యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 40

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 39

జీయర్ ను భట్టర్పిరాన్ జీయర్ మరియు తిరుమంజనం అప్పా ఆశ్రయించుట

జీయర్ ప్రతి రోజు, సూర్యోదయానికి ముందు తమ స్నానమాచరించుటకై  దివ్య కావేరి ఒడ్డుకి వెళ్లేవారు. తిరుమంజనం అప్పా ఒక్క రవ్వంత కూడా ప్రతి ఫలాన్ని ఆశించకుండా కేవలం సత్వ కార్యములలో నిమగ్నమై ఉండి పెరుమాళ్ల సన్నిధిలో కైంకర్యం చేసేవారు. వీరు జీయరుతో కూడా నదిలో స్నానమాచరించుటకై వెళ్ళేవారు. జీయర్ దివ్య తిరుమేనిని తాకిన నీరు క్రిందకు ప్రవహించే ప్రదేశంలో వీరు నిలుచొని స్నానం చేసేవారు. ఆ కారణంగా వీరికి, జీయర్ దివ్య తిరువడి సంబంధం పొందాలనే జ్ఞానాన్ని పొందారు. జీయర్ పట్ల అమితమైన భక్తి ప్రపత్తులు పెంచుకుని వారి దివ్య పాదాల శరణు పొందారు. ఈ సంఘటనను చూసిన వ్యక్తులు క్రింది శ్లోకము ద్వారా ఈ సంఘటనను సంగ్రహించారు:

ఉషస్యయమ్వారిణి సహ్యజాయాః స్నాతో యతీంద్రప్రవణోమునీంద్రః
తత్రైవ పశ్చాద్ అవగాహ్య తీర్థే శ్రీతీర్థాతాదస్ తం ఉపాశ్రితోభూత్

(తెల్లవారుజామున, యతీంద్ర ప్రవణర్ అని పిలువబడే మాముణుల తిరుమేనిని తాకి ప్రవహించే పుష్కలమైన కావేరీ నదీ ప్రవాహంలో తిరుమంజనం అప్పా స్నానం చేసేవారు. జీయర్ పట్ల అప్పా అమితమైన భక్తి ప్రపత్తుల కారణంగా వారి ఆశ్రయం పొందిరి). జీయర్ యొక్క దివ్య నోటి ద్వారా అన్ని శాస్త్రార్థాల శ్రవణం చేసే భాగ్యము వీరికి లభించినది. “ఛాయావాసత్వమనుగచ్ఛేత్” అనే శ్లోకంలో చెప్పినట్లు, వీరు జీయరుని ఒక్క క్షణం కూడా వదలకుండా వారిపైనే ఆధారపడి ఉండి వారి దివ్య తిరు ఛాయలో విశ్వసనీయ శిష్యునిగా జీవించారు.

అనంతరం, గోవింద దాసప్పర్ అనే ఒక వ్యక్తి, జీయర్ తిరువడి ఆశ్రయం పొంది భట్టార్పిరాన్ జీయర్ అయ్యారు. జీయర్ పాద పద్మాలనే తమ జీవనాధారముగా భావించేవారు.

“ముగిల్ వణ్ణన్ అడిమేల్ శొన్న శొల్ మాలై ఆయిరం” (మేఘ వర్ణుడైన ఆ భగవానుని చరణాలపై పాడిన వేయి పాశురాల మాల) లో చెప్పినట్లు, “మదిళరంగర్ వణ్పుగళ్ మేల్ ఆన్ఱ తమిళ్ మఱైగళ్ ఆయిరం” (కోట లాంటి ఆలయం లోపల నివసించే శ్రీ రంగనాధునిపై వేయి పాశురముల ద్రావిడ వేదం) లో చెప్పినట్లు మణవాళ మాముణులు ఎంబెరుమానునిపై పాడిన తిరువాయ్మొళి ఈడు వ్యాక్యానముపై ఉపన్యాసం ఇవ్వడం ప్రారంభించారు. వీరు ఆరుళిచ్చెయల్ (దివ్య ప్రబంధం) వ్యాఖ్యానాలపై, అలాగే శ్రీ వచన భూషణ నిగూఢమైన అర్థాలపైన, వీటికి సమతుల్యమైన రహస్య గ్రంథాలపైన కూడా ఉపన్యాసాలు ఇచ్చారు. “గురోర్ నామ సదా జపేత్” (ఆచార్యుని దివ్య నామాన్ని నిరంతరం పఠిస్తూ ఉండాలి) అని చేప్పినట్లుగా ప్రపన్న గాయిత్రి అనబడు ఇరామానుజ నూఱ్ఱందాదిని పఠిస్తూ రామానుజుల దివ్య తిరువడిని సేవిస్తూ ప్రతిరోజూ ఉపన్యాసాలు తీసుకునేవారు. వారు తిరుమలైయాళ్వార్ (తమ తిరుమాలిగలోని మంటపం) దివ్య నీడలో నివసిస్తూ, రామానుజుల తిరువడిని నిరంతరం సేవిస్తూ, ఇదే పురుషార్థముగా, తమ జీవనాధారముగా భావించేవారు. నిరంతరం సాటిలేని రామానుజుల మహిమల గురించి చర్చిస్తుండేవారు. పెరియ పెరుమాళ్ళ ఆజ్ఞానుసారంగా శ్రీ రంగరాజుని తమ తిరువారాధన పెరుమాళ్‌ గా ఆరాధించారు. ఐప్పసి (తులా మాసం) మాసంలో పిళ్ళై లోకాచార్యుల తిరునక్షత్రం రోజున (శ్రవణం) ఆ విగ్రహాన్ని ప్రతిష్టించి తన దివ్య హస్తాలతో తిరువారాధన చేశారు. ఆ రోజున తమ తిరువారాధన పెరుమాళ్ళకు అక్కారడిశిల్ (పాయసం) ని సమర్పించి, పూర్వాచార్యుల దివ్య వాక్కులను వివరిస్తూ, శ్రీరంగశ్రీకి మంగళదీపంగా నిలిచాడు.

మణవాళ మాముణుల మహిమను విన్న జనులు ఇలా అన్నారు

చిరవిరహదశ చింతానజర్జచేతసం భుజగశయనం
దేవం భూయః ప్రసాదయితుం దృవం
యతికులపతిః శ్రీమాన్ రామానుజస్య మభూతయంత్విది
సమదుషన్ సర్వే సర్వత్ర తత్రసుధీజనాః

(శేష శయ్యపైన ​​శయనించి ఉన్న పెరియ పెరుమాళ్ళు శ్రీ రామానుజులకు దూరమై ఆ విరహ వేదనను భరించలేక వారిని ఓదార్చేందుకు శ్రీ రామానుజులే మణవాళ మాముణులుగా  అవతారము ధరించారని వివిధ ప్రాంతాలలోని పండితులు తెలిపిరి).

జీయరుని ఇలా కీర్తించారు…..

శమునిః సౌమ్యజామాతా సర్వేషాం ఏవ పశ్యతాం
శ్రీసకస్యనిధేశేన శుశుపే దేశిక శ్రియా

(అళగియ మణవాళన్ అనే నామాన్ని ధరించిన ఆ మునివర్యులు, తిరుమగళ్ (శ్రీ మహాలక్ష్మి) కి పతి అయిన పెరుమాళ్ళ ఆదేశాన్ని అనుసరించి, అందరి శ్రేయస్సు కొరకై, ఆచార్యశ్రీ (ఆచార్యుని జ్ఞాన సంపద) తో ఉండిపోయారు).

ఇవి విని, ఇతర ప్రాంతాల్లో నివసించే వారు కూడా ఇలా అన్నారు….

తదస్సముత్సుఖాస్సర్వే శతశోత సహస్రశః
శరణం తస్య సంశ్రిత్య చరణౌ దన్యతాం గతాః

(ప్రజలు ఉప్పొంగిపోతూ వందలు వేల సంఖ్యలో వచ్చి, ఆ మణవాళ మాముణుల దివ్య పాదాల చెంత ఆశ్రయం పొంది కృతజ్ఞులైనారు).

దూరము దగ్గర తేడా లేకుండా సుదూర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కూడా లెక్కలేనంత సంఖ్యలో వచ్చి వారి తిరువడి యందు ఆశ్రయం పొందారు. మాముణులు పరమ కృపతో, “తిరుత్తిత్ తిరుమగళ్ కేళ్వనుక్కు ఆక్కి (వారిని సరిదిద్ది శ్రీమహాలక్ష్మి పతికి దాసులుగా చేయడం) మరియు “అరంగన్ శెయ్య తాళిణైయోడార్తాన్నై”(శ్రీ రంగనాధుని పాద కమలములతో సంబంధపరచుట), మాముణులు వారి గుర్తింపును “అరంగన్ మెయ్యడియార్గల్” (శ్రీ రంగనాధుని దివ్య దాసులు) గా మార్చి, తిరుమాలడియార్గళ్ (శ్రీ మహాలక్ష్మి పతి యొక్క దివ్య దాసులు) అన్న గురింపుని అనుగ్రహించారు. వారందరూ కూడా తమలో ఎలాంటి దోషం లేకుండా, జీయరుకి అనుకూలంగా ఉండి వారి దివ్య పాదాలను సేవించుకున్నారు. మాముణులు వారికి ఉపదేశిస్తున్న భగవత్ విషయము వింటూ, ఆచార్యుల పట్ల అత్యంత భక్తితో జీవించారు..

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://granthams.koyil.org/2021/08/25/yathindhra-pravana-prabhavam-40-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment