ఆచార్య హృదయం – అవతారిక

ఆచార్య హృదయం

<< తనియన్లు

శ్రియః పతి సర్వ స్వామి అయిన సర్వేశ్వరుడు (శ్రీమన్నారాయణుడు) నిరతిశయ ఆనందమయమగు శ్రీవైకుంఠమున(పరమపదమున) అసంఖ్యాకములైన నిత్య నిర్మల జ్ఞానాది గుణములు కలిగిన నిత్యసూరుల(ఎన్నడూ సంసార దోషము/వాసన లేని వారు – అనంత , గరుడ, విష్వక్సేనాదులు) చే అన్ని కాలములలో సేవింపబడుతుండగా, లీలా విభూతి (బద్దులైన సంసారులు)లో వారు కూడ నిత్యాసూరుల వలే తన పాదపద్మములను సేవించి ఆనందించుటకు యోగ్యత కలిగి ఉన్నప్పటికీ వారు కష్టపడుతున్న వైనము చూసి దుఃఖించి ఈ బధ్ధ జీవులను కూడా ఉజ్జీవింప (తన వైపు తిప్పుకొనుటకు) చేయవలెనను సంకల్పముతో ఎంతో ప్రేమతో ఎన్నో విధములుగా పరితపించుచుండెను.

  • ప్రళయ కాలమున అచేతన పదార్థముల వలే దేహేంద్రియములు లేకుండ పడి ఉన్న చేతనులను చూసి రంగరాజ స్తవం 2.41 “అచిదవిశేషితాన్ ప్రళయసీమని సంసరతః కరణకళేబరైర్ఘటయితుం దయమానమనాః వరద! నిజేచ్చయైవ పరవానకరోః ప్రకృతిం మహాదభిమానాభూతకరణావళికోరకిణీమ్” (ఓ వరదా! ప్రళయ కాలములో అచేతనము కంటే తేడా లేనివారై సంసారములో బాధపడుతున్న జీవులను ఇంద్రియములతో, శరీరములతో చేర్చాలని మనస్సులో దయ కలిగిన వాడివై నీ సంకల్పముతో మహాన్ – అహంకారం – పంచభూతాలు – ఇంద్రియాలు అయ్యేట్లుగా చేశావు). దేహేంద్రియములు లేక అచేతనం వలె పడివుండు కారణము చేత భోగము, మోక్షము పొందుటకు సాధ్యము కాని స్థితిలో దయ కలవాడై తనను (తన పాదపద్మములును) ఆశ్రయించుటకు సాధనా భూతములైన దేహేంద్రియములను, ఙ్ఞానమును, ప్రవృత్తి, నివృత్తిల యందు సామర్ధ్యమును కలుగజేసెను.
  • పరమ కరుణతో , శ్రీ రంగరాజ స్తవము 2.1 లో చెప్పి నట్లు “మానం ప్రదీపమాన కారుణికో దదాతి” (కరుణా సంపన్నుడైన భగవానుడు దీపం వంటి వేద శాస్త్ర ప్రమాణమును అందించాడు). త్యాజ్య (విడువ వలసినది), ఉపాదేయ(పొంద తగినది) జ్ఞాన విచక్షణము ఈ చేతనులకు వేదము ద్వారా అందించెను.
  • – అటు పిమ్మట అంతర్యామిగా మనువు, ఋషుల లో వేంచేసియుండి పరమ కరుణతో స్మృతి, ఇతిహాస, పురాణములను లోకమున ప్రకాశింపజేసెను. ఈ శాస్త్రములు దేహేంద్రియములు కలిగిన జీవుల ఉద్ధరణకై ఉన్నవి.
  • అటువంటి శాస్త్రమును అభ్యసించుటకు ఎన్నో విధములైన పరిమితులు ఉండడము చేత మఱియు ఎంతో కఠోర శ్రమ వలన కానీ దర్శింప శక్యము కాని క్లేశమును కలిగి ఉండుట కారణము చేత భగవానుడు తన మనస్సులో ఇలా తలచినవాడై ఏ యోగ్యతా లేని
    జీవుల స్థితికి సరిపడు అష్టాక్షరీ మంత్ర రూపమగు బ్రహ్మవిద్యను ప్రకాశింపజేసెను.
  • అటువంటి అష్టాక్షరీ కూడా ఈ చేతనులను ఉద్ధరించుటకు నిరుపయోగము అవడము చేత ఎలా అయితే రాజు తాను అనుకున్న కార్యము తన సందేశము ద్వారా నెరవేరనప్పుడు తానే స్వయముగా రంగములోకి దిగునో అదే విధముగా తానే చేతనులను ఉజ్జీవింపదలచి రామ, కృష్ణాది అవతారములను దాల్చెను.
  • అలా పలు అవతారాలు దాల్చిననూ ప్రయోజనము లేక తన లక్షణములు ఈ చేతనులైన జీవుల కంటే వేరగుట చేత వీరిని ఉద్ధరించడం శక్యము కాదని దలచి ఈ జీవులను ఉజ్జీవించుటకై వేరొక జీవులచే ఉద్ధరింపదలచిన వాడై దయతో అట్టి ఉత్క్రుష్టమైన వారి కోసం వెదుకలాడగా ఆ స్వామి కృపకు ఎవరూ పాత్రులు అవ్వలేదు, అంతట దక్షిణ దేశమున “మాఱి మాఱి అనేక జన్మలు పొందిన వారైన” నమ్మాళ్వారుల పైన తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణాలు ప్రసరించిన కారణమ చేత అట్టి నమ్మాళ్వారులకి దివ్య జ్ఞాన భక్తులు పరమాత్మ విషయమున కలిగెను.
  • అలా లభించిన దివ్య జ్ఞాన భక్తి వలన ఎమ్పెరుమానుడి స్వరూప రూప గుణ విభూతులను అనుభవించి, అట్టి అనుభవము యొక్క ప్రవాహము ఆ సర్వేశ్వరుని అనుగ్రహము చేత నమ్మాళ్వారుల తిరువాక్కులో నుండి ఛందోబద్ధమైన, సర్వలక్షణోపేతమైన తిరువాయిమొళి అను ప్రబంధము ప్రకాశించెను.( “శ్రీ రామాయణం బాలకాండ 2.15 మా నిషాద – చతుర్ముఖ బ్రహ్మ అనుగ్రహము వలన శ్రీ వాల్మీకి వాక్కుల నుండి ప్రకాశించబడెను”).

ఆచార్య హృదయము అను పేరు పెట్టుటకు కారణము

ఈ తిరువాయిమొళి ద్రావిడ భాషలో విస్తారముగా అనేక రహస్యార్ధాలను ప్రతిపాదించుట చేత ఇది అందరికీ సులభతరంగా అర్ధమగుటకు కష్టమని గ్రహించిన పరమ కారుణికులైన శ్రీ అళగియ మనవాళ ప్పెరుమాళ్ నాయనార్లు అట్టి విశేషార్ధాలను, ఆళ్వారుల తిరువుళ్లమును (అంతరంగమును) దర్శించి పూర్వాచార్య సంప్రదాయ అర్థములు అందరికి తెలిసేలా సంగ్రహముగాను విస్తృతముగాను ఈ “ఆచార్య హృదయము” అను ప్రబంధమును కృప చేసినారు.

“ఆద్యస్య నః కులపతేః ” అన్నట్లు వైదిక పరంపరలో ప్రధమాచార్యులగు నమ్మళ్వారులు ప్రసాదించిన దివ్య ప్రబంధములలో వారి తిరువుళ్ళమున ఉండు విశేషార్ధములను తెలియచెప్పుటకు ఈ గ్రంధమునకు “ఆచార్య హృదయము” అని పేరుపెట్టెను. నాయనార్లు దివ్య ప్రబంధమును ఆధారముగా చేసుకొని ఈ గ్రంధమును నిర్మించుటకు గల కారణము ఏమి అనగా , యాధాత్మ్య జ్ఞానము కలిగిన ఆళ్వారులు ప్రసాదించినట్టి దివ్య సూక్తులు అవడం చేత మరియు ఒక పనిమంతుడి చేత కూర్చబడిన ముత్యాలహారము ఎలా అయితే గొప్ప విలువని సంతరించుకుంటుందో అదే విధముగా బుద్ధి కుశలత కలిగిన నాయనార్లు ఈ ప్రబంధమున సేకరించి అమర్చిన శబ్దములు వాటి అర్థముల కంటే మధురముగా నుండును. కావున ఈ ఆచార్య హృదయమను ప్రబంధము ఆళ్వారుల పాశురముల యందు అభినివేశము కలిగిన వారికి మనోరంజకముగా ఉండును.

అడియేన్ పవన్ రామనుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/02/23/acharya-hrudhayam-avatharikai-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment