్యమ్ అతిశయకరరాగ శొల్లుగైక్కు హేతు శ్రియఃపతిత్వమ్, విష్ణుపత్నీత్వ మాగిఱ ఇవత్తాలే.
వారు పరస్పరం ఒకరికొకరు మహిమను పెంచుతారని చెప్పడానికి కారణం, ఎంపెరుమాన్ పిరాట్టికి భర్త కావడం వల్ల ఆయనకు మహిమ ఉంది; పిరాట్టి విష్ణుపత్నిగా ఉండడం వల్ల ఆమెకు మహిమ ఉంది. ఎంపెరుమాన్‌తో సంబంధం వల్ల పిరాట్టికి మహిమ ఉంది; పిరాట్టితో సంబంధం వల్ల ఎంపెరుమాన్‌కు మహిమ ఉంది. పుష్పానికి సువాసన వల్ల మహిమ ఉన్నట్లే, సువాసన పుష్పంతో సంబంధం వల్ల ఉంటుంది. సువాసన మరియు పుష్పం వేరుకాని విధంగా, పిరాట్టి మరియు పెరుమాళ్ కూడా ఎల్లప్పుడూ కలిసి ఉంటారు.
ఎమ్పెరుమానిఱ్కాత్తిల్ పిరాత్తిక్కు అధిక వ్యాపారమ్ అధికార సమ్పత్తియుమ్, పురుశకారత్వముమ్
ఇక్కడ పిరాట్టి మరియు ఎంపెరుమాన్ గుణాలు విడివిడిగా చెప్పబడుతున్నాయి. ఎంపెరుమాన్ వద్ద లేనివి కానీ పిరాట్టి వద్ద ఉన్న గుణాలు- అధికార సంపత్తి మరియు పురుషకారత్వం. జీవాత్మలు ఎంపెరుమాన్‌ను శరణు పొందకుండా ఈ ప్రపంచంలో బాధపడుతున్నాయి. జీవాత్మను ఎంపెరుమాన్ వైపు మళ్ళించేగుణం పిరాట్టికి ఉంది. ఆమె వారి సద్గుణాలను పెంపొందించి, ఎంపెరుమాన్‌కు శరణాగతి చేయించేలా చేసి, అవసరమైన అర్హతను కలిగిస్తుంది, ఇదే అధికార సంపత్తి. ఎలా తల్లి తన పిల్లవాడికి మంచి విషయాలు నేర్పి పెంచుతుందో, అలాగే పిరాట్టి అన్ని ఆత్మలపట్ల ప్రవర్తిస్తుంది.
పురుషకారత్వం- జీవాత్మ అన్ని మంచి గుణాలను పొందిన తరువాత ఎంపెరుమాన్‌కు శరణాగతి చేస్తుంది. అప్పుడు ఎంపెరుమాన్ జీవాత్మ యొక్క కర్మలను పరిశీలించడం ప్రారంభిస్తాడు. జీవాత్మ ఎన్నో పుణ్యపాప కర్మలు చేసింది; వాటి ఫలితాలను అనుభవించాలి అని చెప్పబోతున్న సమయంలో పిరాట్టి మధ్యలో ప్రవేశిస్తుంది. ఆమె ఎంపెరుమాన్‌తో “ఈ ఆత్మ నీ వద్దకు వచ్చి శరణాగతి చేసింది; కాబట్టి నీవు దానిని అంగీకరించాలి” అని చెప్పుతుంది. శరణాగతి చేయని వారిని నీవు విచారించవచ్చు; కానీ శరణాగతి చేసిన వారిని తప్పక అంగీకరించాలి అని ఆమె ప్రార్థిస్తుంది. ఈ విధంగా జీవాత్మను కర్మల ఆధారంగా తిరస్కరించకుండా చూసేది పిరాట్టి. ఇదే పురుషకారత్వం.
ఎమ్పెరుమానుక్కు అధిక వ్యాపారమ్- దణ్దధరత్వముమ్, ఉపాయత్వముమ్.
దండధరత్వం అంటే శిక్షించగల స్వభావం. పిరాట్టి ఎప్పుడూ శిక్షించదు; అదే ఆమె స్వభావం. జీవాత్మ తప్పులు చేసినప్పుడు ఎంపెరుమాన్ వాటిని గుర్తుంచుకుని తగిన ఫలితాలను ఇస్తాడు, ఇదే దండధరత్వం.
ఉపాయత్వం- ఫలాన్ని ప్రసాదించే ఉపాయం ఎంపెరుమానే. పిరాట్టి కేవలం పురుషకార స్వరూపిణి మాత్రమే; ఆమె ఉపాయం కాదు. ఎంపెరుమాన్ స్వతంత్రుడు కాబట్టి ఫలాన్ని ప్రసాదించే అధికారం ఆయనకే ఉంది.
చేతన స్వరూపం – సత్యమాయ్, జ్ఞానమాయ్, ఆనందమాయ్, అమలమాయ్, అణువాయ్ ఇరుక్కుమ్
ఇక్కడ చేతన స్వరూపం వివరించబడుతోంది. ఈశ్వరుడు మరియు ఆత్మలకు నాలుగు గుణాలు సాధారణంగా ఉన్నాయి, సత్యం, జ్ఞానం, ఆనందం మరియు అమలత్వం.
ఈశ్వరుడు అనంతుడు; కానీ చేతనుడు అణువు. అనంతత్వం అంటే ఈశ్వరుడు అన్నిచోట్లా వ్యాపించి ఉన్నాడు. ఆత్మ మాత్రం అణు స్వరూపం.
ఈశ్వరునిలాగే ఆత్మ కూడా నిత్యము, జ్ఞాన స్వరూపం, ఆనందమయము మరియు దోష రహితము.
స్వరూప నిరూపక ధర్మం – సత్యత్వం, జ్ఞానత్వం, ఆనందత్వం, అమలత్వం, అణుత్వమాగిఱ ఇవై
స్వరూపాన్ని నిర్ధారించే గుణాలు, సత్యత్వం, జ్ఞానత్వం, ఆనందత్వం, అమలత్వం మరియు అణుత్వం.
నిరూపిత స్వరూప విశేషణం – శరీరవత్ శేషత్వముం, అనంత జ్ఞానాది గుణంగళుం
స్థాపించబడిన ఆత్మ యొక్క అదనపు గుణాలు-శరీరవత్ శేషత్వం (ఎంపెరుమాన్‌కు శరీరంలా ఉండి శేషభూతంగా ఉండటం), అనంత జ్ఞానాది గుణాలు. ఈ విధంగా స్థాపించబడిన ఆత్మకు అన్య విశేషణాలు- ఎంపెరుమాన్‌కు శేషభూతుడిగా ఉండటం మరియు జ్ఞానం మొదలైన గుణాలు.
వ్యాపారం- అనుభవ జనిత ప్రీతికారిత కైంకర్యం
ఆత్మ యొక్క వ్యాపారం ఎంపెరుమాన్‌ను అనుభవించడం. ఆ అనుభవం నుండి ప్రేమ (ప్రీతి) కలుగుతుంది. ఆ ప్రేమ వల్ల కైంకర్యం చేయాలనే భావన వస్తుంది. అందువల్ల ఆత్మ కైంకర్యం చేస్తుంది. అంటే మొదట ఎంపెరుమాన్‌ను అనుభవిస్తాము; దాని వల్ల ప్రేమ కలుగుతుంది; ఆ ప్రేమ వల్ల ఆయన కోసం ఏదైనా చేయాలనే భావన కలుగుతుంది; అందువల్ల కైంకర్యం చేస్తాము. ఇదే ఆత్మ యొక్క వ్యాపారం.
ఇప్పుడు అచిత్ తత్త్వ స్వరూపాన్ని చూద్దాం.
పిళ్ళై లోకాచార్యులు రచించిన తత్త్వత్రయం గ్రంథంలో కూడా అచిత్ తత్త్వ వివరాలు చూడవచ్చు.
అచిత్ స్వరూపమ్ మూన్ఱుపదిప్ పట్టిరుక్కుమ్. అదావదు అప్రాకృతమ్, ప్రాకృతమ్. కాలమ్ ఎన్ఱు
అచిత్ తత్త్వం మూడు భాగాలుగా విభజించబడుతుంది.
తత్త్వత్రయంలో దీనిని శుద్ధ సత్వం, మిశ్ర సత్వం మరియు సత్వ శూన్యం అని వివరించారు.
ఇదిల్, అప్రాకృత స్వరూపమ్ జ్ఞానమ్; స్వరూపనిరూపక ధర్మమ్ జ్ఞానత్వమ్; నిరూపిత స్వరూప విశేశణమ్ శరీరవత్ శేశత్వమ్; వ్యాపారమ్ ఇచ్చానుగుణ పరిణామమ్.
అప్రాకృతం అంటే శుద్ధసత్వ పదార్థాలు. శుద్ధసత్వం జ్ఞానస్వరూపం. ఇది పరమపదంలోని అచిత్ మరియు ప్రకాశవంతమైనది.
శుద్ధసత్వమైన అప్రాకృతం యొక్క స్వరూపం జ్ఞానం. స్వరూప నిరూపక ధర్మం జ్ఞానత్వం. నిరూపిత స్వరూప విశేషణం శరీరవత్ శేషత్వం.
అప్రాకృత పదార్థాల వ్యాపారం, ఇచ్ఛానుగుణ పరిణామం. అంటే అవి పూర్తిగా భగవంతునికోసం ఉండి, ఆయన సంకల్పం ప్రకారం మార్పు చెందుతాయి.
ప్రాకృత స్వరూపమ్ జడమ్
ప్రాకృతం అంటే ఈ భౌతిక ప్రపంచంలోని పదార్థాలు. ఇందులో మూలప్రకృతి మరియు దాని నుండి వచ్చిన 23 తత్వాలు ఉన్నాయి. ఈ 24 తత్త్వాలన్నీ జ్ఞానం లేనివి; అందువల్ల అవి జడం.
స్వరూప నిరూపక ధర్మం- జడత్వం. ప్రకృతిని గుర్తించే ప్రధాన గుణం జ్ఞానం లేకపోవడం.
నిరూపిత స్వరూప విశేషణాలు:
- శరీరవత్ శేషత్వం
- గుణత్రయవత్త్వం (సత్వం, రజస్, తమస్)
- సతత పరిణామిత్వం (ఎల్లప్పుడూ మార్పుకు లోనవడం)
వ్యాపారమ్ బద్ధచేతననుక్కు స్వస్వరూప పరస్వరూపన్గళై మఱైక్కై
ప్రాకృతం లీలా విభూతిలో ఉన్నందున, ఇది నిత్యులు మరియు ముక్తులకు వర్తించదు. ప్రాకృతం యొక్క కార్యం, ప్రకృతి మరియు దాని నుండి వచ్చిన శరీరం ఆత్మ జ్ఞానాన్ని మరియు భగవత్ జ్ఞానాన్ని మరుగుపరచడం. ఇది మనలను ప్రపంచ విషయాలలో ముంచుతుంది.
కాలత్తుక్కు స్వరూపమ్ విభూవాయ్ జడమాయ్ ఇరుక్కుమ్
కాలం అన్నిచోట్లా ఉంది. అది జడం.
స్వరూప నిరూపక ధర్మాలు: విభుత్వం మరియు జడత్వం.
నిరూపిత స్వరూప విశేషణమ్ శరీరవత్ శేషత్వముమ్ కలాకాష్టాదియాన పరిణామముమ్.
కాలానికి ఇతర గుణాలు -శరీరవత్ శేషత్వం. అన్ని వస్తువుల మాదిరిగానే కాలం కూడా ఎంపెరుమాన్‌కు శరీరంలా ఉంటుంది.
అలాగే కాలం కలా, కాష్ట మొదలైన విభాగాలను కలిగి ఉంటుంది- నిమిషాలు, క్షణాలు మొదలైన భాగాలుగా విభజించబడుతుంది.
వ్యాపారమ్ సృష్ట్యాదిగళుక్కు ఉపకరణమాయ్ ఇరుక్కుమ్.
కాలం యొక్క వ్యాపారం- ఎంపెరుమాన్ సృష్టి చేయునప్పుడు కాలాన్ని ఉపయోగిస్తాడు. ఈ ప్రపంచంలో ఒక వస్తువు ఒక నిర్దిష్ట సమయంలో ఒక స్థితిలో ఉండి, తరువాతి క్షణంలో మారిపోవడానికి కారణం కాలం.
కాలం మారకపోతే వస్తువులు కూడా మారవు. అందువల్ల కాలం ఎంపెరుమాన్‌కు సృష్టి కార్యంలో ఉపకరిస్తుంది.
తరువాతి వ్యాసంలో, మనం ఎనిమిదవ వార్తై నుండి అనుభవిద్దాము.
ఆళ్వార్ ఎంపెరుమానార్ జీయర్ తిరువడిగళే శరణం
జీయర్ తిరువడిగళే శరణం
పిన్బళగియ పెరుమాళ్ళ జీయర్ తిరువడిగళే శరణం
అడియేన్ ఉషా రామానుజ దాసి
అడియేన్ శ్రీకాంత్ రామానుజదాసన్
మూలము
ఆడియో – https://1drv.ms/u/s!AnOSadexHn4jgiQ45543H7eY6GBY?e=NMz7Nm
వీడియో- https://youtu.be/9U-54OqTkUk
ఆంగ్లంలో-https://granthams.koyil.org/2026/05/13/varthamalai-2-english/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org