యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 67

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 66

జీయర్ శ్రీవైష్ణవులతో కలిసి తిరుమల చేరుకొని కొండ క్రింద ఆళ్వార్లను, నమ్మాళ్వారుని సేవించుకున్నారు. ఆ తర్వాత వారు తిరువాయ్మొళి నూఱ్ఱందాది 60వ పాశురము “ఉలగుయ్య మాల్ నిన్ఱ.… మగిళ్మాఱన్ తాళినైయే ఉన్ చరణాగ నెంజమే ఉళ్” (ఓ హృదయామా! లోక కల్యాణార్థం కొండపైన కొలువై ఉన్న తిరువేంకటేశ్వరునికి శరణాగతి చేసిన నామ్మాళ్వార్ల దివ్య పాదాలే నీకు ఆశ్రయం), తిరువాయ్మొళి నూఱ్ఱందాది 23వ పాశురము “ఒళివిలాక్కాలమెల్లాం… మిక్క నలం శేర్ మాఱన్ పుంగళలై నెంజే పుగళ్” (ఓ హృదయం! తిరువేంకటేశ్వరుని  అంతరాయం లేకుండ నిరంతరం సేవించిన నమ్మాళ్వార్ల తిరువడిని స్తుతించుము) అని పఠించారు. ఆ రాత్రికి అక్కడే బస చేసి, అక్కడి ప్రజలపై తన కృపను కురిపించారు. మరుసటి రోజు, “తిలదం ఉలగుక్కాయ్ నిన్ఱ” (ఈ లోకానికే అలంకారంగా నిలబడి) ఉన్న తిరువేంకటేశ్వరుని సేవించారు. తిరువాయ్మొళి 3-3-10 వ పాశురములో “మొయ్ త్త శోలై మొయ్ పూందడం తాళ్వరే” (దట్టమైన పొదలు, కోనేరులు ఉన్న కొండ లోయలు), పెరియ తిరుమొళి 1-9-2 వ పాశురములో “తేనేయ్ పొళిల్ శూళ్ తిరువేంగడం మామలై” (భ్రమరాలు విహరించే పూతోటలతో విస్తరించి ఉన్న తిరుమల), “అప్రాకృతమేయంచ సర్వరత్న మయం గిరిం హిరణ్యమయ మహాశృంగం పంచోపనిషదాత్మకం” (పంచ ఉపనిషత్తులతో నిండి ఉన్న తిరుమల, ఇది అప్రాకృతం), ఊహకందని రీతిలో మణులు ఒదిగి మేలిమి బంగారంగా మెరిసే కొండలు) అని ఆళ్వార్లు వర్ణించారు; తరువాత వారు తిరుమలైయాళ్వార్ (ఇక్కడ ఆళ్వార్ అనే పదం కొండల దివ్యత్వాన్ని సూచిస్తుంది) దివ్య, అద్భుత రూపాన్ని సేవించారు, శ్రీ వైకుంఠానికి నిచ్చెన వేసినట్లు కనిపించే కొండలను వారు ఎక్కారు. తేనే ప్రవహిస్తున్నట్లు కనిపించే నీటి ప్రవాహాలను, ఆకాశాన్ని అంటుకునేటంత ఎత్తైన తిరుమల శిఖరాలను, మెరిసే మెరుపులకు విశ్రాంతి చోటుగా కనిపించే కొండలను ఆస్వాదిస్తూ, పైకి వెళ్లే దారిలో కాట్టళగియ శింగర్ (నరసింహుడు) ని సేవించారు. వారు అక్కడి అరణ్యాలను అస్వాదిస్తూ, శ్రీవైకుంఠం వలె కనిపించే తిరుమాళ్ (శ్రీయః పతి) కి అత్యంత ప్రీతి అయిన చోటికి చేరుకున్నారు. నాన్ముగన్ తిరువందాది 47వ పాశురం నన్మణివణ్ణన్ (నీల మణి వర్ణ కలిగి ఉన్నవాడు) లో పేర్కొన్నట్లుగా, అరుదైన దృష్యాలను చూసి ఆశ్చర్యపోతూ ఆనందించారు. పట్టణ ప్రవేశ ద్వారాన్ని సేవించారు. అదే సమయంలో, తిరుమలలో ఉండే ఆలయ జీయర్లుతో కలిసి అనేక శ్రీవైష్ణవులు ఆలయ మర్యాదలతో వీరికి సాష్టాంగం చేసి స్వాగతం పలికారు. జీయర్ వారందరినీ నిత్యసూరులుగా భావించి, వారితో పాటు పట్టణ ప్రవేశం చేసారు. వైకుంఠ తిరువాసల్ (వైకుంఠ ద్వారం), అవావఱచ్చూళ్ందాన్ తిరువాసల్ (అవావఱచ్చూళ్ ద్వారం) మొదలైన అనేక ద్వారాల వద్ద వారు సాష్టాంగ నమస్కారం చేసారు. ప్రదక్షిణ మార్గంగా వెళ్లి, ‘ఇరామానుసన్’ అని పేరుగాంచిన అనంతాళ్వాన్ పూల తోటలను, దానితో పాటు అనేక పూతోటలను వారు దర్శించారు. తమ దివ్య మనస్సులో ఎంతో సంతోషపడి, తిరుక్కోనేరిలోన దివ్య స్నానమాచరించి, పన్నెండు ఊర్ధ్వ పుండ్రములను ధరించి, క్షేత్రాధిపతి అయిన వరాహ పెరుమాళ్ళను సేవించారు. పెరుమాళ్ తిరుమొళి 4వ పదిగం ఊనేఱు సెల్వత్తు [కులశేఖర ఆళ్వార్ తాను ఒక స్తంభంలా, లేదా ఆలయానికి వెళ్లే ఒక దారిలా లేదా ఆలయం లోపలికి వెళ్లే దారిలా లేదా ఆలయంలో ఒక మెట్టులా లేదా పక్షిలా ఇక్కడ ఒక అచిత్ వస్తువుగా జన్మించి పెరుమాళ్ళకు నిత్య సేవ చేయాలని కోరుకుంటున్నాను]. వారు కులశేఖరాళ్వార్ ఉదహరించిన వివిధ పక్షులు, స్తంభాలు మొదలైన సమస్థ అచిత్ వస్తువులన్నింటినీ సేవించారు. ఆలయ ప్రధాన గోపురం వద్ద సాష్టాంగం చేసి, ఆలయంలోకి ప్రవేశించి, రంగనాయక మండపం (తుర్కుల దండయాత్ర సమయంలో శ్రీరంగం నంపెరుమాళ్ బస చేసిన మండపం, అళగియ మణవాళ మండపం) సేవించారు. ఈ క్రింది శ్లోకములో వివరించబడింది.

శ్రీమతిమహద్వరాధీర చించాం కాంచనమయంచ బలిపీఠం
స్థానమదయామునేయం చంపకతరు సంపతం ప్రతీహారం
వినతాతనయ మహానస మణిమంటపం కనకమయ విమానవరం
పృతనాపతి యతిదుర్యౌ నరహరిమతనమత జానకీజానిం

(ప్రవేశ ద్వారం వద్ద ఉన్న బంగారు బలిపీఠాన్ని, ఆపై యమునైత్తుఱైవర్ అని పిలువబడే పుష్పక మంటపం, శెణ్బగ వృక్షం ఎదుట ఉన్న శెణ్బగత్తిరువాసల్ (దివ్య ద్వారము), గరుడ, దివ్య వంటశాల, తిరుమామణి మంటపం, ఆనంద విమానం, సేనై మొదలియార్ (విశ్వక్సేనులు), యతిరాజులు (రామానుజులు), నరసింహ స్వమి, ఆపై శ్రీ రాముని సేవించుము).

అతపునరనక మణిధ్యుతి కవచిత కమలనివాస భుజమధ్యం
కలయత కమల విలోచనం అంజన గిరి నిధిం అనజనం పురుషం

(నిష్కలంకుడు, తిరుమల కొండకు నిధి వంటివాడు, ఎర్రటి తామర పువ్వు వంటి దివ్య నేత్రాలున్నవాడు, అరుదైన మణులతో అలంకరిండిన దివ్య వక్ష స్థలమున్నవాడు, ఆ దివ్య వక్ష స్థలములో పిరాట్టి నిత్య నివాసముండే ఆ పరమ పురుషుడు తిరువేంటేశ్వరుని దివ్య దర్శనము కలుగుగాక.)

శరణమయం ఇత్యంగ్రిం నిర్ధిశ్య దక్షిణపాణినా
కరకిసలయం సవ్యం సవ్యోరుసీమ్ని సమర్పయన్
మణిగణమహోమగ్నే వక్షస్థలే తదధిందిరాం
భవతపిమత శ్రీమానస్మాగమస్థు పరంపదం

(అందరికీ ప్రియుడు, మోక్ష (వైకుంఠం) సాధనమైన తమ తిరువడిని తమ కుడి హస్థముతో చూపిస్తూ, లేత ఆకు వంటి తమ దివ్య ఎడమ హస్థమును తమ దివ్య ఎడమ తొడపైన ఉంచి, దివ్య మణుల తేజస్సుతో దేదీప్యమానంగా ప్రకాశించే తమ వక్ష స్థలములో పెరియ పిరాట్టి (శ్రీమహాలక్ష్మి) నిత్య నివాసముండే ఆ తిరువేంకట శ్రీనివాసుడే మన అత్యున్నత లక్ష్యం కావాలి), వారు శాస్త్ర రీతిలో శ్రీ బలిపీఠం, యమునైత్తుఱైవన్ అని పిలువబడే దివ్య పుష్ప మంటపం, శెణ్బగ ద్వారం, గరుడ, దివ్య వంటశాల, తిరుమామణి మంటపం, దివ్య ఆనంద విమానం తరువాత విష్వక్సేనులను దర్శించుకున్నారు. ఇరామానుస నూఱ్ఱందాది పాశురములు ‘నిన్ఱవణ్ కిర్తియుం నీళ్ పునలుం నిఱైవేంగడ ప్పొఱ్కున్ఱముం (నిత్య కీర్తి, అందమైన సరస్సులు, కొండలున్న తిరువేంకడం), ఇరుప్పిడం వైగుందం వేంగడం (భగవానుని నివాసములైన శ్రీ వైకుంఠం, తిరుమల మొదలైన) పఠించి ఎంబెరుమానారుని సేవించారు. ఎంబెరుమానారుని అనుమతితో అక్కడి నుంచి ముందుకు వెళ్లి, ‘తూణాయ్ అదనూడు అరియాయ్’ పాశురము పఠించి తిరువెంగడత్తరి (నరసింహ స్వామి) ని దర్శించుకున్నారు. అక్కడి నుండి వెన్ఱుమాలైయిట్టాన్ తిరుమంటపం చేరుకొని, తాయే తందై…. నాయేన్ వందైందేన్ నల్గియెన్నైయాట్కొండు అరుళే’ అనే పాశురమును పఠించి సాష్టాంగము చేసి, వారు గర్భగుడి లోపలికి ప్రవేశించి, చక్రవర్తి తిరుమగన్ (శ్రీరాముని) తిరువడి వద్దకు చేరుకున్నారు. ఆ తరువాత వారు కులశేఖర పడి (తిరువేంకటేశ్వరిని విగ్రహం ఎదుట ఉన్న మెట్టు) వద్దకు చేరుకుని, తిరువాయ్మొళి ‘అడిక్కీళ్ అమర్ న్దు పుగుందు’ పాశురమును పఠించి పెరుమాళ్ళకు మంగాళాశాసనములు చేశారు.

మూలము: https://granthams.koyil.org/2021/09/23/yathindhra-pravana-prabhavam-67-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment