చూర్ణిక – 62
అవతారిక
నాయనార్లు ఇక మీద ఫల, సాధనములు మొదలగు విషయములలో నమ్మాళ్వార్లకు మరియు ఋషులకు గల గొప్ప వైలక్షణ్యములను కృప చేయుచున్నారు.
చూర్ణిక
ఫలసాధన దేవతాంతరఙ్గళిల్ ఇవర్కళ్ నినైవు పేచ్చిలే తోన్ఴుమ్
సంక్షిప్త వివరణ
ఫల, సాధన మరియు దేవతాంతర విషయములలో వీరికి(నమ్మాళ్వారు, ఋషులు) గల ఆలోచనలు వారి మాటలను బట్టి అర్ధము అవుతాయి.
వ్యాఖ్యానము
అనగా భగవదప్రాప్తియే ఫలము, కర్మ భక్తి జ్ఞాన యోగములు సాధనములు, ఇంద్రాది దేవతలలో అంతర్యామిగా ఉండు ఈశ్వరుడే లక్ష్యము అని ఋషులు చెప్పెదరు. శ్రీ విష్ణు పురాణము 6.5.59 మరియు 6.5.60 “నిరస్తాతిశయ ఆహ్లాద సుఖభావైక లక్షణా భేషజం భగవత్ ప్రాప్తి రేకాన్తాత్యన్తికీ మతా తస్మాత్ తత్ ప్రాప్త్యే యత్నః కర్తవ్యః పండితైనరైః తత్ ప్రాప్తి హేతుః జ్ఞానం చ కర్మ చోక్తం మహామునే” (అంతులేని ఆనందమును కలిగి ఎట్టి శోకము లేని మరియు అట్టి స్థానము నుండి వెనక్కి తిరిగి రాని స్థితిని కలిగియున్న ఆ భగవానుని పొందుటకు గల లాభము ఏమి అనగా ఈ సంసారమున దుఃఖ నివృత్తి. అందుచేత గొప్ప వారు అట్టి సర్వేశ్వరుని పొందుటకు ప్రయత్నించెదరు. ఓ మైత్రేయ! జ్ఞాన మరియు కర్మ యోగములు ఆయనని పొందటానికి గల సాధనములు).
ఆళ్వారు ఇలా కృప చేసి ఉన్నారు
-కైంకర్యమే పురుషార్ధము (ఫలము) తిరువాయిమొళి 2.9.4 “తనక్కేయాగ ఎనైకొళ్ళుమ్ ఈతే” (కృష్ణుడు కృపతో చెప్పిన “నన్నే ప్రత్యేకముగా సేవించు” అనునదే న కోరిక) అనియు తిరువాయిమొళి 3.3.1 “వళువిలా అడియై సెయ్య వేణ్డునామ్”(సకల విధ కైంకర్యములను మనము విడువకుండా చేయవలెను)
– ఆయనని పొందుటకు ప్రపత్తి సాధనము తిరువాయిమొళి 5.10.11 “నాగణాయ్ మిశై నమ్ పిరాన్ చరణే శరణ్” (తిరుఅనంతాళ్వాను పైన పవ్వళించిన మన స్వామి యొక్క శ్రీ పాదములే మనకు ఉపాయము) అనియు తిరువాయిమొళి 6.10.10 “అడిక్కీళ్ అమర్ న్దు పుగున్దేనే”(నీ శ్రీపాదములకు శరణాగతి చేసి వాటి క్రింద అమరి ఉంటిని)
– అన్య దేవతలను పూజింపకూడదు తిరువాయిమొళి 4.6.10 “మత్తోరు దేవ్యమ్ తొళాళ్” (అన్య దేవతలను ఆరాధించను)
ఈ విధముగా ఫల సాధన మరియు దేవతాంతర విషయములలో ఋషుల ఆలోచనలు మరియు ఆళ్వారు యొక్క ఆలోచనలు వారి వారి వాక్కుల చేత బహిర్గత పడినవి.
సకల వేద సారము అయిన తిరుమంత్రమున
– మొదటి పదముచే (ప్రణవము) శేషత్వమే ప్రధానమైన స్వరూపమును కలిగినదని ప్రతిపాదించబడు ఆత్మ యొక్క స్వరూపమునకు పురుషార్ధము అంతిమ పదము అయిన (నారాయణాయ)మీద ఉండు “ఆయ” అను చతుర్ధీ విభక్తిచే తెలుపబడిన కైంకర్యమే.
– మధ్యమ పదము అయిన “నమః” చే ప్రతిపాదించబడు భగవత్ పారతంత్య్రముకు తగినట్లు భగవంతుడు మాత్రమే ఉపాయము తప్ప తనను రక్షించుకొను విషయమున తన ప్రయత్నమూ కూడదు.
– ప్రణవములో మాధ్యమాక్షరము అయిన “ఉ”కారముచే ప్రతిపాదింపబడు భగవత్ అనన్యార్హత్వము(భగవంతునికే తప్ప వేరొకరికి శేషము కాదు) అనేది దేవతాంతరమున లేశ మాత్రమైననూ సహింపలేక పోవుట.
భగవానుని పొందుటయే ఫలము, స్వప్రయత్న రూపములగు కర్మ యోగాదులు ఉపాయము, అహంకారంతో ఉండు దేవతలు భగవంతుని శరీరముగా ఉపదేయములని గ్రహించుట స్వరూప యాధాత్మ్యమును తెలిసిన వారికి త్యాజ్యములు(విడువతగినవి). అందుచేత ఫల, సాధన మరియు దేవతాంతర విషయమున ఋషుల ఆలోచనలకు నమ్మాళ్వార్ల ఆలోచనలకు ఎక్కువ తారతమ్యములు ఉండుట అను విధమున కూడా ఋషుల కంటే ఆళ్వారు ఎంతో గొప్ప వారు అని తెలుస్తున్నది.
అడియేన్ పవన్ రామనుజ దాస
మూలము : https://granthams.koyil.org/2024/06/09/acharya-hrudhayam-62-english/
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org