శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
శ్రీకృష్ణుడు ఏడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, ఒక అద్భుతమైన లీలను ప్రదర్శించాడు. ఆ లీలను మనం ఇప్పుడు అనుభవిద్దాం.
ఒక రోజు బృందావనంలో, గోపకుల పెద్దలు, ఒకస్థలంలో కూడి, ఒక ఉత్సవం గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన కృష్ణుడు వారిని అడిగాడు: “మీరు ఏ ఉత్సవం గురించి మాట్లాడుకుంటున్నారు?”. వారు “ఇది ప్రతి సంవత్సరం ఇంద్రునికి సమర్పించే పండుగ.” అని చెప్పారు. అప్పుడు కృష్ణుడు “ఎందుకు ఇంద్రునికి పండుగ చేయాలి?” అని అడిగాడు. అందుకు వారు “వర్షాన్ని ఇచ్చేది, మనకు సంపదను ప్రసాదించేది ఆయన కాబట్టి.” అని సమాధానం ఇచ్చారు. కృష్ణుడు “నేనే ఇక్కడ ప్రత్యక్షంగా ఉండగా, మరే దేవుడిని పూజించాలి?” అని ఆలోచించాడు, అలా ఆ చింతనే అతన్ని ఒక సంకల్పానికి దారితీసింది. అతను అన్నాడు: “మన గోవర్ధన పర్వతమే మనకు మేఘాలను ఆపి వర్షం కురిపిస్తుంది, పశువులకు పచ్చికను ఇస్తుంది, మనకు కూరగాయలు మరియు పండ్లు ఇస్తుంది. కాబట్టి మనం పర్వతానికే నైవేద్యం సమర్పిద్దాం.” అలా అందరూ కృష్ణుని మాట అంగీకరించారు.
ఒక్క రోజు నిర్ణయించబడింది. నిర్ణీత రోజున పట్టణంలోని అందరూ ఎన్నో రకాల భోజనాలతో నిండిన రథాలను తీసుకొని వచ్చి, గోవర్ధన పర్వతం ముందు ఆహార పర్వతం వలె వేసి నిలపారు. కృష్ణుడు వచ్చి వారికి శ్లాఘించి, “ఇప్పుడందరూ కన్నులు మూసుకోండి; నేను నైవేద్యం సమర్పిస్తాను.” అని అన్నాడు, వారు కన్నులు మూసుకున్నారు. కృష్ణుడు గోవర్ధనుడిగా రూపాంతరం చెంది, “అహం గోవర్ధనః అస్మి (నేను గోవర్ధన పర్వతాన్ని)” అంటూ ఆహారమంతా స్వీకరించాడు. వారు కన్నులు తెరిచినప్పుడు ఆహారం స్వీకరించబడింది అని చూసి; ఎంతో ఆనందపడ్డారు.
ఈ విషయం స్వర్గంలో నుండి గమనించిన ఇంద్రుడు తీవ్ర కోపంతో ఊగిపోయాడు. ఇలా సంప్రదాయాన్ని ఆపినందుకు కృష్ణుని పైన కోపం పెంచుకొని, తన ఆధీనంలోని మేఘాలకు బృందావనాన్ని ధ్వంసం చేసే భారీ వడగండ్ల వాన కురిపించమని ఆజ్ఞాపించాడు.
భారీ మేఘాలు బృందావనాన్ని చుట్టుముట్టాయి. వడగండ్లతో కూడిన భయంకర గాలివాన మొదలైంది. అది చూసి గోపాలకులు మరియు పశువులు భయంతో కృష్ణుని “ఇప్పుడు ఏమి చేయాలి?” అని శరణు కోరారు. అప్పుడు కృష్ణుడు వారిని రక్షించేందుకు గోవర్ధన పర్వతాన్ని చత్రం లాగా ఒకే చేత్తో ఎత్తాడు. అలా వారిపై ఒక్క వర్షపు చుక్క కూడా పడకుండా వారిని సంరక్షించాడు. ఆశ్చర్యపోయిన గోపాలకులు “నువ్వెవరు? దేవుడా? యక్షుడా? ఇంత పెద్ద పర్వతాన్ని ఒక చేత్తో ఎలా పట్టుకున్నావు?” అని అడిగారు. కృష్ణుడు చిరునవ్వుతో “నేను గోపాల బాలుడిని మాత్రమే. నమ్మలేకపోతే పర్వతం వదిలేస్తాను.” అని అన్నాడు. అని చెప్పగానే వారు భయంతో, “లేదు లేదు! అలాగే ఉంచు!” అన్నారు.
అలా ఏడు రోజుల పాటు కృష్ణుడు గోవర్ధనాన్ని ఎత్తి పట్టుకున్నాడు. ఈ దృశ్యం చూసిన ఇంద్రుడు తన తప్పు గ్రహించి, వర్షాన్ని ఆపేశాడు. కృష్ణుని వద్దకు వచ్చి విధేయతతో నమస్కరించి క్షమాపణ కోరాడు. తరువాత భగవత్ప్రశంసలతో కీర్తించాడు మరియు గోవింద పటాభిషేకం చేశాడు. ఈ విధముగా కృష్ణుడు ఇంద్రుని గర్వాన్ని తొలగించాడు.
ఈ లీలను అనేక ఆళ్వార్లు అద్భుతంగా వర్ణించారు. పేయాళ్వార్ తమ మూన్ఱాం తిరువన్దాదిలో “అవనే అరు వరైయాల్ ఆణిరైగళ్ కాత్తాన్ ” — కృష్ణుడే అరు (భారీ) పర్వతంతో పశువులను రక్షించాడు. పెరియాళ్వార్ వారి పెరియాళ్వార్ తిరుమొళి లో “పడంగల్ పాలవుముడై పాంబరైయన్ పడర్ భూమియై తాంగి కిడప్పవన్ పోల్ తడంగై విరాల్ అయిందుం మాలరా వైత్తు తామోతరన్ తాంగు తడవరై తాన్” — (శేషుడు తన పడగ విప్పి భూమిని మోసినట్టుగా, కృష్ణుడు తన చేతి వేలు విప్పి గోవర్ధనాన్ని మోశాడని). మరియు “అట్టు కువిసోరూ” అను పదిగంలో దీనిని ఎంతో వైభవంగా వర్ణించాడు. నమ్మాళ్వార్ల తిరువాయిమొళి లో “కున్ఱమెడుత్త పిరాన్ అడియారోడూమ్ ” అంటూ (గోవర్ధన పర్వతం ఎత్తిన అతని భక్తులతో) అని వర్ణించారు. తిరుమంగై ఆళ్వార్ తిరునెడున్దాణ్డకమ్ లో : “కల్లెడుత్తు కల్ మరి కాత్తాన్” — (పర్వతాన్ని ఎత్తి వడగండ్ల వాన నుండి రక్షించినవాడు) అని అన్నారు.
ఈ లీల లోనీ సారాంశం:
- భగవంతునిపై సంపూర్ణ విశ్వాసం ఉంచినవారిని, ఆయన ఏ విధంగానైనా రక్షిస్తాడు.
- గోవర్ధనమే రక్షకుడు అన్న మాటను నిజం చేయడానికి, వడగళ్ల వాన వచ్చిన సమయంలో ఆయన అదే పర్వతంతో రక్షించి ఆ మాటను నిజం చేశాడు.
- భగవంతుడు ప్రత్యక్షంగా ఉన్నప్పుడు, అతన్ని శరణు వేడిన భక్తులు, ఇతర దేవతలను పూజించటం, ఆయన ఇష్టపడడు.
- ఇంద్రుడు, ఒక్క దేవత మరియు భగవత్ భక్తుడు, తప్పు చేసిన ఇంద్రుడు బదులుగా భగవానుడే స్వయంగా పర్వతాన్ని ఎత్తాడు, దాని వల్ల ఇంద్రుడికి జ్ఞానం కలిగి, అన్ని మార్గాలు మూసుకుపోయి వచ్చిన అతన్ని చివరకు క్షమించాడు.
మూలం : https://granthams.koyil.org/2023/09/25/krishna-leela-20-english/
అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org