ఆచార్య హ్రుదయం – 70

ఆచార్య హ్రుదయం

<< చూర్ణిక – 69

చూర్ణిక – 70

అవతారిక
ఆళ్వార్ల దివ్య ప్రబంధములకు వేదములు మరియు ఉపబృంహణములకు సామ్యమును ఇంతక పూర్వము నాయనార్లు చెప్పియున్నారు. ఇక ఇప్పుడు ఈ ప్రబంధములు వేదము ఒక్క అవతార విశేషమై ఈ ఆళ్వార్లచే రచించబడినదిగా ప్రసిద్ధమైనది అని ఈ విషయమును వేరొక విధమున తెలుపుచున్నారు.

చూర్ణిక
అథవా వేదవేద్యన్యాయత్తాలే పరత్వపర ముతువేదమ్ వ్యూహ వ్యాప్తిఅవతరణఙ్గళిల్ ఓతిననీతి కేట్ట మను పడు కతైకళాయ్ ఆక మూర్తియిల్ పణ్ణియ తమిళానవాఴే వేదత్తై ద్రావిడమాక చ్చెయ్తారెన్నుమ్

సంక్షిప్త వివరణ
వేదోపబృంహణములకు సామ్యము బదులుగా వేద వేద్య న్యాయము(శ్రీ రామాయణ శ్లోకము “వేద వేద్యే పరే పుంసి”) ప్రకారము భగవానుని పరత్వమును తెలుపునట్టి వేదము వ్యూహమును పొందినప్పుడు శ్రీ పాంచరాత్ర ఆగమముగాను అంతర్యామి అవస్థయందు మను స్మృతిగాను విభవావతారముల అవస్థయందు శ్రీ రామాయణ, మహా భారతములుగాను అలానే అర్చా రూపముగా ఉండునప్పుడు ద్రావిడ భాషలో ఆళ్వార్ల ప్రబంధములుగాను అవతరించెను.

వ్యాఖ్యానము

అధవా –
అనగా ఇంతకముందు చెప్పినట్టు రెండు విధములుగా కాకుండా అంటే ఆళ్వార్ల ప్రబంధములకు వేద, ఉపబృంహణములకు సామ్యమును కలిగి ఉండుట.

వేద వేద్య న్యాయత్తాలే –
శ్రీ రామాయణము బాల కాండలో చెప్పినట్టు “వేద వేద్యే పరే పుంసి జాతే దశరధాత్మజే | వేదాః ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణమ్ ఆత్మనా||”(ఎలా అయితే వేదము ద్వారా తెలియబడు ఆ పరాత్పరుడు దశరధుని కుమారునిగా అవతరించారో అలానే వేదము కూడా ప్రాచేతసుని కుమారులు అయిన వాల్మీకి ద్వారా శ్రీ రామాయణముగా అవతరించెను.) అని చెప్పినట్టు వేదము ద్వారా తెలియబడు ఆ స్వామి దశరధుని కుమారునిగా ఎలా అయితే అవతరించాడో అదే న్యాయము ప్రకారము వేదములు కూడా ప్రాచేతసుని కుమారుడైన వాల్మీకి ద్వారా శ్రీ రామాయణముగా అవతరించెను.

పరత్వ పర –
తైత్తిరీయ ఉపనిషత్తు “క్షయన్తమస్య రజసః పరాకే”(రజస్సు, తమస్సుతో నిండియున్న సంసార మండలమునకు ఆవల ఉండు పరమపదమును వేంచేసియుండు వాడు) అనియు పురుష సూక్తము “ఆదిత్య వర్ణం తమసః పరస్తాత్”(ఆదిత్యుని వలే ప్రకాశించు వాడు, తాము గుణమునకు ఆవల ఉండు పరమపదములో వేంచేసియుండు వాడు అయిన ఆ సర్వేశ్వరుడు) అనియు విష్ణు సూక్తము “తద్విష్ణోః పరమంపదమ్ సదాపశ్యంతి సూరయః”(నిత్యసూరులు ఎల్లప్పుడూ సేవించు ఆ సర్వేశ్వరుని విభూతి) అనియు తైత్తిరీయ ఉపనిషత్తు “యో వేదా నిహితం గుహాయామ్ పరమే వ్యోమమ్ | సోస్నుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపశ్చితా||”(ఎవరైతే తమ హృదయ గుహలో ఆ సర్వేశ్వరుని ఆరాధించునో అట్టి వారు ఆ భగవానుని అనంత కళ్యాణ గుణములను ఆయనతో పాటు పరమపదంలో అనుభవించెదరు) అని మొదలగు చోట్ల చెప్పడము చేత ,మరియు అవి ఆ సర్వేశ్వరుని గొప్పతనమును బయలుపరుచుట చేత అవన్నీ ఆ సర్వేశ్వరుని పరత్వాన్నే సూచిస్తున్నవి.

ముదు వేదమ్ –
తిరువాయిమొళి 1.6.2 “ముదు వేదమ్”(పురాతనమైన వేదము) అని చెప్పినట్టు పౌరుషేయము అను దోషమును లేనిదైన వేదము అనాధియై ఉండుట.

వ్యూహ – ఓదిన నీతి
షాడ్గుణ్య  పరిపూర్ణుడై ముక్తులచే అనుభవింపబడు అట్టి సర్వేశ్వరుడు శ్రీ రంగరాజ స్తవము 2.39 “షాడ్గుణ్యాత్ వాసుదేవః పర ఇతి స భవాన్ ముక్త భోగ్యః”(ముక్తాత్మలచే అనుభవింపబడు వాడు మరియు షాడ్గుణ్య పరిపూర్ణుడైన దివ్యమైన వాసుదేవుని రూపమును కలిగిన మహోత్కృష్ఠమైన నీవు) అని చెప్పినట్టు వ్యూహ రూపమును తీసుకుని సృష్ఠి మొదలగు కార్యములను నిర్వహించుటకై  శ్రీ రంగరాజ స్తవము 2.39 “బలాద్యాత్ భోదాత్ సంకర్షణః త్వమ్ హరసి వితనుషే శాస్త్రం ఐశ్వర్య వీర్యాత్ ప్రద్యుమ్నః సర్గధర్మౌనయసి శక్తి తేజో నిరుత్తో బిభ్రాణః పాసి తత్త్వమ్ గమయసిచ తధా వ్యూహ”(బలము, జ్ఞానమును కలిగి సంకర్షణ రూపముగా సంహారము మరియు శాస్త్రమును విశదీకరించుట. ఐశ్వర్యము, వీర్యము కలిగి ప్రద్యుమ్న రూపముగా సృష్ఠి మరియు ధర్మ ప్రచారమును చేయుట. శక్తీ, తేజస్సు కలిగ అనిరుద్ధ రూపముగా జగత్తును రక్షించుట మరియు వేదాంతమును ప్రచారము చేయుట)!

అట్టి వ్యూహ స్థితులను, గుణములను, కార్యములను విశదీకరించుటకు విష్వక్సేన సంహిత “సంకర్షణాది సద్భావమ్ భజే లోకహితేప్సయా క్రమచః ప్రళయోత్పత్తి స్థితిభిః ప్రణయానుగ్రహః ప్రయోజన మతాన్యశ్చ శాస్త్రార్ధ తత్పరైః దాశాస్తుర్య సుషుప్త్యాధ్యాచ్ చతుర్ వ్యూహేభిలక్షయే”(ఈ జగత్తుకు మేలును చేయుటకు నేను వ్యూహ రూపములు అయిన సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ రూపములను స్వీకరించెదను. సృష్టి, స్థితి ప్రళయముల ద్వారా నా మంగళములు సకల జీవాత్మలకు చేరును. శాస్త్రములో “సత్” గురించి చెప్పు జ్ఞానము ధర్మమును గురించి చెప్పు శాస్త్రము యొక్క పరిణామమే. నాలుగు వ్యూహములలో గల తురీయ, సుషుప్తి, జాగృత, స్వప్న అను నాలుగు అవస్థలను అర్థము చేసుకొనవలెను). విష్వక్సేన సంహిత “తత్ర జ్ఞాన బలిద్వంద్వాత్ రూపమ్ సంకర్షణమ్ హరేః ఐశ్వర్యం వీర్య సమ్పేధాత్ రూపం ప్రద్యుమ్నమ్ ఉచ్యతే శక్తి సముత్కర్షా తానిరుద్ధ తనుర్ హరేః ఏతే శక్తిమయా వ్యూహ గుణేన్మేష స్వలక్షణాః”(వ్యూహ స్థితిలో జ్ఞానము, బలమును బట్టి విష్ణువు సంకర్షణ రూపము, ఐశ్వర్య, వీర్యమును బట్టి ప్రద్యుమ్న రూపము, శక్తి, తేజస్సును బట్టి అనిరుద్ధ రూపములు కలవాడు అవుచున్నాడు. ఇలా శక్తిమయమగు వ్యూహములనున్ను వాటి వాటి గుణములను, కృత్యములను విస్తృతముగా ప్రతిపాదించుటకు మహాభారతములో చెప్పినట్టు “పంచరాత్రస్య కృత్స్నస్య వక్తా నారాయణః స్వయం”(పాంచరాత్రము మొత్తము శ్రీమన్నారాయణునిచే చెప్పబడినది). ఆ సర్వేశ్వరుడే మొట్ట మొదట తెలిపినవాడు అగుట చేత వేదము పాంచరాత్రముగా ఆవిర్భవించినది అయినది. ఇఴణ్డామ్ తిరువందాది 48 “ఓదినాయ్ నీది”(వేదములలోని  అంశములను తెలుపునట్టి స్మృతులను మనువు మొదలగు వారి ద్వారా నీవే కృప చేసితివి).

వ్యాప్తి – కేట్ట మను
ఇలా ఆ సర్వేశ్వరుడు వ్యూహ స్థితినే కాకుండా సర్వ శబ్దముల చేత తెలుపబడు వాడు, అన్ని కర్మల చేత ఆరాధింపబడువాడు అయ్యి అంతర్యామిగా కూడా వ్యాపించి మను స్మృతి 1.19 “ఆపో నారా ఇతి ప్రోక్తా అపోవై నర సూనవః | తా యధస్యాయనమ్ పూర్వమ్ తేన నారాయణః స్మృతః||” (నర శబ్ధముచే తెలియబడు ఆ భగవానుని నుండి జలములు పుట్టినవి అందుచేత జలములు నారములు అని పిలువబడుచున్నవి. అట్టి నారములకు ఆశ్రయము అవ్వడము చేత భగవానుడు నారాయణునిగా పిలువబడుచున్నాడు.) అనియు మను స్మృతి 21.122 “ప్రశాసితారం సర్వేషాం అణీయాంస మణీయసమ్ | రుక్మాభం స్వప్నధీగమ్యం విద్యాత్తు పురుషంపరం|| ” (అన్నింటినీ నియమించువాడు సూక్ష్మముల కంటే సూక్ష్మమైన వాడు బంగారపు వర్ణము కలవాడు స్వప్నమున కనపడువాడిగా ఆ పరమ పురుషుని తెలుసుకొనుము) అనియు స్మృతి 12.123 “ఏనమేకే వదంత్యగ్నిం మరుతోన్యే ప్రజాపతిం ఇంద్రమేకే పరే ప్రాణమ్ పరే బ్రహ్మ శాశ్వతమ్”(ఈతనిని కొందరు అగ్ని అని మరి కొందరు ప్రాణము అని మరి కొందరు శాశ్వతమైన బ్రహ్మము అని తెలుసుకుంటున్నారు) అనియు మను స్మృతి 12.124 ” ఏష సర్వాణి భూతాని పంచభిర్వ్యాప్య మూర్తిభిః జన్మ వృద్ధిక్షయైర్నిత్యం సంసారయతి చక్రవత్” (పంచ భూతములు అయిన పృధివి మొదలగు వాటి ద్వారా జన్మ, వృద్ధి నాశన మూలముగా అన్ని జీవాత్మలను సంసారమున చక్రము వలే తిప్పుచున్నాడు.) అనియు అన్ని దేవతలను శరీరముగా కల వాడయినందున అన్ని కర్మముల చేత ఆరాధింపబడువాడు యీతడు అని తైత్తిరీయ ఉపనిషత్తు “స ఆత్మా అంగాన్యన్యా దేవతాః” (ఆ పరమాత్ముని అవయవములే ఇతర దేవతలు) అని చెప్పినట్టు సర్వాంతర్యామియై అట్టి వ్యాప్తిని ప్రతిపాదించుటకు గాను నాన్ముగన్ తిరువన్దాది 76 “కేట్ట మను” (వేదములలో చెప్పబడిన మను స్మృతి) అన్నట్టు ఎక్కువ హితకరమైనదిగా వినబడినట్టు మన్వాది స్మృతిగా వేదము ఆవిర్భవించి

అవతరణాగళిల్ పడుకదైగళాయ్
ఆలా అతీంద్రియుడైన ఆ భగవానుడు సాధు పరిత్రాణము మొదలగు వాటి కోసము రామ, కృష్ణావతారములుగా అవతరించునప్పుడు ఆయా అవతారములు యొక్క వ్యాపారాదులను ప్రతిపాదించుటకు గాను  నాన్ముగన్ తిరువన్దాది 76 “పడు కతైయుమ్”(పురాణములను (పురాతన చరిత్రను) విశదీకరించుటకు ఏర్పడిన ఇతిహాసములు) అని చెప్పినట్టు నృత్త కీర్తన రూపమగు రామాయణ మహాభారతములుగా వేదములు ఆవిర్భవించి

ఆగమూర్తియిల్ పణ్ణయ తమిళ్
అలా తన అవతారములలో రక్షించునట్టి ఆ సర్వేశ్వరుడు ఆయా అవతారములు తరువాత జన్మించువారు దుఃఖపడకుండా తిరుచ్చంద విరుత్తం 17 “ఆగమూర్తి ఆయవణ్ణమ్ ఎన్కోల్”(నిన్ను అనుసరించు దాసుల కోరిక మేరకు అర్చావతారములుగా అవతరించు గుణమును కలిగి ఉన్న నీవు. ఏంతో ఆశ్చర్యమైన గుణము కదా ఇది!) అని చెప్పినట్టు, నీ దాసులా కోరిక మేరకు ముదల్ తిరువందాది 44 “తమర్ ఉగన్దదు ఎవ్వుీరువమ్ అవ్వురువమ్ తానే తమర్ ఉగన్దదు ఎప్పేర్ మత్తు అప్పేర్ తమర్ ఉగన్దు ఎవ్వణ్ణమ్ సిద్ధిత్తు ఇమయాదు ఇరుప్పఴే అవ్వణ్ణమ్ ఆళియానామ్”(చక్రధారి అయిన ఆ సర్వేశ్వరుడు తన దాసుల కోరిక మేరకుమేరకు ఆయా దివ్య శరీరములను ధరిస్తాడు. ఏ నామముతో వారు పిలిచెదరో ఆ నామమును స్వీకరిస్తాడు. వారు ఏ విధముగా ధ్యానించునో అది విధముగా ఆ సర్వేశ్వరుడు ఆయా రీతిలో వారిని తధేకముగా అనుగ్రహించును) అని చెప్పినట్టు ద్రవ్య, నామ, రూప, ఆసన, శయనాదుల విషయముననూ మరియు దెస, కాల, అధికారాదుల విషయముననూ ఎట్టి నియమము లేకుండా సులభముగా అర్చావతారముగా అవతరించినప్పుడు అట్టి అవతారము యొక్క వైభవమును ప్రతిపాదించుటకై తిరువాయిమొళి 2.7.13 “శడగోపన్ పణ్ణియ తమిళ్”(ఎట్టి అధికారమును ఉపేక్షించనిది అయిన నమ్మాళ్వార్లచే అందముగా ద్రావిడములో అల్లబడిన తిరువాయిమొళి అను ప్రబంధము) అని చెప్పినట్టు ప్రతిపాద్య వస్తువు అయిన ఆ సర్వేశ్వరుని వలనే తాను సర్వ సులభమై, సర్వాధికారమగుటకు తగినట్లు ద్రావిడములో రచియించినారు అని చెప్పుట అన్నట్టుగా సంస్కృతములో ఉన్న వేదము తమిళములో ఆళ్వార్లచే చెప్పబడినది. ఇరామానుశ నూత్తందాది 18 “ఎయిదర్కు అరియ మఴైగళై ఆయిరమిన్ద తమిళాల్ శెయ్ తర్కు ఉలగిల్ వరుమ్ శడగోపనై”(అర్థమును తెలుసుకొనుటకు కష్టమైన సంస్కృత వేదమును ద్రావిడములో కృప చేయుటకై ఈ లోకములో అవతరించిన నమ్మాళ్వార్లు) అని చెప్పినట్టు ఈ శాస్త్రములు అన్నియూ భగవానుని అన్నీ అవస్థలను చెప్పియున్ననూ ఒక్కొక్క శాస్త్రమునకు ఒక్కొక్క ప్రధాన విషయము అవ్వడము చేసియే కదా నాయనార్లు ఈ విధముగా కృప చేసియున్నారు. ఇది పరత్వమును తెలుపునది అనుటచే స్పష్టముగదా! (“పరత్వ పరముదు వేదం”).

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/06/21/acharya-hrudhayam-70-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment