శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
<< 46 – సుదాముణ్ణి అనుగ్రహించుట

యుధిష్ఠిరుని, రాజసూయ యాగం పూర్తయిన తర్వాత, దుర్యోధనుడు మయుడు నిర్మించిన ఆ అద్భుత సభాభవనంలో సంచరించాడు. ఆ సభ యొక్క విశిష్టమైన నిర్మాణశైలిని చూసి అతడు ఆశ్చర్యచకితుడయ్యాడు. అలాగే, పాండవులకు అటువంటి మహత్తరమైన సభ లభించిందనే అసూయ కూడా అతనిలో పెరిగింది. కొన్ని చోట్ల నేలను నీరుగా భావించి జాగ్రత్తగా నడిచాడు; మరికొన్ని చోట్ల నీటిని నేలగా భావించి జారి పడిపోయాడు. అది చూసి ద్రౌపది మరియు మరికొందరు అతనిని చూసి పరిహాసపూర్వకంగా నవ్వారు. దాంతో దుర్యోధనుని కోపం మరింత పెరిగి, పాండవులపై తీవ్రమైన ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఏదో విధంగా వారిని ఓడించాలని ఆలోచించాడు. అప్పుడతని మేనమామ అయిన శకుని, యుద్ధంలో వారిని సులభంగా జయించడం కష్టమని భావించి, జూదంలో ఓడించాలనే ఉపాయం చెప్పాడు.
ఆ యోచన ప్రకారం, దుర్యోధనుడు యుధిష్ఠిరుని జూదానికి ఆహ్వానించాడు. రాజధర్మం ప్రకారం యుధిష్ఠిరుడు ఆ ఆహ్వానాన్ని తిరస్కరించలేకపోయాడు. అందువల్ల జూదాన్ని ప్రారంభించాడు. దుర్యోధనుడు, తన తరపున తానే ఆడకుండా శకుని చేత ఆడించాడు. జూదంలో సాధారణంగా పందెం ఉంటుంది. మొదట యుధిష్ఠిరుడు తన సంపదను, రాజ్యాన్ని కోల్పోయాడు. తరువాత తన సోదరులను, తనను తాను, చివరకు తన భార్య ద్రౌపదిని కూడా పందెంగా పెట్టి ఓడిపోయాడు. అపారమైన ఆనందంలో మునిగిపోయిన దుర్యోధనుడు తాను చేస్తున్న ఘోరమైన తప్పును గ్రహించక, తన సోదరుడు దుశ్శాసనునికి ద్రౌపదిని సభకు ఈడ్చుకొని రావాలని ఆజ్ఞాపించాడు. దుశ్శాసనుడు ద్రౌపది విశ్రాంతి తీసుకుంటూ, రజస్వలగా ఉన్న అంతఃపురానికి వెళ్ళి, ఆమె జుట్టును పట్టుకొని సభలోకి ఈడ్చుకొచ్చాడు. జరిగిన దారుణాన్ని గ్రహించిన ద్రౌపది, తన భర్త యుధిష్ఠిరుని మరియు సభలో ఉన్న పెద్దలను న్యాయం కోరింది. కానీ దుర్యోధనుని భయంతో వారందరూ మౌనంగా ఉండిపోయారు. తన అహంకారంతో దుర్యోధనుడు దుశ్శాసనునికి, ఆమె వస్త్రాపహరణం చేయమని ఆజ్ఞాపించాడు. దుశ్శాసనుడు ఆమె వస్త్రాన్ని లాగడం ప్రారంభించాడు. ఏం చేయాలో తెలియక దిగ్భ్రాంతికి గురైన ద్రౌపది, తన వస్త్రాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించింది. అప్పుడామెకు, అరణ్యవాస సమయంలో ఒక ఋషి చెప్పిన ఉపదేశం గుర్తుకు వచ్చింది: “పెద్ద ఆపద సంభవించినప్పుడు, హరిని స్మరించు” వెంటనే ఆమె రెండు చేతులను పైకెత్తి శ్రీకృష్ణునికి శరణాగతి చేసింది. ద్రౌపదికి కృష్ణునిపై అపారమైన భక్తి ఉండేది. కృష్ణుడూ ఆమెపై అపారమైన కరుణ కలిగి ఉన్నాడు. దుశ్శాసనుడు ఎంత లాగినా, ఆమె వస్త్రం అంతులేని విధంగా పెరుగుతూ వచ్చింది. చివరకు చేతులు అలసిపోయి దుశ్శాసనుడు విరమించుకున్నాడు.
ఈ సంఘటనలన్నీ జరిగిన తరువాత, ద్రౌపది మళ్లీ తన ఫిర్యాదును వినిపించింది. చివరకు సభలో ఉన్నవారందరూ, దుర్యోధనుడితో సహా, యుధిష్ఠిరుడు తనను తాను, తన సోదరులను, తన భార్యను పందెంగా పెట్టడం తప్పని అంగీకరించి, ఆ జూదమంతా చెల్లదని ప్రకటించారు. అయితే దుర్యోధనుడు మళ్లీ యుధిష్ఠిరుని జూదానికి ఆహ్వానించాడు. ఈసారి రాజ్యమే పందెంగా నిర్ణయించబడింది. ఓడినవారు పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి, అనంతరం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి అని ఒప్పందం కుదిరింది. యుధిష్ఠిరుడు మళ్లీ ఓడిపోయాడు. దాంతో పాండవులు తమ రాజ్యాన్ని కోల్పోయి అరణ్యానికి వెళ్లారు.ఆ కష్టకాలంలో కూడా శ్రీకృష్ణుడు వారిని కలుసుకొని ఓదార్చాడు. సభలో తనకు జరిగిన అవమానాన్ని తలచుకొని, దుర్యోధనుడు మరియు దుశ్శాసనుడు సంహరింపబడే వరకు తన జుట్టును ముడివేయనని ద్రౌపది ప్రతిజ్ఞ చేసింది. ఆమె దయనీయమైన స్థితిని చూసి సహించలేక, కృష్ణుడు తన దివ్యసంకల్పంతో దుర్యోధనుడు మొదలైన వారిని నాశనం చేయాలని సంకల్పించాడు.
ఆళ్వారులు అనేక చోట్ల భగవానుడు ద్రౌపది, పాండవుల పట్ల చూపిన కరుణను, వారి కోసమే దుర్యోధనుడు మొదలైన వారిని సంహరించిన విషయాన్ని కీర్తించారు. పెరియాళ్వార్, తమ పెరియాళ్వార్ తిరుమొళిలో ఇలా పేర్కొంన్నారు “మైథునన్మార్ కాదలియైయ్ మయిర్ ముడిప్పిత్తు అవర్గలైయే మన్నరాక్కి” (తన బంధువులైన పాండవుల భార్య ద్రౌపదికి తిరిగి జుట్టు ముడివేయించి, వారినే రాజులుగా స్థాపించాడు.) అలాగే తిరుమంగైయాళ్వార్, తమ పెరియ తిరుమోళిలో ఇలా అంటారు, “పందార్ విరలాళ్ పాంజాలి కూందల్ ముడిక్క పారదత్తు కందార్ కళిఱ్ఱు కళల్ మన్నర్ కలంగ చంగం వాయి వైత్తాన్” (బంతి పట్టిన చేతులుగల, పాంచాలి (ద్రౌపది) మళ్లీ జుట్టు ముడివేయుటకై, భారత యుద్ధంలో ఏనుగులపై యుద్ధం చేసిన రాజులు భయపడేలా తన శంఖాన్ని పూరించాడు.)
ఈ సంఘటన యొక్క సారాంశం:
- పిళ్లై లోకాచార్యర్ వివరిస్తూ: “భగవాన్ ప్రత్యక్షంగా రాకపోవడానికి కారణం ఏమిటంటే, ఆయన వచ్చి ఉంటే తనకు ప్రాణాలకన్నా ప్రియమైన పాండవులను శిక్షించవలసి వచ్చేది. ఎందుకంటే ద్రౌపది శరణాగతి చేసిన తరువాత, భగవద్భక్తులైన పాండవులు భగవానునికి చెందిన ఆమెను రక్షించవలసిన బాధ్యత కలిగి ఉన్నారు. వారు అలా చేయకపోవడంతో శిక్షార్హులయ్యారు. వారిని శిక్షించాల్సిన పరిస్థితి రాకుండా ఉండటానికే ఆయన ప్రత్యక్షంగా రాలేదు.”
- ఈ సంఘటన ద్వారా, మనిషి ఎంత సద్గుణవంతుడైనా తన కోరికలను నియంత్రించుకోలేకపోతే తీవ్రమైన దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుందని యుధిష్ఠిరుని జీవితంలో చూడవచ్చు.
- ద్రౌపది మరియు పాండవుల జీవితాల ద్వారా భగవాన్ తన భక్తులను ఎలా రక్షిస్తాడో కూడా మనం గ్రహించవచ్చు. పాండవుల కోసం ఎంతో చేసినప్పటికీ, పరమపదానికి తిరిగి వెళ్తున్న సమయంలో కూడా శ్రీకృష్ణుడు, “ద్రౌపదికి నేను చేయవలసినంత చేయలేదు” అని విచారించాడని ఆచార్యులు పేర్కొంటారు. భక్తులు చూపే చిన్నపాటి భక్తికైనా భగవాన్ తనను తాను వారికి ఎంతో ఋణపడి ఉన్నవాడిగా భావిస్తాడు.
మూలం : https://granthams.koyil.org/2023/10/24/krishna-leela-48-english/
అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org