యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 43

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 42

కందాడై అన్నన్ స్వప్నము

మేడ మీద నుండి ఒక శ్రీవైష్ణవుడు క్రిందకు దిగి, తన వెంట తెచ్చుకున్న కొరడాతో కందాడై అన్నన్ ను కొట్ట సాగాడు. ఆపే సామర్థ్యం ఉన్నా ఆ శ్రీవైష్ణవుడిని అన్నన్ ఏమీ అనకుండా  ఊరుకున్నారు. యదార్థ స్వరూపానికి విరుద్ధమైన గుణం తనలో ఉన్నందుకు ఇలా  శిక్షించ బడుతున్నారని వారు భావించారు. “శస్త్రక్షారాగ్నికర్మాణిస్వపుత్రాయ యతా పితా” (తండ్రి తన పుత్రుని గాయాలను నయం చేయడం కోసం చర్మాన్ని కత్తిరించడం, కుట్టడం, వేడి వేడి ఇనుప కడ్డీలతో వాతలు పెట్టడం వంటివి చేయును) అనే సూక్తులను గుర్తు చేసుకుంటూ మౌనంగా ఉండిపోయారు. కొంతసేపటికి ఆ కొరడా తెగిపోయేసరికి, ఆ శ్రీ వైష్ణవుడు అన్నన్ చేయి పట్టుకొని లాగి పైకి వెళ్ళమన్నారు. అన్నన్ నిచ్చెన గుండా పైకి వెళ్ళి  అక్కడ ఒక జీయర్ తమ ఒక కాలు క్రిందికి వేలాడించి మరో కాలు ముడుచుకొని త్రిదండం ధరించి తమ ఒక చేతిలో కొరడా పట్టుకొని నిప్పులు కక్కుతున్న కళ్ళతో కూర్చొని ఉండటం చూశారు.  శ్రీ వైష్ణవుడు అన్నన్ ను ఆ జీయర్ వద్దకు తీసుకొని వెళ్ళారు. జీయర్ తమ హస్తములో ఉన్న కొరడాతో అన్నన్ ను కొట్టడం ప్రారంభించారు. ఆ కొరడా కూడా తెగింది. అతన్ని ఇంకా శిక్షించాలనే ఉద్దేశ్యముతో తమ త్రిదండం నుండి ఒక దండాన్ని తీసారు. ఆ శ్రీవైష్ణవుడు జీయర్ ముందు సాష్టాంగ నమస్కారం చేసి అంజలి ముద్రలో చేతులు జోడించి, జీయర్ తిరు ముఖాన్ని చూసి ఇలా అన్నారు “ఈ నవ యువకుడు చాలా కొరడా దెబ్బలు తిన్నాడు. దయచేసి దేవరి వారు పెద్ద మనసు చేసుకొని అతనిపై జాలి చూపించి క్షమించండి.” అని ప్రార్థించారు. జీయర్ అన్నన్ పై దయ చూపి, అతనిని తమ ఒడిలోకి తీసుకుని, అల్లారుముద్దుగా అతని శిరస్సుపైన తమ చేతితో నెమరేసి, తల నుండి మొదలు అతని శరీరమంతా స్పర్శించారు.  “ఉత్తమ నంబి మరియు నీవు అపరాధం చేసారు” అని అన్నాన్‌ తో అన్నారు. “అళగియ మణవాళ జీయర్ గొప్పతనాన్ని గుర్తించలేక అస్పష్టమైన మనస్థితితో ఉన్నాను. దయచేసి నా అపరాధాన్ని మన్నించండి” అంటూ వారి చరణాలపై పడ్డారు. జీయర్ అతనిపై జాలిపడి, “మేము భాష్యకారులము, ఆ శ్రీవైష్ణవుడు ముదలియాండాన్” అని ఈ క్రింది శ్లోకాన్ని పఠించారు.

త్వదీయాన్ అపరాదన్యీరన్ త్వద్సంబంధి కృతానపి
క్షమామ్యహం దాశరథేః సంబంధం మాన్యతాకృతః

(మేము మీ తప్పులను వాటికి సంబంధించిన అపరాధాలను క్షమించాము. ముదలియాణ్డాన్ తో మీ సంబంధాన్ని నిరర్ధకం కానివద్దు) అని చెప్పి “మేము తిరు అనంత ఆళ్వానులము (ఆదిశేషుడు); మేము వరవరముణులము (అళగియ మణవాళ జీయర్). నీతో పాటు నీ బంధువులు వారి దివ్య తిరువడిని ఆశ్రయించి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవాలి” అని ఆదేశించారు. వారు వెంటనే మేలుకొని “ఈ కల ఏమిటి, ఎలా వచ్చింది!” అని ఆలోచించ సాగారు. ఆశ్చర్యపోతూ, కలలో తనతో జరిగిన సంఘటనల గురించి చింతన చేస్తూ తమ సోదరులను నిద్రలేపి, తన స్వప్నము గురించి వారికి వివరించారు. స్వప్నంలో జరిగిన సంఘటనలను వారికి వివరిస్తున్నప్పుడు, మధ్యలో కొన్నిసార్లు వారికి మాటలు రాక అవాక్కైనారు.

ఎమ్పెరుమానార్ కృప ద్వారా కందాడై అన్నన్‌ కు జరిగిన సంఘటనలను పెద్దలు ఈ క్రింది శ్లోకాలలో సంగ్రహించారు:

వాదూలదుర్య వరదార్య గురోర్ పపాణ
స్వప్నేయతీంద్ర వపురేత్య కృపాపరోన్యః
శేషోప్యహం వరవరోమునిరప్యహం త్వం
మామశ్రయేతితం అహం కలయామి చిత్తే

అత్యంత పాపనిరతః కథమార్యవర్య
త్వామాశ్రయేహమితి తం కృపణం వదంతం
దృష్ట్వా ఖమామి ననుదాశరథేః త్వదీయ
సర్వాపరాదమితి తం ప్రవదంతమీడే

(వాదూల వంశ ప్రముఖుడైన కందాడై అన్నన్ స్వప్నంలో, ఎమ్పెరుమానార్ల దివ్య స్వరూపంలో ప్రత్యక్షమైన ఆ కృపామూర్తి జీయర్‌ ను నేను ఆరాధిస్తాను. వారు ఆ స్వప్నంలో “మేము ఆదిశేషులం, మేము మాముణులము. మమ్ములను ఆశ్రయించుము” అని తెలిపారు. నా మనస్సులో వారిని ధ్యానించెదను. పరమ పాపి అయిన నన్ను వారు తమ శరణులోకి స్వీకరించెదరా అని కందాడై అన్నన్ నిస్త్రాణైన కంఠంతో ప్రశ్నించగా, వారు (రామానుజులు) అన్నన్ తో  “ఓ అణ్ణా ! ముదలియాండాన్ కొరకు, మీ దోషాలన్నింటినీ క్షమించివేస్తాము” అని అన్నారు. శ్రీవిష్ణు పురాణం 5 -17-3 “అధ్యమే సఫలం జన్మ సుప్రభాదాసమే నిశా” (నిన్నటి రాతిరి వేకువ ఝాము అయితే, ఈ రోజున నా జన్మ ఫలించింది) అని అన్నాట్లు, కందాడై అన్నన్ తమ సోదరులతో ఆచ్చి వద్దకు వెళ్లి ఆమె ఎదుట సాష్టాంగ నమస్కారం చేశారు.  ఆమె భయపడకూడదని, అన్నన్ ముందు రోజు రాత్రి తన కల గురించి ఆమెకు వివరించి ఉంచారు. అచ్చి తాను జీయర్ తిరువడి యందు ఆశ్రయం పొందానని, వారి పాదుకలను తన శిరస్సుపైన ధరించిన సంఘటనను, వాటి నుండి జాలువారిన జలముతో తాను ఎలా శుద్ధి పొందిందో వివరించింది. తరువాత, కావేరిలో జీయర్ స్నానమాడిన తర్వాత ఆ ప్రవాహపు నీటిలో తన తండ్రి స్నానం చేసి ఎలా జ్ఞానోదయం పొందాడో కూడా ఆమె వివరించింది. ఇది విని అన్నన్ ఎంతో ఉప్పొంగిపోయి, శింగరైయర్ వద్దకు వెళ్లి జరిగిన విషయాలు వారికి వివరించి, ఆ తర్వాత దివ్య కావేరి నది వద్దకు వెళ్లి, స్నానం చేసి, రోజువారీ అనుష్టానాలు చేసుకుని, జీయర్‌ వద్దకు బయలుదేరారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://granthams.koyil.org/2021/08/28/yathindhra-pravana-prabhavam-43-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment