శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః

కృష్ణుని, మహిమలు, సామర్థ్యం ప్రపంచ ప్రసిద్ధమైనవి. అందువల్ల యుద్ధం ప్రారంభానికి ముందు అర్జునుడు, దుర్యోధనుడు ఇద్దరూ కృష్ణుని సహాయం కోరడానికి వెళ్ళారు. ఆయన వారికి ఎలా సహాయం చేశాడో ఇప్పుడు అనుభవిద్దాం.
ఒకసారి కృష్ణుడు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో, దుర్యోధనుడు ఆయన దివ్య శయన మందిరంలోనికి ప్రవేశించాడు. అతడు నేరుగా కృష్ణుని దివ్య శిరస్సు వైపునకు వెళ్ళి నిలబడ్డాడు. కొంతసేపటి తరువాత అర్జునుడు వచ్చి కృష్ణుని దివ్య పాదాల దగ్గర నిలబడ్డాడు. ఇద్దరూ కృష్ణుడు మేల్కొనే వరకు వేచి ఉన్నారు. కరుణామయుడైన కృష్ణుడు మేల్కొని చూసినప్పుడు తన ఎదుట నిలబడి ఉన్న అర్జునుణ్ణి గమనించి, “ఏ ప్రయోజనంతో వచ్చావు?” అని అడిగాడు. అర్జునుడు సమాధానం చెప్పకముందే దుర్యోధనుడు మధ్యలో కలుగజేసుకొని, “నేనే ముందుగా వచ్చాను” అని అన్నాడు. అప్పుడు కృష్ణుడు అతనినీ చూసి ఆహ్వానించాడు. వారిద్దరి క్షేమాన్ని విచారించి, “మీకు ఏమి కావాలి?” అని అడిగాడు. అప్పుడు ఇద్దరూ, “రాబోయే యుద్ధంలో మీ సహాయం కావాలి” అని కోరారు. కృష్ణుడు, “ఒకవైపు నేను ఉంటాను; మరోవైపు నా నారాయణ సేన ఉంటుంది” అని చెప్పాడు. వెంటనే దుర్యోధనుడు, “నాకు నారాయణ సేన కావాలి” అని కోరాడు. అర్జునుడు మాత్రం, “నాకు మీరు నా పక్షాన ఉంటే చాలు” అని అన్నాడు. కృష్ణుడు వారి అభ్యర్థనలను అంగీకరించి, వారికి తగిన విధంగా సహాయం చేయడానికి వాగ్దానం చేశాడు. దుర్యోధనుడు అక్కడి నుండి బయలుదేరి భీష్ముడు, ద్రోణుడు మొదలైనవారు ఉన్న సభకు వెళ్లి, “కృష్ణుని నారాయణ సేనను నేను పొందాను” అని చెప్పాడు. వారు అతనిని మందలించి, “వెంటనే వెళ్ళి యుద్ధంలో కృష్ణుడు ఆయుధం ఎత్తనని ప్రమాణం చేయించు” అని అన్నారు. దుర్యోధనుడు తిరిగి వెళ్ళి అదే విధంగా కృష్ణుని చేత ప్రమాణం చేయించాడు.
నమ్మాళ్వారుల తిరువాయ్మొళిలో “కొల్లా మాక్కోల్” అనే పాశుర వ్యాఖ్యానంలో, నంపిళ్ళై స్వామి, ఈ సంఘటనను ఎంతో అందంగా వివరించారు. మరికొన్ని పాశురాల వ్యాఖ్యానాలలో కూడా ఆచార్యులు ఈ సంఘటనను వివరించారు.
ఈ సంఘటన యొక్క సారాంశం:
- భగవంతునిపై నిజమైన ప్రేమ కలిగిన వారికి ఆయన తననే అనుగ్రహిస్తాడు. కానీ కపటమైన ప్రేమ చూపించే వారికి, వారి భావానికి అనుగుణంగానే కపట సహాయాన్ని అందిస్తాడు.
- అంతేకాక, ఆయనపై ప్రేమ లేనివారు కూడా ఆయనను ఆశ్రయిస్తే, వారిని మోహింపజేసి, నిజమైన ప్రయోజనం లేని లాభాలను కోరుకునేలా చేసి, వాటితోనే సంతృప్తి చెందేలా చేసి పంపిస్తాడు.
మూలం : https://granthams.koyil.org/2023/10/27/krishna-leela-51-english/
అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org