శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
కృష్ణుడి మరో అద్భుతమైన లీల “కుడక్కూత్తు”. కుడక్కూత్తు అంటే కుండలు చేత పట్టుకొని, నడుముకు డోలు కట్టి, దాన్ని వాయిస్తూ నృత్యం చేయడం. సాధారణంగా ఇది చవుటి (నాలుగు దారుల కూడలి) వద్ద చేస్తారు, అందరూ చూడటానికి, ఆనందించడానికి. ఇది గోపజనాలకు ఎంతో ప్రియమైన వినోదం. మన పూర్వాచార్యుల వ్యాఖ్యానాల్లో ఇలా చెప్పబడింది: “బ్రాహ్మణులకు సంపద ఎక్కువైతే వారు యాగాలు చేస్తారు; గోపజనాలకు సంపద ఎక్కువైతే వారు కుండ నృత్యం చేస్తూ ఆనందిస్తారు.”
కృష్ణుడు జన్మించేముందే నందగోపుడు ఈ నృత్యంలో నిపుణుడు. కృష్ణుడు పుట్టిన తర్వాత ఆయన మరింత నైపుణ్యం పొందాడు. కృష్ణుడు, ఈ కుండ నృత్యంతోనే గోపికలను మంత్రముగ్దులను చేశాడు.
ఆళ్వార్లు ఈ లీలను పలు చోట్లు ఆస్వాదించారు. పొయ్గై ఆళ్వార్ తమ మొదల్ తిరువందది—“అరవం అడల్ వేలం … కురవై కుడ … కోత్తాది” (రాసక్రీడ మరియు కుండ నృత్యం చేస్తూ ఆనందించారు). పేయాళ్వార్ తమ మూన్ఱాం తిరువన్దాది, “కుడం నయన్ద కూత్తనాయి నిన్ఱాన్”(భగవానుడు ఆశగా అవతరించిన కృష్ణావతారంలో కుండ నృత్యం చేయడంతో ఆనందించాడు). నమ్మాళ్వార్ తమ తిరువాయిమొళిలో “వైకుందం కోయిల్ కొండ కుడక్కూత్త అమ్మానే”(పరమపదంలోని శ్రీహరి , గోకులంలో కుండనృత్యం చేసే దేవదేవుడు). కులశేఖర ఆళ్వార్ తమ పెరుమాళ్ తిరుమొళిలో “కుడమాట్టుం” (కుండతో నాట్యం చేయువాడు). తిరుమంగై ఆళ్వార్ తమ పేరియా తిరుమొళి లో “తణ్ కుడన్దై కుడమాడి”(కుండనృత్యం చేసి స్వామి, తిరుక్కుడందైలో వైభవంగా వేంచేసి ఉన్నాడు)
ప్రత్యేకంగా, తిరుమంగై ఆళ్వార్ తన శిరియ తిరుమడల్ ల్లో, పరకాల నాయకి భావంతో, కృష్ణుడి కుడక్కూత్తును అద్భుతంగా వర్ణించారు.
నీరార్ కమలం పోల్ శెన్గణ్మాల్ ఎన్ఱొరువన్
పారోర్గళెల్లాం మగిళప్పరై కరంగ
శీరార్ కడం ఇరన్డేంది శెళుమ్ తెరువే
ఆరార్ ఎన్చొల్లి ఆడుమ్ అదుకన్డు
ఏరార్ ఇళములయ్యార్ ఎన్నయ్యరుమెళ్లారుమ్
వారాయో ఎన్ఱా ర్కు చెన్ఱేన్ ఎన్ వల్ వినైయాల్
తిరుమంగై ఆళ్వార్యొక్క స్త్రీ భావం — పరకాల నాయకి, ఆమె స్వయంగా అలంకరించుకొని తన బొమ్మలతో ఆడుకుంటోంది. ఆ సమయంలో ఆమె సఖీలు వచ్చి అన్నారు: “ఎర్ర కమలంలాంటి నేత్రాలున్న మహాప్రభువు – కృష్ణుడు –గోకులంలో నడుమ వీధి చవుటిలో రెండు కుండలు పట్టుకొని, డోలు కొడుతూ, అందరిని ఆనందపరుస్తూ నాట్యం చేస్తున్నారు!” ఆ వార్త విని, ఆ బలమైన “పుణ్యపాప బంధనాలు” (ఇక్కడ “పాపం” = గాఢభక్తి) వలన ఆమె అక్కడికి వెళ్లి కృష్ణుడిని చూసింది. ఒక్క చూపులో తన మనస్సు, శరీరం, ఆత్మ — అన్నీ కృష్ణునికే అర్పించబడిపోయాయి.
ఈ లీల యొక్క సారాంశం :
- భగవంతుడు తన సౌందర్యం, లీలలతో జీవులను ఆకర్షిస్తాడు.
- పరకాల నాయకి = జీవాత్మ. ఆమె బొమ్మలతో ఆట సంసారం పైన ఆసక్తి సూచిస్తుంది , కృష్ణుడి కుండనృత్యం చూపటం పరమాత్మ సౌందర్యప్రదర్శన, అనుగ్రహరూప లీలా. ఆమె దోషం — అతిశయ భక్తి. చివరికి ఆమె పూర్తిగా కృష్ణునికి శరణాగతురాలైంది — ఇది జీవాత్మ సాధించగల అత్యున్నత స్థితి.
మూలం : https://granthams.koyil.org/2023/09/29/krishna-leela-22-english/
అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org