శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః
ఉపదేశం 4
సామాన్య శాస్త్ర నిరతో నైవ తిష్టేత్ కదాచన ||
సరళమైన వివరణ: ఒక శ్రీవైష్ణవుడు కేవలం ‘సామాన్య శాస్త్రం’పై మాత్రమే దృష్టి సారించకూడదు. సామాన్య శాస్త్రం అనేది ప్రాథమికమైన వైదిక ధర్మం. వేదాలను, అలాగే తర్కం, మీమాంస, వ్యాకరణం వంటి ఇతర శాస్త్రాలను అభ్యసించడానికి అర్హత కలిగిన ఎవరైనా సరే, తమ యవ్వన వయస్సు లోనే ఈ శాస్త్రాలను క్షుణ్ణంగా నేర్చుకోవడానికి కృషి చేయాలి; అంతేకాక వేదాధ్యయనం (వేదాలను నేర్చుకోవడం) కూడా తప్పక నిర్వహించాలి.ఈ అర్హత ఎవరికి ఉంటుంది అంటే – బ్రాహ్మణ, క్షత్రియ మరియు వైశ్య కులాలలో జన్మించి, ఉపనయనం మరియు బ్రహ్మోపదేశం పొందిన వారికి.కాబట్టి, అటువంటి వ్యక్తులు ఈ సామాన్య శాస్త్రాలను అభ్యసించడానికి అర్హులు. అందువల్ల, వారు తమ యవ్వనంలోనే వీటిని నేర్చుకుని, సాధ్యమైనంత వరకు కంఠస్థం చేసుకోవచ్చు.కానీ ఉన్నత స్థాయి శాస్త్రాలు – అంటే ‘విశేష శాస్త్రాలు’ – దివ్య ప్రబంధం, వేదాంతం మరియు రహస్య గ్రంథాల రూపంలో ఉన్నాయి; ఇవన్నీ ఉన్నత జ్ఞానానికి సంబంధించిన మూలములు.కాబట్టి ఒక శ్రీవైష్ణవుడు కేవలం సామాన్య శాస్త్రాలను నేర్చుకోవడంపైనే దృష్టి సారించి, వాటిని బోధించడంలోనో లేదా వాటిపై చర్చలు జరపడంలోనో మాత్రమే తన సమయాన్ని గడపకూడదు.అదే విధంగా, ‘అనుష్ఠానం’ (ఆచరణ) విషయానికి వస్తే, ప్రతిరోజూ పాటించాల్సిన అనేక నిత్యకర్మలు ఉన్నాయి – స్నానం, సంధ్యావందనం, ఔపాసనం, సమిదాధానం మొదలైనవి. ఈ విధంగా, వైదిక ధర్మాన్ని స్వీకరించిన ఎవరికైనా అనేక కార్యక్రమాలు నిర్దేశించబడ్డాయి.అయితే, ఒక వ్యక్తి కేవలం ఆ ఆచారాలు మరియు కార్యక్రమాలపైనే దృష్టి సారించకూడదు.వాటికి మించిన ఉన్నతమైన అంశాలు కూడా ఉన్నాయి – అవి తిరువారాధనం, కైంకర్యం మొదలైనవి. కాబట్టి, ఆచరణలోనూ, అనుష్ఠానంలోనూ ఇవన్నీ ‘విశేష శాస్త్రాల’ కిందకు వస్తాయి.కాబట్టి జ్ఞానంలోనూ, అనుష్ఠానంలోనూ – ఈ రెండు విషయాలలోనూ – ఒక వ్యక్తి కేవలం సామాన్య శాస్త్రానికే పరిమితమైపోకూడదు.ఇది అత్యంత ప్రాథమికమైన నియమం.సామాన్య శాస్త్రం అనేది ఒక పునాది (ఆధారం) వంటిది; కాబట్టి బాల్యదశలో ఉన్నప్పుడే ఆ జ్ఞానాన్ని సంపాదించి, ఆచరణలో పెట్టాలి. అయితే, భక్తి మరియు జ్ఞానం వృద్ధి చెందుతున్న కొద్దీ, వ్యక్తి తన దృష్టిని మరింత ఉన్నతమైన ఆధ్యాత్మిక సూత్రాల వైపు మళ్ళించాలి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మనం తర్వాతి వాక్యంలో కూడా పరిశీలిద్దాం.
వీడియో లింక్: https://www.youtube.com/shorts/JeUeMb08psc
ఉపదేశం 5
భగవద్విషయే శాస్త్రే నిరత: సర్వధా వసేత్ ||
సరళమైన వివరణ:భగవద్విషయం అనే శాస్త్రంపై ఒక వ్యక్తి పూర్తి ఏకాగ్రతతో, సంపూర్ణ నిమగ్నతతో ఉండాలి.కాబట్టి, ఇక్కడ నాలుగవ ఉపదేశానికి కొనసాగింపుగా, భగవద్ రామానుజులు శ్రీవైష్ణవుల ఏకాగ్రత దేనిపై ఉండాలో నొక్కి చెబుతున్నారు. శ్రీవైష్ణవులుగా, ఒకవేళ తగిన అర్హత ఉంటే, ఎవరైనా ‘సామాన్య శాస్త్రాన్ని’ (సాధారణ శాస్త్రాలను) అభ్యసించవచ్చు మరియు ఆచరించవచ్చు కూడా; అంటే తర్కం, మీమాంస, వేదాలను నేర్చుకోవడం; వేదాధ్యయనం చేయడం, వేదాలను బోధించడం, పఠించడం, వివిధ తత్వశాస్త్రాలను విశ్లేషించడం వంటివి చేయడం. అదేవిధంగా, ఆచరణలో భాగంగా, ఒకరు తమ దైనందిన నిత్యకర్మలన్నింటినీ నిర్వర్తిస్తూ ఉండవచ్చు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన నిత్యకర్మలను ఎటువంటి లోపం లేకుండా తప్పక ఆచరించాలి.మనకు ఏవైతే విధిగా ఆచరించాల్సినవిగా నిర్దేశించబడ్డాయో, వాటిని మనం తప్పక చేయాలి. కానీ వాటికి అతీతంగా, ఒకరు తమ ప్రధాన దృష్టిని ‘భగవద్విషయం’పైనే కేంద్రీకరించాలి.అంటే దివ్య ప్రబంధాలు, రహస్య గ్రంథాలు, పూర్వాచార్యుల గ్రంథాలు – వీటన్నింటినీ తప్పక అభ్యసించి, సంపూర్ణంగా అవగాహన చేసుకోవాలి. మనం దివ్య ప్రబంధాలను, వాటి అర్థాలను పెద్దల నుండి మరియు ఆచార్యుల నుండి అత్యంత క్షుణ్ణంగా నేర్చుకోవాలి.
ఆపై, మన ఆచరణాత్మక జీవితంలో (అనుష్ఠానం) మనం ‘కైంకర్యానికే’ అగ్ర ప్రాధాన్యతనివ్వాలి.మన సంపూర్ణ జీవితం కైంకర్యానికే అంకితం కావాలి.నేటి రోజుల్లో, చాలామంది కైంకర్యాన్ని ఒక ‘ప్రత్యామ్నాయ ఎంపిక’గా మాత్రమే పరిగణించడం మనం చూస్తున్నాం.తమకు తీరిక దొరికినప్పుడు మాత్రమే వారు కైంకర్య కార్యాల్లో పాల్గొంటున్నారు.వారికి వేరే ప్రాధాన్యతలు ఉన్నాయి.శ్రీవైష్ణవులతో సహా ప్రతి ఒక్కరికీ కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి – కుటుంబం, ఉద్యోగం, చదువు, వ్యాపారం వంటివి; వీటన్నింటి మధ్య, రోజుకు కేవలం కొద్ది సమయం మాత్రమే వారు కైంకర్యం కోసం కేటాయిస్తున్నారు.కానీ వాస్తవానికి, మన దృష్టి కేవలం కైంకర్యంపైనే నిలిచి ఉండాలి – అంటే భగవత్ కైంకర్యం (భగవంతునికి చేసే సేవ), భాగవత కైంకర్యం (భాగవతులకు, భక్తులకు చేసే సేవ), మరియు ఆచార్య కైంకర్యం.మన జీవితం మొత్తం కేవలం ఈ కైంకర్యం కోసమే అంకితం కావాలి.మనం శ్రీవైష్ణవ కుటుంబాల్లో జన్మించడం గానీ, ఆచార్యులతో అనుబంధం ఏర్పరచుకుని శ్రీవైష్ణవులుగా మారడం గానీ – మనం ఒక భక్తునిగా (భాగవతునిగా) పరిణమించడం గానీ – ఈ వాస్తవాలన్నీ మనం మన సమయాన్ని భగవంతుని, భాగవతుల మరియు ఆచార్యుల సేవలోనే గడపాలని సూచిస్తున్నాయి.ఒకవేళ మనం వేరే పనులు చేయడానికి, అంటే లౌకిక జనాల్లాగే ఉద్యోగ వ్యాపారాలు చేసుకోవడానికి మాత్రమే ఉద్దేశించబడి ఉంటే, మనం వేరే కుటుంబాల్లో జన్మించి ఉండేవాళ్ళం; అంతేకాక, మనకు ఆచార్య సంబంధం కూడా లభించి ఉండేది కాదు.మనకు ఈ గొప్ప అనుబంధాలన్నీ – ఆచార్యులతో, భగవంతునితో – లభించడం, అలాగే కొంత ప్రాథమిక జ్ఞానాన్ని కూడా మనం పొందడం అనే వాస్తవం… ఆ జ్ఞానాన్ని మనం ఆచరణలో పెట్టాలని తెలియజేస్తోంది.ఆచరణలో పెట్టకపోతే, కేవలం జ్ఞానం వల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండదు.కాబట్టి, మన ప్రధాన దృష్టి భగవత్ మరియు భాగవత కైంకర్యంపైనే ఉండాలి.భగవద్విషయ శాస్త్రం అందించే సందేశం ఇదే. ఉన్నతమైన శాస్త్రం – అంటే ‘భగవద్విషయం’ – ఎల్లప్పుడూ కైంకర్యానికే అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. భగవద్ రామానుజులు తమ ఐదవ ఉపదేశంలో ఈ విషయాన్నే ప్రముఖంగా నొక్కిచెప్పారు.
