ఆచార్య హృదయం – 90

ఆచార్య హృదయం

<< చూర్ణిక – 89

చూర్ణిక – 90

అవతారిక
ప్రస్తుత అంశమైన ప్రమాత(అనగా ఆళ్వారు) యొక్క గొప్పతనమును నిర్ధారణ చేయుటకై ప్రమాణము (అనగా శాస్త్రము) మరియు ప్రమేయములను (అనగా ఆ సర్వేశ్వరుడు) స్వీకరించి ఈ మూడింటిలో త్యాజ్యోపాధేయములను వివరించుచూ అట్టి విశేషము తెలిసినవారికి లభించు ఫలము, దీనిని తెలుసుకొనక ఉండు వారు ఆ విధముగా అధోగతులను పొందుతారు అనే విషయమును నాయనార్లు ఇక మీద తెలుపుచున్నారు.

చూర్ణిక
మావురువిల్ కళ్ళవేడమ్ తిరున్దవేదమలమాన మానిడమ్ పాడల్ సర్వవర్ణ శూద్రత్వమ్ కాడువాళ్ శాతియిల్ కడల్ వణ్ణన్ వేడమ్ తెన్నురైయిల్ హరికీర్తి శ్వపచరిల్ పత్తి పాశనముమ్ అఴివార్ ఆరార్ అమరరెన్న ఏఴ అఴియాతార్ శాతియన్దణర్ కళేలుమ్ తకరవిళువర్

సంక్షిప్త వ్యాఖ్యానము
ఆ భగవానుని కపట (కొంటె) అవతారములు, ఉత్తమమైన వేదములో కొనియాడబడ్డ ప్రాకృతములు(నశ్యములు), ఏ వర్ణములో జన్మించినప్పటికీ శూద్రునిగా ఉండుట, అడవిలో సంచరించు గిరిజనుల మధ్య అత్యంత సుందరమైన సముద్ర వర్ణమును కలిగి ఉండుట, ద్రావిడ భాషయైన తమిళములో ఆ సర్వేశ్వరుడైన హరిని కొనియాడబడుట మరియు కుక్క మాంసమును తిను వంశములో పుట్టినప్పటికీ గొప్ప భక్తిని కలిగియుండుట అనునవి తెలిసినవారు నిత్యసూరులతో సమానులై పరమపదమును పొందెదరు. ఇవి ఏవి తెలియని వాళ్ళు వేదము నేర్చిన బ్రాహ్మణులైనప్పటికీ ఈ లోకములో అట్టడగు అధమ గతులను పొందెదరు.

వ్యాఖ్యానము
అనగా,

మా ఉరువిల్ కళ్ళ వేడమ్ –
తిరువాయిమొళి 5.8.2 “ఎమ్మా ఉరువుమ్ వేన్డుమ్ ఆత్తాయ్ ఆవాయ్”(ఆ సర్వేశ్వరుడు తన కోరిక మేరకే అన్ని జాతులలో అవతారములను స్వీకరించును) అని చెప్పినట్టు తన రూపాలు అన్నీ అప్రాకృతములు (దివ్యమైనవి) అవ్వడము చేత అవన్నీ ఉత్క్రుష్టములైనవే మరియు అట్టి రూపములను తన యొక్క సంకల్పముతోనే తాను స్వీకరించెను. అటువంటి అవతారములలో వేద మార్గమును నాశనము చేయుటకై వేదము యొక్క అప్రామాణికతను వివరించుటకై బుద్ధ మునిగా రూపమును దాల్చెను. శ్రీ రామాయణము అయోధ్యా కాండము 109.33 “యతాహి చోరః తతా హి బుద్ధః”(దొంగ వలె బుద్ధుని తిరస్కరించవలెను) అనియు తిరువాయిమొళి 5.10.4 “కళ్ళ వేడత్తైక్ కొణ్డు”(కపట వేషమును దాల్చి).

తిరున్దు వేదమలమాన మానిడమ్ పాడల్ –
భగవత్స్వరూపాదులను యథార్థముగా ప్రతిపాదించుటచే నిర్బంధమును పొందిన వేదమున “నసమర్తవ్యో విశేషేణ వేద మంత్రోపి అవైష్ణవః”(వేదమంత్రములలో కూడా విష్ణువుని చెప్పని వాటిని ప్రత్యేకముగా స్వీకరింపకూడదు) అన్నట్టు మాలిన్యమును కలిగి స్మరింప తగనివి తిరువాయిమొళి 3.9.3″మానిడమ్ పాడల్ ఎన్నావతు”(వేరొకరిని చేరడము మరియు మనుష్య జాతిని పాడడము వలన కలుగు ప్రయోజనము ఏమి?) అని చెప్పినట్టు చేతనులను (క్షేత్రజ్ఞ) కీర్తించు అట్టి వాక్యములను.

సర్వవర్ణ శూద్రత్వమ్ –
“నశూద్రా భగవద్భక్తా విప్రా భగవతాస్మృతాః సర్వవర్ణేషు తే శూద్రా మేహ్యభక్తా జనార్ధనే”(భగవానుని భక్తులు శూద్రులు కారు. వారు బ్రాహ్మణులతో సమానులై బ్రాహ్మణులుగానే తెలియబడుతారు. అన్ని వర్ణముల యందు భగవద్భక్తులు కాని వారు శూద్రులు) అని చెప్పినట్టు అన్ని వర్ణముల యందు భగవానుని పట్ల భక్తి లేని వారు శూద్రులుగా పిలువబడుతారు.

ఇవి ప్రమాణ, ప్రమేయ, ప్రమాతల విషయమున ఉన్నట్టి త్యాజ్యములు

కాడువాళ్ శాతియిల్ కడల్ వణ్ణన్ వేడమ్ –
నాచ్చియార్ తిరుమొళి 12.8 “కాడు వాళ్ సాదియుమ్ ఆగప్ పెత్తాన్”(తమ ఇళ్ళని విడిచి అడవులలో నివసించు గోప కులమున తాను అవతరించెను) అని చెప్పినట్టు ఊరిలో తమ గృహములలో ఉండకుండా పశువులకు మేత, నీరు ఉండు అడవులలో ఉండుటచే “కాడు వాళ్ సాది” (అడవిలో ఉండు జాతి) అని పిలువబడి గోప కులము వారిలో ఒకడై అవతరించిన శ్రీ కృష్ణుని యొక్క పెరియాళ్వార్ తిరుమొళి 3.3.1 “కాలిప్పిన్నే వరుగిన్ఴ కడల్ వణ్ణన్ వేడత్తై వన్దు కాణీర్”(మేఘము వంటి వర్ణమును కలిగి ఆవు పాలు పితుకు శ్రీకృష్ణుని దివ్య మంగళ విగ్రహమును వచ్చి చూడండి) అని తాము అనుభవించి ఇతరులను పిలిచి చూపించినట్లు పశువులను మేపుకొని వచ్చునప్పుడే అలంకరింపబడి ఉన్నట్టి విగ్రహము.

తెన్నురైయిల్ హరికీర్తి
పెరియ తిరుమాడల్ “తెన్నురయిల్ కేట్టఴవతుణ్డు”(మేము తమిళ భాషలో విని ఉన్నాము) అని చెప్పినట్టు దక్షిణ దిక్కున ఉన్నందున తెన్నురై(దక్షిణిగా దేశ భాష)గా పిలువబడు దివ్య ప్రబంధములు మాత్స్య పురాణము “హరి కీర్తనమ్ వినైవాన్యత్ బ్రాహ్మణేన నరోత్తమ భాషా గానం న కర్తవ్యమ్ తస్మాత్ పాపమ్ త్వయాకృత్యమ్”(ఓ రాజా! విష్ణువును స్తుతించు పాశురములను తప్ప బ్రాహ్మణుడు ఇంకా ఏదియూ పడకూడదు) భగవానుని కొనియాడు పాశురములు.

శ్వపచరిల్ పత్తి పాసనముమ్ –
“శ్వపచోపి మహీపాల విష్ణుభక్తో ద్విజాధికః”(ఓ రాజా! కుక్క మాంసమును తిను వాడు విష్ణు భక్తుడు అయినచో వాడు బ్రాహ్మణుని కంటే అధికుడు) అని చెప్పినట్టు స్వప్రయత్నము చేత లభ్యము కాని ఆ సర్వేశ్వరుని పాద పద్మముల యందు భక్తి అను ధనము కుక్క మాంసమును తిను వారిలో ఉన్నట్లు అయినచో తిరుచ్ఛన్ద విరుత్తమ్ 100 “పెఴఴ్కియ నిన్న పాద పత్తియాన పాసనమ్”(అంత సులువుగా దక్కనిదైన అట్టి భక్తి నాకు కృపతో అనుగ్రహించు)

ఇట్టి విషయములు ప్రమాణ, ప్రమేయ, ప్రమాతలలో ఉపాదేయములు.

ఎవరికి అయితే ఇవి తెలుసునో తిరువాయిమొళి 10.5.8 “ఆరార్ అమరర్”(నీటితో నిండియున్న నీలి మేఘము వంటి వర్ణమును కలిగిన వాని దివ్య నామమును ఎవరైతే ఎంతకీ తృప్తి చెందక పలికెదరో అట్టి వారు నిత్య సూరులతో సామానులు) అని చెప్పినట్టు వారు నిత్యసూరులతో సామానులు మరియు అట్టి వారు ఎటువంటి జన్మము ఎత్తినా ఎట్టి వర్ణములో జన్మించినప్పటికీ ఉత్క్రుష్టులు. అట్టి వారు ప్రకాశించుచున్న పరమపదమును పొందెదరు. తిరువాయిమొళి 3.8.11 “ఇలంగు వాన్ యావరుమ్ ఏరువర్”(ఆ వెయ్యి పాశురములలో గొప్పవైన ఈ పది పాశురములను పఠిస్తే (పఠించిన వారందరు) ప్రకాశవంతమైన పరమపదమును పొందెదరు.

ఈ ప్రమాణ, ప్రమేయ, ప్రమాత విషయమున గొప్పతనమును తెలుసుకొనక నీ పాద పద్మములనే ఆరాధించుట అనునది స్వరూపముగా కలిగిన అట్టి భాగవతుల జన్మను నిరూపించువారు గొప్ప వర్ణములో జన్మించి వేదములను వాటి అంగములతో నేర్చి, భగవతులలో గొప్ప వారైనప్పటికీ అక్కడిక్కకడే కుక్క మాంసమును తిను చండాలులై అధోగతుల పాలై ఎప్పటికి ఉద్ధరింపబడని స్థితిని పొందెదరు. తిరుమాలై 43 “అమరవోర్ అంగమ్ ఆఴుమ్”. “అనాచారాన్ దురాచారాన్ అజ్ఞాతృూన్ హీన జన్మనః మద్భక్తాన్ స్రోత్రియో నిందన్ సత్యః చండాలతామ్ వ్రజేత్”(వేదములో గొప్ప నేర్పును సాధించిన వాడైనప్పటికీ ఒకడు నా భక్తులను జ్ఞానము లేని వాడు అని, ధర్మము లేని వాడు అని దూషించినచో తప్పక కుక్క మాంసమును తినే వాడి స్వభావమును పొందుతాడు)

అందుచేత సూత్రము 75 “వీట్టిన్బ …” మొదలుకొని సూత్రము 84 “నిమగ్నరై ఉయర్తత్త తాళ ఇళిన్దార్” వరకు నాయనార్లు ఆళ్వార్ల గొప్పతనమును చెప్పి ఇంకనూ ఆ గొప్పతనమును సిద్ధింపజేయుటకు సూత్రము 85 “మ్లేచ్చానుమ్ భక్తన్ ఆనాల్” మొదలుకొని సామాన్యమగు భాగవతుల గొప్పతనమును వివరించి మొదటి వాక్యముతో ప్రమాత (ఆళ్వారు) యొక్క గొప్పతనమును ప్రమాణము (తిరువాయిమొళి) మరియు ప్రమేయము (అర్చావతార భగవానుడు) తో కూడి ముగించినారు.

అడియేన్ పవన్ రామానుజ దాస

మూలము : https://granthams.koyil.org/2024/07/19/acharya-hrudhayam-90-english/

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment