యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 93

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 92

ఆచర్య హృదయం గ్రంథానికి వ్యాఖ్యానం వ్రాసిన జీయర్ 

జీయర్ తమ శరీరం బలహీనతను కూడా లెక్కచేయకుండా, ఆచార్య హృదయం (పిళ్ళై లోకాచార్యుల తమ్ముడు అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ రచించిన రహస్య ప్రబంధం) గ్రంథానికి వ్యాఖ్యానం వ్రాయాలని సంకల్పించారు. వారి మెడ భాగం నొప్పి కారణంగా, తమ ఆసనంపై పడుకుని వ్యాఖ్యానం వ్రాసేవారు. అది చూసి, కందాడై అణ్ణన్ “దేవర్వారు ఎందుకు అంత శ్రమ తీసుకుంటున్నారు?” అని ప్రశ్నించగా, జీయర్ ప్రతిస్పందిస్తూ “అడియేన్ దేవర్వారి పుత్రులు మనుమల కోసం ఈ కృషి చేస్తున్నాను” అని చెప్పి వ్యాఖ్యానం పూర్తి చేశారు.

జీయర్ను ఆశ్రయించిన ఏట్టూర్ శింగరాచారియర్; ఎనిమిది గోత్రముల క్రమం

ఆ సమయంలో, పెరియ తిరుమలై నంబి దివ్య వంశస్థులైన ఏట్టూర్ శింగరాచారియర్ [రామానుజుల పంచ ఆచార్యులలో ఒకరు, వారి మేనమామ], జీయర్ మహిమను గురించి విని, తన అకించన్యం [తనకంటూ ఒకటి ఉన్నదని చెప్పుకోడానికి ఏమీ లేకపోవడం], అనన్య గతిత్వం [ఇక వేరే ఎక్కడికి వెళ్ళే ఆస్కారం లేని] (ఇవి ఒక వ్యక్తి శరణాగతులు కావడానికి కావలసిన ప్రాథమిక అవసరాలు) తన అహంకారములు సిగ్గులను విడిచిపెట్టి, జీయర్ తిరువడి యందు ఆశ్రయం పొందాలని వచ్చెను. ఏట్టూర్ శింగరాచారియర్ సమర్పించిన సంపదతో, తిరునగరిలో ఆళ్వార్ కోసమై దివ్య గోపురం మరమ్మత్తు కైంకర్యాన్ని జీయర్ చేపట్టారు. ఆ కైంకర్యాన్ని పూర్తి చేయడంలో కొంత నిధుల కొరత ఏర్పడినప్పుడు, జీయర్ నాయనార్ [జీయర్ పూర్వాశ్రమ మనవడు] ఆ కొరతను సరిచేసి, పనిని పూర్తి చేశారు. తరువాత జీయర్ పొళిప్పాక్కం నాయనారుకి కబురు పంపి, సప్త గోత్ర నిబంధన (ఏడు వంశీయులను క్రమబద్ధం చేయడం), ఆ ఏడు వంశాలకు ఏట్టూర్ శింగరాచారియర్ ను కూడా చేర్చి, అష్ట గోత్ర సంఖ్యగా మార్చారు. ఈ క్రింది శ్లోకంలో చెప్పినట్లు…

జగత్రక్షయాపరో’నందో జనిష్యత్యపరోమునిః
తదారశ్యాస్ సదాచరాస్ సాత్వికాస్ తత్వ దర్శినః

(లోక సంరక్షణలో మునిగి ఉన్న తిరువంతాళ్వాన్ (రామానుజ మునిగా అవతారం కాకుండా) మరొక మునిగా అవతరించబోతున్నాడు (అందరి అభ్యున్నతి కోసం ధ్యానం చేసేవాడు); వారి ఆశ్రయం పొందిన వారు (ఆ సమయంలో) మంచి నడవడిక, సత్గుణాలను కలిగి ఉంటారు, తత్వార్థాలను సరిగ్గా తెలుసుకుంటారు), జీయర్ ఆశ్రయం పొందిన వ్యక్తులు సత్ప్రవర్తన కలిగి, కైంకర్యములలో నిమగ్నమై ఉన్నారు, మన తత్వశాస్త్రార్ధాలను పూర్తిగా తెలుసుకుంటున్నారు, నిరంతరం జీయర్ను ధ్యానిస్తూ ఉన్నారు.

అష్టదిగ్గజులు

ఈ పాశురములో చెప్పబడినట్లు…

పారారుమంగై తిరువేంగడముని భట్టర్పిరాన్
ఆరామమ్ శూళ్ కోయిల్ కందాడై అణ్ణన్ ఎఱుంబియప్పా
ఏరారుమప్పిళ్ళై అప్పిళ్ళార్ వాది భయంకరరెన్
పేరార్ంద దిక్కయన్ జూళ్ వరయోగియై చ్చిందియుమే

జీయరుకి ఎనిమిది ప్రాథమ శిష్యులు ఉండేవారు. వారు వానమామలై జీయర్, తిరువెంగడం జీయర్, భట్టర్పిరాన్ జీయర్, కందాడై అణ్ణన్, ఎఱుంబియప్పా, అప్పిళ్ళై, అప్పిళ్ళార్, ప్రతివాధి భయంకరం అణ్ణ. ఈ అష్టదిగ్గజులు కాకుండా మరి కొందరు తిరుప్పాణాళ్వార్ దాసర్, ఏట్టూర్ శింగరాచార్యర్, వరం తరుమ్ పెరుమాళ్ పిళ్ళై, మేనాట్టు త్తోళప్పర్, అళగియ మణవాళ ప్పెరుమాళ్ నాయనార్, జీయర్ నాయనార్, అణ్ణరాయ చక్రవర్తులు మొదలైనవారు మునుపు చూసిన ‘జగత్రక్షయాపరో నందో…….తత్వ దర్శినః’ శ్లోకానికి అణుగుణంగా ఉన్న మహా పురుషులు, సత్ ప్రవర్తనతో, దర్శన సూత్రాల అనుసంధానం చేస్తూ లోకోద్ధారణకై జీవిస్తుండేవారు.

శిష్యులకు కైంకర్యం

పైన పేర్కొన్న శిష్యులలో, అష్టదిగ్గజులతో సహా, ఈ కింద పేర్కొన్న వాళ్ళు జీయర్ తిరువడి వద్ద నిత్య కైంకర్యాలు చేస్తుండేవారు:

  1. వానమామలై జీయర్ – జీయర్ ప్రారంభ రోజుల నుండి భక్తి ప్రపత్తులతో నిత్యం జీయరుతో ఉన్న ఒక పేరుగాంచిన వ్యక్తి.
  2. కందాడై అణ్ణన్ – ‘రామానుజ మునిద్రస్య శ్రీమన్ దాశరథిర్యతా’ అనే వ్యాక్యంలో రామానుజులకు ముదళియాండాన్ ఎలాగో, అలాగే, అణ్ణన్ జీయర్ పట్ల పరమ భక్తితో ఉండేవారు. జీయర్ భద్రతను చూసుకునే కైంకర్యం చేసేవారు.
  3. ఎఱుంబియప్పా – ‘దేవుమఱ్ఱఱియేన్’ (మరొక దేవుణ్ణి ఎరుగను) అని అన్నట్లు, రామానుజుల పట్ల వడుగ నంబి ఎలా ఉండేవారో, అల్లగే జీయర్ పట్ల నిష్ఠతో ఉండేవారు.
  4. ప్రతివాది భయంకరం అణ్ణన్ – రామానుజులకు కూరత్తాళ్వాన్ ను పోలి; వీరు ప్రజలను ఇతర తత్వాల బారి నుండి దూరంగా ఉంచడం, శ్రీభాష్యంలో జీయరుకి నిరంతర సహచరుడిగా ఉండేవారు.
  5. సేనై ముదల్లియార్ అణ్ణన్, శఠగోప దాసర్, అప్పిళ్ళై, తిరుప్పాణాళ్వార్ దాసర్ – ఈ శిష్యులందరూ జీయరుకి తిరువాయ్మొళి దివ్య ప్రబంధ సహచరులు. ప్రత్యేకించి, అప్పిళ్ళై జీయర్ ఆదేశానుసారం, ఐదు తిరువందాదులకు [ముదల్, ఇరండాం, మూన్ఱాం, నాన్ముగ, పెరియ తిరువందులు] గమనికలు వ్రాసారు; అదీ కాకుండా యతిరాజ వింశతి (జీయర్ స్వరపరచినది) కి వ్యాఖ్యానం కూడా రాశారు.
  6. అప్పిళ్ళార్ – వీరు మఠ కార్యనిర్వహణ విషయాలు చూసుకునేవారు. కాల రితులకు అణుగుణంగా కూరగాయలు, పాలు, నెయ్యి, పెరుగు, పప్పులు, ఉప్పులు మొదలైన వంటకు సంబంధించిన సరుకుల ఏర్పాట్లను చూసుకునేవారు.
  7. భట్టర్పిరాన్ జీయర్ – రామానుజులకు ఎంబార్ లాగానే, జీయర్ దివ్య పాదాలకు నీడగా భట్టర్పిరాన్ జీయర్ ఉండేవారు. జీయరుని వీడి ఉండలేక, వారికే అన్ని సేవలు చేస్తూ, జీయర్ తప్పా మరేమీ ఎరగని వారు.
  8. జీయర్ నాయనార్ – ఒక యువరాజు వలె అందరికీ నచ్చినవాడు; రామానుజులకు తిరుక్కురుగై ప్పిరాన్ పిళ్ళాన్ వలె, వీరు జీయరుకి ఎంతో ఆసరాగా ఉండేవారు.

మూలము: https://granthams.koyil.org/2021/10/19/yathindhra-pravana-prabhavam-93-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment