ఐప్పాసి అనుభవం – పూదత్తాళ్వార్ – ఇరండామ్ తిరువందాది

శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

పూర్తి ధారావాహిక

<< మునుపటి

పూదత్తాళ్వార్ల ‘ఇరండామ్ తిరువందాది’కి నంపిళ్ళై గారు అందించిన అవతారిక యొక్క ఆంగ్ల అనువాద వివరణ యోక్క తెలుగు అనువాదం ఇది. నంపిళ్ళై గారి వ్యాఖ్యానాలను ప్రచురించి, సులభమైన తమిళ వివరణను అందించిన శ్రీ ఉ. వే. ఎం. ఎ. వేంకటకృష్ణన్ స్వామి వారి కృషికి కృతజ్ఞులం. 

https://granthams.koyil.org/2013/10/aippasi-anubhavam-poigai-azhwar/  వద్ద పోయిగై ఆళ్వార్ల యొక్క ముదల్ తిరువందాది పరిచయాన్ని చదవండి.

నంపిళ్ళై – తిరువల్లిక్కేణి

మొదటిదైన ‘ముదల్ తిరువందాది’ లో, పొయ్‌గై ఆళ్వార్లు ఎంపెరుమాన్ ఉభయ విభూతులకు – అనగా నిత్య విభూతి (ఆధ్యాత్మిక లోకం) మరియు లీలా విభూతి (భౌతిక ప్రపంచం) రెండింటికీ అధిపతి అని నొక్కి చెప్పారు. దీనిని దర్శించిన పూదత్తాళ్వార్లు తాను ఎంపెరుమానుకి నిజమైన దాసుడనని గ్రహించారు. ఆ జ్ఞానమే ఇక్కడ భక్తిగా పరిపక్వం చెందింది. ముదల్ తిరువందాది ప్రధానంగా జ్ఞానంపై దృష్టి సారించగా; ఇరండామ్ తిరువందాది భక్తిపై కేంద్రీకృతమైంది. ఈ దివ్య ప్రబంధం పూదత్తాళ్వార్ల హృదయం నుండి ఉప్పొంగిన భక్తి భావనల సమాహారం. అయితే దీని అర్థం పొయ్‌గై ఆళ్వార్లకు భక్తి లేదనా? కాదు – ఆయనకూ భక్తి ఉంది. ఇవి భగవదనుభవంలో వ్యక్తమయ్యే వివిధ విభిన్న దశలు – ఒకటి కారణమైతే, మరొకటి దాని ఫలితం. భగవానుని నిత్య, లీలా విభూతులను ధ్యానిస్తూ జ్ఞాన నిష్ఠలో ఉండడం పొయ్‌గై ఆళ్వార్ల స్థితి. అదే జ్ఞానం పరిపక్వత చెందిన అత్యున్నత భక్తి స్థితిలో ఉండడం పూదత్తాళ్వార్ల స్థితి. ముదల్ తిరువందాదిలో వర్ణించబడిన ఎంపెరుమాన్ దివ్య ఐశ్వర్యాన్ని, వైభవాన్ని పూదత్తాళ్వార్లు ధ్యానించారు. దాని ఫలితంగా, ఆయనలో ఉప్పొంగిన అపారమైన భక్తి ఈ పాశురాల రూపంలో వెలువడి ‘ఇరండామ్ తిరువందాది’ అనే దివ్య ప్రబంధంగా ఆవిర్భవించింది.

‘ముదల్ తిరువందాది’ లో పరమాత్మ గురించిన జ్ఞానం వివరించబడింది. అనగా, భగవానుడే ఈ సమస్త విశ్వానికి అధిపతి అని మరియు ఈ విశ్వం కేవలం భగవానుని కోసమే ఉనికిలో ఉందని చెప్పబడింది. ఈ జ్ఞానమే భగవానుని చేరుకోవడానికి మార్గమని కూడా వివరించబడింది. సాధారణంగా, లౌకిక విషయాలలో మార్గము మరియు గమ్యము వేర్వేరుగా ఉండడం మనం చూస్తాము. మరి అలాంటప్పుడు, భగవానుడే ఉపాయము (మార్గము) మరియు భగవానుడే ఉపేయము (గమ్యము) కావడం ఎలా సాధ్యం? ఆయన సర్వశక్తిమంతుడు (ఏదైనా చేయగల సమర్థుడు) కాబట్టే, ఆయనే ఉపాయము మరియు ఆయనే ఉపేయము అయి ఉన్నాడు. కారణము అనేది 3 రూపాలలో వివరించబడింది:

