శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
శ్రీమద్ ఉభయ వేదాంతాచార్య కాంచీపురం ప్రతివాది భయంకరం అణ్ణంగరాచార్యులు ఇచ్చిన వివరణ
ఈ శ్లోకాన్ని (శ్రీశైలేశ దయాపాత్రం) ఎంతో కృపతో శ్రీ రంగనాధుడు స్వరపరిచారు. ఇది భగవానుని వాక్కు అని మేము ధృవీకరిస్తున్నాము. శ్రీ రంగనాధుడే శ్రీ రామ కృష్ణులుగా అవతరించినది. ఆ అవతారాలలో కూడా భగవానుడికి కొందరు ఆచార్యులుగా ఉన్నారు, కానీ అతని మనస్సు తృప్తి పడలేదు. మాముణులను ఆచార్యునిగా (పరిపూర్ణ ఆచార్యుడిగా) పొంది ఆ లోటుని తీరి సంతోషించారు. ఈ లోకంలో అనేక చోట్ల మనం ఇది చూడవచ్చు.
శ్రీశైలేశ దయాపాత్రం: రామావతారంలో భగవానుడు శైలేశ దయాపాత్రం అయిన మహాత్ముని ఆశ్రయించాడు. కానీ నిరాశ ఎదురైయ్యింది. కానీ ఇప్పుడు, శ్రీశైలేశ దయాపాత్రం అయిన వ్యక్తిని పొంది అతను ఉద్ధరించబడ్డాడు. రామావతారం సమయంలో శ్రీరాముడు పొందిన శ్రీశైలేశ దయాపాత్రుడు, సుగ్రీవుడు. అక్కడ ఋష్యముఖ పర్వతం శ్రీశైలం (పర్వతం). మతంగ ముని ఆ పర్వతానికి ఈశన్ (నియంత్రించువాడు). సుగ్రీవుడు అతని దయకు పాత్రుడు (దయాపాత్రం). దుందుబి అనే రాక్షసుడు వాలీని యుద్దానికి రమ్మని సవాలు చేశాడు. ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. వాలి చేత దుందుబి వధింప బడి క్రింద వాలాడు. వాలి దుందుబి మృత దేహాన్ని ఒక యోజన (సుమారు 10 మైళ్లు, 16 కిలోమీటర్లు) దూరం విసిరి పడేశాడు. అతని శరీరం ఎగిరి పడుతున్నపుడు, అతని నోటి నుండి కొన్ని రక్తపు బిందువులు మతంగ ముని ఆశ్రమంలో పడ్డాయి. ముని క్రోదించి, తన ఆశ్రమాన్ని అపవిత్రం చేసిన వ్యక్తితో పాటు అతనితో స్నేహంగా ఉండేవారు కూడా తాను నివసించే పర్వతంపైన అడుగు పెడితే మరణిస్తారని శాపం ఇచ్చాడు. వెంటనే, వాలీతో స్నేహం ఉండి, ఆ పర్వతంపైన నివసించే అందరూ తలదాచుకోడానికి అటు ఇటు పరుగులు తీశారు. వాలితో సంబంధం తెంచుకున్న సుగ్రీవుడు, తన ప్రియ మిత్రులతో కలిసి వెళ్లి ఆ కొండపైన తలదాచుకున్నాడు. ఆ విధంగా, అతను శ్రీశైలేశుని దయకు పాత్రుడు అయ్యాడు. “సుగ్రీవం శరణం గతః” (నేను సుగ్రీవుడిని ఆశ్రయిస్తాను), “సుగ్రీవం నాథం ఇచ్ఛతి” (సుగ్రీవుడిని నా స్వామిగా ఆశిస్తున్నాను) అని సుగ్రీవుడితో స్నేహం చేసిన శ్రీ రాముడు, వర్ష ఋతువు దాటాక కూడా సీతా పిరాట్టిని వెదకడంలో సుగ్రీవుడు సహాయం అందించకపోయేసరికి నిరాశ పడ్డాడు. అందుకే, శ్రీ రాముడు లక్ష్మణుడితో “ఓ లక్ష్మణా! సుగ్రీవుని వద్దకు వెళ్లి, నా మాటలుగా అతనితో చెప్పు: చేసిన సహాయం మరచిన వ్యక్తి అధముడు; వాలి మార్గం ఇంకా సుగ్రీవుడికి ఇప్పటికీ తెరిచి ఉందని చెప్పు. నేను అతనిని, అతని బంధు మిత్రులతో సహా నరకానికి పంపడానికి సిద్ధంగా ఉన్నాన నని చెప్పు” అని అన్నాడు. అలాగ, అప్పుడు ‘శ్రీశైలేశ దయాపాత్రుడి’ యందు తృప్తి పొందలేకపోయారు. ఇప్పుడు, శ్రీ రంగనాధుడిగా, శ్రీశైలేశ దయాపాత్రుడిని పొంది ఉద్ధరణ పొందారు. తిరువాయ్మొళి పిళ్ళై అనే పేరుతో పిలవబడే తిరుమలై ఆళ్వార్ల (శ్రీశైలేశ) కృపకు పాత్రుడైన మాముణులను నేను నమస్కరిస్తున్నాను అని వివరించారు.
ధీభక్త్యాది గుణార్ణవం: రామావతారంలో, రాముడు సముద్ర రాజుకి శరణాగతి చేసారని అందరికీ తెలుసు. విభీషణుడి మాటల ప్రకారం “సముద్రం రాఘవో రాజా శరణం గంతుమర్హతి” (రఘకుల తిలకుడు (శ్రీరాముడు) సముద్ర రాజుకి శరణాగతి చేయుట సముచితమేనా) అని శ్రీ రాముడు సముద్రం ఎదుట తలవంచాడు; కానీ ఇక్కడ కూడా రాముడికి నిరాశే మిగిలింది. ఆ సముద్ర రాజు శ్రీ రామునికి సహాయం అందించడానికి ముందుకు రాకపోయేసరికి, క్రోదాగ్నికి గురై, లక్ష్మణునితో “చాపమానయ సౌమిత్రే! సారాంచ ఆసీవివిషోపమాన్ సగరమశోషయిష్యమి” (నా విల్లు బాణాలు తీసుకురా లక్ష్మణా! నేను ఈ సముద్రంలో నీళ్ళు లేకుండా చేస్తాను) అని అన్నాడు. ఆ విధంగా, శరణాగతి చేయడానికి ప్రయత్నించిన ప్రతి చోటా, తిరస్కరణయే లభించింది. ఆ లోటుని తీర్చుకోడానికి, ఉప్పు సముద్రం ఎదుట కాకుండా, జ్ఞాన భక్తి వైరాగ్య గుణాల మహాసాగరుడైన మణవాళ మాముణులకు వంగి నమస్కరించాడు.
యతీంద్ర ప్రవణం: “మందిపాయ్ వడవేంగడ మామలై వానవర్గళ్ సంధి శెయ్య నిన్ఱాన్ అరంగత్తు అరవిణ్ అణైయాన్” (శేష శయ్యపైన పవ్వళించి ఉన్న శ్రీరంగనాధుడే, నిత్యసూరుల ఆరాధనలు స్వీకరిస్తూ తిరువేంగడముడయానుడిగా తిరుమలలో నిలబడి ఉన్నాడు). ఆ తిరువేంగడముడయానుడికి రామానుజులు శంఖ చక్రాలను ప్రసాదించి, “అప్పనుక్కుచ్చంగాళి అళిత్తరుళుం పెరుమాళ్” (దయతో తిరువేంకటేశ్వరునికి శంఖ చక్రాలను అందించినవాడు) అని కీర్తించబడ్డారు. పెరుమాళ్ళు రామానుజులను తమ ఆచార్యునిగా భావించారన్నది అందరికీ తెలిసిన విషయమే. రామానుజులలో ఎటువంటి తృటి లేకపోయినా, ఇరామానుశ నూఱ్ఱదాది 97వ పాశురంలో “తన్నై ఉఱ్ఱాట్చెయ్యుం తన్మైయినోర్” (రామానుజులకు కైంకర్యం చేసే వారి దివ్య తిరువడిని తిరువరంగత్తు అముదనార్లను అధిరోహింపజేశారు) అని పెరుమాళ్ళు తెలుసుకున్న తరువాత, యతీంద్రుని కన్నా యతీంద్రప్రవణర్లకు శిష్యుడిగా ఉండటమే మంచిదని భావించాడు – అంటే నేరుగా రామానుజులకు బదులుగా మణవాళ మాముణుల ద్వారా అని అర్థం. అందుకే, తాను యతీంద్ర ప్రవణర్లకు నమస్కరిస్తున్నానని అన్నారు.
వందే రమ్యజామాతరం మునిం: పెరుమాళ్ళ అవతారాలలో, శ్రీ రామావతారంలో విశ్వామిత్రుడికి శిష్యుడిగా, కృష్ణనవతారంలో సాందిపని మునికి శిష్యుడిగా భగవానుడు ఉన్నాడు. అయితే, ఆ రెండు చోట్లా పెరుమాళ్ళకు నిరాశయే మిగిలింది. రాముడు విశ్వామిత్రునితో కలిసి జనక మహారాజు రాజసభకు వెళ్ళినపుడు, గౌతమ మహర్షి తనయుడైన శతానందుడి నుండి, విశ్వమిత్రుడు మేనకల కలయిక గురించి, విశ్వమిత్రుని వశిష్ఠ మహర్షితో యుద్దం మొదలైన తమ ఆచార్యుని రజో తమో గుణాల కథనాలను విన్నాడు. శ్రీ రామాయణం బాల కాండం 51వ సర్గంలో వివరించబడి ఉన్నాయి. “ఇటువంటి వ్యక్తిని ఆచార్యునిగా ఆశ్రయించ వచ్చా?” అని భావించి నిరాశ చెందాడు. కృష్ణావతారంలో, సాందిపని ముని వద్ద అన్ని విధ్యలు నేర్చుకున్నాడు. కృష్ణుడే శ్రీమాన్ నారాయణుడని, మోక్షం ప్రదాత అని తెలిసినప్పటికీ, సాందిపని ముని గురుదక్షిణగా కోల్పోయిన తన కొడుకును తిరిగి తీసుకురమ్మని కృష్ణుడిని అడుగుతాడు. ఈ విధంగా, భౌతిక వాంఛలపై ఆసక్తి ఉన్న ఇద్దరు మునులను తిరస్కరించి, పూర్ణ వైరాగ్యులు, పవిత్ర గుణా సాగరులైన మాముణులను తమ ఆచార్యుడిగా స్వీకరించాడు.
అందువల్ల, ఇంత విశేష అర్థాలున్న ఈ శ్లోకాన్ని భగవానుడే పఠించగలడు. ఇవి ఆతని దివ్య హృదయ కమలలోని విషయాలు కాబట్టి, మరెవరి సొత్తు కాలేదు. కాబట్టి ఇవి స్వయంగా పెరుమాళ్ళు పలికిన పలుకులేనని నిర్ధారించబడింది.
ఇంతటితో యతోంద్ర ప్రవణ ప్రభవం ముగింపుకు వచ్చింది
దివ్యదంపతి తిరువడిగళే శరణం
ఆళ్వార్ ఎమ్పెరుమానార్ జీయర్ తిరువడిగళే శరణం
పిళ్లై లోకం జీయర్ తిరువడిగళే శరణం
మూలము: https://granthams.koyil.org/2021/11/03/yathindhra-pravana-prabhavam-108-english/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org