యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 99

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 98

జీయర్ యొక్క ఆశీస్సులు

ఆ తరువాత, జీయర్ చరమ కైంకర్యలు నిర్వహించేందుకు, వారి పూర్వాశ్రమ మనుమడు, జీయర్ నాయనార్, శిష్యులందరితో కలిసి కావేరి నది స్నాన మాచరించారు. జీయర్ తిరుమంజనం కోసం కావలసిన జలాన్ని తీసుకొని వెళ్ళారు. వారి దివ్య తిరుమేనిని తిరుమంజనవేధి (వివిధ పుణ్య కార్యాలు నిర్వహించే ఎత్తైన ఒక వేదిక) పై ఉంచి, పురుషసూక్తం, ద్వయ మహామంత్రం, అనేక శ్లోకాలను పఠిస్తూ తిరుమంజనం గావించారు. “విస్థీర్ణబాలతల విస్పురదూర్ద్వపుండ్రం” (విశాలమైన వారి నుదురులో ప్రకాశిస్తున్న తిరుమన్ కాప్పు) అని చెప్పినట్లుగానే, వారి తిరుమేనిని దివ్యమైన వస్త్రంతో తుడిచి, పన్నెండు ఊర్ధ్వ పుండ్రాలను ధరింపజేశారు. మిగిలిన తిరుమన్ కాప్పు శ్రీచూర్ణాన్ని అమూల్యమైన ఆస్థిగా అందరూ పంచుకున్నారు. వారి దివ్య తిరుమేనిని ఒక దివ్య సింహాసనంపై ఉంచి, అందరూ చరణాలపైన తమ శిరస్సుని ఉంచి నమస్కరించారు. ప్రతి క్షణాన్ని అనుభవిస్తూ కనురెప్ప వార్చకుండా వారి దివ్య స్వరూపాన్ని చూస్తూ తమ తమ హృదయాలలో జీయర్ దివ్య స్వరూపాన్ని నిలుపు కున్నారు.

ఆ సమయంలో, శ్రీ రంగనాధుడు ధరించిన ఎర్రటి దివ్య వస్త్రాన్ని, శ్రీ రంగనాధుడు తమ దివ్య వక్షస్థలంపై ధరించిన వనమాలను ఉత్తమ నంబి (శ్రీరంగ దేవాలయ ప్రధాన కైంకర్యపరుడు) బంగారు కంచంలో ఉంచి, తమ శిరపైన పెట్టుకొని, ఆలయ ఇతర కైంకర్యపరర్లతో కలిసి మఠానికి వేంచేశారు. జీయర్ శిష్యులు ఎదురు వెళ్లి, వారికి నమస్కారాలు సమర్పించి, వారి తలపై పెరుమాళ్ ప్రసాదాన్ని స్వీకరించారు. పెరియాళ్వార్ తమ తిరుప్పల్లాండు 9 వ పాశురంలో పేర్కొన్నట్లుగానే “ఉడుత్తు క్కళైంద నిన్ పీతగవాడై ఉడుత్తు క్కలత్తదుండు తొడుత్త తుళాయ్ మలర్ శూడి కళైందన శూడుం ఇత్తొండర్గళోం” (మీ శిష్యులము, మీరు తొడిగిన వస్త్రాన్ని, దివ్య తుళసి మాలను మేము ధరిస్తాము). పెరుమాళ్ళు ధరించిన వస్త్రం, మాలతో జీయర్ తిరుమేనిని అలంకరించారు. ఆలయ కైంకర్యపరర్లు, అనేక ఆచార్య పురుషులు, జీయర్లు, ఏకాంగులు, శ్రీవైష్ణవులు, జీయర్‌ను సేవించుకొని వారి తనియన్లను (‘శెయ్య తామరై తాళిణై వాళియే’ (75వ భాగంలో చూడవచ్చు) త) సేవించి మంగళాశానములు సమర్పించారు. “రామానుజులను సేవించలేదేనన్న లోటుని జీయర్‌ ను సేవించుకొని పూరించుకున్నాము, ఇప్పుడు వారు కూడా మనలను విడిచిపెట్టి వెళుతున్నారు” అని అందరు ఒకరితో ఒకరు చెప్పుకొని బాధపడ్డారు. ఆ తర్వాత వారి శిష్యులు శ్రీచూర్ణ పరిపాలన (జీయర్ తిరుమేనిపై దివ్య సింధూరం లేపనం చేయుట) కైంకర్యం నిర్వహించి మిగిన లేపనాన్ని తమ నుదుటిపైన ధరించారు. జీయర్ దివ్య తిరుమేనిని పుష్పక విమానం (పూలతో అలంకరించిన వాహనం) పైన ఉంచి, ఆ వాహనాన్ని శిష్యులు తమ భుజాలపై మోస్తూ, ఛత్ర చారలు, మేళతాలాలు, శంఖ నాదములతో ముందుకు సాగారు.

పదాకాత్ విజినీం రమ్యాం దూర్యోద్కుష్ట నినాదనీం
సిగ్దరాజపదాం రామ్యాం కృత్స్నం ప్రకీర్ణ కుసుమోత్కరాం

(ఆ ఊరుని, జీయర్ వచ్చే మార్గం మొత్తం నీళ్లు చల్లి, అందమైన జెండాలతో, పుష్పాలతో అలంకరించి, అనేక సంగీత వాయిద్యాలతో మారుమ్రోగించారు) వారు మార్గాన్ని వివిధ పుష్పాలు ఫలాలను ఇచ్చే చెట్లతో అలంకరించారు. చెరకులను మోసుకెళుతూ రామానుస నూఱ్ఱందాది మొదలైన పాశురాలను పఠించారు. దివ్యజలాన్ని చల్లారు, పువ్వులు చల్లారు. ఏక తిరుచ్చిన్నం (రాజులు, దేవతలు మొదలైన వారి ఊరేగింపులో ఊదబడే వాయుద్యం) ఊదుతూ “మణవాళ మాముణులు తిరునాడుకి చేరుకున్నారు” అని నినాదాలు చేశారు”. మహిళలు దీప హారతులు సమర్పించారు. ఊరేగింపు వెళ్ళే వీధుల్లో ప్రజలందరూ సాష్టాంగ నమస్కారం చేశారు.

తిరుప్పళ్ళి నిర్వహణ 

[సన్యాసులకు అగ్నితో ఎలాంటి సంబంధం ఉండకూడదు కాబట్టి, దహనం చేసే బదులు వారిని పాతిపెట్టే ప్రక్రియను మన సంప్రదాయంలో ‘తిరుప్పళ్ళి’ సేవ అని అంటారు]. జీయర్ పెరుమాళ్ళ పాదపద్మాల యందే ఉండాలని, ఆదికేశవ పెరుమాళ్ కొయిల్ సమీపంలోని, ‘తవరాసన్ పడుగి’ (రామానుజులు కావేరి ఒడ్డున స్నానమాచరించిన చోటు) వద్దకు తీసుకెళ్ళారు. భూమిదేవి సీతా పిరాట్టిని తన ఒడిలోకి తీసుకున్నట్లు, మణవాళ మాముణులును కూడా తన ఒడిలోకి తీసుకొని సంతోషించింది. ఆళవందార్లు ఎంబెరుమానార్ల మాదిరిగానే, యతుల నియమాలను నిష్ఠగా పాఠించి, జీయర్ దివ్య స్వరూపం కూడ సమాధి చేయబడింది.

మూలము: https://granthams.koyil.org/2021/10/26/yathindhra-pravana-prabhavam-99-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment