యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 8

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 7

నంపిళ్ళై వారి శిష్యులతో శ్రీ రంగంలో శ్రీ వైష్ణవ దర్శనం (శ్రీ వైష్ణవ సిద్దాంతము) చూసుకుంటూ జీవనము సాగిస్తున్న సమయంలో, వారి శిష్యురాలలో ఒక స్త్రీ నంపిళ్ళై వారి పొరుగింట్లో ఉంటూ ఉండేది. ఒకరోజు, నంపిళ్ళై తమ శిష్యులకు బోధన చేస్తున్నప్పుడు, వారి శిష్యులలో ఒకరు నంపిళ్ళై తిరుమాలిగ వారి శిష్యులందరికి వసతి కల్పించడానికి కొంచెం చిన్నదిగా ఉందని, ఆ శిష్యురాలిని తన ఇంటిని విడిచిపెట్టమని కోరతాడు. “గుడిలో చోటు ఎవరికైనా దొరుకుతుందా? నేను జీవించే వరకు ఈ ఇంటిని వదలను” అని ఆమె జవాబిస్తుంది. ఆ శిష్యుడు వెళ్ళి వారి సంభాషణ గురించి నంపిళ్ళై వారి వివరిస్తారు. నంపిళ్లై ఆమెను పిలిచి, “నీ శరీరానికి సరిపోయేంత చోటు ఉంటే సరిపోతుంది కదా? చాలా మంది శిష్యులుండటంతో ఈ స్థలంలో [వారి నివాసం] చోటు చాలక ఇరుకైపోయింది. అందుకని, నీ ఇల్లు మాకివ్వాలి” అని కోరతారు. దానికి ఆవిడ ” మీరు చెప్పినట్లే చేస్తాను; అయితే, దీనికి బదులుగా మీరు నాకు పరమపదం (శ్రీవైకుంఠం) లో చోటివ్వాలి” అని ఆమె ప్రార్థించింది. నంపిళ్లై ఆమెతో “అది అనుగ్రహించడానికి పరమపదనాధుడికే అధికారం ఉంది కదా? నేను ఆతడికి విన్నపం చేసి, అక్కడ నీకు స్థానము కల్పిస్తాను” అని వివరిస్తారు. ఆమె “స్వామీ! నేను ఏమీ తెలియని అమాయకురాలిని. నాకు స్థానము కల్పిస్తానని చెబితే సరిపోదు, మీరు వ్రాసి సంతకం చేసిన చీటీ నాకివ్వాలి” అని కోరుతుంది. అప్పుడు నంపిళ్ళై వారు ఒక తాటి ఆకుపై ఇలా వ్రాశారు, “ఫలానా తేదీన (రోజు, నెల, సంవత్సరంతో), నేను తిరుక్కళికన్ఱి దాసన్ అయిన నేను (నంపిళ్లై వారికి ఉన్న మరొక పేరు) పరమపదంలో చోటు నివ్వమని ఈ స్త్రీకి వ్రాతపూర్వకంగా ఇచ్చాను. సకల లోకాలకు ప్రభువైన నా స్వామి ఆమెకు ఆ స్థానము ప్రసాదించమని కోరుతున్నాను”; ఆ ఆకుపై సంతకం చేసి, ఆ పత్రాన్ని ఆమెకు ఇచ్చారు. ఆమె ఉప్పొంగిపోయి ఆ పత్రాన్ని తన శిరస్సుపై పెట్టుకుని, నంపిళ్ళై వారి నుండి ప్రసాదం పుచ్చుకుంది. అలాగే మర్నాడు ఆ మర్నాడు కూడా నంపిళ్ళై వారి ఎదుట సాష్టాంగ ప్రణామం చేసి, మూడవ రోజు తన దేహాన్ని త్యజించి పరమపదానికి బయలుదేరింది.

నంపిళ్ళై వారి గొప్పతనాన్ని చాటుతున్న వారి తనియన్లను చూద్దాము:

వేదాంత వేధ్యామృత వారిరాశేః వేదార్థ సారామృత పూరమర్గ్యం।
ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్య పూర్ణం కలివైరిదాసం॥ 

((నాంజీయార్ వారి అమృత సాగరం నుండి తీసుకోబడిన వేదాంతముల సారార్థములను కరుణతో కురిపించు తిరుక్కలికన్ఱి దాసులను నేను ఆశ్రయిస్తున్నాను))

నమామి తం మాధవ శిష్య పాదౌ యత్సన్నితం సూక్తిమయం ప్రవిష్టాః ।
తత్రైవ నిత్యస్థితి మాత్రియంతే వైకుంఠ సంసార విముక్త చిత్తాః॥

(మాధవర్ల (నంజీయార్) శిష్యులైన నంపిళ్ళై వారి దివ్య పాదారవిందములకు నేను నమస్కరిస్తున్నాను. ఆళ్వార్లు మరియు ఆచార్యుల దివ్య పాశుర స్తోత్రాలను నిరంతరం పఠించే నంపిళ్లై సన్నిధిలో ఉండటాన్ని వారి శిష్యులు ఎంతో ఆదరంగా స్మృతిస్తూ ఈ సంసారాన్ని ఆ శ్రీవైకుంఠాన్ని కూడా ఆశించరు.)

వార్తోంచ వృత్యాపి యదీయగోష్ట్యాం గోష్ట్యాంతరాణాం ప్రత్మాభవంతి
శ్రీమద్ కలిధ్వంసన దాసనామ్నే తస్మైనమః సూక్తి మహార్ణవాయ

(శ్రీ సూక్తి మహార్ణవం (ఆళ్వార్ల దివ్య పాశురముల సాగరము) అయిన ఆ తిరుక్కలికన్ఱి దాసులను నేను నమస్కరిస్తున్నాను. అలాంటి నంపిళ్ళై తమ శ్రీ వైష్ణవ గోష్ఠిలో చేసిన ఉపన్యాసాలలోని కొన్ని శబ్దాలను అనుసరించినా వాళ్ళు ఇతర శ్రీ వైష్ణవ గోష్ఠిలో శిఖామణులు అగుదురు).

నెంజత్తిరుందు నిరందరమాగ నిరయత్తుయ్ క్కుం
వంజక్కుఱుంబిన్ వగై అఱుత్తేన్ మాయవాదియర్ తాం
అంజప్పిఱంద సీమాధవనడిక్కన్బు శెయ్యుం
తంజత్తొరువన్ చారణంబుయం ఎన్ తలైక్కణిందే

(నేను నంపిళ్ళై దివ్య పద్మముల లాంటి పాదాలను నా శిరస్సుపై ఆభరణంగా ధరిస్తాను. నంపిళ్ళై వంటి గొప్ప ఆచార్యులను నిరంతరం మనము ధ్యానిస్తే, నన్ను నరకానికి దారితీసే అన్ని మార్గాలు మటుమాయమౌతాయి. పైగా జ్ఞానము, సంపద, వంశము నుండి సంతరించు మూడు అహంకారములు, నంపిళ్ళై వారిని ధ్యానించుటచే అంతరించిపోతాయి. శ్రీ మాధవన్ (నంజీయర్) యొక్క పాద పద్మాలను సేవించిన వీరిని చూసి మాయావాదులు (వేదాలను వక్రీకరించి వ్యాఖ్యానం చేయు వారు) భయంతో వణికిపోతారు. అందరికీ వారే ఆశ్రయం).

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://granthams.koyil.org/2021/07/23/yathindhra-pravana-prabhavam-8-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment