శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
<< 47 – ద్రుపదిని అనుగ్రహించుట

కృష్ణుడు, ప్రదర్శించిన అత్యద్భుతమైన గుణాలలో ఒకటి ఆశ్రిత పారతంత్ర్యం, అంటే తన భక్తుల మాటలను పూర్తిగా అనుసరించడం. ఈ గుణాన్ని ప్రధానంగా రెండు సందర్భాలలో చూడవచ్చు – ఒకటి పాండవుల దూతగా వెళ్లడం, రెండవది అర్జునునికి సారథిగా ఉండడం. వీటిలో పాండవుల కోసం దూతగా వెళ్లిన లీలను ఇప్పుడు ఆస్వాదిద్దాం.
పాండవులు, పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం చేసి, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తి చేసిన తరువాత, ధృతరాష్ట్రుని వద్ద తమ రాజ్యాన్ని తిరిగి కోరారు. కానీ తన కుమారులపై ఉన్న మమకారం వల్ల ధృతరాష్ట్రుడు, దుర్యోధనుని పక్షపాతిగా ప్రవర్తించాడు. దుర్యోధనుడు మరియు అతని అనుచరులు పాండవులకు సూది మొన పెట్టేంత భూమిని కూడా ఇవ్వడానికి నిరాకరించారు.
ఆ సమయంలో పాండవులు మరియు కౌరవుల మధ్య యుద్ధం తప్పదన్న పరిస్థితి ఏర్పడింది. నిజానికి కృష్ణుడు కూడా అదే జరగాలని ఎదురుచూస్తున్నాడు. ఆయన హృదయంలో ఉన్న సంకల్పం ఏమిటంటే, ఎలాగైనా యుద్ధం జరగాలి, సమస్త దుష్టశక్తులు ఒకచోట చేరాలి, తరువాత అవన్నీ నాశనం చేయబడాలి. అందుకే “నేను వెళ్ళి శాంతిని స్థాపిస్తాను” అని చెప్పి దూతగా వెళ్ళి, చివరికి యుద్ధం జరిగేలా చేశాడు. దూతగా తనను పంపాలనే ఆలోచనను కూడా పాండవుల మనస్సుల్లో ఆయనే కలిగించాడు. గతంలో శ్రీరామావతారంలో, హనుమంతుడిని దూతగా పంపించాడు. హనుమంతుడు ఆ బాధ్యతను అద్భుతంగా నిర్వర్తించడంతో అందరూ అతనిని కీర్తించారు. అది చూసి భగవాన్ “మరొక అవతారంలో మనమే దూతగా వెళ్ళి అటువంటి కీర్తిని పొందాలి” అని సంకల్పించి, కృష్ణావతారంలో ఆ కార్యాన్ని స్వయంగా నిర్వర్తించాడు.
ఆళ్వార్లు కూడా తమ పాశురాలలో ఈ పాండవ దూత లీలను ఎంతో అందంగా అనుభవించారు. నమ్మాళ్వార్ తమ తిరువాయ్‌మొళిలో: “నాడుడై మన్నరక్కు తూదు సెల్ నంబిక్కు” (రాజ్యాధికారులైన పాండవుల తరపున దూతగా వెళ్ళి, అందువల్ల సంపూర్ణతను పొందినవాడు) అని కీర్తించాడు. తిరుమంగై ఆళ్వార్ తన పెరియ తిరుమొళిలో: “మూత్తవకు అరసు వేణ్డి మున్బు తూదు ఎళున్దరుళి” (ధర్మపుత్రుడైన పెద్దవాడు రాజ్యాన్ని తిరిగి పొందాలి అని కోరుకొని దూతగా వెళ్లినవాడా!” అని స్తుతించారు). అలాగే, “మున్నోర్ తూదు వానరత్తిన్ వాయిల్ మొళిన్దు అరక్కన్ మన్నూర్ తన్నై వాళియినాల్ మాళ మునిన్దు అవనే పిన్నోర్ తూదు ఆది మన్నర్క్కాగిప్ పెరుణిలత్తార్ ఇన్నార్ తూదన్ ఎన నినాన్ ఎవ్వుళ్ కిడన్దానే” అని, “శ్రీరామావతారంలో హనుమంతుని నోటి ద్వారా అపూర్వమైన సందేశాన్ని పంపి, లంకలో గర్వంగా నిలిచిన రావణుని బాణాలతో నాశనం చేయాలని సంకల్పించిన అదే పరమాత్మ, కృష్ణావతారంలో ఆదిరాజులైన పాండవుల కోసం దూతగా నిలబడి, ‘ఇతడు పాండవుల దూత’ అని ఈ విశాల భూమిపై ఉన్నవారు చెప్పుకునేలా చేశాడు; ఇప్పుడు ఆయన తిరువెవ్వుళ్‌లో శయనిస్తున్నాడు” అని అనుభవించారు.
ఈ సంఘటనలోని సారాంశం
- ఆ కాలంలో దూతగా వెళ్లడం అనేది చాలా తక్కువ స్థాయి పని, “కుక్క పని”గా కూడా భావించబడేది. అయినప్పటికీ, తన భక్తులైన పాండవుల కోసం భగవాన్ స్వయంగా దూతగా వెళ్లాడు. ఇది ఆయన సౌలభ్య గుణానికి (అత్యంత సులభంగా అందుబాటులో ఉండే స్వభావానికి) పరాకాష్టగా భావించబడుతుంది.
- భగవాన్ స్వయంగా పాండవ దూతగా వెళ్ళడానికి మరొక ముఖ్యమైన కారణం కూడా ఉంది. వేరెవరో దూతగా వెళ్ళి సంధిని కుదిర్చి ఉంటే, భూభారం తగ్గించడం సులభంగా సాధ్యపడేది కాదు. అందువల్ల ఆయన దివ్యసంకల్పం ఏమిటంటే, తానే దూతగా వెళ్ళి, యుద్ధం తప్పనిసరిగా జరిగేలా చేసి, సమస్త దుష్టశక్తులను ఒకే చోట చేర్చి, వాటన్నింటినీ సంహరించి భూభారాన్ని తగ్గించాలి. ఇదే ఆయన అంతరంగ ఉద్దేశ్యం.
మూలం : https://granthams.koyil.org/2023/10/24/krishna-leela-48-english/
అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org