శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః

భీష్ముని పతనం, తరువాత కౌరవుల సేనాధిపతిగా ద్రోణుడు నియమితుడయ్యాడు. యుద్ధం తీవ్రంగా కొనసాగింది. ప్రతిరోజూ అనేకమంది వీరులు మరణించారు.
భీముడు మరియు హిడింబికి జన్మించిన ఘటోత్కచుడు యుద్ధరంగానికి వచ్చి కౌరవ సైన్యానికి గొప్ప భయంగా మారాడు. చివరికి కర్ణుడు అతనిని సంహరించాడు.
తరువాత అర్జునుడు మరియు సుభద్రలకు జన్మించిన అభిమన్యుడు అపూర్వమైన పరాక్రమంతో యుద్ధం చేశాడు. అతనిని సంహరించేందుకు కౌరవులు ఒక పెద్ద కుట్ర పన్నారు. ద్రోణుని నాయకత్వంలో వారు చక్రవ్యుహాన్ని ఏర్పాటు చేశారు. అభిమన్యుడుకి చక్రవ్యుహంలోకి ప్రవేశించడం తెలిసి ఉండేది, కానీ దానిలోనుండి బయటకు రావడం తెలియదు. యుధిష్ఠిరుడు మొదలైన వారు “మేము నీ వెంట వచ్చి నీకు తోడ్పడతాము” అని ధైర్యం చెప్పి అతనిని లోపలికి పంపారు. ఈ విధంగా అతనిని చక్రవ్యుహంలోకి రప్పించి, అనేక మంది మహారథులు కలిసి అతనిని అన్యాయంగా సంహరించారు. అతనికి సహాయం చేయడానికి వచ్చిన యుధిష్ఠిరుడు మొదలైన వారిని అనేక మంది యోధులు అడ్డుకున్నారు. అభిమన్యుని వధలో జయద్రథుడు ముఖ్య పాత్ర పోషించాడు.
ఇదంతా జరుగుతున్న సమయంలో అర్జునుడు అక్కడ లేడు. తిరిగి వచ్చిన తరువాత, తన కుమారుడు అభిమన్యుడు వీరోచితంగా పోరాడి చివరికి పిరికితనంతో చంపబడ్డాడని తెలుసుకున్నాడు. అతడు తీవ్రమైన శోకంతో, కోపంతో నిండిపోయాడు. “రేపు సూర్యాస్తమయానికి ముందే అభిమన్యుని మరణానికి ప్రధాన కారణమైన జయద్రథుడిని సంహరిస్తాను; లేకపోతే నేనే అగ్నిప్రవేశం చేస్తాను” అని ప్రతిజ్ఞ చేశాడు.
మరుసటి రోజు యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచే కౌరవులు అర్జునుడు జయద్రథుని దగ్గరకు చేరకుండా అడ్డుకున్నారు. సూర్యాస్తమయం సమీపించింది. ఆ సమయంలో కృష్ణుడు తన సుదర్శన చక్రంతో సూర్యుణ్ణి కప్పివేశాడు. అందరికీ సూర్యాస్తమయం అయిపోయినట్లు కనిపించింది. దుర్యోధనుడు జయద్రథుని బయటకు తీసుకొచ్చి, “అర్జునా! ఇప్పుడు నీవు ఎప్పుడు అగ్నిప్రవేశం చేస్తావు?” అని ఎగతాళి చేశాడు. అప్పుడే కృష్ణుడు తన చక్రాన్ని తొలగించి, “ఇప్పుడు జయద్రథుని తలను బాణంతో ఖండించి, అది అతని తండ్రి చేతులపై పడేలా చేయి” అని అర్జునునికి ఆజ్ఞాపించాడు. అర్జునుడు అలాగే చేశాడు. జయద్రథుని తల అతని తండ్రి చేతులపై పడింది. అది ఏమిటో తెలియక అతను దానిని నేలపై పడవేయగానే, అతడు కూడా వెంటనే మరణించాడు.
ఈ విధంగా కృష్ణుడు అర్జునునిపై అపారమైన కృప చూపి, అభిమన్యుని వధకు ప్రతీకారం తీర్చుకునేలా చేశాడు.
ఈ సంఘటనను ఆళ్వార్లు తమ పాశురాలలో ఆనందంగా అనుభవించారు :
- పోయ్‌గై ఆళ్వార్ తమ ముదల్ తిరువందాదిలో ఇలా అన్నారు: “ముయంగు అమరుళ్ తేరాళియాల్ మఱైత్తదు ఎన్ నీ తిరుమాలే పోరాళి కైయాల్ పొరుదు” (ఓ శ్రీమన్నారాయణా! మహాభారత యుద్ధంలో నీ చేతిలోని చక్రంతో సూర్యుణ్ణి ఎందుకు కప్పివేశావు?)
- తిరుమళిశై ఆళ్వార్ తమ నాన్ముగన్ తిరువందాదిలో ఇలా అన్నారు: “వెంగదిరోన్ మాయప్పొళిల్ మఱైయ తేరాళియాల్ మఱైత్తారాల్” (భగవాన్ తన చక్రంతో సూర్యుణ్ణి కప్పి, ప్రపంచమంతా చీకటిగా చేశాడు.)
- తిరుమంగై ఆళ్వార్ తమ పెరియ తిరుమొళిలో ఇలా అన్నారు: “పాళియాల్ మిక్క పార్థనుక్కు అరుళి పగలవన్ ఒళికెడా పగలే ఆళీయాల్ అన్ఱు అంగు ఆళియై మఱైత్తాన్ అరంగమా నగర్ అమర్నదానే” (శ్రీరంగంలో విరాజిల్లే శ్రీరంగనాథుడు, మహాపరాక్రమశాలి అర్జునునిపై కరుణ చూపి, పగటిపూటనే తన చక్రంతో సూర్యుని కాంతిని మరుగుపరచాడు).
ఈ సంఘటనలోని సారాంశం:
- సుదర్శన చక్రం సూర్యునికంటే ఎక్కువ తేజస్సు కలిగినది. అందువల్ల భగవాన్ దానితో అందరి దృష్టిని ఆవరించి, సూర్యాస్తమయం జరిగినట్లు కనిపించేలా చేశాడు.
- జయద్రథుడు తప్పకుండా సంహరించబడాలి. జయద్రథుని తలను నేలపై పడవేసినవాడు మరణిస్తాడనే శాపం ఉండేది. అందువల్ల అర్జునుడికి ఏ అపాయం కలగకుండా, జయద్రథుని తండ్రి చేతులపై ఆ తల పడేలా చేసి, భగవాన్ అత్యంత చాతుర్యంతో ఈ కార్యాన్ని పూర్తి చేశాడు.
మూలం : https://granthams.koyil.org/2023/10/31/krishna-leela-55-english/
అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org