  • ఉపాదాన కారణము: అంతిమ రూపం లేదా ఫలితంగా మారే ప్రాథమిక ముడి పదార్థం. ఉదాహరణకు, మట్టి – కుండగా మారుతుంది – ఇక్కడ మట్టి ‘ఉపాదాన కారణం’ మరియు కుండ అనేది ‘కార్యం’ (ఫలితం).
  • నిమిత్త కారణము: ఆ ముడి పదార్థంలో మార్పును తీసుకవచ్చే సమర్థుడైన కర్త. ఉదాహరణకు, మట్టిని కుండగా మార్చే కుమ్మరి ‘నిమిత్త కారణం’.
  • సహకారి కారణము: ముడి పదార్థాన్ని ఫలితంగా మార్చడానికి ఉపయోగపడే పనిముట్లు లేదా సహాయక సాధనాలు. ఉదాహరణకు, కుమ్మరి మట్టిని కుండగా మార్చడానికి ఉపయోగించే కర్ర మరియు చక్రం ‘సహకారి కారణం’.

శ్రీమన్నారాయణుడు – సమస్త కారణాలకు పరమ కారణం (సర్వకారణ కారణం)

సాధారణంగా, ఈ భౌతిక ప్రపంచంలో ఈ మూడు కారణాలు ఎల్లప్పుడూ వేర్వేరుగా ఉండడాన్ని మనం గమనిస్తాము. కానీ శ్రీమన్నారాయణుడు సర్వశక్తిమంతుడు (ఏదైనా చేయగల సమర్థుడు) కాబట్టి, ఆయనే స్వయంగా ఈ మూడు రకాల కారణాలు అయి ఉన్నాడు. (గమనిక: ఉపాదాన కారణము – ముడి పదార్థాలుగా ఉండే చిత్ (చేతనులు/జీవులు) మరియు అచిత్ (అచేతనులు/జడ పదార్ధాలు) ఎంపెరుమానుకి శారీరక లేదా విశేషణ రూపాలు; నిమిత్త కారణము – ఎంపెరుమాన్ స్వంత సంకల్పము; సహకారి కారణము – ఎంపెరుమాన్ అనంతమైన జ్ఞానము, శక్తి మొదలైనవి). ఈ విధంగా, వ్యక్తమైన ఈ సమస్త విశ్వానికి ఎంపెరుమానే స్వయంగా ఈ మూడు కారణాలు అవుతున్నాడు. ఎంపెరుమాన్ ఈ సమస్త విశ్వానికి అంతర్యామి (అంతఃకరణంలో ఉండే పరమాత్మ) అయినందున, మరియు పూదత్తాళ్వార్ ఈ విశ్వంలోని జీవులలో ఒకరైనందున – ఆ పరమ గమ్యాన్ని చేరుకోవడానికి ఆళ్వార్లు ఎంపెరుమానునే ఏకైక ఉపాయంగా (మార్గంగా) భావిస్తారు.

సాధారణ అంశాలలో కనిపించే ప్రతిదీ ప్రత్యేక సందర్భాలలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎంపెరుమాన్ “అఖిల జగత్ స్వామిన్” (సమస్త విశ్వానికి అధిపతి అని గద్య త్రయంలో భగవద్రామానుజులచే వివరించబడినట్లుగా) అయినట్లే, ఆయన “అస్మత్ స్వామిన్” (నాకు కూడా అధిపతి) అవుతాడు. ఇక్కడ సాధనము (మార్గము) సాక్షాత్తు ఆ ఎంపెరుమానే కాబట్టి, జీవుడు తన జ్ఞానం పూర్తిగా వికసించేంతవరకు ఓపికతో వేచి ఉండాలి (జ్ఞానం పరిపక్వమైనప్పుడు ఎంపెరుమానే స్వయంగా గమ్యాన్ని అనుగ్రహిస్తాడు). ఒకసారి పరమేశ్వర మంగళత్తు ఆణ్డాన్ గారు (నాథమునుల పరమ ప్రియ శిష్యులు) కురుగై కావలప్పన్ గారి వద్దకు వెళ్లి, “ఈ జగత్తుకు (విశ్వానికి), ఈశ్వరునికి (ఎంపెరుమానుకి) మధ్య ఉన్న సంబంధం ఏమిటి?” అని అడిగారు. దానికి కురుగై కావలప్పన్ గారు ఎదురుప్రశ్న వేస్తూ “ఏ జగత్తు? ఏ విశ్వం?” అని అడిగారు (అంటే ఎంపెరుమాన్ లేని జగత్తు ఎక్కడుంది, రెండు వేర్వేరు వస్తువులు అయితేనే కదా వాటి మధ్య సంబంధం గురించి మాట్లాడాలి అని వారి అంతరార్థం). ఈ సమాధానంతో పరమేశ్వర మంగళత్తు ఆణ్డాన్ గారు సంపూర్ణ సంతృప్తి చెందారు. ఈ విశ్వమంతా భగవానుని శరీరం అని, ఎంపెరుమాన్ ఈ విశ్వానికి అంతర్యామి (ఆత్మ) అని శాస్త్రాలు వివరిస్తున్నాయి (వీరిద్దరూ విడదీయరానివారు). శరీరము ఆత్మకు ఎలాగైతే లోబడి ఉంటుందో, అలాగే ఈ సమస్త విశ్వం ఎంపెరుమాన్ శరీరమై ఆయనకు లోబడి ఉంటుంది. పొయ్‌గై ఆళ్వార్లు తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పబడినట్లుగా భగవానుని “పతిం విశ్వస్య” (సమస్త విశ్వానికి పతి/నాథుడు) అని ధ్యానించారు. ఈ సిద్ధాంతం పూదత్తాళ్వార్లకు కూడా సమానంగా వర్తిస్తుంది. అందుకే, పూదత్తాళ్వార్లు ఆ మహోన్నత సిద్ధాంతాన్ని తమ ‘ఇరండామ్ తిరువందాది’ లో నిరంతరం ధ్యానించారు.

ఇవన్నీ కేవలం జ్ఞానము మరియు భక్తి యొక్క విభిన్న దశలలో వ్యక్తమైన భావనల సమాహారమే అయినప్పుడు, ఈ మూడు తిరువందాది ప్రబంధాలను ఒకే రచయిత ఎందుకు రచించలేదు? ముదల్ తిరువందాదిని పొయ్‌గై ఆళ్వార్లు, ఇరండామ్ తిరువందాదిని పూదత్తాళ్వార్లు – ఇలా వేర్వేరు రచయితలు ఎందుకు రచించారు? దీనికి సమాధానంగా మనం ‘త్రిముని వ్యాకరణాన్ని’ గుర్తుచేసుకోవచ్చు. దీనిని పాణిని, వరరుచి, పతంజలి అనే ముగ్గురు వేర్వేరు మునులు రచించినప్పటికీ, వారంతా ఒకే విషయం (వ్యాకరణం) గురించి మాట్లాడారు కాబట్టి ఆ మూడింటినీ కలిపి ఒకే శాస్త్రంగా పరిగణిస్తారు. అలాగే, జైమిని మహర్షి పూర్వ మీమాంసను (మొదటి 12 అధ్యాయాలు), వ్యాస మహర్షి ఉత్తర మీమాంసను (4 అధ్యాయాలు) రచించారు. అయినప్పటికీ, ఈ రెండు కూడా ఒకే బ్రహ్మాన్ని కీర్తిస్తాయి కాబట్టి (పూర్వ మీమాంస బ్రహ్మాన్ని ఎలా ఆరాధించాలో వివరిస్తుంది, ఉత్తర మీమాంస బ్రహ్మము యొక్క నిజమైన స్వభావాన్ని సవివరంగా తెలియజేస్తుంది) వీటన్నింటినీ కలిపి ఒకే శాస్త్రంగా భావిస్తారు. ఆళ్వార్లు అనుగ్రహించిన ఈ దివ్య ప్రబంధాలను కూడా అదే విధంగా (కర్తృ భేదం ఉన్నప్పటికీ అంతరార్థం ఒక్కటే కాబట్టి ఒకే వస్తువుగా) పరిగణించాలి.

‘ముదల్ తిరువందాది’ లో, ఎంపెరుమాన్ “విచిత్ర జ్ఞాన శక్తి యుక్తుడు” (అద్భుతమైన జ్ఞానానికి నిలయం మరియు ఏదైనా చేయగల సంపూర్ణ సమర్థుడు), “జగత్ కారణ భూతుడు” (ఈ సమస్త విశ్వానికి పరమ కారణం) మరియు “శంఖచక్రగదాధరుడు” (శంఖము, చక్రము, మరియు గదను ధరించినవాడు) అని వివరించబడింది. ఇదంతా కూడా కేవలం ఎంపెరుమాన్ (భగవానుని) పట్ల ఉన్న భక్తి కారణం చేతనే వివరించబడింది. అసలు ఆ భక్తి అనే బీజాన్ని కూడా సాక్షాత్తు ఆ ఎంపెరుమాన్ నాటాడు (ఎందుకంటే అంతకుముందు ఆళ్వార్లలో అది లేదు). ఇక్కడ ఎంపెరుమానే ఉపాయం (మార్గం) అయినందున, మన హృదయంలో భక్తిని రగిలించేది కూడా ఆయనే (భక్తి బీజాన్ని నాటడం అనేది మన స్వంత ప్రయత్నం వల్ల సాధ్యం కాదు). ఎంపెరుమాన్ ఇంతటి వైవిధ్యభరితమైన విశ్వాన్ని నియంత్రించడం మరియు నడిపించడం ఎంతటి అద్భుతమో, ఆళ్వార్ల హృదయంలో ఈ భక్తి బీజాన్ని నాటడం కూడా అంతే అద్భుతమైన విషయమని ఆళ్వార్లు ఇక్కడ పేర్కొంటున్నారు.

