కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 54 – సహస్రనామం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి

<< 53 – మహాభారత యుద్ధం భాగం – 1

మహాభారతంలో, శ్రీకృష్ణుడు ఉపదేశించిన శ్రీమద్భగవద్గీత ఎంతో ముఖ్యమైనది. అలాగే శ్రీకృష్ణుని మహిమను తెలియజేసే శ్రీ విష్ణు సహస్రనామం కూడా అత్యంత ముఖ్యమైన భాగం. ఇప్పుడు దాని గురించి అనుభవిద్దాం.

భీష్ముడిని అంపశయ్యపై పడుకోబెట్టిన అర్జునుడు, కృష్ణుని ఆజ్ఞ ప్రకారం యుద్ధం చేసినప్పటికీ, చాలా దుఃఖించాడు. వంశంలో పెద్దవాడైన, మహోన్నత గుణాలు కలిగిన, భగవంతునిపై అపార భక్తి కలిగిన భీష్ముడిని తాము ఓడించామని భావించి పాండవులు విచారంలో మునిగిపోయారు. అప్పుడు శ్రీకృష్ణుడు వారిని ఓదార్చి, యుద్ధంలో ఇటువంటి సంఘటనలు సహజమేనని చెప్పాడు.

ఆ రాత్రి, శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుని మరియు అతని సోదరులను పిలిచి, “మీరు భీష్ముని వద్దకు వెళ్ళి పరమ తత్త్వాలను తెలుసుకోండి” అని చెప్పాడు. వారు కృష్ణుడిని వెంట తీసుకొని భీష్ముని వద్దకు వెళ్ళారు. భీష్మునికి నమస్కరించి, “పరమాత్మ ఎవరు? పరమ పురుషార్థం ఏమిటి? దానిని పొందే ఉపాయం ఏమిటి?” వంటి ప్రశ్నలను అడిగారు. అప్పుడు భీష్ముడు దేవకీ నందనుడు అయిన శ్రీకృష్ణుని చూపించి ఇలా చెప్పాడు: “శ్రీకృష్ణుడే పరమాత్మ. ఆయనకు కైంకర్యం చేయడమే పరమ పురుషార్థం. ఆయన వెయ్యి దివ్య నామాలను జపించడం అత్యుత్తమ ఉపాయం.” ఆ తరువాత భీష్ముడు శ్రీ విష్ణు సహస్రనామాన్ని ఉపదేశించి, శ్రీకృష్ణునికి ఆనందాన్ని కలిగించాడు. పాండవులు కూడా కృష్ణుని మహిమను స్పష్టంగా గ్రహించారు.

ఆళ్వార్లు అనేక చోట్ల సహస్రనామ మహిమను ప్రకటించారు:

  • పెరియాళ్వార్ తమ తిరుప్పల్లాండులో ఇలా అంటారు: “తొండై కులతిలుల్లీర్ వందు అడితోళుదు ఆయిర నామం సొల్లి” (దాస్యకులంలో ఉన్నవారలారా! రండి, అచ్యుతుని తిరువడిని నమస్కరించి, ఆయన వెయ్యి దివ్యనామాలను కీర్తించండి.)
  • ఆండాళ్ తమ నాచ్చియార్ తిరుమొళిలో ఇలా ప్రార్థిస్తుంది: “నామం ఆయిరం ఏత్త నిన్ఱ నారాయణ!” (వెయ్యి దివ్యనామాలతో స్తుతింపబడుతున్న నారాయణా!)
  • నమ్మాళ్వార్ తమ తిరువాయ్మొళిలో ఇలా అంటారు: “ఓరాయిరమాయ్ ఉలాగేళాలిక్కుం పేర్ ఆయిరం కొండదోర్ పీడుడైయన్” (ప్రపంచంలోని చేతనాచేతన సమస్తాన్ని వెయ్యి విధాలుగా రక్షించే మహిమాన్వితమైన వెయ్యి దివ్యనామాలను కలవాడు.)
  • తిరుమంగై ఆళ్వార్ తమ పెరియ తిరుమొళిలో ఇలా అంటారు: “పల్లియిల్ ఓది వంద తన్ సిఱువన్ వాయిల్ ఓరాయిర నామం” (హిరణ్యకశిపుని కుమారుడైన ప్రహ్లాదుడు, పాఠశాలలో చదివి వచ్చి, తన పవిత్రమైన నోటితో సర్వేశ్వరుని వెయ్యి నామాలను జపించేవాడు.)

శ్రీ పరాశర భట్టర్ స్వామి సహస్రనామానికి అత్యంత విశదమైన వ్యాఖ్యానాన్ని రచించారు.

సంఘటనలోని సారాంశం:

  • “విష్ణు సహస్రనామం” అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. “సహస్రనామం” అని చెప్పినప్పుడే అది విష్ణు సహస్రనామాన్నే సూచిస్తుంది.
  • కలియుగంలో భగవంతుని చేరడానికి తిరునామ సంకీర్తనమే ఉత్తమ ఉపాయమని శాస్త్రాలు చెప్పినప్పటికీ, శ్రీవైష్ణవులు తిరునామ సంకీర్తనాన్ని ఉపాయంగా భావించి చేయరు. వారు దానిని కైంకర్యంగా మాత్రమే ఆచరిస్తారు. ఎందుకంటే జీవాత్మ యొక్క స్వరూపానికి పూర్తిగా అనుకూలమైన ఏకైక ఉపాయం భగవంతుడే. అందువల్ల భగవంతుడిని తప్ప మరేదీ ఉపాయంగా అంగీకరించబడదు.

మూలం : https://granthams.koyil.org/2023/10/30/krishna-leela-54-english /

అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment