చూర్ణిక – 86
అవతారిక
ఇంతక ముందు సూత్రములో “జన్మ ఉత్కర్ష అపకర్షఙ్గల్ తెరివతు” అని నాయనార్లు చెప్పడము చేత జన్మము యొక్క ఎక్కువ తక్కువు స్థాయిలకు కొన్ని అంశములు కారణమని సూచించబడ్డాయి. ఇక మీద చెప్పబోవు రెండు సూత్రములలో నాయనార్లు వాటిని బయలుపరుస్తూ అందులో మొట్టమొదట భగవానుని గురుంచిన జ్ఞానము లేకపోవుట వలన కలుగు తక్కువ జన్మ, తక్కువ వర్ణములను ప్రమాణములతో సూచించుచున్నారు.
చూర్ణిక
ఆజ్ఞర్ భ్రమిక్కిఴ వర్ణాశ్రమవిద్యావృత్తంగళై గార్ధభ జన్మం స్వపసాధమం శిల్పనైపుణం భస్మాహుతి శవ విధవాలంకారమెన్ఴు కళిప్పర్గళ్
సంక్షిప్త వ్యాఖ్యానము
అజ్ఞానుల చేత చూడబడు(కొనియాడబడు) వర్ణము, ఆశ్రమము, విద్య మరియు వృత్తములు “గాడిద జన్మ”, “కుక్క మాంసమును తినేవారిలో అధములు”, “చెప్పులు కుట్టు వాడి నైపుణ్యము”, “యజ్ఞములో భస్మమును హవిస్సుగా ఇచ్చుట”, “శవ/విధవ అలంకారము” వలే నిషేదించబడుచున్నవి(తొలగించబడుచున్నవి).
వ్యాఖ్యానము
ఆజ్ఞర్ –
అనగా భగవానునికే శేషభూతముగా ఉండుటయే ఆత్మ స్వరూపము అనే సూత్రమును ఆధారముగా చేసుకొని త్యాజ్య(విడువవలసినవి), ఉపాదేయములు(పొందతగినవి) యొక్క జ్ఞానమును లేని వారు.
భ్రమిక్కిఴ వర్ణాశ్రమవిద్యావృత్తంగళై –
భగవానుని గురించిన జ్ఞానము లేని కొంత మంది తక్కువ స్థాయి అల్పులను అనుచితముగా ఉత్తమ వర్ణము, ఉత్తమ ఆశ్రమము, సద్విద్యా మరియు సద్వృత్తములలో ఉన్నతులుగా భావించెదరు.
అట్టి వర్ణము మొదలగు క్రింద చెప్పబడిన విధముగా పరిగణించబడుతాయి.
గార్ధభ జన్మం –
“చతుర్వేద ధరో విప్రో వాసుదేవం న విన్దతి వేదభారభరాక్రాంత స్సవై బ్రాహ్మణ గార్ధభః”(నాలుగు వేదములను నేర్చినప్పటికీ అంతటా వ్యాపించియున్న వాసుదేవుని తెలుసుకోలేని బ్రాహ్మణుడిని వేదమును మోసుకుపోవు గాడిద బ్రాహణునిగానే భావించాలి) అని చెప్పినట్టు ఒకడు నాలుగు వేదములను అధ్యయనము చేసినప్పటికీ వేదములంతటా చూపించబడ్డ ఆ సర్వేశ్వరుని గురుంచి తెలియకపోతే కఠవల్లి “సర్వే వేదా యత్ పదమామనన్తి”(అన్ని వేదములచే చెప్పబడినట్టి భగవానుడు) అనియు శ్రీ భగవద్గీత 15.15 “వేదైశ్చ సర్వేః అహమేవ వేద్యః”(వేదము అంతా నా గురుంచే చెప్పును)అని చెప్పినట్టు అట్టి వాడిని కుంకుమ పువ్వును మోసుకొనిపోవు గాడిదలా భావించవలెను. తాను మోసుకొని తిరుగు వేదము యొక్క పరిమళమును తెలియని బ్రాహ్మణ రూపముతో ఉన్న గాడిద అని తెలుసుకొనుము.
శ్వపచాధమమ్ –
“స్వచోపా మహీపాల విష్ణుభక్తో ద్విజాధికః విష్ణుభక్తి విహీనస్తు యతిశ్చ శ్వపచాధమ”(ఓ రాజా! కుక్క మాంసమును తినువాడు విష్ణు భక్తుడు అయితే చాలు వాడు బ్రాహ్మణుడి కంటే గొప్ప వాడు. కానీ విష్ణు భక్తి లేని వాడు సన్యాసి అయినప్పటికి వాడు కుక్క మాంసమును తినేవాడి కంటే అధముడు) అని చెప్పినట్టు చరమాశ్రమములో ఉన్న సన్యాసికి భగవానుని పట్ల భక్తి లేనిచో ఆతను కుక్క మాంసమును తినే వాడికంటే అధముడు.
శిల్పనైపుణం –
శ్రీ విష్ణు పురాణము 1.19.41 “తత్ కర్మ యన్న బంధాయ సావిద్యా యావిముక్తయే ఆయాసాయపరం కర్మ విద్యాన్యా శిల్పనైపుణం”( ఏ పని(కర్మ) అయితే మనకు సంసార బంధనము కాజాలదో అట్టిది మంచి కార్యము. ఎట్టి విద్య మోక్షమునకు దారి తీయునో అట్టిది ఉన్నతమైన విద్య. సంపద కోసము, సంతోషము కోసము చేయు పని దుఃఖమునకు హేతువు అగును. తక్కిన విద్య అంతా చెప్పులు కుట్టుటకు కావలసిన విద్యతో సమానమగును, అది కూడా జ్ఞానమే అయినప్పటికి ముముక్షత్వానికి దోహద పడేది కానిది) దీనితో ఆ భగవానుని తెలుపు మోక్షమునకు దారి తీయు జ్ఞానమే అసలైన జ్ఞానము అనియు తక్కిన నైపుణ్యము అంతయూ చెప్పులు కుట్టుటకు కావలసినటువంటిదే అగును అని ప్రతిపాదించడము అయినది.
భస్మాహుతి –
ముకుంద మాల 25 “అమ్నాయభ్యాసనాన్యరణ్యరుధితం వేద వ్రతాన్యన్వహం మేధశ్చేదఫలాని పూర్తవిధయ స్సర్వే హుతం భస్మని తీర్ధానా మవగాహనాని చ గజస్నానం వినా యత్పదద్వన్ద్వామ్భోరుహ సంస్మృతిర్విజయతే దేవస్స నారాయణః”(నారాయణుని పాదపద్మములను స్మరించకుండా వేదాధ్యయనము చేయడము అడవిలో చిక్కుకొని పెద్దగా రోధించడము లాగా నిరుపయోగమైనదే. (అట్టి మరపుతో) వేదములో చూపబడిన కర్మలు రోజూ ఆచరించినచో ఆరోగ్య క్షయమునకు దారి తీయును; బావి తవ్వడము మొదలగు దానాది కర్మలు ఆచరించుట అనునది బూడిదను యజ్ఞములో హవిస్సుగా ఇవ్వడము వంటిదే; గంగ మొదలగు నదులలో స్నానము ఆచరించుట అనునది ఏనుగు స్నానము వంటిదే; భగవానుని మరపుతో ఆచరించు కర్మానుష్ఠాములు యజ్ఞములో బూడిదను హవిస్సుగా ఇవ్వడము లాగా నిరుపయోగమైనదే.
శవ అలంకారము –
శ్రీ భాగవతం 10.18.12 “యస్యాఖిలామీవహభి స్సుమఙ్గళైర్వాచో విమిశ్రాగుణకర్మజన్మభిః ప్రాణన్తి కమ్పన్తి పునన్తి వై జగద్యాస్తద్వియుక్తా శ్శవశోభనామతాః”(అందరి పాపాలని తొలగించి శుభాలను కటాక్షించు కృష్ణుని గుణములు, కర్మలు మరియు అవతారములతో ఏకమైన పదాలు లోకాన్ని సజీవముగా మరియు ప్రకాశవంతముగా చేస్తాయని పెద్దలు చెప్పెదరు. తక్కిన పదాలు అన్నీ శవానికి చేసే అలంకారములతో సమానములు) అనియు “విష్ణు భక్తి విహీనస్య వేదచ్చాస్త్రం జపస్తపః అప్రాణస్యేవ దేహస్య మండనం లోకరంజనం”(విష్ణు భక్తి లేకుండా చేసే వేదాధ్యయనము, జపము, తపము మొదలగునవి లౌకిక వినోదము కోసము చేయు శవాలంకారము వంటిదే) అన్నట్టు భగవత్సంబంధము లేని వాడి మాటలు, విద్య, వృత్తములు శవమునకు చేయు అలంకారముల వంటివే.
విధవాలంకారమ్ –
“ప్రాదుర్భావై స్సురనరసమో దేవ దేవ స్తదీయా జాత్యా వృత్తైరపి చ గుణతస్తాదృశో నాత్రగర్వా కింతు శ్రీమద్భువన భవన త్రాణతోన్యేషు విద్యావృత్తప్రాయో భవతి విధవా కల్ప కల్పః ప్రకర్షః”(ఎలా అయితే ఆ సర్వేశ్వరుడు తన అవతారములలో దేవ, మనుష్య మొదలగు అవస్థలను స్వీకరించునో అదే విధముగా భాగవతులు కూడా విభిన్నమైన జన్మ, గుణ, వృత్తము వంటి అవస్థలను స్వీకరించెదరు. అందులో ఎట్టి లోపమూ లేదు. అటువంటి ఈ అవతారములు లోకరక్షణార్ధమునకై జరుగుట వలన అవి ఉత్క్రుష్టములైనవే. జ్ఞానము మరియు మంచి ప్రవృత్తిచే కలుగు గొప్పతనము విధవకు చేసే అలంకారము వంటిదే. విష్ణు భక్తి లేనందువల్ల వాటికి విలువ లేదు)అని చెప్పినట్టు జ్ఞానము, సంపదలో ఆధిక్యం చేత కలిగిన గొప్పతనము అనునది విధవాలంకారముతో సమానమైనవి అని జ్ఞానులు అయిన వారు వాటిని నిషేధించెదరు.
దీనితో భగవద్విషయ సంబంధములేని వర్ణాశ్రమములు, జ్ఞాన అనుష్ఠానములు హేయములు అని చెప్పడము చేత ఇంతక ముందు చెప్పబడిన తక్కువ జన్మ(ఆపకర్ష) ఇటువంటిది అని మనము అర్ధము చేసుకొనవచ్చును.
అడియేన్ పవన్ రమనుజ డసన్
మూలము : https://granthams.koyil.org/2024/07/19/acharya-hrudhayam-86-english/
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org