పొయ్‌గై ఆళ్వార్లుకు కేవలం పరమాత్మ గురించిన జ్ఞానం మాత్రమే ఉందా? కాదు, ఆళ్వార్లందరికీ పరిపూర్ణమైన జ్ఞానము మరియు భక్తి రెండూ ఉన్నాయి – కానీ ఇక్కడ ప్రాధాన్యత అనేది ఆయా ఆళ్వార్లు తమ ప్రబంధాలలో దేనిపై ఎక్కువగా దృష్టి సారించారు అనే అంశంపైనే ఉంటుంది. ఆళ్వార్లందరికీ ఒకరి దివ్య భావనలు (భగవదనుభవాలు) మరొకరికి పూర్తిగా తెలుసు కాబట్టి, వారందరూ తమ దివ్య ప్రబంధాలలో ఒకే విధమైన పరమ సిద్ధాంతాలను వెల్లడించారు. ఇది ఎలా ఉందంటే – సాక్షాత్తు ఆదిశేషునికి ఒకే మెడ మరియు అనేక శిరస్సులు ఉన్నట్లుగా, ఆళ్వార్లు కూడా ఒకే విధమైన సిద్ధాంతాలను పంచుకున్నారు, కానీ వేర్వేరు వ్యక్తులుగా విభిన్న ప్రబంధాల ద్వారా వాటిని లోకానికి ఆవిష్కరించారు.

పూదత్తాళ్వార్ల ‘ఇరండామ్ తిరువందాది’ ప్రబంధానికి నంపిళ్ళై గారు అందించిన అవతారిక ముగిసింది. 

తిరుక్కురుగై పిరాన్ పిళ్లాన్ గారు అనుగ్రహించిన ‘ఇరండామ్ తిరువందాది’ యొక్క తనియన్ విశేషాలను ఇప్పుడు సంక్షిప్తంగా చూద్దాం. సాధారణంగా తనియన్లు ఆ దివ్య ప్రబంధాన్ని రచించిన వారి యొక్క వైభవాన్ని మరియు ఆ ప్రబంధం యొక్క గొప్పతనాన్ని వెల్లడిస్తాయి.

పూదత్తాళ్వార్లు

ఎన్ పిఱవి తీర ఇఱైంజినేన్ ఇన్నముదా

అన్బే తగళి అళిత్తానై

నన్పుగళ్ సేర్ సీదత్తార్ ముత్తుక్కళ్ సేరుమ్

కడల్ మల్లైప్ బూదత్తార్ పొన్నంగళల్ 

సరళమైన అనువాదం: ఈ సంసార బంధాలనుండి విముక్తి పొందడం కొరకు – అత్యంత అమృతతుల్యమైన ‘ఇరండామ్ తిరువందాది’ ని మనకు ప్రసాదించిన, మరియు ఎంతో మహిమాన్వితమైన, చల్లని ముత్యాలతో నిండిన ‘తిరుక్కడల్‌మల్లై’ (మహాబలిపురం) దివ్యదేశంలో అవతరించిన పూదత్తాళ్వార్ల పవిత్రమైన బంగారు పాదపద్మాలకు నేను నమస్కరిస్తున్నాను. (ముత్యాలు అనగా – ఈ దివ్యదేశం సముద్రతీరంలో ఉన్నందున బాహ్యంగా ముత్యాలు అని అర్థం వచ్చినప్పటికీ, దీని అంతరార్థం ‘భగవానుని పరమ పవిత్ర భక్తులు’ అని అర్థం).

ముదలాళ్వార్ల చరిత్ర మరియు వైభవం ఇక్కడ చూడవచ్చు: https://acharyas.koyil.org/index.php/2012/10/22/mudhalazhwargal/ 

ముదలాళ్వార్ల అర్చావతార అనుభవాన్ని ఇక్కడ చూడవచ్చు: https://granthams.koyil.org/2012/10/archavathara-anubhavam-azhwars-1/ 

ఆంగ్లంలో: https://granthams.koyil.org/2013/10/25/aippasi-anubhavam-bhuthathazhwar-irandam-thiruvanthadhi/       

అడియేన్ దాసరి కేశవ కృష్ణ రామానుజ దాసన్

ప్రూఫ్ రీడింగ్ చేసినవారు – శ్రీ తేజ రామానుజ దాసి

https://granthams.koyil.org లో ఆర్కైవ్ ఉంచబడినది.

ప్రమేయం (లక్ష్యం) – https://koyil.org
ప్రమాణం (గ్రంధాలు) – https://granthams.koyil.org
ప్రమాతా(ఉపదేశకులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్యా/పిల్లల పోర్టల్ – https://pillai.koyil.org

Leave a Comment