శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః

యుధిష్ఠిరుడు, శ్రీకృష్ణుడు ఆధ్వర్యంలో రాజసూయ యాగాన్ని ప్రారంభించాడు. అనేకమంది ఋషులు, మహానుభావులను నియమించి యాగాన్ని ఘనంగా నిర్వహించడం ప్రారంభించాడు.
ఆ యాగంలో మొదటి మర్యాద ఎవరికి ఇవ్వాలి అనే ప్రశ్న వచ్చింది. అప్పుడు సహదేవుడు ముందుకు వచ్చి, శ్రీకృష్ణుని మహిమను స్పష్టంగా, దృఢంగా వివరిస్తూ. “సర్వోన్నతుడైన భగవాన్ శ్రీకృష్ణుడికే మొదటి మర్యాదలు ఇవ్వాలి” అని ప్రకటించాడు. సహదేవుని మాటలను విన్న పెద్దలు, సభలోని అందరూ ఆనందంతో ప్రశంసించారు. యుధిష్ఠిరుడు శ్రీకృష్ణునికి అత్యున్నత ఆసనాన్ని సమర్పించి, ఆయన పాదాలను కడిగి, పాదపూజ చేశాడు. ఆ పవిత్ర తీర్థాన్ని తన తలపై, తన సోదరుల తలలపై మరియు బంధువుల తలలపై చల్లుకున్నాడు. అక్కడ ఉన్న అనేకమంది కూడా అలాగే చేశారు. అందరూ “జయము! జయము!” అని ఘోషించగా, ఆకాశం నుండి పుష్పవర్షం కురిసింది.
ఇది అంతా చూసిన శిశుపాలుడు తీవ్రమైన కోపంతో ఉలిక్కిపడ్డాడు. అతనికి ముందే కృష్ణునిపై ద్వేషం ఉండేది. వెంటనే కృష్ణునిపై అపవాదాలు మోపుతూ, అవమానకరమైన మాటలు మాట్లాడడం ప్రారంభించాడు. అది చూసిన పాండవులు అతనిపై దాడి చేయడానికి సిద్ధపడ్డారు. కానీ కృష్ణుడు వారిని ఆపాడు. ఎందుకంటే, శిశుపాలుడు చేసిన వంద అపవాదాలను తాను సహిస్తానని కృష్ణుడు ముందే ప్రతిజ్ఞ చేశాడు. ఆ పరిమితిని దాటితేనే అతనికి శిక్ష విధించాలని నిర్ణయించాడు. ఆ విధంగా శిశుపాలుడు వంద అపవాదాలను దాటి మాట్లాడిన వెంటనే, కృష్ణుడు తన సుదర్శన చక్రంతో శిశుపాలుని శిరస్సును ఖండించాడు. ఆ సమయంలో, శిశుపాలుడు అనేకసార్లు కృష్ణుని దివ్యనామాలను ఉచ్చరించినందున, అలాగే బ్రహ్మమానసపుత్రుల శాపం వల్ల పొందిన అతని మూడు జన్మలు ముగిసినందున, చివరకు అతడు భగవంతుని చేరుకున్నాడు.
ఆ తరువాత యాగం అత్యంత వైభవంగా పూర్తయింది. యుధిష్ఠిరుడు యాగానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికీ ఘనమైన కానుకలను సమర్పించి గౌరవంగా వీడ్కోలు పలికాడు. అనంతరం కృష్ణుడు కూడా తన కుటుంబ సభ్యులు, పరివారంతో కలిసి ద్వారకాకు తిరిగి వెళ్ళాడు.
ఆళ్వారులు అనేక చోట్ల శిశుపాలవధను ప్రస్తావించారు. పెరియాళ్వార్ తమ పెరియాళ్వార్ తిరుమొళిలో ఇలా అంటారు: “పలపల నాళం సొల్లి పళిత్త శిశుపాలన్ తన్నై అలవలామై తవిర్త అళగన్ అలంగారన్ మలై” (అనేక విధాలుగా కృష్ణుణ్ణి దూషించిన శిశుపాలుని వ్యర్థప్రలాపాలను అంతం చేసిన సుందరస్వరూపుడైన భగవత్ కొండ). ఆండాళ్ తమ నాచ్చియార్ తిరుమొళిలో, కృష్ణుడు సంహరించినవారిని పేర్కొంటూ: “అన్ఱు ఇన్నాదన సెయ్ శిశుపాలనుమ్ ” (ఆ రోజు తప్పు చేసిన శిశుపాలుడు). నమ్మాళ్వార్ తిరువాయిమొళిలో శిశుపాలుడు పొందిన పరమగతిని అద్భుతంగా వివరిస్తూ ఇలా అంటారు: “కేట్పార్గ ల్ కేశవన్ కీర్తి అల్లాళ్ మఱ్ఱుం కేట్పరో సెవి సుడు కీళ్మై వసవుగలే వైయుం సేట్పాల్ పళమ్ పగైవన్ శిశుపాలన్ తిరువడి తాళ్ పాల్ అడైంద తన్మయ్ అఱివారై అఱిందుమే” ( కృష్ణునిపై నీచమైన దూషణలు చేసిన చిరకాల శత్రువైన భగవద్విరోధులు సైతం వినలేని మాటలు తిట్టిన శిశుపాలుడే చివరకు ఆయన దివ్యపాదాలను చేరుకున్నాడని తెలిసినవారు, భక్తులు, ముముక్షువులు మరెవరి గొప్పతనాన్ని వినగలరు? కేశిని సంహరించిన కేశవుని మహిమను తప్ప మరెవరి కీర్తిని వినగలరు?)
ఈ సంఘటన యొక్క సారాంశం:
- విష్ణులోకంగా ప్రసిద్ధి చెందిన క్షీరాబ్ధిలో జయ, విజయులు అనే ద్వారపాలకులు ఉండేవారు. వారు బ్రహ్మమానసపుత్రుల శాపం వల్ల మూడు జన్మలు భూమిలో పొందుతూ భగవంతునికి విరోధులుగా జన్మించారు. ఆ జన్మలలో చివరిది శిశుపాలుడు మరియు దంతవక్రుడు.
- మన పూర్వాచార్యులు, శిశుపాలుడు భగవంతుని చేరిన విషయాన్ని భిన్నరీతులలో వివరిస్తారు. కొందరు, “శిశుపాలుడు వంటి వారు ఇక్కడ ఉండి ఇతరులను కూడా చెడగొట్టడం కంటే, పరమపదంలో ఒక మూలన ఉన్నా మేలే” అని భావించి భగవాన్ అతనిని అక్కడికి చేర్చాడని అంటారు. మరికొందరు, “భగవంతుడు అతనిని సంహరించడానికి ముందు తన దివ్యసుందరరూపాన్ని అతనికి దర్శింపజేశాడు. ఆ రూపదర్శనం వల్ల అతనిలో పరమభక్తి ఉద్భవించి, దాని ఫలంగా అతడు భగవంతుని చేరుకున్నాడు” అని వివరిస్తారు.
మూలం : https://granthams.koyil.org/2023/10/20/krishna-leela-44-english/
అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org