యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 25

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 24

అళగియ మణవాళ పెరుమాళ్ తిరుమలై ఆళ్వారుని ఆశ్రయించుట

తిగళక్కిడందాన్ తిరునావీఱుడైయ పిరాన్ తాదరణ్ణర్ తమ దివ్య తిరు కుమారుడైన అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ కు సుమారు ఆ రోజుల్లోనే వివాహం చేయించారు. వారు అతనికి అరుళిచ్చెయల్ (నాలాయిర దివ్య ప్రబంధం), రహస్యాలు (నిగూఢమైన అర్థ విషయాలు) మొదలైనవి బోధించారు. నాయనార్లు కూడా భక్తి శ్రద్దలతో తమ తండ్రి వద్ద ఉండి ఈ ఫలాన్ని స్వీకరించెను. వారు తమ తండ్రిగారిపై కూర్చిన తనియన్…

శ్రీ జిహ్వావదధీశధాసం అమలం అశేష శాస్త్రవిదం
సుందరవరగురు కరుణా కందళిత జ్ఞానమందిరం కలయే

(మొదటి పదానికి శ్రీ జిహ్వార్క్యాధీశం అని కూడా అంగీకరించబడింది; తనియన్ యొక్క అర్థం: కోట్టూర్ అళగియ మణవాళ ప్పెరుమాళ్ పిళ్ళై కృపకు పాతృలై, శాస్త్రాధ్యయనము చేసి నిష్కలంకమైన జ్ఞానానికి నిధి అయిన తిరునావీఱుడైయ పిరాన్ తాదరణ్ణర్ ను నేను ఆరాధిస్తున్నాను).

వాళి తిరునావీఱుడైయ పిరాన్ తాదనరుళ్
వాళియవన్ మామై వాక్కిన్బన్ – వాళియవన్
వీరన్ మణవాళన్ విరైమలర్ త్తాళ్ శూడి
బారమదై త్తీర్థళిత్త పణ్బు

(తిరునావీఱుడైయ పిరాన్ తాదరణ్ణర్ దయామహిమ; వారి పద సౌందర్య మాధుర్యానికి జోహార్లు; అళగియ మణవాళుని (శ్రీ రంగనాధుడు) దివ్య తిరువడి సౌందర్యీకరించినందుకు జోహార్లు, అడ్డంకులను తగ్గించే వారి స్వభావానికి జోహార్లు అని అర్థము).

కొంత కాలము తరువాత, అణ్ణర్ దివ్య వైకుంఠ లోకానికి చేరుకున్నారు. అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లు వారికి చరమ కైంకర్యాలను పూరించారు. ఇదిలా ఉండగా, ఆళ్వార్ తిరునగరిలో, దర్శనానికి నాయకత్వం వహిస్తున్న తిరుమలై ఆళ్వార్, ఇకపై ఎవరు నిర్వహిస్తారోనని యోచించు చుండెను. వీరు తిరువాయ్మొళి యొక్క పద మాలలు, వాటి అర్థాల అనుసంధానములో నిరంతరం లీనమై ఉండి జీవనం కొనసాగిస్తుండేవారు. వీరు కేవలం తిరువాయ్మొళితో  మాత్రమే ముడిపడి ఉండి, ఇతర గ్రంథాలను గడ్డి పోచతో సమానంగా చూసేవారు. తిరువాయ్మొళితోనే ఉన్న సంబంధాన్ని వారి గుర్తింపుగా చేసుకున్నందువల్ల వీరు తిరువాయ్మొళి పిళ్ళైగా ప్రసిద్ధి గాంచెను. వీరు ఆళ్వార్ (నమ్మాళ్వార్) దివ్య తిరువడి సేవను కొనసాగించు చుండెను. అటువంటి తిరువాయ్మొళి పిళ్ళైల దివ్య అనుగ్రహ ఛత్ర ఛాయలో అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లు ఆశ్రయము పొందెను. “తిరువనంత ఆళ్వాన్ సకందన్నై త్తిరుత్త మరువియ కురుగూర్ వాళనగర్ వందు” (ఈ ప్రపంచాన్ని సరిదిద్దడానికి ఆదిశేషుడు తిరుక్కురుగూర్ నివాసానికి చేరుకున్నారు) అని చెప్పబడినట్లుగా, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లు సిక్కల్ కిడారంలోని తమ తాతగారి ఇంటిని విడిచిపెట్టి తమ జన్మ స్థలమైన ఆళ్వార్ తిరునగరిని వచ్చారు. “పొరునర్సంగణిత్ తుఱైయిలే సంగుగళ్ సేరుమాపోలే”  (సంగణిత్ తుఱై అనే దివ్య స్థలానికి సమీపంలో ఉన్న తామిరపరణిలో శంఖాలు చేరినట్లు), శుద్ధ స్వభావము, శంఖం వర్ణముతో ఆదిశేషుడు అళగియ మణవాళ పెరుమాళ్ గా అవతరించి శుద్ధ జ్ఞానులైన తిరువాయ్మొళి పిళ్ళైల దివ్య తిరువడిని ఆశ్రయించెను. “అశిశ్రియతయం భూయః శ్రీ శైలాధీశ దేశికం” అనే శ్లోకములో చేప్పినట్లుగా వీరు తిరువాయ్మొళి పిళ్ళైతో విశేష సంబంధాన్ని ఏర్పరచుకొనెను మరియు “దేశం తిగళుం తిరువాయ్మొళి పిళ్ళై వాసమలర్ త్తాల్ అడైందు” (ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరువాయ్మొళి పిళ్ళైల సువాసన భరితమైన దివ్య తిరువడిని చేరెను) అని అర్థము.

ఆ తరువాత, ఇలా చెప్పబడినట్లు…

తదశ్ శృతితరస్సోయం తస్మాద్ తస్య ప్రసాదనః
అశేషనశృణోద్దివ్యాన్ ప్రబంధం బంధనచ్చిదః

(తరువాత, వీరు వేదాంగములను నేర్చుకున్నారు,  తిరువాయ్మొళి పిళ్ళైల అనుగ్రహముతో అళగియ మణవాళ పెరుమాళ్ సంసార సంబంధాన్ని తెంచే అరుళిచ్చేయల్ (నాలాయిర దివ్య ప్రబంధం) అర్థాలను కూడా నేర్చుకొనెను. వీరు ద్రావిడ వేదం (నాలాయిర దివ్య ప్రబంధం) వాటి అంగములు, ఉపాంగములను తిరువాయ్మొళి పిళ్ళైల సూచనల ద్వారా వాటి అర్థాలను నేర్చుకొనెను. వీరు శేషి, శరణ్యం, ప్రాప్యన్ అనే మూడు గుణాలతో తిరువాయ్మొళి పిళ్ళైపై ధ్యానం చేసే చరమ పర్వ నిష్ఠలో గాఢంగా స్థిరమై ఉండెను. “మిక్క వేదియర్ వేదత్తిన్ ఉట్పొరుళ్” (వేదాల యొక్క అంతర్గతార్థాలు) లో చెప్పబడినట్లు ఇదే సమస్థ వేదాల సారము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము: https://granthams.koyil.org/2021/08/09/yathindhra-pravana-prabhavam-25-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment