యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 83

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 82

కోయిల్లోని మరి కొన్ని సంఘటనలు

తిరువెంకటేశ్వరుడు తిరుమలలో కైంకర్యం చేయమని తిరుమలై అయ్యంగార్లను ఆదేశించిన రోజున, జీయర్ తిరువాయ్మొళి 3.3 పదిగం ‘ఒళివిలాక్కాలం ఉడనాయ్ మన్ని వళువిలా అడిమై శెయ్య వేండుం నామ్’ (ఆటంకాలు లేకుండా నిష్కల్మశమైన కైంకర్యం చేయాలి) కాలక్షేపం చేస్తున్నారు. వారు కూర్చున్నా, నిలబడినా, పడుకున్నా దుఃఖంతో రోధిస్తున్నారు. అంతకు ముందు రేత్రి, తిరువేంకట జీయర్ అనే ఒక ఏకాంగి (జీయరుకి సహకారిగా ఉండే బ్రహ్మచారి) ప్రతివాది భయంకరం అణ్ణా స్వప్నంలో వచ్చి “ఓ శ్రీవైష్ణవ దాసర్! రా! రేపు ‘ఒళివిలాక్కాలం’ కలక్షేపం సమయంలో జీయర్ మైమరపు స్ధితిలో ఉంటారు, ఎందుకంటే అక్కడ వారు కైంకర్యం చేయ లేదు కాబట్టి. ఆదిశేషుని అవతారమైన శేషశైలంలో (తిరుమల) వారికి కైంకర్యం ప్రసాదిస్తామని వారికి చెప్పండి” అని చెబుతారు. ప్రతివాది భయంకరం అణ్ణా చటుక్కున మేల్కొని “ఏమి ఈ దివ్య స్వప్నం!” అని మర్నాడు ఉదయం తమ నిత్య అనుష్ఠానాలు ముగించుకొని, తిరుమలైయాళ్వారుకి (జీయర్ మఠంలోని ఉపన్యాస మంటపం) చేరుకున్నారు, అక్కడ జీయరుకి సాష్టాంగ నమస్కారం చేశారు. అక్కడ జీయర్ పరిస్థితిని చూసి, మునుపటి రాత్రి తన స్వప్నాన్ని గుర్తుచేసుకుని, రెండూ ఒకేలా ఉన్నాయని గుర్తించి, సంతోషించి, జీయరుకి తమ స్వప్నం గురించి వివరించారు. జీయర్ అణ్ణాను ప్రశంసిస్తూ, “ఇది కూడా పెరుమాళ్ళ అనుగ్రహమే!” అని సంతోషించారు. జీయార్ ఆ స్వప్నాన్ని పదే పదే వర్ణించమని అభ్యర్థించారు, దానిని ఆనందంగా తమ అష్ట దిగ్గజులతో పంచుకున్నారు. “దీని గురించి మీకేమనిపిస్తుంది?” అని వారిని ప్రశ్నించారు. వారు జీయర్ తో “ఇప్పటికే తిరుమలలో ఒక అద్భుతమైన సంఘటన జరిగి ఉండాలి; అదేమిటో తెలుసుకోవడానికి దేవర్వారు ఎవరినైనా తిరుమలకు పంపాలి” అని విన్నపించారు. ఆ గోష్ఠిలో అళగరణ్ణన్ అనే ఒకరు లేచి, జీయరుకి సాష్టాంగము చేసి, “అడియేన్ స్వామివారి దివ్య తిరువడి పురుషకారంతో (సిఫార్సు పాత్ర) తిరుమలకు వెళ్ళి, అప్పన్ ను (తిరువెంకటేశ్వరుడు) సేవించుకొని, జరిగిన విషయం గురించి తెలుసుకుని వస్తాను” అని ప్రార్థించాడు. జీయర్ సంతోషించి, అతనిని బయలుదేరమని ఆదేశించారు. అళగరణ్ణన్ వెంటనే తిరుమలకు వెళ్లి పెరుమాళ్ళని దర్శించుకొని, అక్కడ ఇళైయాళ్వార్ పిళ్ళైని చూసి, ఇద్దరూ ఒకరికికొకరు సాష్ఠాంగ నమస్కారాలు సమర్పించుకున్నారు. ఇళైయాళ్వార్ పిళ్ళై అళగరణ్ణన్ ను రామానుజ అయ్యంగార్ల వద్దకి తీసుకువెళ్లారు. పరమానందంతో రామానుజ అయ్యంగార్లు అళగరణ్ణన్ పైన బహుమతుల వర్షం కురిపించి, జీయర్ మహిమను పదే పదే అడిగి తెలుసుకున్నారు. తిరుమలలో కైంకర్యం చేయాలనే జీయర్ కోరిక గురించి, ప్రతివాది భయంకరం అణ్ణా స్వప్నం గురించి అళగరణ్ణన్ అయ్యంగారుకి వివరించారు. రామానుజ అయ్యంగారు అన్నారు “అడియేన్ మహా భాగ్యవంతుడి నైనాను; జీయర్ తిరు హస్తాల ఆశీర్వాదంతో, అడియేన్ సామర్థ్యం మేరకు కైంకర్యం నిర్వహిస్తాను” అని తెలిపారు. తరువాత ఇళైయాళ్వార్ మరియు అళగరణ్ణన్ ను శ్రీరంగానికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. వాళ్ళు వెంటనే శ్రీరంగం చేరుకొని, జీయరుకు సాష్టాంగ నమస్కారాలు సమర్పించి, వివిధ ఉత్తర దివ్యదేశ పెరుమాళ్ళ అభయ హస్త ప్రసాదాలను (పెరుమాళ్ళ అభయ హస్థం అచ్చు) వారికి అందించారు. జీయర్ వాటిని స్వీకరించి, చాలా కాలం తర్వాత చూస్తున్న ఇళైయాళ్వార్‌ పై అలాగే అళగరణ్ణన్ పైన తమ కృపను కురిపించారు. ప్రతివాది భయంకరం అణ్ణాతో “మీ కల ఫలించింది. తిరువెంకటేశ్వరుడు తమ కృపను మీపైన  కురిపించారు కదా!” అని చెప్పి ఇళైయాళ్వార్ పిళ్ళైని ఆలింగనం చేసుకుంటూ “నీవు దూర దేశాలకు వెళ్ళి వచ్చావు!” అని చెప్పి రామానుజ అయ్యంగార్ల స్వరూప గుణాల గురించి అడిగి తెలుసుకున్నారు. వారు నంపెరుమాళ్, శ్రీ బద్రికాశ్రమ పెరుమాళ్, తిరుణారాయణ పెరుమాళ్ (తిరుణారాయణపురం), తిరువెంకటేశ్వరుడు, అళగర్ [మాముణుల తనియన్ పై] మధ్య ఉన్న సమన్వయాన్ని మరళా మరళా స్మరించుకున్నారు. ఈ సంఘటనలన్నీ కందాడై అప్పన్ తమ “వరవరముని వైభవ విజయం” అను ప్రబంధం లో దయతో వ్రాసి ఉంచారు. పైగా జీయర్ విని ఆమోదించినవి.

ఒక రోజు, జీయర్ కావేరి నది నుండి తిరిగి వస్తుండగా, ఇళైయాళ్వార్ వారికి చేయి ఇచ్చి, వారితో రామానుజ అయ్యంగార్ల [జీయర్ అనుగ్రహంతో కైంకర్యం చేయాలనే] కోరిక గురించి చెప్పారు. జీయర్ “తిరువెంకటేశ్వరుడిని సేవించేందుకు వారికి మరొక అవకాశం రాబోతుంది; అంతవరకు వారిని కైంకర్య సంపదతో ఉండనివ్వండి” అని అన్నారు. జీయర్ దివ్య పాదుకలను రామానుజ అయ్యంగార్లు తమ తిరువారాధన పెరుమాళ్ళుగా సేవిస్తున్నారని ఇళైయాళ్వార్ జీయరుకి తెలిపారు. జీయర్ మఠానికి చేరుకున్నారు. తమ తిరువడి సంబంధం ఉన్న కొందరు శ్రీవైష్ణవులు, బాధ్రపద (పురట్టాసి) ఉత్సవాలలో పాల్గొనడనికి తిరుమలకు వెళుతున్నట్టు తెలిపారు. జీయర్ ఎంతో సంతోషించి, తిరుమల వైపు చూసి తమ అంజలిని సమర్పించి, వారికి తమ పాదుకలనిచ్చి, వాటిని రామానుజ అయ్యంగారుకి ఇవ్వమని ఆదేశించారు. అవి తీసుకొని వాళ్ళు తిరుమలకు బయలుదేరారు.

మూలము: https://granthams.koyil.org/2021/10/09/yathindhra-pravana-prabhavam-83-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment