అవతారిక
భాషా నిరూపణము (తమిళము) బట్టి తిరువాయిమొళిని మరియు గ్రంధకర్త అయిన ఆళ్వారు యొక్క జన్మను(వర్ణమును) బట్టి విశ్లేషించుట తగదు అని ఇంతకు ముందు చెప్పినట్టుగా కాకుండా అట్టి వారికీ సంప్రాప్తమగు అనిష్టమును నాయనార్లు తెలుపుచున్నారు.
చూర్ణిక
ప్పేచ్చుప్పార్కిల్ కళ్ళ ప్పోయ్ న్నూల్ కళుమ్ గ్రాహ్యజ్గళ్ పిఴవి పార్ క్కిల్ అజ్ఞామోత్తుమ్ ఆఴుమూన్ఴుమ్ కళిప్పనామ్
సంక్షిప్త వ్యాఖ్యానము
భాషకు ప్రాధాన్యతను ఇచ్చినచో వేదమును తిరస్కరించు సంస్కృతములో ఉండు తక్కిన సాహిత్యమును కూడా మనము ఒప్పుకొని తీరవలెను. ఏదైనా సాహిత్యమును గ్రంధకర్త యొక్క వర్ణమును బట్టి తిరస్కరించదలచినచో మహాభారతమును మరియు శ్రీ భగవద్గీతను కూడా తిరస్కరించవలెను.
వ్యాఖ్యానము
అనగా – భగవానుని కీర్తించునట్టి సాహిత్యము సంస్కృతములో లేదా ద్రావిడములో ఉన్నా వాటిని మనము స్వీకరించవలెను. తక్కిన వాటిని(భగవానుని కీర్తించనివి) ఏ భాషలో ఉన్నప్పటికినీ వాటిని తిరస్కరించవలెను(విడువవలెను). ఇలా కాకుండా కేవలము భాషను బట్టి సాహిత్యమును స్వీకరించుట లేదా త్యజించుట అను దాని ద్వారా ఒకడు ద్రావిడములో చెప్పబడుట చేత దానిని తిరస్కరించినచో అప్పుడు వేదబాహ్యములు అయిన శాస్త్రములు కూడా స్వీకార యోగ్యములు అగును. పెఴియ తిరుమొళి 9.7.9 “వెళ్ళియార్ పిణ్డియార్ బోధియార్ ఎన్ఴివర్ ఓదుగిన్ఴ కళ్ళ నూల్” (అసత్యములు అయిన మరియు పాశుపతులు, జైనులు, బౌద్దులచే రచించబడిన వేదం బాహ్య శాస్త్రములు) అనియు పెఴియ తిరుమొళి 2.5.2 “పొయ్ నూలై మెయ్ నూల్ ఎన్ఴు ఎన్ఴుమ్ ఓది” (వేదమునకు విరుద్ధముగా ఉండు శాస్త్రములను నేర్చుట మరియు అవే సత్యములు అని విశ్వసించుట) అని చెప్పినట్టు స్వీకార యోగ్యములు అగును. గ్రంధకర్త అయిన ఆళ్వారు చతుర్ధ వర్ణములో జన్మించిన కారణము చేత ఈ ప్రబంధమును త్యజించినట్లైతే మత్స్యగంధి పుత్రుడైన వ్యాసునిచే రచించబడిన పంచమ వేదము అయినట్టి మహాభారతము మరియు యాదవ కులమున పుట్టిన శ్రీ కృష్ణునిచే చెప్పబడిన గీతోపనిషత్తు కూడా త్యజించవలసి వచ్చును. దీనితో భాష చేతనో జన్మ చేతనో ఈ ప్రబంధమును తిరస్కరించుట వలన కలుగు ఇబ్బంది ఇక్కడ వివరించబడినది.
మరొక వివరణము:
భాషను బట్టి కాని గ్రంధకర్త యొక్క జన్మను బట్టి కాని ఈ ప్రబంధమును తిరస్కరించుట అను దాని బట్టియే కాకుండా కేవలము సంస్కృతములో చెప్పబడిన మరియు గ్రంధకర్త యొక్క ఉత్క్రుష్టమైన జన్మను బట్టి మాత్రమే మేము అట్టి గ్రంధములను స్వీకరించెదము అని చెప్పిన వారికి ఆ విధముగా అంగీకరించిన పిదప కలుగు అనిష్టములను గూర్చి నాయనార్లు ప్రతిపాదించుచున్నారు.
భగవంతుని తెలుపునట్టిది అంగీకరించవలసినదియు తక్కిన వాటిని (వేద బాహ్యములు) తెలుపునట్టిది తిరస్కరించవలసినదియును గ్రహింపక భాషను బట్టి ఉండు వాటిని మాత్రమే అంగీకరించి అనగా భాషను మాత్రము బట్టి ఇది కావలెను ఇది వద్దు అని అంగీకరించి ద్రావిడ భాష అవ్వడము చేత తిరువాయిమొళి త్యాజ్యము అని అనినచో తిరువాయిమొళి 9.7.9 “కళ్ల నూల్” అనియు పెరియ తిరుమొళి 2.5.2 “పొయి నూల్” అని చెప్పినట్టు వేదబాహ్య శాస్త్రములను సంస్కృత భాషలో ఉండడము చేత అవి అంగీకరించవలసి వచ్చును.
శూద్ర కులమున జన్మించిన వారని గ్రంధకర్త యొక్క జన్మను చూచి దీనిని ఒప్పుకోకవలసినట్లైన మత్స్య గంధి పుత్రుడు అయిన వ్యాసునిచే రచించబడిన పంచమ వేదము అయిన మహాభారతమును, యాదవ కులమున జన్మించిన శ్రీ కృష్ణుడు చెప్పిన పద్దెనిమిది అధ్యాయములను కలిగిన శ్రీ భగవద్గీత త్యాజ్యములు కావలసి వచ్చును.
దీనితో భాషను బట్టి గ్రంధకర్త జన్మను బట్టి మాత్రమే విచారించి ఈ ప్రబంధమును త్యజించదలచినచో దాని వలన కలుగు ఇబ్బందులను చూపించడము అయినది.
అడియేన్ పవన్ రామనుజ దాస
మూలము : https://granthams.koyil.org/2024/07/03/acharya-hrudhayam-76-english/
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org