అవతారిక
శాస్త్రార్థములను ప్రతిపాదించిన ఆ సర్వేశ్వరుడు తన మనస్సున అట్టి శాస్త్రమును అభ్యసించుటకు ఎన్నో యోగ్యతలు మరియు ఎంతో శ్రమ కావలసినందున ఎంతో కృపతో తానే సకల శాస్త్ర సారమైన మరియు శాస్త్రాభ్యాసము వలే క్లిష్టతరమైనది కానిది, ఎట్టి యోగ్యత అపేక్షించనిది అయిన తిరుమంత్రాన్ని ప్రకాశింపజేసిన వైనాన్ని ఇక మీద నాయనార్లు వివరించనున్నారు.
చూర్ణిక
చతుర్విధమాన దేహ వర్ణ ఆశ్రమ అధికార ఫల మోక్ష సాధన గతి యుగధర్మ వ్యూహ రూప క్రియాదిగళై అఴివిక్కిఴ పాట్టుపరప్పుక్కు ప్పెరియతీవినియిల్ ఓన్బతామ్ కూఴుమ్ మానిడప్పిఴవియుమ్ ఆక్కైనిలైయుమ్ ఈరిరణ్డిల్ ఓన్ఴుమ్ ఇళమైయుమ్ ఇశైవుమ్ ఉణ్డాయ్ పుకువరేలుమ్ ఎన్గిఴతుక్కు ఉళ్ళే విఘ్నమఴ నిన్ఴవా నిల్లా ప్రమాధియైక్కొణ్డు అఴ క్కట్కై అరితుఎన్ఴిఴే వేదసారోపనిషత్ సారతరానువాక సారతమ గాయత్రియిల్ ముతల్ ఓతుకిఴ పొరుళ్ ముడివాన శురుక్కై తైవవణ్డాయ్ అన్నమాయ్ అముతమ్ కొణ్డవన్ శాఖైకళిలుమ్ ఓతమ్పోల్ కిళర్ నాల్వేద క్కడలిలుమ్ తేనుమ్ పాలుమ్ అముతుమాక ఎడుత్తుపెరు విశుమ్బుఅరుళుమ్ పేర్ అరుళాలే శిజ్గామై విరిత్తతు
సంక్షిప్త వివరణ
నాలుగు విధములగు శరీరములు, వర్ణాశ్రమములు, అధికారములు, ఫలములు, సాధనములు, మోక్షము, గతులు, యుగములు, ధర్మములు, వ్యూహములు, రూపములు, చేష్టతములు(క్రియలు) మొదలగును తెలుపుచున్న వేదము, అట్టి వేదాభ్యాసమునకు ఒకడు జంబూద్వీపములో భారతవర్షములో మనుష్య జాతిలో చక్కటి శరీర పుష్టితో బ్రాహ్మణ వర్ణమున జన్మించవలెను, అటువంటి జన్మ లభించినప్పటికీ స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి, అప్పటికినీ అట్టి వేదమును అభ్యసించుట కష్టతరమే, అందుచేత నారాయణ సూక్తములో సారతమముగా చెప్పబడిన మరియు వేదం సారమైన వేదాంతములో సారతరముగా చెప్పబడిన నారాయణ శబ్ధమునే మొదట పఠించవలెను. అట్టి నారాయణ శబ్దమును కలిగిన తిరుమంత్రమును (హంస, తేనె, పాలు, అమృతముగా సాక్షాత్కరించిన) ఆ సర్వేశ్వరుడే విస్తారముగా ప్రకాశింపజేసెను.
వ్యాఖ్యానము
క్రింద చెప్పబడుచున్న వాటికి “నాలుగు విధములు” వర్తించును
దేహము (శరీరము) – దేవ(దైవ), మనుష్య(మానవ), తిర్యక్(జంతు), స్థావరము(వృక్షములు)
వర్ణము(సంఘ విభాగము) – బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, సూద్ర
ఆశ్రమము(సంఘ క్రమము) – బ్రహ్మచర్య, గార్హస్త్య, వానప్రస్థ, సన్యాస
అధికార(అర్హత) – శ్రీ భగవద్గీత 7.16 లో “ఆర్ధో జిగ్యాసుర్ అర్ధార్ధి జ్ఞాని” అని చెప్పినట్టు (దుఃఖంలో ఉండువాడు ద్రవ్యమును కోల్పోవడము చేత) ద్రవ్యము కోసము కాంక్షించువాడు, ఆత్మానందమును పొందువాడు, సరియైన జ్ఞానమును కలవాడు
ఫల – ధర్మ(మంచి పనులు), అర్ధ(ద్రవ్యము), కామ(భోగము), మోక్ష(విడుదల)
మోక్ష – సాలోక్య(అదే లోకములో ఉండుట), సామీప్య (సర్వేశ్వరునికి చేరువుగా ఉండుట), సారూప్య(సర్వేశ్వరుని వలె దివ్యమంగళ విగ్రహమును కలిగి ఉండుట), సాయుజ్య(సర్వేశ్వరునితో కలిసి ఉంటూ ఆతనికి పలు కైంకర్యములు అర్పించుట)
సాధన – కర్మ, జ్ఞాన, భక్తి, ప్రపత్తి
గతి – గర్భ గతి(తల్లి గర్భమున ప్రవేశించుటకు మార్గము), యామ్య గతి(నరకమునకు చేరు మార్గము), ధూమాది గతి (స్వర్గము మొదలగు లోకములకు చేరు మార్గము), అర్చిరాది గతి (శ్రీ వైకుంఠమునకు చేరు మార్గము). ఇవన్నీ పంచాగ్ని విద్యలో చూపించబడినవి.
యుగ – కృత, త్రేతా, ద్వాపర, కలి
యుగ ధర్మము – చతుర్విధములైన ధర్మములు – ధ్యాన, యజ్ఞ(అగ్ని కార్యము), అర్చన(ప్రార్ధన), సంకీర్తన(పాడుట) శ్రీ విష్ణు పురాణము 6.2. 16 “శ్లోకం ధ్యాయాన్ కృతే యజన్ యజ్ఞైః త్రేతాయామ్ ద్వాపరేర్ అర్చయేత్, యదాప్నోతి తదాప్నోతి కలౌ సంకీర్త్య కేశవమ్”(ధ్యానము ద్వారా ఏదైతే కృత యుగములో పొంద పడుతుందో, అర్చన ద్వారా ఏదైతే త్రేతా యుగములో పొంద పడుతుందో యజ్ఞము ద్వారా ఏదైతే ద్వాపర యుగములో పొంద పడుతుందో అట్టి ఫలితము సర్వేశ్వరుని కీర్తించడం ద్వారా కలి యుగములో లభిస్తుంది)
వ్యూహ – వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ
రూపం – కృత యుగములో తిరుచ్చన్ధ విరుత్తము 44 “పాలినీర్మై సెంబొనీర్మై పాసియిన్ పసుంబుఴమ్ పోలునీర్మై పొఴుపడైత్ తడత్తు వణ్డు విణ్డులా నీలనీర్మై ఎన్ఴివై నిఴైన్ద కాల నాన్గుమాయ్ మాలినీర్మై వైయగమ్ మత్తైత్తదెన్న నీర్మైయే” (పాలలోని తెల్లదనం, బంగారములోని ఎర్రదనము, నాచులో ఉండే పచ్చదనము మరియు కొలనులో ఉండు పెడ పురుగు రెక్కలు చూచినప్పుడు కనపడు ముదురు రంగులు నాలుగు యుగములను పాలించువాడైన(నియంత్రించు) ఆ సర్వేశ్వరునిలో కనిపించును. ఈ సంసారమున వసించు వారు అట్టి ఎమ్పెరుమానుడి విషయములో ఉదాసీనంగా ఉండటం ఎంత హేయకరము(నాలుగు విధముల రూపములు అయిన తెలుపు, పసుపు, నలుపు, నీలము).
క్రియా – సృష్టి (సృజించుట), స్థితి (నిలబెట్టుట), సంహార(ఉపసంహరించుట), మోక్షప్రదత్వ (మోక్షమును ఇచ్చుట)
క్రియాదిలో చివరన ఉన్న “ఆది” అను పదము చేత నాలుగు విధములైన ప్రమేయములు వివరింపబడుచున్నాయి, అవి ఏవి అనగా, వాసుదేవ నుంచి సృష్టించబడ్డ కేశవ, మాధవ, నారాయణ, సంకర్షణ నుంచి సృజించబడ్డ గోవిందా, విష్ణు, మధుసూదన, ప్రద్యుమ్న నుంచి సృజించబడ్డ త్రివిక్రమ, వామన, శ్రీధర; అనిరుద్ధ నుంచి సృజించబడ్డ హ్రిషీకేశ, పద్మనాభ, దామోదర. నాలుగు విధములైన వ్యూహా స్థానములు – ఆమోద, ప్రమోద, సమ్మోద, వైకుంఠ. ఈ విధముగా విస్తరింపబడ్డ శాస్త్రము నాన్ముగన్ తిరువందాది 76 “పాట్టుమ్ ముఱైయుమ్” లో చెప్పినట్టుగా చతుర్విధములను ఇతర విషయములను వివరించింది.
పెఱియ తీవినిల్
పెఱియ తీవినిల్ ఒన్బదామ్ కూరుమ్
పెఱియ తిరుమొళి 3.6.1 “నావలమ్ పెఱియ తీవు” (గొప్పదైన జంబూ ద్వీపము) లో చెప్పినట్టు ఈ జంబూ ద్వీపము భోగమును అనుభవించుటకు, మోక్షమును పొందుటకు యోగ్యమైనందున మరియు ఇది తక్కిన ద్వీపముల కంటే పెద్దదై ఇందులో ఉన్న తొమ్మిది ఖండములలో భారత వర్షము స్వర్గ మోక్షదులకు కారణమైన కర్మలనాచరించుటకు తగిన ప్రదేశమై మరియు తక్కిన ఖండముల వలె కేవల భోగ్యానుభవము కొరకే కాకుండా ఉండు కారణము చేత దీనిని గురుంచి శ్రీ విష్ణు పురాణము 2.3.24 “గాయంతి దేవాః కిల గీతకాని ధన్యాస్తు తే భారతభూమిభాగే స్వర్గాపవర్గాస్పదమార్గభూతే భవంతి భూయాఃపురుషాః సురత్వాత్” (దేవతలు ఈ విధముగా గానము చేయుదురు: స్వర్గ మోక్షదులకు కారణమైన భారత ఖండమున మనుష్య జన్మను పొంది దేహవసానమున వారిని కీర్తించుము) అని దేవతల చేత కొనియాడబడినది.
మాన్డిప పిఴవియుమ్
మానవ జన్మ పొందుట దుర్లభము అని శ్రీ భాగవతము 11.2.21 “దుర్లభో మానుషో దేహః” (మనుష్య జన్మ పొందుట దుర్లభము), శ్రీ విష్ణు పురాణము 2.3.24 “అత్ర జన్మ సహస్రానామ్ సహస్రైరపి సత్తమ కదాచిత్ లభతే జన్తుః మానుష్యం పుణ్య సంజయాత్” (ఓ మైత్రేయా! వేయి జన్మల తర్వాత జీవునికి మంచి కార్యము చేయుట వలన భారతదేశములో మనుష్య జన్మ లభిస్తుంది) అనియు తిరుక్కుఱున్దాండగం 8 “మానదిప్ పిఴవై అన్ధో” (మానుష జన్మము దుర్లభము) అని చెప్పినట్టు.
ఆక్కై నిలైయుమ్
తిరువాయిమొళి 1.2.2 “మిన్నిన్ నిలైయిలా మన్నుయిర్ ఆక్కైకళ్”(ఈ దేహములు మెరుపుల వలె అస్థిరములు) అనియు, శ్రీ భాగవతము 11.2.21″మానుషో దేహో దేహినామ్ క్షణపంగుర” (అట్టి మనుష్య దేహము క్షణ కాలములో నశించిపోవును) అని చెప్పినట్టి దేహపుష్టి ఉన్నట్టు అయితే
ఈరిరణ్డిల్ ఒన్ఴుమ్
తిరుచ్చందవిరుత్తం 90 “కులంగళాయ ఈరిరణ్డిల్ ఒన్ఴు”(చాతుర్వర్ణములలో ఒకటి అయిన) చెప్పినట్టు ఒకరికి మనుష్య జన్మ కలిగినప్పటికీ, అది శాస్త్ర అభ్యాసమునకు తగినదైన బ్రాహ్మణ జన్మ అయితే
ఇలమైయుమ్
శ్రీ విష్ణు పురాణము 1.17.75 “తస్మాత్ బాల్యే వివేకాత్మా యదేవ శ్రేయసే సదా”(జ్ఞానము కలిగిన పురుషులు యవ్వన దశలోనే మంచి కార్యములందు నిమగ్నులవుటకు ప్రయత్నించుదురు) అని చెప్పినట్టు ఒకరు వారి యవ్వన దశలో ఉన్నట్లయితే అది వారికి జ్ఞాన ప్రకాశమునకు తోడ్పడును. తిరువాయిమొళి 2.10.1 “కిలరొళి ఇలమై” (జ్ఞాన వృద్ధి మరియు ప్రకాశము) అని చెప్పినట్టు.
ఇసైవుమ్ ఉణ్డాయ్
పెఱియ తిరువందాది 26 “యానుమ్ ఎన్నెన్జుమ్ ఇశైన్దొళున్దోమ్” (నేను, నా మనస్సు ఒప్పుకొంటిమి) అని చెప్పినట్టు ఏ కార్య నిర్వహణమునకు కావలసినది కొరికే
పుగువరేలుమ్
అయితే ఇవన్నీ ఉన్నప్పటికినీ తిరుమాలై 3 “వేతనూల్ పిరాయమ్ నూఴు మనిశర్ తామ్ పుగువరేలుమ్”(వేద శాస్త్రమున చెప్పినట్టు నూఱు సంవత్సరముల ఆయుష్యు ఉన్నప్పటికీ) అనియు “శతాయుర్వైపురుషః”( మనిషి ఆయుష్యు నూఱు సంవత్సరములు), వేదములో చెప్పినట్టు నూఱు సంవత్సరములు జీవించినప్పటికీ
ఎంగిఴాదుక్కుళ్ళే విజ్ఞామఴ
అంత ఆయుష్యు ఉన్నప్పటికీ, శాస్త్ర అభ్యాసమునకు ఎటువంటి విఘ్నములు లేకుండుట అని ఉత్తర గీత 7.10″అనంతసారం బాహువేదితవ్యమ్ అల్పశ్చ కాలో బహవశ్చ విజ్ఞాః” (తెలుసుకొనవలసిన శాస్త్రమునకు అంతు లేదు మరియు తెలుసుకొనుటకు విఘ్నములు అనేకములు) అనియు “శ్రేయామ్సి బహు విఘ్నాని భవంతి మహతామపి”(ఎంత గొప్పవారికైననూ విఘ్నములు అనేకములు ) అని చెప్పినట్టు శాస్త్రాభ్యాసము చేయునప్పుడు అట్టి విఘ్నములను అధిగమించుట.
నిన్ఴావా నిల్లా ప్రమాధియైక్కొణ్డు
పెఱియ తిరుమొళి 1.1.4 “నిన్ఴావా నిల్లా నెంజు” (దేని మీద స్థిమితము లేని మనస్సు) అనియు శ్రీ భగవద్గీత 6.34 “చంచలం హాయ్ మనఃకృష్ణ ప్రమాథి బలవద్ ధృడం”(మనస్సు సహజముగానే చంచలమైనది, ప్రాపంచిక సుఖాల యందు మనల్ని లాగుతుంది) అని చెప్పినట్టు చంచలమైన మనస్సు ఒకడిని ఒక విషయము పైన క్షణకాలం కూడా ఉండనివ్వక విషయాంతరాల వైపు లాగును అన్నట్టు.
