శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః
మన శ్రీవైష్ణవ సాంప్రదాయంలో మన పూర్వాచార్యుల శ్రీసూక్తులు పరమ ప్రమాణాలుగా అంగీకరించబడతాయి. “ధర్మజ్ఞ: సమయ: ప్రమాణం వేదాశ్చ” (వేదము-ధర్మములను ఎరిగినవారి ఆలోచనలే ప్రమాణము) అను శాస్త్ర వాక్యం ఈ విధానాన్ని బలపరుస్తుంది. వేదమే పరమ ప్రమాణమైనప్పటికీ, మన పూర్వాచార్యుల అనుష్ఠానానికే అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడింది. అందుకే మన సంప్రదాయంలో పూర్వాచార్యుల శ్రీసూక్తులు, వారి ఉపదేశాలు మరియు వారి అనుష్ఠానాలే అందరికీ అత్యున్నత ప్రమాణాలుగా నిలుస్తాయి.
జీవితంలో క్లిష్ట పరిస్థితులు ఎదురై, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియనప్పుడు, మన పూర్వా చార్యు ల బోధనలు మరియు వారి జీవన వాదానమే ఉదాహరణలుగా మనకు దిశానిర్దేశం చేస్తాయి. మనకు పూర్వాచార్యుల శ్రీసూక్తులు తెలిసుంటే, “అలాంటి ఒక సందర్భంలో భగవద్రామానుజులు లేదా కూరత్తాళ్వాన్ లేదా నంజీయర్ ఎలా స్పందించారు?” అని మనం గుర్తు చేసుకోవచ్చు. వారి అడుగుజాడలు మన మార్గాన్ని ప్రకాశింపజేసి, మన నిర్ణయాలను సులభతరం చేస్తాయి.
మన పూర్వాచార్యుల శ్రీసూక్తులను నంబిళ్ళై శిష్యులైన పిన్బళగియ పెరుమాళ్ జీయర్ ఎంతో శ్రద్ధతో క్రోడీకరించారు. నంబిళ్ళై మన సంప్రదాయంలో అత్యంత ప్రముఖులైన ఆచార్యులలో ఒకరు. ఆయన కాలక్షేపాలు (ప్రవచనాలు) ఎంత ప్రసిద్ధి చెందాయంటే, ఆ సభలకు వచ్చే జనసందోహాన్ని చూసి అది నంబిళ్ళై గోష్ఠియా లేక నంపెరుమాళ్ (శ్రీరంగనాథుని) ఉత్సవ ఊరేగింపా అని ప్రజలు ఆశ్చర్యపోయేవారట. సాక్షాత్తూ నంపెరుమాళ్ కూడా నంబిళ్ళై కాలక్షేపాన్ని వినాలనుకున్నారని సంప్రదాయం చెబుతోంది.
ఒకసారి నంపెరుమాళ్ తన గర్భాలయం నుండి నంబిళ్ళై కాలక్షేపం వినడానికి బయలుదేరగా, అక్కడ దీపం పట్టుకుని ఉన్న కైంకర్యపరుడైన ‘తిరువిళక్కు పిచ్చన్’, పెరుమాళ్‌కు ఆయన అర్చావతార స్థితిని మరియు శయన తిరుక్కోలాన్ని (పవళించిన భంగిమ) గుర్తు చేస్తూ, మెల్లగా తిరిగి యథాస్థానానికి పంపారట. దీని ద్వారా శ్రీరంగంలో నంబిళ్ళై తన కాలక్షేపాలతో నంపెరుమాళ్ దివ్య తిరువడిలకు (పాదాలకు) నిరంతరం ఎలా అంకితమై ఉండేవారో మనం అర్థం చేసుకోవచ్చు.

శ్రీరంగంలో నంబిళ్ళై చరణారవిందాల చెంత పిన్బళగియ పెరుమాళ్ జీయర్
నంబిళ్ళై కాలక్షేపాలను విన్న ఆయన శిష్యులు వడక్కు తిరువీధి పిళ్ళై, తిరువాయిమొళికి అత్యుత్తమ వ్యాఖ్యానాల్లో ఒకటిగా నిలిచే ‘ఈడు 36000 పడి’ని రచించారు. ఈ గ్రంథం మన సంప్రదాయంలోని నిగూఢమైన అంతరార్థాలను, సిద్ధాంతాలను వివరిస్తుంది. నంబిళ్ళై శిష్యులలో పిన్బళగియ పెరుమాళ్ జీయర్ అత్యంత ప్రముఖులు.
గృహస్థాశ్రమంలో ఉన్న తన ఆచార్యులు నంబిళ్ళై వలె కాకుండా, పిన్బళగియ పెరుమాళ్ జీయర్ సన్యాసాశ్రమాన్ని స్వీకరించి, నిరంతరం వివిధ కైంకర్యాల ద్వారా తన ఆచార్యుల పట్ల అచంచలమైన భక్తిని చాటుకున్నారు. మణవాళ మామునులు తమ ఉపదేశరత్తినమాలైలో ఒక శిష్యుడు తన ఆచార్యుని పట్ల ఎలా ఉండాలో వివరిస్తూ, శిష్యుడికి ఆచార్యుని తిరుమేని (దివ్య మంగళ విగ్రహం) పట్ల అత్యంత భక్తి ఉండాలని చెప్పారు. ఈ భక్తికి ఉదాహరణగా పిన్బళగియ పెరుమాళ్ జీయర్‌ను పేర్కొంటూ ఇలా అన్నారు:
“పిన్బళగియరాం పెరుమాళ్ జీయర్ పెరున్దీవత్తిల్ అన్బదువుమ్ అత్తు మిక్క ఆశైయినాల్ నంబిళ్ళైక్కాన అడిమైగళ్ శెయ్”
ఆయనకు పరమపదం మీద కూడా ఆశ లేదు; నంబిళ్ళై తిరుమేనికి నిరంతర కైంకర్యం చేయడమే ఆయన ఏకైక ఆశయం.
‘వార్తామాలై’ అనేది సుమారు 500 వార్తలతో కూడిన ఉపదేశాల సంకలనం. ప్రతి వార్త ఒక పేజీ ఉండవచ్చు లేదా కొన్ని పేజీల వరకు సాగవచ్చు. ఇందులో అనేక ఉపదేశాలు, తత్త్వ రహస్యాలు మరియు వివిధ సంఘటనలు ఉన్నాయి. ముముక్షుప్పడి (తిరుమంత్రం, ద్వయం, చరమ శ్లోకాల వివరణ) వంటి ఇతర గ్రంథాల వలె కాకుండా, వార్తామాలై అనేది వివిధ సందర్భాల్లో రకరకాల ఆచార్యులు చెప్పిన వాక్కుల సమాహారం. ఈ గ్రంథం వివిధ ఆచార్యుల నుండి ఉద్భవించిన జ్ఞాన మౌక్తిక మాల వంటిది.
పుత్తూరు శ్రీ ఉ.వే. కృష్ణస్వామి అయ్యంగార్ గారు ఈ లోతైన సిద్ధాంతాలను సామాన్యులకు సైతం అందుబాటులోకి తెస్తూ, వార్తామాలైను సరళమైన వివరణలతో ప్రచురించారు. పుత్తూరు స్వామి గారు తమ రచనల్లో విలక్షణమైన శైలికి మరియు సులభమైన వివరణలకు ఎంతో ప్రసిద్ధి చెందారు. ఆ విధంగా వారు మన సంప్రదాయానికి అపారమైన సేవలు అందించారు.

పుత్తూరు శ్రీ ఉ. వే. కృష్ణస్వామి ఐయంగార్
ఈ వ్యాసం, శ్రీ ఉ. వే. సారథి తోతాద్రి స్వామి వారు ‘వార్తామాలై’ గ్రంథంపై అందించిన తమిళ కాలక్షేపం (ప్రవచనం) ఆధారంగా వ్రాయబడింది.
(కాలక్షేపం నుండి గమనిక: ఈ కాలక్షేపం శ్రీపెరుంబుదూర్‌లో మాసి మఖం ఉత్సవాల సమయంలో, ఒక తిరువాదిరై నక్షత్రం రోజున ప్రారంభమైంది. శ్రీపెరుంబుదూర్‌లోని మాసి మఖం ఉత్సవం గురించి – ఎంబెరుమానార్లు (రామానుజులు) మాసి దశమి నాడు పరమపదించారు. దశమి నుండి పౌర్ణమి వరకు ఐదు రోజుల పాటు మాసి మఖం ఉత్సవాలను జరుపుకుంటారు. ఇతర ప్రాంతాల వలె కాకుండా, శ్రీపెరుంబుదూర్‌లో ఈ వేడుక కేవలం మాసి మఖం రోజుకే పరిమితం కాకుండా ఐదు రోజుల పాటు వైభవంగా జరుగుతుంది. ప్రతిరోజూ ఆది కేశవ పెరుమాళ్‌కి తిరుమంజనం, సాయంత్రం పెరుమాళ్ మరియు నాచ్చియార్ల పురప్పాడు జరుగుతాయి. చివరగా పెరుమాళ్ గరుడ వాహనంపై, ఎంబెరుమానార్లు పల్లకిపై వేంచేస్తారు. పౌర్ణమి రోజు ఉదయం సుమారు 8 గంటలకు సమీపంలోని సరస్సులో తీర్థవారి జరుగుతుంది. పెరుమాళ్ తరపున చక్రత్తాళ్వార్‌కు, ఎంబెరుమానార్ తరపున ముదలియాన్దాన్‌కు (ఎంబెరుమానార్ల పాదుకలకు) తీర్థవారి నిర్వహిస్తారు. ఇది శ్రీపెరుంబుదూర్‌లోని ఒక విశిష్టమైన వేడుక.)
వేలుక్కుడి శ్రీ ఉ. వే. వరదాచార్య స్వామి వారు, పుత్తూరు స్వామి వారి ప్రచురణలోని ప్రతి వార్తకు ఒక సంగ్రహ తాత్పర్యాన్ని అందించారు. దీనివల్ల మనం వివరాల్లోకి వెళ్లేటప్పుడు విషయం సులభంగా అర్థమవడమే కాకుండా మరింత ఆనందాన్నిస్తుంది. సందర్భాన్ని బట్టి ఆ సారాంశాలు కూడా పొందుపరచబడ్డాయి.

అడియేన్ ఉషా రామానుజ దాసి
అడియేన్ శ్రీకాంత్ రామానుజదాసన్
ఆంగ్లం లో: https://granthams.koyil.org/varthamalai-english/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org