వీడియో లింక్: https://youtube.com/shorts/RqERg_UU5bc?si=a2tGqOic7UlEeAvY
ఉపదేశం 6
ఆచార్య కృపయా పూర్వం సంజాత జ్ఞాన సాగర: |
భూయ: శబ్ధాధి విషయ కింకరో నైవ వర్తయేత్ ||
సరళమైన వివరణ: గతంలో ఒక ఆచార్యుని ఆశీర్వాదం పొంది, దానివల్ల జ్ఞానాన్ని సంపాదించిన శిష్యుడు, మరలా ఇంద్రియ భోగాలలో, లౌకిక సుఖాలలో మునిగిపోకూడదు.ఆచార్యులు కరుణామయులు.వారు తప్పక పూర్వాచార్యుని వద్ద విద్యనభ్యసించి ఉండాలి.వారు నేర్చుకున్న విషయాలను వారి జీవితంలో ఆచరణలో పెట్టి ఉండాలి.అంతేకాదు, వారిను ఆశ్రయించి, మార్గదర్శనం కోరిన వారిపై కూడా వారు వారి యొక్క కరుణను కురిపిస్తారు.అంతేకాదు, ఒక వ్యక్తి గొప్ప భక్తుడు కాగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడని గుర్తించిన వెంటనే, ఆచార్యులు అపరిచితుల వద్దకు కూడా స్వచ్ఛందంగా వెళ్లి వారి కరుణను కురిపించగలరు.ఈ విధంగానే గొప్ప ఆచార్యులు స్వచ్ఛందంగా వెళ్లి, అవైధిక స్వభావం గల వారిని సైతం అత్యంత వైధిక స్వభావం గల వారిగా తీర్చిదిద్దారు.ఈ పద్ధతిలోనే ఆచార్యుని కరుణను పొంది, దానివల్ల జ్ఞానాన్ని సంపాదించినవాడు (ఇక్కడ ప్రత్యేకంగా చెప్పబడింది ఏమిటంటే) కరుణతోనే జ్ఞానాన్ని సంపాదించాలి. కేవలం కరుణ పొందడం మాత్రమే సరిపోదు – కొంత శుభాన్ని ప్రసాదించడం, కొంత ప్రాథమిక భక్తిని కలిగించడం సరిపోతుంది.కానీ ఆచార్యుని వద్ద తప్పక విద్యనభ్యసించాలి.ఆచార్యులు తమను ఆశ్రయించిన వారికి బోధించడానికి సుముఖంగా ఉండాలి.దానికోసం ఆయన నియమాలను ఆచరిస్తూ ఉండాలి.కాబట్టి, ఈ అంశాలన్నీ ఉన్నాయి.అటువంటి అంశాలన్నీ ఒకే సరళరేఖపైకి వచ్చి, ఆచార్యులు శిష్యునికి లోతైన, సంపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించినప్పుడు, ఆ తర్వాత ఆ శిష్యుడు లౌకిక సుఖాలను అనుభవించే తన పాత మార్గాలకు తిరిగి వెళ్ళకూడదు.ఎందుకంటే, ఆచార్యుల ఆశీర్వాదం పొందడంలో అసలు ఉద్దేశ్యం ఈ సంసారం నుండి తప్పించుకోవడమే.శిష్యుడు ఆ విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడు, అతను తన పూర్వ మార్గాలకు తిరిగి వెళ్ళడు.అలాగే, ఆచార్యులు శిష్యుడిని రక్షించడంలో ఎంతో నిబద్ధతతో ఉన్నప్పుడు, ఆయన శిష్యుడిని కూడా జారిపోనివ్వరు.
వీడియో లింక్: https://youtube.com/shorts/YEzj3jrIw-s?si=wjpslkz7y3Mlm9Cp
ఆంగ్లంలో: https://granthams.koyil.org/2026/04/16/bhagavath-ramanujas-final-instructions-4-6-english/
అడియేన్ దాసరి కేశవ కృష్ణ రామానుజ దాసన్
ప్రూఫ్ రీడింగ్ చేసినవారు – ప్రసూన రామానుజ దాసి
https://granthams.koyil.org లో ఆర్కైవ్ ఉంచబడినది.
ప్రమేయం (లక్ష్యం) – https://koyil.org
ప్రమాణం (గ్రంధాలు) – https://granthams.koyil.org
ప్రమాతా(ఉపదేశకులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్యా/పిల్లల పోర్టల్ – https://pillai.koyil.org