చూర్ణిక 92
అవతారిక
జ్ఞానులు అయినప్పటికీ ఆళ్వారు యొక్క స్వరూపమును గుర్తించలేక ఆశ్చర్యచకితులై “ఈ విధముగా ఆళ్వారులా ఎవరు అవతరించి ఉంటారు?” అని ఆళ్వార్ల స్వరూపమును ఏ విధముగా శంకించెదరు అన్న విషయమును ఇక మీద నాయనార్లు కృప చేయుచున్నారు.
చూర్ణిక
అత్రి జమదగ్ని పంక్తిరధ వసునన్ద సూనువానవనుడైయ యుగ వర్ణ క్రమావతారమో? వ్యసాదివదావేశమో? మూతువర్ కరైకణ్డోర్ శీరియరిలే యొరువరో మున్నమ్ నోత్త అనన్దన్ మేల్ పుణ్ణియఙ్గళ్ ఫలిత్తవరో ఎన్ఴు శఙ్కిప్పర్ కళ్
సంక్షిప్త వ్యాఖ్యానము
అత్రికి[దత్తాత్రేయునిగా], జమదగ్నికి[పరశురామునిగా], దశరధునికి[శ్రీ రామునిగా], వసునన్దులకి[శ్రీ కృషునిగా] ఆయా యుగములకి తగ్గట్టుగా ఆయా వర్ణములలో భగవానుడు అవతరించినట్టుగా ఈ ఆళ్వార్ల అవతారమా? వ్యాస మొదలగు వారిలా ఆళ్వార్లు ఆవేశ అవతారమా? నిత్యసూరులలో లేదా ముక్తాత్మలలో లేదా శ్వేత ద్వీపములో నివసించు శ్రేష్ఠులైనవారిలో ఆళ్వారు ఒకరా? లేదా వీరు భగవానుని నిర్హేతుక కృపకు పాత్రులై లేదా భక్తి యోగము వల్ల ఇలా అయినారా? అన్నట్లు ఈ విధముగా జ్ఞానులైన మహానుభావులు కూడా ఆళ్వార్ల విషయములో శంకించెదరు.
వ్యాఖ్యానము
అత్రి జమదగ్ని పంక్తిరధ వసునన్ద సూనువానవనుడైయ యుగ వర్ణ క్రమ అవతారమో? –
అనగా – కృత యుగములో భగవానుడు బ్రాహ్మణోత్తములైన అత్రికి దత్తాత్రేయునిగా మరియు జమదగ్నికి పరుశరామునిగా జన్మించెను. దశరధుని కుమారుడిగా శ్రీరాముని వలె జన్మించెను. ద్వాపర యుగములో తక్కువ స్థాయి క్షత్రియుడు మరియు వైశ్య సమానుడగు వసుదేవునికి కుమారునిగా జన్మించెను. యయాతి శాప ప్రభావము చేత రాజ్యమును కోల్పోయిన యదు వంశములో జన్మించుట చేత మరియు గోసంరక్షణమును ధర్మముగా కలిగియున్న నిజమైన వైశ్యుడు అయిన శ్రీ నంద గోపుడు శ్రీ భగవద్గీత 18.44 “కృషిగోరక్ష్యవాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం” (వ్యవసాయము, గోసంరక్షణ మరియు వాణిజ్యము అనునవి మునుపటి కర్మ మూలకముగా వైశ్యునికి సంక్రమించును) అని చెప్పినట్టు ఈ విధముగా కృత యుగముతో మొదలగు యుగములలో బ్రాహ్మణ మొదలగు వర్ణములలో అవతరించునట్టి ఆ సర్వేశ్వరుడు నాల్గవ యుగము అయిన కలి యుగమున చతుర్ధ వర్ణములో అవతరించెనా? అన్నట్టు ఈ ఆళ్వార్ల అవతారమున ఇది ఒక సందేహము.
మొదటి మూడు యుగములలో క్రమముగా మొదటి మూడు వర్ణములలో భగవానుడు అవతరించును కనుక భగవానుడు కలియుగములో తన భక్తునిగా అవతరించెను అని మహర్షులచే చెప్పబడినది. “కలే పునః పహర్తాభిభూతే స ఉద్భభూవాశ్రిత వతులత్వాత్ భక్తాత్మనా సర్వజనాన్ సుఖోప్తుమ్ విశ్వాధికో విశ్వమయోహి విష్ణుః”(అందరి కంటే ఉత్క్రుష్టుడు, ఈ జగత్తును తన శరీరముగా కలిగిన వాడు అయినట్టి విష్ణువు పాపభూయిష్ఠులైన జనులతో నిండియున్న కలియుగములో ఆయనకి తన భక్తుల పట్ల ఉన్న వాత్సల్యము చేత అందరినీ ఉద్ధరించుటకై తన భక్తునిగా అవతరించెను) అన్నట్టుగా ఆళ్వారు యొక్క గొప్పతనమును చూసిన వారికి ఈ విధమైన సందేహము కలుగును.
వ్యసాదివత్ ఆవేశమో ? –
అనగా – శ్రీ విష్ణు పురాణము 3.4.5 “కృష్ణద్వైపాయనమ్ వ్యాసమ్ విద్ధి నారాయణమ్ ప్రభుమ్”(కృష్ణద్వైపాయనుడగు వ్యాసుని నారాయణునిగా తెలుసుకొనుము) అనియు మహాభారతము “సోయమ్ నారాయణస్సాక్షాత్ వ్యాసరూపీ మహామునిః”(గొప్ప మహర్షి అయిన వ్యాసుడు సాక్షాత్తు ఆ నారాయణుడే) అని చెప్పినట్టు వేదములను విభజించుటకు వ్యాస మొదలగు అవతారములను దాల్చినట్టి ఎమ్పెరుమానుడు ద్రావిడ వేదమును ప్రవర్తింపజేయుటకై ఆళ్వారుగా అవతరించెనా? భగవానుడు ఈ లోక ఉద్ధరణకు ఆళ్వారుగా అవతరించగలడు కనుకనే ఈ సందేహము వచ్చెను.
మూదువర్ కరైకణ్డోర్ శీరియరిలే ఒరువరో? –
అనగా – తిరువిరుత్తం 2 “విణ్ణత్తవర్ మూదువర్”(అనాదిగా పరమపదములో ఉన్నవారు) అన్నట్టు ఈ లోకోద్ధరణకై ఆ సర్వేశ్వరుని ఆజ్ఞ చేత పరమపదమును పాలించు నిత్యసూరులలో ఎవరైనా ఒకరు అవతరించెనా? మరొక విధముగా తిరువాయిమొళి 8.3.10 “కరై కణ్డోర్”(ఆవలి ఒడ్డుకి (సంసారమును దాటి)చేరిన ముక్త పురుషులు) అని చెప్పినట్టు ఆ భగవానుని ఆజ్ఞ మేరకు సంసారులను ఉద్ధరించుటకై సంసారమును దాటి ఆవలి ఒడ్డు అయిన పరమపదమును చేరిన ముక్తాత్మలలో ఎవరైనా ఒకరు ఆళ్వారుగా అవతరించెనా? మరొక విధముగా మహాభారతము శాంతి పర్వము “ముక్తానామ్ లక్షణమ్ హ్యేతత్ శ్వేత ద్వీప నివాసినమ్”(ముముక్షువులతో సరి సమానులైన శ్వేతా దీపపు వాసులు) అని చెప్పినట్టు ముక్తప్రాయులు అగుట వలన (ముక్తాత్మలతో సమానులైన వారు) తిరువిరుత్తం 79 “పాఴ్కడల్ పామ్బణై మేల్ పళ్ళి కొణ్డరళుమ్ సీతనైయే తొళువార్ విణ్ణుళారిలుమ్ సీరియర్”(చల్లదనమును తన సహజ స్వభావముగా కలిగి తిరుప్పార్కడల్ లో ఆ సర్వేశ్వరుడు ఆదిశేష అను శయ్య పైన పవ్వళించును. అట్టి సర్వేశ్వరుని ఆరాధించువారు నిత్యసూరుల కంటే గొప్ప వారు) అట్టి శ్వేత ద్వీపములో ఉండు ఎవరైనా ఆ ఈశ్వరుని ఆజ్ఞ మేరకు సంసారులను ఉద్ధరించుటకై ఆ లోకమున అవతరించెనా? ఆళ్వార్ల గొప్పతనమును చూస్తే వారికి అందరి గుణములు ఉండడము వలన అందరూ ఆళ్వార్ల స్వరూపమును పలు విధములుగా శంకించెను. తిరువాయిమొళి 6.5.10 “పిన్నైకొల్? నిలమామగళ్ కొల్? తిరుమగళ్ కొల్?” (ఈ విధముగా జన్మించిన పరాంకుశ నాయకి ఆ స్వామికి భోగ్యమైన నప్పిన్నై పిరాట్టియా? భూమిని నియంత్రించు భూమి పిరాట్టియా? ఆ సర్వేశ్వరుని ఐశ్వర్యము అయిన శ్రీ మహాలక్ష్మియా?) అన్నట్టు ఈ విధముగా భగవానుని పిరాట్టులతో పోల్చినప్పటికీ ఆమె యా? ఈమె యా? అని వేరు వేరుగా సందేహించవచ్చును కదా! తక్కిన భాగవతుల విషయమున వేరు చెప్పన్నక్కర్లేదు కదా!
మున్నమ్ నోత్త అనన్దన్ మేల్ పుణ్ణియఙ్గళ్ ఫలిత్తవరో ఎన్ఴు శఙ్కిప్పర్ కళ్ –
అనగా – అంతక ముందు చెప్పిన ఏ ఒక్కరిలా కాకుండా, తన యొక్క పూర్వ జన్మలలో ఆర్జించబడిన సుకృతముల వలన ఈ సంసారములో ఒకరిగా ఈ విధముగా సరిదిద్దబడిన వాడు అయ్యెనా? తిరువాయిమొళి 6.5.7 “మున్నమ్ నోత్త విధికొలో”(ఇది ఆమె యొక్క పూర్వ జన్మ సుకృతమా?) మరొక విధముగా తిరుచ్ఛన్దవిరుత్తం 45 “అనన్తన్ మేల్ కిడన్ద ఎమ్ పుణ్ణియ”(ఓహో! ఆదిశేషుని ఫై పవ్వళించినట్టి నాకు ప్రాప్యమైన వాడు) అన్నట్టు నిర్హేతుక కటాక్ష విశేషము చేత నిత్య సంసారిని నిత్యసూరులతో సమానునిగా చేయగల అనంతునిపై శయనించిన ఆ స్వామి యొక్క సనాతన పుణ్యము(శాశ్వతమైన ఉపాయము) పరిపూర్ణ కటాక్షముగా ఫలించి ఈ విధముగా దిద్దుబాటు అయినట్టివారా? అని సందేహించెదరు. అనగా ఇంతక ముందు చెప్పినట్టు అనేక విధములుగా ఆళ్వారును ఇట్టి వారు అని నిశ్చయింపలేక జ్ఞానులు కూడా అనుమానపడుదురు.
అడియేన్ పవన్ రామానుజ దాస
మూలము : https://granthams.koyil.org/2024/07/19/acharya-hrudhayam-92-english/
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org