కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 49 – విదురుణ్ణి అనుగ్రహించుట

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి

<< 48 – పాండవ దూత భాగం – 1

పాండు రాజు మరియు విదురుడు, ధృతరాష్ట్రుని తమ్ముళ్లు. విదురుడు కృష్ణునిపై అపారమైన భక్తి కలిగినవాడు. మన సంప్రదాయంలో ఆయన అంత గొప్పవాడై ఉండటంతో, “విదురాళ్వాన్” అని గౌరవంగా పిలువబడతాడు. కృష్ణుడు పాండవదూతగా హస్తినాపురానికి వచ్చినప్పుడు విదురునిపై ప్రత్యేక కృపను కురిపించాడు. ఆ సంఘటనను ఇప్పుడు ఆస్వాదిద్దాం.

కృష్ణుడు పాండవుల వద్ద నుండి సెలవు తీసుకొని ధృతరాష్ట్రుని హస్తినాపురానికి చేరుకున్నాడు. అక్కడికి వచ్చిన వెంటనే నేరుగా విదురుని గృహానికి వెళ్ళాడు. కృష్ణుని రాకను ఊహించని విదురుడు, సర్వేశ్వరుడు తన ఇంటిని వెదికి వచ్చాడనే ఆశ్చర్యంతో, భక్తిపరవశుడై వణికిపోయాడు. ఏమి చేయాలో తెలియక, కృష్ణుణ్ణి ఆహ్వానించి ఒక ఆసనాన్ని ఏర్పాటు చేశాడు. తరువాత ఆ ఆసనాన్ని తానే మళ్లీ పరిశీలించాడు. తానే ఏర్పాటు చేసినప్పటికీ, ధృతరాష్ట్రుడు మొదలైన వారితో తనకు సంబంధం ఉన్నందున, తెలియకుండానే కృష్ణునికి ఏదైనా అపకారం జరిగి ఉండవచ్చని భావించి దానిని మరోసారి జాగ్రత్తగా పరిశీలించాడు.

తర్వాత కృష్ణునికి భోజనం సమర్పించాలని అనుకున్నాడు. ఒక అరటిపండును తీసుకొని, భక్తి పారవశ్యంలో పండును పడేసి తొక్కనే కృష్ణునికి అందించాడు. కృష్ణుడు దానినే ఆనందంగా స్వీకరించాడు.

ఆ తరువాత, కృష్ణుడు తన రాక ఉద్దేశ్యాన్ని విదురునికి తెలియజేశాడు. యుద్ధం తప్పదని, అలాంటి యుద్ధంలో విదురుడు పాల్గొనకూడదని అతని హృదయంలో కృపతో ఆ భావనను నాటాడు.

తర్వాత కృష్ణుడు ధృతరాష్ట్రుని రాజసభకు వెళ్లాడు. కృష్ణుని రాక గురించి తెలిసిన దుర్యోధనుడు, “కృష్ణుడు సభలోకి వచ్చినప్పుడు ఎవరూ లేచి నిలబడకూడదు” అని అందరికీ ఆజ్ఞాపించాడు. కానీ కృష్ణుడు సభలో ప్రవేశించినప్పుడు, తనకు తెలియకుండానే దుర్యోధనుడే లేచి నిలబడ్డాడు. అది చూసి సభలో ఉన్న వారందరూ కూడా లేచారు. అప్పుడు దుర్యోధనుడు, “మీరు అందరూ ఎందుకు లేచారు?” అని అడిగాడు. వారు, “మీరు లేచారు కాబట్టి మేమూ లేచాము” అని సమాధానం చెప్పారు. దాంతో దుర్యోధనుడు సిగ్గుతో తల వంచుకున్నాడు.

తరువాత కోపంతో కృష్ణుణ్ణి ఉద్దేశించి, “భీష్ముడు, ద్రోణుడు, నేను వంటి మహానుభావులు ఇక్కడ ఉండగా, నీవు ఎందుకు ఆ తక్కువవాడైన విదురుని ఇంటికి వెళ్లావు?” అని ప్రశ్నించాడు. దానికి కృష్ణుడు, “శత్రువుల ఇంట భోజనం చేయకూడదు; అలాగే శత్రువులకు భోజనం పెట్టకూడదు” అని అన్నాడు. దుర్యోధనుడు, “కానీ నేను నీ శత్రువును కాను కదా!” అని అన్నాడు. అప్పుడు కృష్ణుడు, “నీవు పాండవుల పట్ల శత్రుత్వాన్ని కలిగి ఉన్నావు. అందువల్ల నీవు నాకు కూడా శత్రువువే. అందుకే నేను నీ ఇంటికి రాకుండా, నాపై అపారమైన ప్రేమ కలిగిన విదురుని ఇంటికి వెళ్ళాను” అని సమాధానం ఇచ్చాడు.

పూర్వాచార్యులు, తమ వ్యాఖ్యానాలల్లో, మంగళాశాసననికి వివరణం ఇస్తూ, విదురుని ఈ మహోన్నత గుణాలను ఎంతో అందంగా వర్ణించారు.

ఈ సంఘటన యొక్క సారాంశం:

  • భగవంతుని భక్తులు ఆయనపై ఉన్న అపారమైన ప్రేమ వల్ల పరవశులై తికమకపడితే, భగవంతుడు దానినే ఆనందంగా ఆస్వాదిస్తాడు.
  • భగవద్గీతలో “భక్తితో ఎవరు ఏదైనా సమర్పించినా నేను దానిని స్వీకరిస్తాను” అని చెప్పిన మాటను, విదురుని విషయంలో కృష్ణుడు ఆచరణలో చూపించాడు.
  • విదురుడు భగవంతుని శ్రేయస్సునే ఎల్లప్పుడూ కోరుకునే “మంగళాశాసనపరుడు”గా, పెరియాళ్వార్, నమ్మాళ్వార్, పిల్లై ఉరంగావిల్లి దాసర్‌లతో సమానంగా గౌరవించబడుతున్నాడు.
  • విదురుని వైభవాన్ని గుర్తించిన కృష్ణుడు, ఆయనకు అంత్యక్రియలుగా గొప్ప భాగవతులకు నిర్వహించే “బ్రహ్మమేధ సంస్కారం” చేయమని యుధిష్ఠిరునికి ఆజ్ఞాపించాడు.

మూలం : https://granthams.koyil.org/2023/10/25/krishna-leela-49-english/

అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment