శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః

యుద్ధం పూర్తయిన తరువాత యుధిష్ఠిరుడు పట్టాభిషిక్తుడయ్యాడు. శ్రీకృష్ణుడే స్వయంగా అతని పట్టాభిషేకాన్ని నిర్వహించి, ద్రౌపది మరియు పంచపాండవులకు మళ్ళీ సర్వమంగళాలను ప్రసాదించాడు.
అభిమన్యుని భార్య ఉత్తర యుద్ధకాలంలో గర్భవతిగా ఉండేది. పాండవులపై తీవ్రమైన కోపం కలిగిన అశ్వత్థాముడికి, పాండవ వంశానికి వారసుడిగా జన్మించబోయే శిశువునే గర్భంలో ఉండగానే సంహరించాలని దురాలోచన కలిగింది. అందుకోసం అతడు అపాండవాస్త్రాన్ని (బ్రహ్మాస్త్రమని కూడా అంటారు) ప్రయోగించాడు. ఆ అస్త్రం ఉత్తర గర్భంలో ప్రవేశించి, గర్భస్థ శిశువును దహనం చేసి, కాష్ఠ రూపంలో బయటకు పడేలా చేసింది.
అప్పుడు ఉత్తర శ్రీకృష్ణుణ్ణి శరణు వేడింది. కరుణాసాగరుడైన శ్రీకృష్ణుడు ఆ శిశువును తన దివ్యస్పర్శతో మళ్ళీ ప్రాణం పోసి జీవింపజేశాడు. ఆ బాలుడు తరువాత పరీక్షిత్తు మహారాజుగా ప్రసిద్ధి పొందాడు. శ్రీకృష్ణుని దివ్యపాదస్పర్శను పొంది మరల జీవించిన కారణంగా, అతనికి శ్రీకృష్ణునిపై అపారమైన భక్తి కలిగింది.
యుధిష్ఠిరుడు కొంతకాలం రాజ్యాన్ని పరిపాలించిన తరువాత పరీక్షిత్తును రాజుగా అభిషేకించి, తన సోదరులు మరియు ద్రౌపదితో కలిసి స్వర్గారోహణానికి బయలుదేరాడు.
ఆ తరువాత పరీక్షిత్తు మహారాజు ధర్మపూర్వకంగా రాజ్యాన్ని పాలించాడు. ఒకసారి వేటకు అడవికి వెళ్ళినప్పుడు అతనికి తీవ్రమైన ఆకలి, దాహం కలిగాయి. అప్పుడు ఒక మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆహారం కోరాడు. అయితే ఆ మహర్షి ధ్యానంలో నిమగ్నుడై ఉండడంతో ఎలాంటి స్పందన ఇవ్వలేదు. దాంతో కోపగించిన పరీక్షిత్తు, ఒక చనిపోయిన పామును తీసుకొని ఆ మహర్షి మెడలో హారంలా వేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ మహర్షి కుమారుడు ఈ సంఘటనను చూసి, “ఇలా చేసినవాడు ఏడు రోజులలోపే పాము కాటుతో మరణిస్తాడు” అని శపించాడు. తపోబలంతో జరిగిన విషయాన్ని తెలిసుకున్న ఆ మహర్షి తన కుమారుణ్ణి మందలిస్తూ, “పరీక్షిత్తు మంచి రాజు. తెలియక చేసిన చిన్న తప్పుకు నీవు ఇంత ఘోరమైన శాపం ఇచ్చావు” అని అన్నాడు. తరువాత జరిగిన సంగతులు అన్ని పరీక్షిత్తుకు తెలిసాయి. తాను చేసిన అపరాధానికి పశ్చాత్తాపపడి, “మిగిలిన ఈ ఒక్క వారాన్ని అత్యుత్తమ రీతిలో గడపాలి” అని నిర్ణయించుకున్నాడు. వెంటనే తన కుమారుడు జనమేజయుణ్ణి రాజుగా పట్టాభిషేకం చేసి, అరణ్యానికి వెళ్ళి అక్కడ ఉన్న మహర్షులను ఆశ్రయించాడు. అదే సమయానికి వ్యాస మహర్షి కుమారుడైన శుక మహర్షి కూడా అక్కడికి విచ్చేశారు. పరీక్షిత్తు ఆయనకు శరణాగతి చేసి, ఆహారం, నిద్ర వంటి బాహ్య విషయాలపై ఎటువంటి ఆసక్తి చూపకుండా, ఏడు రోజులపాటు శ్రీమద్భాగవతంలో వివరించబడిన శ్రీకృష్ణుని సంపూర్ణ చరిత్రను శ్రద్ధతో శ్రవణం చేశాడు. చివరికి అతడు సద్గతిని పొందాడు.
ఆళ్వార్లలో పెరియాళ్వార్ తమ పెరియాళ్వార్ తిరుమొళి , “మరుమగన్ తన్ సందతియై ఉయిర్ మీట్టు” (తన బంధువుల సంతానాన్ని తిరిగి జీవింపజేసినవాడు) మరియు “ఉత్తరై తన్ శిరువనైయుం ఉయ్యకొండ ఉయిరాళన్” (ఉత్తర కుమారుణ్ణి రక్షించి జీవింపజేసినవాడు) అనే పాశురాల ద్వారా, పరీక్షిత్తును శ్రీకృష్ణుడు ఎలా రక్షించాడో ఎంతో అందంగా కీర్తించారు.
ఈ సంఘటనలోని సారాంశం:
- భగవాన్ తన కృపను పాండవులపైనే కాకుండా వారి వంశస్థులపైనా కురిపించాడు. భక్తులను మాత్రమే కాదు, వారి సంతానాన్నికూడా రక్షించి అనుగ్రహిస్తాడనే విషయానికి ఇది గొప్ప ఉదాహరణ.
- మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. అందువల్ల మన సమయాన్ని భగవద్విషయాలలోనే గడపడం శ్రేయస్కరం. ఈ విషయాన్ని పరీక్షిత్తు మహారాజు తన జీవితాంతంలో ఆచరించి చూపించాడు.
మూలం : https://granthams.koyil.org/2023/11/02/krishna-leela-57-english/
అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org