శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
మాముణుల ఆశ్రయం పొందిన అణ్ణన్
ఈ క్రింది శ్లోకములో చెప్పినట్లుగా…
రామానుజపదాంభోజ సౌగంధ్య నిదయోపియే
అసాధారణ మౌన్నత్యమవధూయ నిజంధియా
ఉత్తేజయంతః స్వాత్మానం తత్తేజస్సంపదా సదా
స్వేషామతిశయం మత్వా తత్వేన శరణం యయుః
(ఎమ్పెరుమానార్ల (రామానుజుల) దివ్య పాదాల మధుర పరిమళాన్ని నిధిగా పొందిన వారు, దివ్య తేజస్సు గల మాముణులను ఆశ్రయించి మరింత గొప్పతనాన్ని పొందాలని భావించి, తమ స్వంత గొప్పతనాన్ని వదిలి ఆ మాముణులకు సంపూర్ణ శరణాగతి చేశారు), కందాడై అన్నన్ తో సహా ఆచార్యులందరూ, రామానుజుల అనుగ్రహం పొందిన వారే పైగా వారి జన్మం, జ్ఞానం, అనుష్ఠాన పరంగా ఎన్నో గౌరవాలు అందుకున్నవారు. వారందరూ తమ గొప్పతనాన్ని పక్కన పెట్టి, జీయర్ దివ్య తిరువడి మాత్రమే వారికి గొప్పతనాన్ని చేకూర్చునని తమ మనస్సులలో దృఢంగా స్థిరపరచుకొని వారి దివ్య తిరువడి యందు ఆశ్రయం పొందాలని జీయరు వద్దకి చేరుకున్నారు. జీయర్ దగ్గరకు అణ్ణన్ వెళ్లి ఇలా అన్నారు: “భక్తులపై మీ కృపను కురిపించే శుభ దినము ఆసన్నమైనది. ఇంతకు మునుపు ఎంబా చేత ఆపబడిన కొందరు, ఎమ్పెరుమాన్ వారి స్వప్నంలో చెప్పిన కారణంగా తమ మార్గాన్ని సరిదిద్దుకొని ఈ గోష్టిలో చేరారు. దేవర్వారు అందరిపై తమ కృపను కురిపించాలి.”జీయర్, వానమామలై జీయర్‌ని పిలిపించి, సమాశ్రయణం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయమని ఆదేశించారు. జీయర్ [మణవాళ మాముణులు] తిరువారాధన నిర్వహించి ఆహారం మరియు పండ్లు నివేదన గావించారు. వారు సమాశ్రయణం చేయవలసిన వారందరినీ పిలిచి, పరంపరా రీత్య చేయవలసివన్నీ పద్దతిగా నిర్వహించారు. అనగా “తాపః పుండ్రస్థతానామ మంత్రోయాగశ్చ పంచమః”[(భుజాలపైన దివ్య ముద్రలు, పన్నెండు ఊర్ధ్వపుండ్రాలు (భగవంతుని రక్షక చిహ్నాలు), దాస్యనానము ప్రసాదించుట, మంత్రోపదేశం (భగవానుని దివ్య మంత్రం (స్తోత్రం) పఠించడం), దేవపూజ (భగవానునికి రోజువారీ ఆరాధన చేసే విధానం) నిర్వహించడం]. వారు పరమానందంతో అణ్ణన్ ను చూస్తూ ఉండిపోయారు.
వానమామలై జీయర్ ఆశ్రయం పొందిన అప్పాచ్చియారణ్ణా
వానమామలై జీయర్ ను జీయర్ చూపిస్తూ “వీరు మా హృదయానికి అతి దగ్గరైనవారు, మాకు అతి ప్రియమైనవారు. మాకు జరిగిన మరియాద వీరికి కూడా జరగాలి” అని అన్నారు. అణ్ణన్ జీయర్ దివ్య మనస్సును తెలుసుకుని “అడియేన్ వారిని ఆశ్రయించి ఉండేవాడను కదా” అని అనగా, దానికి జీయర్ “మా సంపదను ఎలా వదులుకుంటాము?” అన్నారు. అణ్ణన్ తమ బంధువుల వైపు చూసి జీయర్ మనోభవనను వ్యక్తం చేసారు. ఆచ్చి కుమారుడైన అణ్ణా లేచి వారి ముందు సాష్టాంగము చేసారు; జీయర్ అతని కోరిక ఏమిటో అడిగారు; “మా స్వామి వానమామలై జీయర్ దివ్య తిరువడి పొందాలని ఉంది, దేవర్వారు అనుమతించాలి” అని ప్రార్థించారు. ఇది విన్న జీయర్ సంతోషించి, “నీవు మా అప్పాచ్చియారణ్ణన్!” (ఆచ్చి కుమారుడు). ఆ తర్వాత వారు అప్పాచ్చియారణ్ణన్ ని తమ చేతితో పట్టుకుని, తమ పక్కన నిలబెట్టి, తమ ఆసనము నుండి లేచి, వానమామలై జీయర్ ను తమ ఆసనముపై ఆసీనులు కామన్నారు. ఆ తర్వాత అప్పాచ్చియారణ్ణన్ ను వానమామలై జీయర్ కి అప్పగించి, అతనికి సమాశ్రయణం చేయమన్నారు. వానమామలై జీయర్ సంకోచిస్తుండగా జీయర్ అతనితో “సంకోచించకు; మాకు ఏది ప్రీతికారమో దానిని ఆచరించు” అని చెప్పి అప్పాచ్చియారణ్ణన్ ను ఆలింగనము చేసికొని వానమామలై జీయర్ దివ్య తిరువడిని ఆశ్రయించేలా చేసారు. వెంటనే, అప్పాచ్చియారణ్ణన్ తమ్ముడు, దాశరథి అప్పై కూడా వానమామలై జీయర్ దివ్య చరణాలను ఆశ్రయించారు. వానమామలై జీయర్ ఆ ఆసనములో నుండి లేచి “దయచేసి చాలు” అంటూ కొంతదూరం వెళ్లి సాష్టాంగ నమస్కారం చేసారు. అప్పుడు మాముణులు, కందాడై అణ్ణన్ సోదరుడు, కందాడై అప్పన్, ఇతర సోదరులతో పాటు వారి బంధువులు, వారి సహధర్మచారులకు, పిల్లలకు మొత్తం 120 మందికి సమాశ్రయణం పూర్తి చేసారు. శింగరైయర్ తదితరులు కూడా మాముణుల ఆధ్వర్యంలో సమాశ్రయణం సంపన్నం చేసుకొన్నారు. ఆలయం నుండి పెరుమాళ్ల ప్రసాదంతో ఆలయ ఉద్యోగులంతా అక్కడికి వచ్చారు. జీయర్ బయటకు వెళ్లి, ఆలయ మర్యాదలను గౌరవప్రదంగా స్వీకరించి వారిని లోనికి పిలిచారు. కందాడై అణ్ణన్ వారిని ఎంతో ఆదరంతో వారికి తగిన విధంగా బహుమతులు అందజేశారు. తదనంతరం, ఆ రోజు తిరువడి సంబంధం పొందిన వారందరూ ఆలయానికి వెళ్లి, ఎమ్పెరుమానార్, ఆళ్వార్, నాచ్చియార్, పెరుమాళ్ళను వారి వారి సన్నిధులలో సేవించి జీయార్ మఠానికి తిరిగి చేరుకొని తదీయారాధనంలో పాల్గొన్నారు. దేవరాజ ప్పెరుమాళ్ పలికిన “జగత్రక్షాపరో నంద” (ఈ లోక రక్షణలో పూర్తిగా నిమగ్నమై ఉన్న అనంతాళ్వాన్ అవతరిస్తాడు…) అన్న తోళప్పర్ స్వప్నాన్ని గుర్తు చేసుకుని ఆనందించారు. మాముణుల ఆశ్రయం పొందిన వారందరూ, అతని మానవాతీత, అద్భుత కథనాలను స్మరిస్తూ ఈ శ్లోకాన్ని పఠించారు.
చిరవిరహతః చింతా సంతానజర్జజర చేతసం
భుజగశయనం దేవంభూయః ప్రసాదయితుం ధృవం
యతికులపతిః శ్రీమాన్ రామానుజ స్వయమిత్య భూ
తిదిథి సమదుశన్ సర్వే సర్వత్ర తత్ర సుతీజనాః
(యతులకు రాజైన శ్రీ రామానుజులు ఈ లోకాన్ని విడిచి పెట్టిన తర్వాత శ్రీ రంగనాథ పెరుమాళ్ళు శ్రీరామానుజుల గురించి నిరంతరం ఆలోచిస్తూ తల్లడిల్లుతున్నందున, పెరుమాళ్ల సంతోషము కోసం వారు మణవాళ మాముణులుగా పునరవతారము చేసారని అక్కడి పండితులు సంతోషించారు.) వారు మాముణులను రామానుజుల పునరవతారముగా భావించి, వారి దివ్య చరణాలపై పడి, వారి పట్ల గౌరవంగా వ్యవహరించేవారు. జీయర్ తమ శిష్యులతో ఇలా దయతో జీవిస్తున్నప్పుడు, వారు శ్రీ కోశమును (ఎమ్పెరుమానార్ దర్శనం గురించి వ్రాసిన వ్రాతప్రతులు) పరీక్షించి వాటిని సురక్షిత స్థానములో ఉంచమని తిరువాళియాళ్వార్ పిళ్ళైని ఆదేశించారు; చిరిగి శిథిలమైన పత్రాలను తిరిగి సరిగ్గా వ్రాసి, అనుకరణ చేయడానికి రచయితలను నియమించారు. ఈడు (తిరువాయ్మొళికి ముప్పత్తారాయిర ప్పడి వ్యాఖ్యానం) వివరించడానికి వీలుగా అవసరమైనప్పుడల్లా శ్రీకోశము నుండి అందుకునేవారు.
మూలము: https://granthams.koyil.org/2021/08/30/yathindhra-pravana-prabhavam-46-english/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org