శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
<< 49- విదురుణ్ణి అనుగ్రహించుట

ఇప్పుడు కౌరవుల రాజసభలో తరువాత జరిగిన సంఘటనలను ఆస్వాదిద్దాం.
కృష్ణుడు దూతగా వస్తున్నాడని తెలిసిన ధృతరాష్ట్రుడు, ఆయనకు ఎంతో ధనసంపదను బహుమతిగా ఇచ్చి కౌరవుల పక్షం వహించేలా చేయవచ్చని అనుకున్నాడు. అయితే వెంటనే ఆ ఆలోచన తప్పు అని గ్రహించాడు.
కృష్ణుని రాక గురించి ముందుగానే తెలిసిన దుర్యోధనుడు ఒక కపటమైన ఆసనాన్ని తయారు చేయించాడు. ఆ ఆసనం క్రింద ఒక రహస్య గదిని నిర్మించి, అందులో కొందరు మల్లయోధులను ఉంచాడు. కృష్ణుణ్ణి ఆ ఆసనంపై కూర్చోబెట్టి, క్రిందకు పడవేసి బంధించాలని అతని ఉద్దేశ్యం. కృష్ణుడు ఆ ఆసనంపై కూర్చోగానే అది క్రిందకు దిగడం ప్రారంభించింది. అయితే వెంటనే ఆయన అక్కడే తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఆయన దివ్యమైన ఆరూపాన్ని చూసి సభలో ఉన్న వారందరూ భయభ్రాంతులకు గురయ్యారు.
ఆ తరువాత కృష్ణుడు, ధృతరాష్ట్రునితో శాంతి చర్చలను ప్రారంభించాడు. “రాజ్యాన్ని పాలించడానికి నిజంగా అర్హుడు యుధిష్ఠిరుడు. తాత్కాలిక పాలకుడిగా ఉన్న నీవు ఇప్పుడు రాజ్యాన్ని అతనికి అప్పగించాలి” అని చెప్పాడు. కానీ దుర్యోధనుడు మధ్యలో జోక్యం చేసుకొని, పాండవులకు రాజ్యంపై ఎటువంటి హక్కూ లేదు. వారికి రాజ్యాన్ని ఇవ్వను అని చెప్పాడు. అప్పుడు కృష్ణుడు, “అయితే కనీసం ఐదు గ్రామాలనైనా వారికి ఇవ్వండి. వారు వాటితోనే సంతృప్తి చెందుతారు” అని అన్నాడు. దానికి కూడా దుర్యోధనుడు అంగీకరించలేదు. “సూది మొన పెట్టేంత భూమిని కూడా వారికి ఇవ్వను” అని గర్వంగా ప్రకటించాడు. ఆ మాటలు విన్న కృష్ణుడు, “అయితే యుద్ధమే ఒక్కటే పరిష్కారం” అని అన్నాడు.
దుర్యోధనుడు కూడా, “అవును. మేము యుద్ధానికి సిద్ధమే” అని సమాధానమిచ్చాడు. అప్పుడు విదురుడు దుర్యోధనునికి మంచి ఉపదేశం చేస్తూ, “నీవు కృష్ణునితో ఇలా మాట్లాడకూడదు. పాండవుల న్యాయమైన హక్కును నిరాకరించకూడదు” అని చెప్పాడు. దుర్యోధనుడు కోపంతో విదురుణ్ణి అవమానించాడు. దాంతో విదురుడు ఎంతో విచారించి, “అధర్మాన్ని ఆశ్రయించిన వారితో నేను ఉండను. ఈ యుద్ధంలో కూడా నేను పాల్గొనను” అని ప్రకటించాడు. అని చెప్పి తన వద్ద ఉన్న విష్ణు ధనుస్సును విరిచివేశాడు. విదురుడు దుర్యోధనుని పక్షాన నిలబడి ఉంటే, అది పాండవులకు ఎంతో పెద్ద ప్రమాదంగా మారి ఉండేది.
ఈ విధంగా కృష్ణుడు దూతగా వెళ్లి, యుద్ధం అనివార్యంగా జరిగే పరిస్థితిని ఏర్పరిచాడు.
ఆళ్వార్లు అనేక చోట్ల కృష్ణుని ఈ దూతత్వ వైభవాన్ని అనుభవించారు. పొయ్ గై ఆళ్వార్ తన ముదల్ తిరువందాదిలో, “సెఱ్ఱెళుందు తీవిళిత్తు చెన్ఱ ఇంద ఎళులగం” అని పాడారు. నంపిళ్ళై ఈ పాశురానికి ఒక వ్యాఖ్యానంగా, దుర్యోధనుని సభలో కృష్ణుడు విశ్వరూపాన్ని ప్రదర్శించిన ఈ సంఘటనను సూచిస్తారు. పెరియాళ్వార్ తన పెరియాళ్వార్ తిరుమోళిలో,“తూదు సెన్ఱాయ్ ! కురు పాండవర్క్కై అంగోర్ పొయ్సుర్రం పేసి చెన్ఱ బేధం సేయ్దు ఎంగుం పిణం పడుత్తాయ్! తిరుమాలిరుంజోలై ఎందాయ్” అని పాడుతూ, (ఓ తిరుమాలిరుంజోలై నాథా! నీవు కౌరవులు, పాండవులు ఇద్దరి పట్ల సమభావంతో ఉన్నట్లుగా దూతగా వెళ్ళి, వారి మధ్య యుద్ధాన్ని కలిగించి, దుర్యోధనుడు మొదలైన వారిని నాశనం చేశావు). తిరుమంగై ఆళ్వార్ తన పెరియ తిరుమోళిలో, “అరవ నీళ్ కోడియోన్ అవైయుళ్ ఆసనత్తై అంజిడాదేయిదా అదఱ్కు పెరియ మామేని అండం ఊడురువ పేరుందిసై అడంగిడ నిమిర్ధోన్” అని పాడుతూ, (దుర్యోధనుని సభలో సమర్పించిన ఆసనంపై భయపడకుండా కూర్చొని, అనంత బ్రహ్మాండాలను వ్యాపించే విశ్వరూపాన్ని ప్రదర్శించిన భగవంతుడు) అని స్తుతిస్తున్నారు.
ఈ సంఘటన యొక్క సారాంశం:
- భగవంతుణ్ణి అణచివేయాలని లేదా నాశనం చేయాలని ప్రయత్నించే వారిని, వారు ఊహించని విధంగా భగవంతుడు సులభంగా జయిస్తాడు.
- భగవంతుడు ఒక సంకల్పం చేసిన తరువాత, దానిని తప్పక నెరవేర్చుతాడు. ఆయన సంకల్పాన్ని ఎవరూ అడ్డుకోలేరు; ఎవరూ అతిక్రమించలేరు.
మూలం : https://granthams.koyil.org/2023/10/26/krishna-leela-50-english/
అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org