శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
నంపిళ్ళై వారు ఒకసారి పెరియ కోయిల్ వళ్ళలార్ అనే ఒకరిని తిరుమంగై ఆళ్వార్ల తిరుమొళి 1-1-9 పాశురము కులం తరుంలోని మొదటి శ్లోకానికి (ఈ పాశురం శ్రీమన్నారాయణుని దివ్యనామం జపించడం వల్ల కలిగే ఫలాన్ని వివరిస్తుంది; మొదటి వరుస ఆతడి దివ్య నామము పఠించడం వల్ల మంచి వంశాన్ని (శ్రీవైష్ణవులకు జన్మించుట) ప్రసాదిస్తుంది) అర్థం చెప్పమని అడిగారు; వళ్ళలార్ వారు ఇలా జవాబిచ్చారు “అనాచార వంశంలో జన్మించిన నేను నంబూర్ వంశానికి (నంపిళ్ళై వారు నంబూర్ వాసులు) సేవ చేసుకునే భాగ్యము లభించినందున నాకు మంచి వంశము లభించిందనే భావిస్తాను” అని అంటారు. మరో మాటలో చెప్పాలంటే, ఆచార్యుల వంశాన్ని సేవించే వారు మహా గౌరవనీయమైన వంశానికి చెందిన వారిగా భావించాలి. నంపిళ్లై శిష్యులు “[భగవాన్] అవతారం ఎలా ఉంటుంది?” అని అడిగారు. వారు “దివ్య స్వరూపం పాలిపోయి, నాలుక ఎండి పోయి ఉంటుంది” అని వివరించారు. “ఎందుకు అలాగ?” అని వారు అడిగారు, “మోక్ష అర్హతకి తగిన వ్యక్తి దొరకనందుకు వారి రూపం పాలిపోతుంది; నాలుక పొడిగా ఉంటుంది ఎందుకంటే అలాంటి వ్యక్తిని చూసినా, ఆ వ్యక్తి ప్రాయోజనాంతపరర్ (భగవానుని కాకుండా ఇతర ఫలాలను కోరేవాడు)” అని వివరించారు. ఇక్కడ సూచించిన అర్థం ఏమిటంటే, ఎంబెరుమాన్ అంతటా వెదికినా, ఏ ఫలము ఆశించకుండా తమ ఆచార్యుడికి పూర్ణమైన అంకిత భావము ఉన్న వ్యక్తి లభించడం అనేది చాలా అరుదు అని అర్థమౌతుంది.
నంపిళ్ళై వారు ఆ విధంగా కలియుగ చీకటిని తొలగిస్తూ, ప్రతిచోటా ఆనందాన్ని ప్రసరింపజేస్తూ, అందరినీ సరిదిద్దితూ, వారిని తిరుమాళ్ భక్తులుగా తీర్చి దిద్దుతూ జీవిస్తున్నారు. ఒకసారి వారి దివ్య తిరుమేని అనారోగ్య పాలైయ్యింది. తమ అంతిమ దశ సమీపిస్తున్నదని వారు గ్రహించారు; వారు తమ శిష్యులందరినీ పిలిచి, వారి ముందు సాష్టాంగ నమస్కారం చేసి, వారి పట్ల తాను ఏదైనా అపరాధము చేసి ఉంటే క్షమించమని కోరారు. వారికి భోజన సత్కారములు గావించి వారి అవశేషాలను వారు స్వీకరించెను; వారి శిష్యులు ఉపనిషత్తులోని బ్రహ్మవల్లిని జపించడం ప్రారంభించారు, అలాగే తిరువాయ్మొళి 10వ పత్తు 9వ పదిగము”శూళ్విశుంబణి ముగిల్” సేవించారు. నంపిళ్లై వారు తమ తిరుముడిని (శిరస్సు) నడువిల్ తిరువీధి పిళ్ళై వారి దివ్య ఒడిలో ఉంచి, తమ తమ తిరువడిని (పాదాలు) పిన్బళగియ పెరుమాళ్ జీయర్ వారి దివ్య ఒడిలో పెట్టి తమ ఆచార్యులైన నంజీయర్ వారిని ధ్యానిస్తూ కన్నుమూసారు. వారి శిష్యులైన పెరియ వాచ్చాన్ పిళ్ళై, నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టార్, వడక్కు త్తిరువీధి పిళ్ళై, పిన్బళగియ పెరుమాళ్ జీయర్ మొదలైన వారిని దుఃఖ సాగరములో ముంచేసి వారు ఈ సంసారం విడిచి పెట్టి పరమపదాన్ని చేరుకున్నారు. వాళ్ళు వారి ఆచార్యుల నుండి విరహాన్ని సహించలేక స్పృహలేని స్థితిలోకి ప్రవేశించారు. తిరిగి స్పృహలోకి వచ్చి తీవ్ర దుఃఖంతో కన్నీళ్లు కార్చుకుంటూ ఒకరినొకరు ఓదార్చుకున్నారు. నంపెరుమాళ్ళ వద్ద నుండి వచ్చిన పూలమాలను పరివట్టం (వస్త్రం) ని సమర్పించి నంపిళ్ళై వారి చరమ సంస్కారాలకు సిద్ధమయ్యారు. కందాడై తోళప్పర్ వారు (ముదలియాండాన్ మనుమలు) నంపిళ్ళైకి “లోకాచార్యుడు” అనే బిరుదు ఇచ్చిన గొప్పతనం కలిగినవారు వారు. లోకాచార్యుడు అనగా మొత్తం ప్రపంచానికే గురువు అని సూచిస్తుంది. ఆళ్వార్ల దివ్య ప్రబంధంలోని అరుదైన అర్థాలను తెలుసుకుని అందరికీ వివరించ గలిగే గొప్పతనం కూడా వారికి ఉంది. వారికి ఉన్న మరో గొప్పతనం ఏమిటంటే, వారి తిరు హస్థాలతో వ్రాసిన చీటీతో, వారి పొరుగింటి ఒక మహిళ (నంపిళ్ళై వారి అనేక శిష్యులకి వారున్న స్థలము సరిపోనందున, నంపిళ్ళై వారి కోసము తన నివాసాన్ని వదులుకున్న ఒక మహిళ) పరమపదం చేరుకుంది.
అడియేన్ శ్రీదేవి రామానుజదాసి
మూలము: https://granthams.koyil.org/2021/07/22/yathindhra-pravana-prabhavam-7-english/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org