నమ్మాళ్వారుల దివ్య నామములు – భవరోగ పండిత, నావలర్ పెరుమాన్

శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

పూర్తి ధారావాహిక

<< మునుపటి

21. భవరోగ పండిత

‘భవం’ అంటే సంసారం (లౌకిక ప్రపంచం). ‘రోగం’ అంటే వ్యాధి. ‘పండితుడు’ అంటే విద్వాంసుడు లేదా గొప్ప జ్ఞాని అని అర్థం. మనలాంటి ఆత్మలకు ఈ సంసారమే ఒక వ్యాధి.

సాధారణంగా, ఈ సంసారంలో మనుషులకు రకరకాల వ్యాధులు వస్తుంటాయని ప్రజలు భావిస్తుంటారు. కానీ, వైదిక మరియు వేదాంత దృక్పథం ప్రకారం, ఈ సంసారమే స్వయంగా ఒక వ్యాధి; దీనిని తొలగించుకోవాలి. ఈ విముక్తి (మోక్షం) ద్వారానే ఆ వ్యాధి నివారణ సాధ్యమవుతుంది. అత్యంత నీచమైనది మరియు అశాశ్వతమైనది అయిన ఈ సంసార స్వభావాన్ని నమ్మాళ్వార్లు తమ ‘దివ్య ప్రబంధాల’ ద్వారా మనకు స్పష్టంగా తెలియజేశారు. అలాగే, ఎంపెరుమాన్ శాశ్వతుడని మరియు పరమానందదాయకుడని కూడా నమ్మాళ్వార్లు వివరించారు.నమ్మాళ్వార్లు బోధనలను స్వీకరించడం ద్వారా మనం ఈ సంసారం నుండి, అంటే ఈ ‘భవరోగం’ నుండి విముక్తి పొందవచ్చు. అందుకే, నమ్మాళ్వార్లను ‘భవరోగ పండిత’ అని పిలుస్తారు.

22. నావలర్ పెరుమాన్

‘నావలర్’ అంటే వాక్చాతుర్యం లేదా గొప్ప వాగ్ధాటి కలిగినవారు అని అర్థం; ఇక్కడ ఈ పదం కవులను సూచిస్తుంది. కాబట్టి, ‘నావలర్’ అంటే కవి అని, ‘పెరుమాన్’ అంటే అటువంటి కవులకు నాయకుడు అని అర్థం.

భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో మరియు తమిళ భాషలో అనేకమంది కవులు ఉండేవారు. వీరు ప్రధానంగా దక్షిణ మధురగా పిలువబడే మధురై నగరంలో నివసించేవారు.

నమ్మాళ్వార్లు పరమపదం చేరిన తర్వాత, మధురకవి ఆళ్వార్లు తమ ఆచార్యుల గొప్పతనాన్ని లోకానికి చాటాలని సంకల్పించారు. అందుకోసం,మధురకవి ఆళ్వార్లు నమ్మాళ్వార్లు రచించిన పాశురాలను తీసుకుని ‘తమిళ్ సంఘం’ వద్దకు వెళ్లారు. ఏ పద్యాలు గొప్పవో నిర్ణయించే కవుల సభయే ఈ ‘తమిళ్ సంఘం’. వారి వద్ద ‘సంఘం పలక’ అనే ఒక ప్రత్యేకమైన పలక ఉండేది. తాళపత్రంపై రాసిన ఒక పద్యం ఆ పలకపై ఉంచినప్పుడు, ఆ పద్యం తగినంత గొప్పగా ఉంటే ఆ పలక దానిని స్వీకరించేది; ఒకవేళ ఆ పద్యం తగినంత విలువైనదిగా లేదా గొప్పదిగా లేకపోతే, ఆ పలక దానిని తిరస్కరించేది.

మధురకవి ఆళ్వార్లు “కణ్ణన్ కళల్ ఇణై” – తిరువాయ్మొళి 10.5.1 అనే రెండు పాదాల సరళమైన పాశురాన్ని తాళపత్రంపై రాసి, దానిని సంఘం పలకపై ఉంచారు. అక్కడ ఉన్న కవులందరూ ఆశ్చర్యపోయేలా, ఆ పలక ఆ పాశురాన్ని స్వీకరించి దానిని గొప్పగా గౌరవించింది. దీనిని చూసిన కవులందరూ నమ్మాళ్వార్లు గొప్ప కవి అని పూర్తిగా విశ్వసించారు. తద్వారా వారు నమ్మాళ్వార్లను తమ నాయకులుగానూ, దైవంగానూ అంగీకరించారు. అందుకే నమ్మాళ్వార్లు “నావలర్ పెరుమాన్” అని పిలువబడ్డారు.

వీడియోలింక్: https://youtube.com/shorts/KZdAezsJbaE?si=Eb7oqJk5uq-Pd2y1

ఆంగ్లంలో: https://granthams.koyil.org/2026/07/19/nammazhwars-divine-names-bhavaroga-panditha-navalar-peruman/  

అడియేన్ దాసరి కేశవ కృష్ణ రామానుజ దాసన్

ప్రూఫ్ రీడింగ్ చేసినవారు – శ్రీ తేజ రామానుజ దాసి

https://granthams.koyil.org లో ఆర్కైవ్ ఉంచబడినది.

ప్రమేయం (లక్ష్యం) – https://koyil.org
ప్రమాణం (గ్రంధాలు) – https://granthams.koyil.org
ప్రమాతా(ఉపదేశకులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్యా/పిల్లల పోర్టల్ – https://pillai.koyil.org

Leave a Comment