అఴక్కఴ్కై
తిరుమాలై 7 “కలైయఴక్కత్త మాన్దర్” (శాస్త్ర జ్ఞానమును ఎట్టి సందేహము లేక గ్రహించిన మనుష్యులు) అన్నట్టు శృతి స్మృత్యాదుల సారము తెలిసేట్టు అభ్యసించుట
అరిదెన్ఴిఴే
అట్టి శాస్త్ర అభ్యాసము నియమాల పైన ఆధారపడి ఉండటము మరియు తెలివిగా వాటిని అనువర్తించడము ఎంతో కష్టము పెఱియ తిరువందాది 37 “అమఴు అణివుడైయార్ ఆవదు అరిదన్ఴే” (సరియైన మార్గములో ప్రయాణించుటకు/అనువర్తించుటకు గల జ్ఞానము కలిగియుండుట చాల కష్టము కదా!)
ఇలా శాస్త్ర సార జ్ఞానమును పొందుట మిక్కిలి కష్టము అని ఆ సర్వేశ్వరుడు తన హృదయములో తలచి
వేదసార ఉపనిషత్ …
వైకుంఠ దీక్షితీయమ్ “అసారం అల్పసారం సారంచ సారం సారతరం త్యజేత్, భజేత్ సారతమమ్ శాస్త్రం రత్నాకర ఇవామృతం”(అసారమైన ఇతర శాస్త్ర విషయములను, కొంచెము సారములైన వేద పూర్వభాగము, వేదాంతములను వాటి కంటే కొంచెము సారములైన నారాయణ అనువాకములను త్యజించి, సముద్రము నుండి తీసిన అమృతము వలే మిక్కిలి సారతమమైన విష్ణు గాయత్రిని మాత్రమే స్వీకరించాలి), సారతమమైన శాస్త్రమునే గ్రహించాలి కనుక, ఇక మీదట పరమ ప్రాప్యమైన తిరుమంత్రాన్ని నాయనార్లు ప్రతిపాదించుచున్నారు.
వేదసార ఉపనిషత్
వేదం పూర్వభాగము యొక్క సారము వేదాంతము(ఆరాధనాది మొదలగు విధులను తెలుపు వేద భాగాము). బాహ్య శాస్త్రములు(వేదమునకు బాహ్యముగ గల శాస్త్రములు) సత్య విరుద్దములైన విషయములను ప్రతిపాదించుట చేత అవి సారము కాజాలవు. వేదం పూర్వభాగము యదార్ధములను తెలుపునప్పటికీ స్యేన విధి, జ్యోతిష్ఠోమాదుల వరకును ఐహిక, పారలౌకిక పురుషార్థ సాధనములను ప్రతిపాదించుట చేత మరియు అవి శాస్త్రమున, దేహాత్మల తారతమ్యములను తెలుసుకొనుట విషయమున, క్షుద్రమైన ఫల సాధనములను తెలుసుకొనుట విషయమున మాత్రమే విశ్వాసమును కలిగించుట చేత పూర్వభాగము అల్పసారమని తెలుస్తున్నది. ఆలా కాకుండా ఉపనిషత్తు అంతములేని అనాదియైన బ్రహ్మ స్వరూపమును మొదలగు విషయములను, అట్టి బ్రహ్మమును పొందుటకు గల సాధనములను ప్రతిపాదించుట చేత ఉపనిషత్ భాగము సారమైనదని తెలుస్తున్నది.
సారతర అనువాక
ఆ ఉపనిషత్తులయందు చెప్పబడు పరబ్రహ్మ, పరతత్త్వ, పరంజ్యోతి, పరమాత్మ ఇత్యాది సామాన్య శబ్దముల చేతను మరియు శంభు, శివ వంటి విశేష శబ్దముల చేతనున్నూ ప్రతిపాదింపబడు వాడు నారాయణుడే అని ఇట్లు భగవత్ పరతత్వమును స్పష్టముగా ప్రతిపాదించునదై వేరొక దాని గురుంచి ప్రతిపాదింపనదియగు నారాయణ అనువాకము సారతరమైనదిగా చెప్పతగినది.
సారతమ గాయత్రి
వాటిలోనూ ఆ సర్వేశ్వరుని పరత్వానికి ప్రధాన చిహ్నమైన అంతరాత్మత్వమును కలిగి ఉండుటను(తెలుపునట్టి విష్ణు గాయత్రి) ఆవ్యాపక మంత్రముల(ఇతరత్రా విషయముల గురుంచి ప్రతిపాదించు విష్ణు మంత్రములు) కంటే శ్రేష్ఠములైన వ్యాపక మంత్రముల(నారాయణ, వాసుదేవ, విష్ణు పరత్వాన్ని ప్రతిపాదించు మంత్రములు)ను తెలుపు విష్ణు గాయత్రి సారతమమైనది.
గాయత్రియిల్ ముదలోదుగిఴ పొరుళ్ ముదివాన సురుక్కై
ఇట్టి విష్ణు గాయత్రిలోనూ వ్యాపక మంత్రముల కంటెను విలక్షణమైనది అయినందున వ్యాప్యాధ్యాహారాదులను అపేక్షించునట్టి “నారాయణాయ విద్మహే” ఆదరముతో మొదట చెప్పబడినది. ఇరండామ్ తిరువందాది 39 “ఓత్తిన్బొరుళ్ ముడివు మిత్తనైయే ఉత్తమన్ పేఴ్ ఏత్తుమ్ తిఴమ్ అఴీమిన్ ఎళైగళ్ ఓత్తదనై వల్లీరేళ్ అదనై మాత్తీరేళ్ మాదవన్ పేఴ్ సొల్లువదే ఓత్తిన్ సురుక్కు” (అన్నిటికంటే విలక్షణుడు పరాత్పరుడు అయిన ఎమ్బెరుమానుడి దివ్య నామములు వేదముల యొక్క సారము. అజ్ఞానముతో భ్రష్టత్వమును పొందిన ఓ జనులారా! వేదమును తెలుసుకునే సామర్ధ్యము మీకు కలిగి ఉంటే తెలుసుకోండి, అట్టి సామర్ధ్యము లేని యెడల ఆ సర్వేశ్వరుని (శ్రియఃపతి) యొక్క తిరునామములను ఉచ్చరించుటయే అట్టి వేదముల యొక్క సారము అని తెలుసుకోండి). శ్రీ పాంచరాత్రములో చెప్పినట్టు “రుచో యజుంషి సామాని తధైవ అధర్వణానిచ సర్వం అషఠాక్షరాన్తస్తమ్”(ఋగ్, యజుర్, సామ, అతర్వణ వేదములు మరియు ఇతర శాస్త్రములు అష్టాక్షరీ మంత్రములో అంతర్గతములై ఉన్నవి) ఈ తిరుమంత్రము వేదాంత శాస్త్రము యొక్క సారము మరియు వేదముల యొక్క సంగ్రహార్ధము.
దేవ్య వణ్డాయ్…
ఈ తిరుమంత్రము సకల వేద సారము మరియు పెఱియ తిరుమొళి 5.10.6 “తేనుమ్ పాలుమ్ అముదుమాయ తిరుమాల్ తిరునామమ్”(పాలు, తేన, అమృతము వంటిదైన శ్రీమన్నారాయణుని తిరునామము) అని చెప్పినట్టు ఆ సర్వేశ్వరుని చేతనే వేదము నుండి వెలికి తీయబడినది. దీనినే నాయనార్లు మూడు విధములుగా చెప్పుచున్నారు.
దేవ్య వణ్డాయ్
అది ఏమి అనగా – ఆ సర్వేశ్వరుని ఒక తుమ్మెద తో పోల్చి చెప్పడము చేత తిరువాయిమొళి 9.9.4″తూవియుమ్ పుళ్ళుడైత్ తేవ్య వణ్డు”(దివ్యమగు తుమ్మెద అయిన సర్వేశ్వరుడు మంచి ఆకర్షణీయమైన రెక్కలు గల గరుడుని వాహనముగ కలిగి ఉన్నాడు), ఎలా అయితే ఆరు పాదములు గల తుమ్మెద అన్ని శాఖల యందు సంచరించి తేనెను గ్రహించునట్టు, ఆ సర్వేశ్వరుడు కూడా సకల వేదం సారమైనది అయిన, అన్ని అర్ధాలను తెలియజేయునది అయిన తేనలా తీయనిది అయిన తిరుమంత్రమును వేదం శాఖల నుండి గ్రహించి మనకు ప్రసాదించినాడు.
అన్నమాయ్
పెఱియ తిరుమొళి 5.7.3 “అన్నమాయ్ అన్ఴన్గు అరుమఴై పయన్దాన్” లో చెప్పినట్టు (ఆ రోజు హంస వలె భగవానుడు వేదమును ప్రసాదించెను). సర్వేశ్వరుడు హంస లాగా ఉండి ఎలా అయితే హంస పాల నుండి నీళ్లను వేరు చేసి గ్రహించగలదో అలానే ఆ సర్వేశ్వరుడు తిరుమంత్రమును గ్రహించి, పెఱియ తిరుమొళి 6.10.6 “నానుమ్ సొన్నేన్ నమరుమ్ ఉరైమిన్” (నేను ఉచ్చరించాను, అందరు ఉచ్చరించుగాక) వేదమనే సాగరము నుండి వేరు చేసి ఇచ్చెను. తిరువాయిమొళి 1.8.10 “ఓదుమ్ పోల్ కిళర్ వేద నీరణే” (సముద్రములోని అలల వలే అని ఆ సర్వేశ్వరుని కీర్తించిన వేదము)
అముదమ్ కొణ్డవన్
పెఱియ తిరుమొళి 6.10.3 “అముదమ్ కొణ్డ పెరుమాన్” (అమృతమును తీసుకొచ్చిన ఆ స్వామి) అని చెప్పినట్టు రాక్షసుల నుండి భయపడిన వారై మరణము లేకుండా ఉండు స్థితిని కోరిన దేవతలను రక్షించుటకై క్షీర సముద్రమును చిలికి అమృతమును తీసినట్లు సంసారము నుండి భయపడి ముముక్షువులను రక్షించుటకు అమృతము వలె తీయనిది, వినాశమును తొలగించునట్టిదైన తిరుమంత్రమును తీసి ఇచ్చెను. పెఱియాళ్వార్ తిరుమొళి 4.3.11 “నాల్ వేదక్ కడల్” (నాలుగు వేదములనబడు సముద్రము) అని చెప్పినట్టు
అముదమాగ ఎడుత్తుప్ పెరువిసుంబరుళుమ్ పేరరుళాలే సింగామై వరిత్తదు
ఆ విధముగా వేద సారమైన తిరుమంత్రమును ఆ సర్వేశ్వరుడు తానే తీసిచ్చి పెఱియ తిరుమొళి 1.4.4 “అమరర్ పెరువిసుంబు అరుళుమ్ పేరరుళాలన్ ఎమ్పెరుమాన్ అణిమలర్కుళలార్ అరంబైయర్ ఆరముమ్ వారి వన్దు అణినీర్ మణి కొళిత్తిళిన్ద గంగైయిన్ కరైమేల్ వదరియాచ్చిరామత్తుళ్ళానే” (ఓ మనసా! ఆ సర్వేశ్వరుని గొప్పతనము తెలియని వారికి నేను ఇప్పుడు ఉపదేశించుచున్నాను, ఎంతో దయ కలిగిన ఆ సర్వేశ్వరుడు తన భక్తుల విఘ్నములను తొలగించి నిత్యసూరులు ఆనందించునట్టి పరమపదమును అట్టి భక్తులకు ప్రసాదించునో అటువంటి స్వామి గంగా నది తీరాన బదరికాశ్రమములో కృప వేంచేసియున్నాడు. ఈ సంసారమున ఉజ్జీవింపబడుటకు అట్టి సర్వేశ్వరుని స్తుతించు); నిత్యసూరులకు అనుభవింప యోగ్యమై పరమాకాశమనబడు పరమపదము ఇచ్చునట్టిది అయిన తన కృప చేత “నర నారణనాయ్ ఉలగత్తు అఴనుళ్ సింగమాయ్ విరిత్తవన్” (నర నారాయణునిగా సత్యమును ప్రకాశింపజేసెను) అని చెప్పినట్టు నర, నారాయణ రూపముగా తానే శిష్యునిగా తానే ఆచార్యునిగా స్వరూప శాస్త్రము సంకోచమును పొందకుండ చేసినవాడాయెను.
అడియేన్ పవన్ రామనుజ దాస
మూలము : https://granthams.koyil.org/2024/02/25/acharya-hrudhayam-16-english/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org