కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 38 – మరో ఐదుగురు దేవేరులు

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి

<< 37 – ఖాండవ వన దహనం, ఇంద్రప్రస్థ నిర్మాణం

కృష్ణుడు మరొక ఐదుగురు దేవేరులను ఎలా వివాహం చేసుకున్నాడో ఇప్పుడు చూద్దాం. ఈ ఎనిమిది మంది కలిసి కృష్ణావతారంలో ఆయనకు ప్రధానమైన అష్టమహిషులు అయ్యారు.

ఒకసారి కృష్ణుడు మరియు అర్జునుడు వేట కోసం అడవికి వెళ్లారు. అక్కడ యమునా నదిలో స్నానం చేస్తుండగా ఒక అతి సుందరమైన యువతిని చూశారు. కృష్ణుడు, అర్జునుని ఆమె వద్దకు పంపి “ఆమె ఎవరో తెలుసుకో” అని అన్నాడు. అర్జునుడు వెళ్లి “నీవెవరు?” అని అడిగాడు. అప్పుడు ఆమె “నేను సూర్యభగవానుని కుమార్తె కాళింది. నేను భగవాన్ విష్ణువునే వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందుకోసమే తపస్సు చేస్తున్నాను.” అని చెప్పింది. అర్జునుడు ఆ విషయాన్ని కృష్ణునికి తెలిపాడు. అప్పుడు కృష్ణుడు ఆమెను తన రథంలో తీసుకొని యుధిష్ఠిరుని వద్దకు వెళ్లాడు.

తరువాత కృష్ణుడు మరియు ఇతరులు పాండవులకు వీడ్కోలు చెప్పి ద్వారకకు చేరుకున్నారు. అక్కడ కృష్ణుడు కాళిందిని వివాహం చేసుకున్నాడు.

ఆ తరువాత కృష్ణుడు, తన మరొక మేనత్త రాజాధిదేవి కుమార్తె మిత్రవిందను వివాహం చేసుకోవాలని ఆశించాడు. ఆమె సోదరులు వింధ్యుడు మరియు అనువింధ్యుడు అవంతి దేశాన్ని పాలించేవారు. వారు తమ చెల్లెలికి స్వయంవరం ఏర్పాటు చేశారు. కానీ కృష్ణుడిని ఆ సభకు రానీయలేదు. అయినప్పటికీ కృష్ణుడు అక్కడికి వెళ్లి, ఆ సభకు వచ్చిన రాజులు చూస్తుండగానే మిత్రవిందను తీసుకొని వెళ్లి వివాహం చేసుకున్నాడు.

తరువాత కోసల దేశ రాజు నగ్నజిత్ తన కుమార్తె సత్యా లేదా నగ్నజీతి వివాహానికి యోగ్యుడైన వరుణ్ని వెతుకుతున్నాడు. అతనివద్ద అత్యంత క్రూరమైన ఏడు ఎద్దులు ఉండేవి. “ఆ ఏడు ఎద్దులను అదుపు చేసిన వాడికే నా కుమార్తెను ఇస్తాను” అని ప్రకటించాడు. అనేకమంది యువరాజులు వచ్చి ఆ ఎద్దులను జయించాలని ప్రయత్నించారు. కానీ అందరూ గాయపడి పారిపోయారు. ఈ విషయం విని కృష్ణుడు మహాసేనతో కోసల దేశానికి వచ్చాడు. నగ్నజిత్ ఎంతో ప్రేమతో కృష్ణుణ్ణి ఆహ్వానించి అనేక కానుకలు సమర్పించాడు. సత్యా కూడా కృష్ణుణ్ణి చూసి ఆయనను వివాహం చేసుకోవాలని కోరుకుంది. కృష్ణుడు ఆ ఏడు ఎద్దులను సులభంగా అదుపు చేసి సత్యాను వివాహం చేసుకున్నాడు. కొంతమంది రాజకుమారులు ఆ వివాహాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించారు. కానీ కృష్ణుడు వారిని తరిమికొట్టాడు. ఈ సంఘటన నప్పిన్నై కళ్యాణాన్ని పోలి ఉండటం ముఖ్యమైన విషయం.

తరువాత కృష్ణుని మరొక మేనత్త శృతకీర్తి, కేకయ దేశ రాణి. ఆమెకు భద్రా అనే కుమార్తె ఉండేది. ఆమె సోదరుల అనుమతితో కృష్ణుడు భద్రను వివాహం చేసుకున్నాడు.

అనంతరం మద్ర దేశ యువరాణి లక్ష్మణా స్వయంవరానికి వెళ్ళి, ఆమెను తీసుకొని వచ్చి వివాహం చేసుకున్నాడు.

ఈ విధంగా కృష్ణుడు తన అష్టమహిషులు — రుక్మిణి, సత్యభామ, జాంబవతి, కాళింది, మిత్రవింద, సత్యా, భద్రా మరియు లక్ష్మణాలతో కలిసి ద్వారకలో ద్వారకాధీశుడిగా ఆనందంగా విరాజిల్లాడు.

తరువాత కృష్ణుడు నరకాసురుని సంహరించి, అతని చెరలో బంధింపబడిన పదహారు వేల వంద మంది దేవకన్యలను వివాహం చేసుకున్నాడు. దీనిని తరువాతి వ్యాసంలో చూద్దాం.

ఈ సంఘటనలోని సారాంశం:

  • శ్రీమన్నారాయణుని ప్రధాన దేవేరులు అయిన శ్రీదేవి, భూదేవి, నీలాదేవి — రుక్మిణి, సత్యభామ మరియు నప్పిన్నై లేదా సత్యగా అవతరించి కృష్ణుణ్ణి వివాహం చేసుకున్నారు.
  • భగవాన్ సమస్త పురుషులలో శ్రేష్ఠుడు. సమస్త జీవాత్మలు ఆయన భార్యస్థానంలోనే ఉంటారు. కొన్ని అవతారాలలో ఆయన కొందరు ఆత్మలను ఎన్నుకొని వారికి స్త్రీశరీరాన్ని ప్రసాదించి వారిని వివాహం చేసుకుంటాడు. ఈ విధంగా వారిని తన దివ్య మహిషులుగా ఉన్నత స్థానానికి చేర్చుతాడు.

మూలం : https://granthams.koyil.org/2023/10/15/krishna-leela-38-english/

అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment