కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 27 – మథురలో కృష్ణుడి ఆగ్రహానుగ్రహాలు

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి

<< 26 – అక్రూరుడి యాత్ర

కృష్ణుడు మరియు బలరాముడు అక్రూరుని రథంలో మథురకు చేరుకున్నారు. వారు అక్రూరుని విడిచి, మథుర నగర వీధులల్లో ఆనందంగా తిరిగారు. అక్కడి భవనాల నుండి నగర స్త్రీలు కృష్ణుడు మరియు బలరాముని చూసి ఆనందపడ్డారు.

వారు ధనుర్యాగానికి వెళ్తున్నారు కాబట్టి, కృష్ణుడు తనను తాను లావణ్యముగా అలంకరించుకోవాలని కోరాడు. అప్పుడు, కంసుని వస్త్రాలు ఉతికే ఒక చాకలివాడు కృష్ణుని వైపుగా వచ్చాడు. కృష్ణుడు అతని వద్దకు వెళ్లి, “మాకు కొన్ని మంచి వస్త్రాలు ఇవ్వండి” అని అడిగాడు. కృష్ణ భగవానుడి మహిమను తెలియక, అతడు వస్త్రాలు ఇవ్వలేదు. అంతే కాక, కృష్ణుని మరియు బలరాముని అవమానించి, తిట్టాడు. కృష్ణుడు కోపగించి, తన వేలు గోటితో అతని తలను నరికివేశాడు. చాకలివాడు తెచ్చిన మూట నుండి వస్త్రాలు తీసుకుని, ఇద్దరూ ధరించారు. ఈ సంఘటనను నంపిళ్ళై , నమ్మాళ్వార్ పాశురం “నిన్ఱవారుం ఇరున్దవారుం” కు వ్యాఖ్యానంలో చాలా అందంగా వివరించారు. ఒకసారి ఒక చాకలివాడు పెరియ పెరుమాళ్ వస్త్రాలను పూర్తిగా చక్కగా ఉతికనప్పుడు, భగవత్ రామానుజులు కృష్ణావతారంలో చాకలివాడు అవమానించినందుకు క్షమించాలి అని కోరుకొని, ఆ వస్త్రాలు పెరియ పెరుమాళ్ వద్ద చూపించి, చాకలివాడిని క్షమించమని వేడుకున్నారు. పెరియ పెరుమాళ్ కూడా భగవత్ రామానుజుల వారి మాటలు అంగీకరించారు.

అప్పుడు కృష్ణుడు అందమైన మాలలు ధరించాలని కోరాడు. చిన్న వీధిలో నివసించే సుధామా అనే మాలాకారుని వెతికి, అతని ఇంటికి చేరుకున్నాడు. కృష్ణుని మరియు బలరాముని చూసి, మాలాకారుడు అత్యంత ఆనందితుడయ్యాడు. వారికి తగుమర్యాదలు చేసి, తాను తయారు చేసిన ఉత్తమ మాలలు అర్పించాడు. భగవాన్ చాలా సంతోషించి, తన అనుగ్రహం కురిపించి, అక్కడి నుండి బయలుదేరారు. ఈ సంఘటనను పెరియవాచ్చాన్ పిళ్ళై, నాచ్చియార్ తిరుమోళి పాశురం “మాడ మాళిగై సూళ్ మదురై ప్పది నాడి నన్దెరువిన్ నడువే వన్దిత్తు”కు వ్యాఖ్యానంలో వివరించారు. వాధి కేసరి అళగియ మణవాళ జీయర్ స్వామి తమ తిరువాయ్ మొళి వ్యాఖ్యానంలో “పూశమ్ శాన్దు” పాశురంకు ఈ సంఘటనను ఉట్టంకించారు.

అప్పుడు భగవానుడు చందనము అలంకరించుకోవాలని భావించాడు. అప్పుడు, కంసుడికి చందనం అందించే గూని స్త్రీ త్రివక్రా అటువైపు నుండి వచ్చింది. ఆమె వివిధ రకాల చందనాలు మోసుకుంటూ వచ్చింది. కృష్ణుడు ఆమెను చందనం కొంచెం ఇవ్వమని కోరాడు. ఆమె మొదట తక్కువ నాణ్యత చందనం ఇచ్చింది. కృష్ణుడు అది తీసుకోకుండా, మంచి చందనం ఇవ్వమని అడిగాడు. ఆమె కొంచెం మెరుగైన చందనం ఇచ్చింది. కృష్ణుడు ఆమె వద్ద ఉన్న ఉత్తమ చందనం ఇవ్వమని అడిగాడు. కృష్ణుని వివిధ చందన నాణ్యతలను గుర్తించే సామర్థ్యం చూసి ఆమె అవాక్కయ్యి, ఉత్తమ చందనం ఇచ్చింది. ఆమె ఆయన దివ్యమైన శరీరంపై చందనం పూసింది. ఆయన సంతోషించి, ఆమెను అనుగ్రహించాలి అని నిర్ణయించాడు. తన దివ్యమైన పాదాలతో ఆమె కాలి బొటన వేలుని ఒత్తి, దివ్య హస్తం తో ఆమె చుబుకాన్ని ఎత్తాడు. ఆమె గూని నుండి విముక్తి పొంది, కాంతివంతురాలైంది. ఈ సంఘటనను పెరియాళ్వారు తన పెరియాళ్వార్ తిరుమొళిపాశురం “నాఱియశాన్దం నమక్కిఱైనల్ గుఎన్న తేఱిఅవళుమ్ తిరువుడమ్బిల్ పూశ ఊఱియ కూనినై ఉళ్ళే ఒడుఙ్గ అన్ఱు ఏఱవురువినాయ్ అచ్చోఅచ్చో ఎమ్బెరుమాన్ వారా అచ్చోఅచ్చో”లో ప్రస్తావించారు (నీ గొప్పతనాన్ని గ్రహించి, కూని నీకు చందనము పూసింది. నువ్వు ఆమె గూనిని తొలగించావు. మరి నువ్వు ఎందుకు రావు, స్వామీ?).

ఈ విధంగా, భగవానుడు చాకలివాడి మీద కోపం చూపి, మాలాకారుని మరియు త్రివక్రపై అనుగ్రహం చూపాడు.

ఈ సంఘటన లోని సారాంశం::

  • భగవంతుడి వైపు ప్రేమ కలిగి ఉంటే, ఆయన అనుగ్రహం పొందవచ్చు. ఆయనను వ్యతిరేకిస్తే, ఆయన ఆగ్రహిస్తాడు. ఈ విధంగా, ప్రతి వ్యక్తికి తగిన ఫలితాన్ని అందించి, ఆయన తన “సామ్యం” (సమానత్వం) గుణాన్ని తెలియజేస్తాడు.
  • భగవంతుడి వైపు కొంచెం ప్రేమ చూపితే, ఆయన గొప్ప అనుగ్రహాన్ని అందిస్తాడు.

మూలం : https://granthams.koyil.org/2023/10/03/krishna-leela-27-english/

అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment