యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 107

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 106

ఇప్పుడు, యతీంద్రర్ (రామానుజులు), యతీంద్రప్రవణర్ (మణవాళ మాముణులు) మధ్య పోలికలు గమనిద్దాం: 

శ్రీ రామానుజులు సంస్కృత తమిళ భాషల ప్రాధాన్యతను ఎత్తి చూపుతూ శ్రీరంగానికి ఉత్తరాన ఉన్న శ్రీపెరంబుదూర్లో అవతరించారు. వీరి అవతారం కారణంగా, “నారణనై క్కాట్టియ వేదం కళిప్పుఱ్ఱదు తెన్ కురుగై వళ్ళల్ వాట్టమిళా వణ్ తమిళ్ మఱై వాళ్ందదు” (సంస్కృతం ఆనందించింది; ఆళ్వార్తిరునగరిలో అవతరించిన నమ్మాళ్వార్లు వాడిన గొప్ప తమిళ భాష ఉద్దరింపబడింది). మణవాళ మామునిగళ్, “అరంగ నగరుం మేవు తిరునగరియుం వాళ్ంద మణవాళ మాముని” (శ్రీరంగం, ఆళ్వార్తిరునగరి రెండూ మణవాళ మాముణుల అవతారంతో ఉద్ధరింపబడ్డాయి) అని చెప్పినట్లుగా, తమిళ భాష ఉద్దరించుటకు దక్షిణ ప్రాంతానికి తిలకం వంటి ఆళ్వార్తిరునగరిలో మణవాళ మాముణులు అవతరించారు. వీరు సంస్కృత తమిళ భాషలలో నైపుణ్యం ఉన్నప్పటికీ, వారి కీర్తి స్థాపన కోసమై ఇక్కడ తమిళ్ మాత్రమే ప్రస్తావించబడింది. నల్లని రత్నం (శ్రీ రంగనాధుడు) దర్శనం పొంది, కైంకర్య సంపదతో జీవిస్తూ, కైంకర్యం, ఇరు వేదములను (సంస్కృత, ద్రవిడ) పోషించడానికి మాముణుల కూడా తమ స్వస్థలాన్ని విడిచి, రెండు నదుల (కవేరి, కొల్లిడం) మధ్య ఉన్న శ్రీరంగానికి వెళ్ళారు. “ఎల్లా ఉయిర్గాట్కుం నాధన్ అరంగన్” (సమస్థ జీవరాశులకు అధిపతి శ్రీ రంగనాధుడు) అని రామానుజులు కీర్తిస్తే, “పల్లుయిర్ క్కుం విణ్ణిన్ తలై నిన్ఱు వీడళిప్పాన్” (అందరికీ మోక్షప్రధానం చేసేవారు రామానుజులు) అని, “అనైత్తులగుం వాళ ప్పిఱంద ఇరామానుశన్” (ఈ లోకంలో అందరినీ ఉద్ధరించేందుకు రామానుజులు అవతరించారు) అని మణవాళ మాముణులు ఎత్తి చూపారు. జీయర్ అవతరణకు ముందు కాలంలో, ఉడయవర్ల (రామానుజులు) మహిమలకు అంత వైభవం ఉండేది కాదు. రామానుజుల గొప్పతనానికి దీపం వెలిగించిన వారు జీయర్. వీరిరువురు నరనారాయణుని వలె అవతారాలు దాల్చారు (భగవానుడు బద్రికాశ్రమంలో ఆచార్య శిష్యుని రూపాలలో నర నారాయణుడిగా అవతరించారు). అక్కడ ఆచార్య శిష్యులు ఇద్దరూ ఒకరే; ఇక్కడ రామానుజులు, మాముణుల విషయంలో కూడా అదే జరిగింది [ఇద్దరూ ఆదిశేషుని అవతారాలు]. రామానుజులు నారాయణుడి మహిమలను కీర్తిస్తే, జీయర్ రామానుజుల మహిమలను కీర్తించారు. నారాయణుడు, రామానుజులిద్దరూ చతురాక్షరీలు (నాలుగు అక్షరాలు ఉన్న వారు). ఉత్తములలో పరమ ఉత్తములైన మాముణులు చరమచతురక్షరి (అత్యుత్తమ నాలుగు అక్షరాల పదం) తో దృఢ నిశ్చయులై ఉండేవారు. ఆచార్యుడు తప్ప మరే ఇతర దేవతను ఎరుగని స్థితిని చరమపర్వం (అంతిమ స్థితి) అంటారు. రామానుజులను నమ్మాళ్వార్ల తిరువడి అని కూడా అంటారు. మధురకవి ఆళ్వార్లకు నమ్మాళ్వార్ల పట్ల చరమ నిష్ఠ ఉన్నప్పటికీ, నమ్మాళ్వార్ల దివ్య పాదాలను రామానుజులని పిలుస్తారు. అలాగే, రామానుజుల వద్ద కూరత్తాళ్వాన్, ముదళియాండాన్ మొదలైన ఉత్తమ శిష్యులు ఉండేవారు, కానీ మణవాళ మాముణులు మాత్రమే యతీంద్రప్రవణర్‌ గా ప్రసిద్ధి చెందారు. ఈ తనియన్ (శ్రీశైలేశ దయాపాత్రం) వేద సారమైన ప్రపత్తికి సమానంగా నిత్య అనుసంధానం (ప్రతిరోజూ పఠించేది) చేయాలి.

మూలము: https://granthams.koyil.org/2021/11/02/yathindhra-pravana-prabhavam-107-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment