వార్తామాలై – అయిదవ  భాగం – వార్తై 13 – 16

శ్రీ:     శ్రీమతే శఠకోపాయ నమః    శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః   

పూర్తి శ్రేణి

<< పూర్వపు భాగం

శ్రీ పిన్బళగియ పెరుమాళ్ జీయర్, నంపిళ్ళై వారి శ్రీ పాదముల వద్ద, శ్రీరంగం

వార్తామాలైలో మన తత్వశాస్త్రం, సంప్రదాయం, అలాగే మన పూర్వాచార్యుల ద్వారా పరంపరగా మనకు అందిన అనేక ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. వారి ఉపదేశాలను, అలాగే వారి జీవితంలోని ముఖ్యమైన సంఘటనలను, నంపిళ్ళైకి అత్యంత ప్రియమైన శిష్యులైన పిన్బళగియ పెరుమాళ్ జీయర్ సంక్షిప్తంగా సంగ్రహించారు. ఆయనే 6000 పడి గురుపరంపరా ప్రభావం గ్రంథకర్త కూడా.

చారిత్రక సంఘటనలను (ఐతిహ్యాలను) చదవడం ద్వారా సులభంగా అర్థం చేసుకోవచ్చు. అయితే, మన సిద్ధాంతానికి సంబంధించిన చిత్, అచిత్, ఈశ్వరుడు వంటి తత్త్వాలను లోతుగా విశ్లేషించే భాగాలను, అనేక వార్తలలో విశదీకరించబడిన వాటిని, పూర్తిగా గ్రహించడం కొంత కష్టంగా ఉండవచ్చు. ఈ భాగాలను అర్థం చేసుకోవడానికి శాస్త్రజ్ఞానం, అలాగే వేదాంతంలోని ప్రాథమిక విషయాలపై మంచి అవగాహన అవసరం.

ఈ గ్రంథాన్ని ప్రచురించి, అంతేకాకుండా ఇందులోని సంక్లిష్టమైన తాత్త్విక భావనలకు విపులమైన వివరణను అందించిన పుత్తూరు స్వామివారికి మేము ఎంతో కృతజ్ఞులము.

క్రింద ఇవ్వబడిన వ్యాసం, శ్రీ ఉ.వే. సారథి తొతాద్రి స్వామివారి తమిళ కాలక్షేపంలో వార్తామాలై గ్రంథంపై చేసిన వివరణకు అనువాదం. ఈ అవకాశాన్ని కల్పించినందుకు, అలాగే ఈ ప్రచురణకు నిరంతరం సహాయం అందిస్తున్నందుకు స్వామివారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు.

వార్తై అనే పదం, ఆచార్యులు తమ శిష్యులకు ఉపదేశించిన విషయాలను సూచిస్తుంది. ఈ ఉపదేశాలు గురుపరంపర ద్వారా తరతరాలకు అందుతూ వచ్చి, తరువాత సంక్షిప్తంగా అనుగ్రహించబడ్డాయి.

ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలను మనం గుర్తుంచుకోవాలి. కొన్ని సందర్భాలలో ఒకే భావన వేర్వేరు వార్తలలో, కొద్దిగా భిన్నమైన వివరణలతో లేదా అర్థవ్యాఖ్యానాలతో మళ్లీ కనిపించవచ్చు. దీనికి కారణం, ప్రతి ఆచార్యుడు ఒక నిర్దిష్ట అంశాన్ని ప్రత్యేకంగా నొక్కి చెప్పడానికి, తన వివరణలో వేర్వేరు దృక్పథాలను  ప్రధానంగా తీసుకోవడం కావచ్చు.

వార్తై 13

వార్తై 13 సారాంశం:

  • ఉభయ విభూతులు , అంటే సంసారం మరియు పరమపదం, రెండూ శ్రీమన్నారాయణునికి అధీనమైనవి మరియు ఆయనకు శేషభూతంగా ఉంటాయి.
  • ఈ రెండు విభూతులలో నివసించేవారు ప్రధానంగా మూడు వర్గాలుగా విభజించబడతారు:
    • బద్ధులు 
    • ముక్తులు
    • నిత్యులు

బద్ధులు మళ్లీ రెండు రకాలుగా ఉంటారు:

  • ముముక్షువులు – సంసార బంధం నుండి విముక్తిని కోరుకునేవారు.
  • సంసారులు – సంసారంలోనే ఉండి, దానిని అనుభవిస్తూ జీవించేవారు.
  • నిత్యులు అంటే ఎప్పుడూ అహంకారం, మమకారం కలిగి ఉండని వారు. వారు ఎప్పుడూ సంసారబంధంలోకి రాలేదు.
  • ముక్తులు అంటే సంసారంలో ఉన్నప్పుడు ఒకప్పుడు అహంకారం, మమకారం కలిగి ఉన్నవారు. అయితే పరమపదాన్ని చేరుకున్న తరువాత అవి పూర్తిగా తొలగిపోతాయి.
  • ఎంబెరుమాన్ (శ్రీమన్నారాయణుడు) తన మధురమైన అనుభవం కోసం నిత్యులను మరియు ముక్తులను తన కైంకర్యంలో వినియోగించుకుంటాడు. వారు భగవంతునికి నిత్య కైంకర్యం చేస్తూ ఆయన ఆనందానికి కారణమవుతారు.
  • సంసారంలో నివసించేవారిలో, సంసార జీవితం పట్ల విరక్తి చెంది, ఇక్కడ ఉండటాన్ని బాధగా భావించేవారిని ఎంబెరుమాన్ తన కృపకు పాత్రులుగా చేస్తాడు.
  • అదే సమయంలో, అహంకారం మరియు మమకారంతో సంసార జీవితాన్ని ఆనందిస్తూ ఉండేవారిని, ఎంబెరుమాన్ తన లీలకు ఆధీనులుగా చేస్తాడు.

మూలము 

ఉభయవిభూతియుమ్ ఈశ్వరనుక్కు శేషమాయ్ ఇరుక్కుమ్; ఇదిల్ ఇరుక్కుమవర్గళ్ బద్ధరుమ్, నిత్యరుమ్, ముక్తరుమ్. బద్ధర్ ఇరణ్డుపడి  ముముక్షుక్కళుమ్, సమ్సారిగళుమ్. ఇవర్గళ్తాన్  అహంకార మమకారమ్ కళిన్దిరుప్పారుమ్, అహంకార మమకారన్గళిలే అగప్పట్టోమ్ ఎన్ఱు ఇరుప్పారుమ్, అహంకార మమకారన్గళొడు ఉడన్పట్టిరుప్పారుమాయ్ ఇరుక్కుమ్. ఇదిల్ కళిన్దిరుప్పార్  నిత్యరుమ్, ముక్తరుమ్; అగప్పట్టోమ్ ఎన్ఱు ఇర్రుప్పార్  ముముక్షుక్కళ్; ఉడన్పట్టిరుప్పార్  నిత్యసమ్సారిగళ్. ఇదిల్ కళిన్దిరుప్పారై ఎమ్పెరుమాన్ తన్ ఇనిమైక్కు విషయమాక్కుమ్; అగప్పట్టోమ్ ఎన్ఱు ఇరుప్పారైత్ తన్ ఇరక్కత్తుక్కు విష్యమాక్కుమ్; ఉడన్పట్టిరుప్పారైత్ తన్ లీలైక్కు విషయమాక్కుమ్  ఎన్ఱు ముదలియాణ్డాన్. 

వివరణ 

ఉభయవిభూతియుమ్ ఈశ్వరనుక్కు శేషమాయ్ ఇరుక్కుమ్

ఈశ్వరన్ అనగా ఎంపెరుమాన్ శ్రీమన్నారాయణుడు. ఈశ్వరన్ అనగా అందరినీ నియంత్రించేవాడు అని అర్థం. ఇతరులను నియంత్రించడం ఆయన యొక్క సహజమైన గుణ విశేషము. ఈ లోకంలో మనం ఎంతోమంది ఈశ్వరులను చూడవచ్చును. ఉదాహరణకు, ‘కోటీశ్వరన్’ అనే పదానికి కోటి రూపాయలు గలవాడు అని అర్థం. ఆ ధనం కలిగిన వ్యక్తి దానిని తన నియంత్రణలో ఉంచుకుని, తనకు నచ్చినట్లు ఖర్చు చేయగలడు. ఈ లోకంలో సాధారణంగా రుద్రుడిని ఈశ్వరన్ అని పిలుస్తారు. అయితే, భగవాన్ ఇటువంటి లౌకిక ఈశ్వరరుల వంటివారు కాదు; భగవానుడు స్వభావసిద్ధమైన నియంత్రణ శక్తి కలిగిన పరమేశ్వరుడు. రుద్రుడికి కొన్ని విషయాలను నియంత్రించే శక్తి ఉన్నందువల్ల ఆయనను ఈశ్వరన్ అంటారు, కానీ ఆ శక్తిని ఆయనకు ప్రసాదించినవాడు ఎంపెరుమానే.

ఉదాహరణకు, ఒక వ్యక్తికి విపరీతమైన ధనం ఉందంటే, అది అతని పూర్వకర్మను బట్టి ఎంపెరుమాన్ అనుగ్రహించినందువల్ల లభించినదే. దీనికి భిన్నంగా, భగవాన్ శ్రీమన్నారాయణుడు ఒక్కడే అటువంటి ఈశ్వరత్వాన్ని సహజసిద్ధంగా కలిగియున్నాడు. ఇటువంటి ఈశ్వరనునికి ఉభయ విభూతియు శేషభూతమై (సేవకమై) ఉంటుంది. ఉభయ విభూతి అనగా రెండు విధములైన ఐశ్వర్యాలు. నిత్య విభూతి మరియు లీలా విభూతి అనేవి ఆ రెండు విభూతులు. నిత్య విభూతి అనగా ఎప్పటికీ నశించని పరమపదము. లీలా విభూతి అనగా మనం నివసించే ఈ సంసార ప్రపంచము, ఇది నిరంతరం సృజింపబడుతూ మరియు నశించుతూ ఉంటుంది. పరమపదము మరియు సంసారము అనే రెండూ ఈశ్వరనునికి దాసులై, ఆయన ఆనందం కోసమే ఉనికిని కలిగియున్నాయి. శేషము అనగా వేరొకరి ప్రయోజనం కొరకు, సేవకుడిగా ఉనికిని కలిగియుండుట. అదేవిధంగా సమస్తమూ భగవానునికి సేవకమై, ఆయన ప్రయోజనార్థమే వర్తిస్తుంది. అందుచేత, సమస్త ఉభయ విభూతి (పరమపదము మరియు సంసారము) భగవానునికి అంకితమై ఉంటుంది.

ఇదిల్ ఇరుక్కుమవర్గళ్ బద్ధరుమ్, నిత్యరుమ్, ముక్తరుమ్ 

ఉభయ విభూతి అనగా ఒక విశాలమైన దివ్య లోకము. ఈ విభూతులలో నివసించే ఆత్మలు మూడు వర్గాలుగా వర్గీకరించబడ్డాయి:

  • బద్ధులు : సంసార బంధంలో చిక్కుకున్నవారు.
  • నిత్యులు : ఎన్నటికీ బంధంలో చిక్కుకోని ముక్తపురుషులు / నిత్యసూరులు.
  • ముక్తులు :  పూర్వం బంధంలో ఉండి, తరువాత విముక్తి పొందినవారు.

బద్ధర్ ఇరణ్డుపడి  ముముక్షుక్కళుమ్, సమ్సారిగళుమ్ 

ఈ బద్ధులలో రెండు విభాగాలు ఉన్నాయి:  ముముక్షువులు మరియు సంసారులు. సంసారులు అనగా ఈ భౌతిక ప్రపంచంలో నివసిస్తూ, లౌకిక భోగాలను అనుభవించాలనే కోరిక గలవారు. ముముక్షువులు అనగా ప్రస్తుతం సంసారంలో ఉన్నప్పటికీ, ఈ బంధం నుండి విముక్తిని (మోక్షాన్ని) పొందాలని తీవ్రంగా కోరుకునేవారు.

ఇవర్గళ్తాన్  అహంకార మమకారమ్ కళిన్దిరుప్పారుమ్, అహంకార మమకారన్గళిలే అగప్పట్టోమ్ ఎన్ఱు ఇరుప్పారుమ్, అహంకార మమకారన్గళొడు ఉడన్పట్టిరుప్పారుమాయ్ ఇరుక్కుమ్.

ఇవర్గళ్తాన్ – ఇది సమస్త ఆత్మలను సూచిస్తూ, వాటిని వివిధ వర్గాలుగా విభజిస్తుంది.

  • అహంకారమ్ సాధారణంగా ఈ పదం అహంభావమును సూచిస్తుంది. అయితే దీని పరమార్థం ఏమిటంటే, ఆత్మ కాని దానిని (శరీరాన్ని) ఆత్మగా భావించడం. అనగా ఆత్మ తన నిజరూపాన్ని మరచి, శరీరంతో కూడి ఉన్నందువల్ల శరీరమే తాను అని భ్రమించడం.
  • మమకారమ్ సమస్త వస్తువులు తనకు చెందినవిగా భావించడం. ఆత్మ సమస్త పదార్థాలూ నావే అని తలచి, తాను స్వతంత్రుడనని భావిస్తే అది మమకారము. దీనికి విరుద్ధంగా, సమస్తమూ భగవానునికి చెందినవి అని గ్రహిస్తే ఆత్మ మమకార రహిత స్థితిని చేరుకుంటుంది.

అహంకార మమకారమ్ కళిన్దిరుప్పారుమ్ 

ఈ మొదటి వర్గంలో అహంకార మమకారాలు లేనివారు అంతర్భూతులై ఉన్నారు.

అహంకార మమకారన్గళిలే అగప్పట్టోమ్ ఎన్ఱు ఇరుప్పారుమ్

రెండవ వర్గంలో, తాము అహంకార మమకారాలలో చిక్కుకున్నామని బాధపపడుతూ ఈ సంసారంలో జీవించేవారు ఉన్నారు.

అహంకార మమకారన్గళొడు ఉడన్పట్టిరుప్పారుమాయ్ ఇరుక్కుమ్. 

మూడవ వర్గము, తమ అహంకార మమకారాలతో ఉన్నామని అంగీకరించి, అదే తమ సహజమైన స్థితిగా భావిస్తూ ఆ జీవితాన్నే ఆస్వాదించేవారు 

ఇదిల్ కళిన్దిరుప్పార్  నిత్యరుమ్, ముక్తరుమ్; 

అహంకార మమకారాల నుండి పూర్తిగా విముక్తులైనవారు నిత్యులు మరియు ముక్తులు. నిత్యులు అనగా అనంతన్ (ఆదిశేషుడు), గరుడన, విశ్వక్సేనుడు (సేనాపతి) వంటి నిత్యసూరులు. వీరు ఎన్నడూ ఎంపెరుమాన్ నుండి వేరుపడలేదు, ఎల్లప్పుడూ ఆయనతోనే నివసిస్తూ దివ్య కైంకర్యాలు ఆచరిస్తుంటారు. ఇక ముక్తుల విషయానికి వస్తే, వారు సంసారంలో ఉన్నప్పుడు అహంకార మమకారాలను కలిగియున్నారు; కాని పరమపదమును చేరుకున్న తరువాత ఆ మాలిన్యాలను పూర్తిగా విడిచిపెట్టారు.

అగప్పట్టోమ్ ఎన్ఱు ఇర్రుప్పార్  ముముక్షుక్కళ్;

అహంకార మమకారాల చేతిలో చిక్కుకున్నందుకు నిరంతరం పశ్చాత్తాప పడేవారే ముముక్షువులు. తాము ఇంకా శరీరాన్ని ఆత్మగా భ్రమిస్తున్నామని వారు గుర్తిస్తారు. అంతేకాక, ఆత్మ మరియు సమస్త పదార్థాలూ భగవానునికే చెందినవి అని తెలుసుకోవాల్సింది పోయి, అప్పుడప్పుడు తమవేనని భావిస్తున్నామని వారు గ్రహిస్తారు. ఫలితంగా, ఈ బంధాల నుండి విముక్తి పొంది పరమపదమును చేరాలనే తీవ్రమైన తపనతో జీవిస్తారు.

ఉడన్పట్టిరుప్పార్  నిత్యసమ్సారిగళ్. 

ఉడన్పత్తిరుప్పార్ అనగా అహంకార మమకారాలను కలిగియుండి, వాటితో కూడిన జీవనమే సంతోషదాయకమని భావించేవారు. శరీరాన్ని, ఆత్మను ఒక్కటే అని, లౌకిక భౌతిక వస్తువులన్నీ తమవే అని నమ్మి సంతోషించేవారే నిత్య సంసారులు.

అయితే ‘నిత్య సంసారి’ అనే పదం సాపేక్షమైనది. అంటే వీరు ఈ భౌతిక లోకంలో శాశ్వతంగా నివసిస్తారని అర్థం కాదు. ఎంపెరుమాన్ ప్రతి ఒక్కరికీ అవకాశం ఇస్తూ, వారిని సంస్కరించడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. వారు ఇంకా సంసారంలోనే ఉండి, సంసారాన్ని విడిచిపెట్టి మోక్షాన్ని సాధించాలనే కోరికను ఇంకా పొందనందువల్ల వారిని ‘నిత్య సంసారులు’ అని పిలుస్తారు.

ఎంపెరుమాన్ ఈ ఆత్మలను తన లీలానుభవానికి ఎలా వినియోగిస్తాడు?

ఇదిల్ కళిన్దిరుప్పారై ఎమ్పెరుమాన్ తన్ ఇనిమైక్కు విషయమాక్కుమ్;

అహంకార మమకారాల నుండి పూర్తిగా విముక్తులైన నిత్యులను మరియు ముక్తులను ఎంపెరుమాన్ తన దివ్యమైన, మధురమైన ఆనందానుభవానికి వినియోగిస్తాడు. పరమపదంలో నివసిస్తూ వారు నిరంతరం ఎంపెరుమాన్‌ను అనుభవిస్తూ ఆనందిస్తారు. ఎంపెరుమాన్ యొక్క దివ్య స్వరూపమే మాధుర్య నిధి, వారు ఆ మాధుర్యాన్ని నిత్యం రుచి చూస్తుంటారు. దీనిని సులభతరం చేయడానికి, వారు ఆ పరమానందాన్ని ఎప్పటికీ అనుభవించేలా ఎంపెరుమాన్ అనుగ్రహిస్తాడు.

 అగప్పట్టోమ్ ఎన్ఱు ఇరుప్పారైత్ తన్ ఇరక్కత్తుక్కు విష్యమాక్కుమ్; 

సంసారంలో పడి తపించిపోతున్న ముముక్షువులపై ఎంపెరుమాన్ తన దయను (కరుణను) కురిపించి వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. వారి ప్రస్తుత జీవితాంతంలో వారిని స్వీకరించి, వారు పరమపదంలో నిత్యం ఆనందించేలా అనుగ్రహిస్తాడు.

ఉడన్పట్టిరుప్పారైత్ తన్ లీలైక్కు విషయమాక్కుమ్  

అహంకార మమకారాలను కలిగియుండి వాటితోనే జీవించడాన్ని ఆస్వాదించేవారిని, ఎంపెరుమాన్ తన లీలకి విషయంగా చేసుకుంటాడు.

అదేమనగా-ఎంపెరుమాన్ ఈ సంసారం మొత్తాన్ని కేవలం తన లీల (దివ్య క్రీడ) కొసమే సృష్టిస్తాడు, పోషిస్తాడు మరియు లయం చేస్తాడు. బ్రహ్మసూత్రంలోని ‘లోకవత్తు లీలా కైవల్యం’ అనే సూత్రం, ఈ సంసారం కేవలం భగవానుని ఆనందం కొరకు మరియు ఆయన లీల కొరకే ఉనికిలో ఉందని నిరూపిస్తుంది. కంబనాళ్వాన్ కూడా కంబ రామాయణంలో, “ఉలగమ్ యావైయుమ్ తాముళవాక్కలుమ్” (ఈ సమస్త జగత్తును తన దివ్య సంకల్పంతో సృష్టించువాడు), “అలగిలా విళైయాట్టుడైయాన్” (అంతులేని, అనంతమైన దివ్య లీలలు గల పరమాత్మ) అని కీర్తించారు. ఆళ్వార్లు కూడా అనేక తిరువాయ్మొళి పాశురాలలో సంసారము ఎంపెరుమాన్ యొక్క లీలా విలాసమే అని పేర్కొన్నారు. అంతిమంగా, ఎంపెరుమాన్ వారిని తన దివ్య లీలకు సాధనాలుగా ఉపయోగిస్తాడు.

ఎన్ఱు ముదలియాణ్డాన్. ఇది ముదలియాణ్డాన్ సాయించిన వార్తై.

పద్నాలుగవ వార్త 

సారాంశం 

మనం భగవానుని అనంతమైన ఆనందానికైనా లేదా ఆయన లీలా విలాసానికైనా విషయమవుతాము. ఈ సంసారంలో మనం సుఖంగా ఉండగలమని, ఇక్కడే నిరంతరం భోగాలను అనుభవించవచ్చని తలచి జీవిస్తే, ఎంపెరుమాన్ యొక్క లీలకు (క్రీడకు) విషయమవుతాము. ఒకవేళ ఈ లోకంలో జీవిస్తున్నందుకు పశ్చాత్తాపపడితే, ఎంపెరుమాన్ యొక్క కృపకు (కరుణకు) విషయమవుతాము.

మూలము 

ఆచ్చాన్పిళ్ళై గోష్ఠియిల్, శ్రీవైష్ణవర్గళ్ తిరళ ఇరున్దు, తన్జమాయ్ ఇరుప్పదొరు వార్తై అరుళిచ్చెయ్య వేణుమ్ ఎన్న, అరుళిచ్చెయ్దపడి  నామ్ లీలైక్కు విషయమో, ఇరక్కత్తుక్కు విషయమో ఎన్ఱు విణ్ణప్పమ్ చెయ్య; ఉడన్పట్టు ఇరున్దోమ్ ఆగిల్ లీలైక్కు విషయమ్ ఆగిఱోమ్; అగప్పట్టోమ్ ఎన్ఱు ఇరున్దోమాగిల్ ఇరక్కత్తుక్కు విషయమ్ ఆగిఱోమ్ ఎన్ఱు అరుళిచ్చెయ్దార్.

వివరణ 

ఇవి ముదలియాణ్డాన్ గతంలో పల్కిన వాక్కులను సంక్షిప్తీకరించి ఆచ్చాన్ పిళ్ళై  ప్రసాదించిన దివ్య వాక్కులు. ఇందులో ‘లీలై’ మరియు ‘కృప’ అనే రెండు పదాలు మరింత విశదీకరించబడ్డాయి.

  • ఆచ్చాన్పిళ్ళై గోష్ఠియిల్, శ్రీవైష్ణవర్గళ్ తిరళ ఇరున్దు – ఆచ్చాన్ పిళ్ళై గోష్ఠిలో శ్రీవైష్ణవులు, శిష్యులు సమూహంగా కూర్చుని కాలక్షేపమును ఆనందిస్తున్నారు.
  • ‘తన్జమాయ్ ఇరుప్పదొరు వార్తై అరుళిచ్చెయ్య వేణుమ్’ ఎన్న – ఆ సమయంలో వారు తరణోపాయమైన, తాము నమ్మి జీవించడానికి తగిన సద్బోధనను అనుగ్రహించవలసిందిగా ప్రార్థించారు.
  • నామ్ లీలైక్కు విషయమో, ఇరక్కత్తుక్కు విషయమో ఎన్ఱు విణ్ణప్పమ్ చెయ్య;  శ్రీవైష్ణవులలో ఒకరు వినయంతో, మనం ఎంపెరుమాన్ యొక్క ‘లీలకు’ విషయమగుచున్నామా లేక ‘కృపకు’ విషయమగుచున్నామా అని విన్నవించగా…
  • ఉడన్పట్టు ఇరున్దోమ్ ఆగిల్ లీలైక్కు విషయమ్ ఆగిఱోమ్; అగప్పట్టోమ్ ఎన్ఱు ఇరున్దోమాగిల్ ఇరక్కత్తుక్కు విషయమ్ ఆగిఱోమ్’ – ముదలియాణ్డాన్ గతం లో పలికిన వాక్కు లను సంక్షిప్తీకరించి వారు సంతోషంగా ఇలా అనుగ్రహించారు: “మనం సంసారంతో లీనం అయ్యి ఉంటే ఆయన లీలకు విషయమగుచున్నాము; అహంకార మమకారాలలో చిక్కుకున్నామని పశ్చాత్తాపపడితే ఆయన కృపకు విషయమగుచున్నాము.”

ఈ సంసారంలో మనకు అహంకార మమకారాలు, విషయాంతరాలు (లౌకిక భోగాలు), ఇతర దేవతల ఆరాధన వంటి అనుభవించడానికి తగినట్లుగా కనిపించే ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇవే ఎంతో ఆనందదాయకమని భావించి, వాటితో కలిసిమెలిసి జీవిస్తే మనం భగవానుని లీలకు (క్రీడా వస్తువుగా) మారుతాము.

దీనికి విరుద్ధంగా, ఆళ్వార్లు తమ లౌకిక అస్తిత్వాన్ని తలచి పశ్చాత్తాపపడినట్లుగా, ఈ సంసారంలో చిక్కుకుని ఇబ్బంది పడుతున్నందుకు మనం కూడా పశ్చాత్తాపపడాలి. తిరువిరుత్తమ్ మొదటి పాశురంలో ఆళ్వార్, “పొయ్ నిన్ర జ్ఞానముమ్ పొల్లా వొళుక్కుమ్ అళుక్కుదమ్బుమ్ ఇన్నిన్ర నీర్మై ఇనియామ్ ఉరామై” (ఆత్మ కాని దానిని ఆత్మగా భావించే తప్పుడు జ్ఞానం, కైంకర్యం కాని దురాచారాలు, అహంకార మమకారాలతో కూడిన మాలిన్య శరీరం – ఈ స్వభావాన్ని ఇక ముందు మనం పొందకూడదు) అని ప్రార్థించారు. భగవానుని శ్రీపాదాలను చేరుకునే అవకాశం మనకు లభించాలంటే, ఈ లోకంలో మనం పడుతున్న కష్టాలకు పశ్చాత్తాపపడడం ఎంతో ముఖ్యం.

పదిహేనవ వార్త 

సారాంశం 

ఈ వార్తలో అర్ధ పంచకంలోని విశేషాలు వివరించబడ్డాయి.

  • ఆత్మ యొక్క స్వస్వరూపం జ్ఞాన ప్రధానం. ఆ జ్ఞానం అనగా మనం భగవానునికి శేషభూతులమని (దాసులమని), భగవానునిపై ఆధారపడి ఉన్నామని (పారతంత్ర్యమును) తెలుసుకోవడమే.
  • ఉపాయానికి (ప్రాప్తి సాధనానికి) వ్యవసాయం (దృఢ సంకల్పం) ప్రధానం.
  • ప్రాప్యానికి (లక్ష్యానికి) అపేక్ష (తీవ్రమైన కోరిక) ప్రధానం.
  • విరోధికి (మోక్ష ప్రాప్తికి అడ్డుపడే వాటికి) లౌకిక విషయాల యెడల అరుచి (విరక్తి) ప్రధానం.

మూలము  

స్వస్వరూపమ్ జ్ఞాన ప్రధానమ్; ఉపాయమ్  వ్యవసాయ ప్రధానమ్; ప్రాప్యమ్  అపేక్షా ప్రధానమ్; విరోధి  అరుచి ప్రధానమ్  ఎన్ఱు ముదలియాణ్డాన్ అరుళిచ్చెయ్వర్.

వివరణ 

ఇవి ముదలియాణ్డాన్ వారి దివ్య వాక్కులు. అర్ధ పంచకంలో స్వస్వరూపము, పరస్వరూపము, ఉపాయస్వరూపము, విరోధిస్వరూపము, ఫలస్వరూపము అనే ఐదు విషయాలు చెప్పబడతాయి. వాటిలో నాలుగు ముఖ్య అంశాలు ఇక్కడ వివరించబడ్డాయి.

  • స్వస్వరూపమ్ జ్ఞాన ప్రధానమ్: స్వస్వరూపం అనగా ఆత్మ యొక్క నిజరూపము. దీని ప్రధాన లక్షణం జ్ఞానమే. ఈ జ్ఞానం అనగా జీవాత్మ పరమాత్మకు శేషమని (దాసుడని) మరియు పారతంత్ర్యుడని (పూర్తిగా ఆయనపై ఆధారపడివాడని) తెలుసుకోవడమే. ప్రణవంలో మకారము జీవాత్మను, అకారము పరమాత్మను, ఇకారము (ఉకారంలోని అర్థం) ‘మాత్రమే’ (జీవాత్మ కేవలం పరమాత్మ కొసమే ఉనికిని కలిగియున్నాడు) అనే గూఢార్థాన్ని సూచిస్తుంది.
  • ఉపాయమ్ – వ్యవసాయ ప్రధానమ్: వ్యవసాయం అనగా దృఢ నిశ్చయం. ఎంపెరుమానే ఏకైక ఉపాయమని (రక్షకుడని) మనం గట్టిగా నమ్మి నిశ్చయించుకోవాలి. ఉపాయంలో ఈ దృఢ సంకల్పమే ప్రధానమైనది.
  • ప్రాప్యమ్ – అపేక్ష ప్రధానమ్: ప్రాప్యం అనగా పరమపదమును పొందిన తరువాత అనుభవించే ఆనందము. దీనికి అత్యంత ముఖ్యమైనది ఎంపెరుమాన్‌ను కైంకర్యం కోరుకోవడం. ఆళ్వార్లు మరియు ఆండాళ్ తిరుప్పావైలో (“ఉనక్కే నామ్ ఆట్చెయ్వోమ్”) ప్రార్థించినట్లుగా, మనం భగవానుని వద్ద నిత్య కైంకర్యాన్ని అపేక్షించాలి. ఆకలితో ఏడ్చే చిన్నారికి తల్లి ఆహారం అందించినట్లుగా, మనం కోరితే భగవానుడు వెంటనే మనకు కైంకర్యాన్ని ప్రసాదిస్తాడు.
  • విరోధి – అరుచి ప్రధానమ్: విరోధి అనగా మోక్షానికి అడ్డంకులు. రుచి అంటే ఆసక్తి; అరుచి అంటే అయిష్టత, అనగా లౌకిక భోగాల యెడల విరక్తి. ఈ లోకంలో అహంకార మమకారాలు, అవిద్య, వాసనలు విరోధులుగా ఉంటాయి. వీటిపై కొద్దిపాటి ఆసక్తి ఉన్నా విరోధి పూర్తిగా తొలగిపోదు. కనుక లౌకిక విషయాలపై అరుచి (విరక్తి) కలిగి ఉండడం విరోధిని నశింపజేయడంలో ప్రధానమైనది.

ఇది శ్రీ ముదలియాణ్డాన్ వారు అనుగ్రహించిన దివ్య వార్తై.

పదహారవ వార్తై 

సారాంశం

  • ఎంపెరుమాన్ భోక్తా – అనుభవించేవాడు; ఆత్మ భోగ్యం – అనుభవించబడే వస్తువు.
  • అన్యథా విరోధి  ఐదు రకాలుగా ఉంటుంది:
    • ఆత్మను మరియు శరీరాన్ని ఒకటిగా భావించడం.
    • ఇతర దేవతలను పరదేవతగా భావించడం.
    • భగవంతుడిని కాకుండా ఇతర ఉపాయాలను మోక్షానికి మార్గంగా భావించడం.
    • ఇతర ఫలితాలను పరమ లక్ష్యంగా కోరుకోవడం.
    • ఇతర జీవులను విరోధులుగా భావించి భయంతో జీవించడం.
  • విరోధి మూడు రకాలుగా ఉంటుంది:
    • స్వరూప విరోధి 
    • ఉపాయ విరోధి 
    • ఉపేయ విరోధి 

మూలం 

అవన్ భోక్తా; ఇవన్ భోగ్యమ్. వ్యామోహమ్  ఉపాయమ్; ఎతిర్విళి పెఱుగై ఉపేయమ్; అవనుక్కు  మిడఱు పిడియాఇప్ పోరువదు  అన్యథా విరోధి; అన్యథా విరోధి తాన్ అన్జుపడి  దేహత్తై ఆత్మావాగ బుధిది పణ్ణుగైయుమ్, ఇతర ధ్వతైగళైప్ పరతత్వమాగ బుద్ధి పణ్ణుగైయుమ్, ఇళితోళిల్గళై ఉపాయమాగ బుద్ధి పణ్ణుగైయుమ్, అవఱ్ఱాలే విషయాన్తరన్గళై భోగ్యమాగ బుద్ధి పణ్ణుగైయుమ్, నిన్ఱ చేతనరై ఎల్లామ్ విరోధిగళాగ బుద్ధి పణ్ణుగైయుమ్. 

స్వరూప విరోధి, ఉపాయ విరోధి, ఉపేయ విరోధి ఎన్ఱు మున్ఱు. దేహాత్మాభిమానం, అన్యశేషత్వమ్, స్వస్వాతంత్రయమ్ ఇవై  స్వరూప విరోధి; రక్శకాన్తరమ్, సాధనాన్తరమ్, సిధ్ధోపాయతిల్ అవిశ్వాసమ్ ఇవై  ఉపాయ విరోధి; ఐశ్వర్యకైవల్యమ్, స్వానుభవమాన భగవత్ కైన్కర్యమ్ ఇవై  ఉపేయ విరోధి. స్వరూప యాతాత్మ్య జ్ఞానమ్ పిఱవామైయాలే  దాన్థి పిఱక్కిఱధిల్లై; విరోధి యాతాత్మ్య జ్ఞానమ్ పిఱవామైయాలే- అచ్చమ్ పిఱక్కిఱదిల్లై; ఉపాయ యాతాత్మ్య  జ్ఞానమ్ పిఱవామైయాలే వ్యవసాయమ్ పిఱక్కిఱదిల్లై; భోగ యాతాత్మ్య జ్ఞానమ్ పిఱక్కిఱదిల్లై- త్వరై పిఱక్కిఱదిల్లై.

వివరణ

ఈ వార్తై కూడా అర్థ పంచకం గురించే వివరిస్తుంది. మొదట అన్యథా విరోధి వివరించబడుతుంది; తరువాత విరోధిని మరింత విపులంగా వివరిస్తారు.

“అవన్ భోక్త, ఇవాన్ భోగ్యం”

వ్యాఖ్యానాలలో “అవన్ ” అనే పదం ఉపయోగించినప్పుడు అది భగవంతుడిని / ఎంపెరుమాన్ను సూచిస్తుంది. “ఇవన్ ” అనేది ఆత్మను సూచిస్తుంది. “ఇవన్” సాధారణంగా మనకు సమీపంగా ఉన్న వ్యక్తిని సూచించే పదం. అందువల్ల మన గురించి, అంటే ఆత్మ గురించి మాట్లాడేటప్పుడు “ఇవన్” అని, ఎంపెరుమాన్ గురించి మాట్లాడేటప్పుడు “అవన్” అని ఉపయోగిస్తారు.

ఎంపెరుమాన్ భోక్తా,  అనుభవించేవాడు; ఆత్మ భోగ్యం, అనుభవించబడే వస్తువు.

తైత్తిరీయ ఉపనిషత్: “అహం అన్నం, అహం అన్నం, అహం అన్నం, అహం అన్నాదః” అని చెబుతుంది.

ఆత్మ పరమపదాన్ని చేరినప్పుడు “అహం అన్నం”, “నేనే అన్నం” అని అంటుంది. ఇక్కడ “అన్నం” అనేది అనుభవించబడే వస్తువును సూచిస్తుంది.

సాధారణంగా ఆహారాన్ని తినేవాడే దాని ద్వారా ఆనందాన్ని పొందే భోక్త. ఆహారం స్వయంగా ఆనందాన్ని అనుభవించదు. కానీ ఆత్మ చేతనమైనది, అంటే జ్ఞానం కలిగినది. అందువల్ల ఆత్మ ఆనందాన్ని అనుభవించగలదు.

అందుకే:

“అహం అన్నాదః”, “నేనూ అనుభవించేవాడినే” అని కూడా చెప్పబడుతుంది.

జ్ఞానానికి ప్రతిఫలాలలో ఒకటి ఆనందం. ఆత్మ ఎంపెరుమాన్‌ను చేరినప్పుడు, అది అన్నంలాగా భోగ్యంగా ఉంటుంది. ఎంపెరుమాన్ ఆత్మను అనుభవించినప్పుడు, తన ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. ఆ ఆనందాన్ని ఆత్మ గ్రహించినప్పుడు, ఆత్మ కూడా ఆనందాన్ని పొందుతుంది.

అందువల్ల:

  • అన్నం అంటే “నేను అనుభవించబడే వస్తువును.”
  • అన్నాదః అంటే “నేనూ అనుభవిస్తున్నాను.”

మొదటి స్థాయిలో ఎంపెరుమాన్ మనలను అనుభవిస్తాడు. ఆయన దివ్యమైన ముఖంలో ఆ ఆనందాన్ని చూసి ఆత్మ ఆనందిస్తుంది.

అందువల్ల, ఆత్మ యొక్క ఆనందం స్వతంత్రంగా కలిగేది కాదు; ఎంపెరుమాన్ యొక్క ఆనందం ద్వారా కలిగేది.

అదేవిధంగా, మనం చేసే కైంకర్యం కూడా మన స్వప్రయోజనం కోసం కాదు; ఎంపెరుమాన్ సంతోషం కోసం మాత్రమే చేయాలి.

కాబట్టి ముఖ్యమైన విషయం:

ఎంపెరుమాన్ భోక్తా; ఆత్మ భోగ్యం.

“వ్యామోహం- ఉపాయం”

ఎంపెరుమాన్ మన నాయకుడు, స్వామి, శేషి. ఆత్మలన్నీ ఎంపెరుమాన్ యొక్క సంపద.

ఎంపెరుమాన్‌ను పొందడానికి ఉపాయం వ్యామోహం, అత్యంత గాఢమైన ప్రేమ.

మన ఇంటి మీద, మన సంపద మీద మనకు ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ వల్ల వాటిని సంరక్షించడానికి అవసరమైన పనులు చేస్తాము.

అదేవిధంగా, ఆత్మలన్నీ తన సంపద కాబట్టి, ఎంపెరుమాన్‌కు అన్ని ఆత్మల మీద అపారమైన ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ వల్ల ఆయన ఆత్మలకు నిరంతరం సహాయం చేస్తాడు.

ఈ గాఢమైన ప్రేమనే వ్యామోహం అంటారు.

వ్యామోహం అంటే అమితమైన ప్రేమ.

తన సంపదైన ఆత్మలపై ఎంపెరుమాన్‌కు ఉన్న ప్రేమే ఉపాయం అవుతుంది. ఆత్మలను తన సంపదగా భావించి, వాటిని రక్షించాలి అనే ప్రేమతో ఎంపెరుమాన్ మనకు మోక్షాన్ని మరియు కైంకర్యాన్ని ప్రసాదిస్తాడు.

అందువల్ల, ఆయన ప్రేమే ఉపాయం.

“ఎతిర్విళి పెఱుగై ఉపేయమ్”

ఉపేయం అంటే ఆత్మ చివరికి పొందవలసిన లక్ష్యం.

ఆత్మ ఎంపెరుమాన్‌కు కైంకర్యం చేసినప్పుడు, ఎంపెరుమాన్ ఆనందిస్తాడు. ఆ ఆనందం ఆయన దివ్యమైన ముఖంలో కనిపించే చిరునవ్వు ద్వారా వ్యక్తమవుతుంది.

ఆ దివ్యమైన చిరునవ్వును చూసి ఆత్మ కూడా ప్రతిస్పందించాలి.

అందువల్ల ఆత్మ యొక్క లక్ష్యం, మన కైంకర్యం వల్ల ఎంపెరుమాన్ సంతోషించాడు; ఆయన పొందిన ఆ సంతోషాన్ని చూసి మనం కూడా సంతోషించాలి.”

భగవంతుడు మన కైంకర్యాన్ని స్వీకరించినప్పుడు, ఆత్మ ఒక జ్ఞానం లేని అచేతన వస్తువులా ఉండకూడదు. అలా ఉంటే ఆత్మకు, ఒక రాయిలాంటి అచేతన వస్తువుకు తేడా ఉండదు.

ఆత్మ: “అడియేన్ కైంకర్యం చేశాను; దేవరీర్ దానిని స్వీకరించి ఆనందించారు; అందువల్ల అడియేన్ కూడా ఆనందిస్తున్నాను” అని భావించాలి.

ఆత్మ ఈ విధంగా ప్రతిస్పందించినప్పుడే దాని చైతన్యం సార్థకమవుతుంది.

“అవనుక్కు మిడఱు పిడియాఇప్ పోరువదు  అన్యథా విరోధి”

మిడరు పిడి అంటే ఒక వ్యక్తి ఆహారం తింటున్నప్పుడు, అతను ఆహారాన్ని మింగకుండా ఉండేలా అతని గొంతును గట్టిగా పట్టుకోవడం.

అన్యథా అంటే ఒక విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం.

అందువల్ల అన్యథా విరోధి అంటే తప్పు అవగాహన, అపార్థం వల్ల కలిగే అడ్డంకి.

అంటే, జీవాత్మ నిజమైన జ్ఞానానికి విరుద్ధంగా తప్పుగా అర్థం చేసుకోవడం, ఎంపెరుమాన్ ఆత్మలను అనుభవించడానికి అడ్డంకిగా మారుతుంది.

మన సంప్రదాయంలో ప్రతి విషయం ఎంపెరుమాన్ మరియు ఆయన దివ్యానుభవాన్ని కేంద్రంగా చేసుకునే ఉంటుంది.

మన ఉనికి కూడా ఆయన అనుభవం కోసమే. నిత్యవిభూతి మరియు లీలావిభూతి రెండూ ఆయన ఆనందం కోసం ఉన్నాయి; మన స్వీయ ఆనందం కోసం కాదు.

“అన్యథా విరోధి తాన్ అన్జుపడి”

అన్యథా విరోధి ఐదు రకాలుగా ఉంటుంది.

1. “దేహత్తై ఆత్మావాగ బుద్ధి పణ్ణుగైయుమ్”

మొదటిది స్వస్వరూపం గురించి తప్పు జ్ఞానం.

అంటే శరీరాన్నే ఆత్మగా భావించడం, ఆత్మకు శరీరానికి ఎటువంటి భేదం లేదని అనుకోవడం.

దీనినే అహంకారం / దేహాత్మాభిమానం అని కూడా అంటారు.

ఈ భావన కలిగితే, అది ఎంపెరుమాన్‌ను అనుభవించడానికి అడ్డంకిగా ఉంటుంది. అంతేకాక ఎంపెరుమాన్‌కూ ఇది బాధ కలిగిస్తుంది.

ఎంపెరుమాన్ ఆత్మకు జ్ఞానాన్ని, కైంకర్యం చేసే అవకాశాలను, అనుకూలమైన పరిస్థితులను ఇచ్చినప్పటికీ, ఆత్మ మాత్రం శరీరమే ఆత్మ అని భావిస్తూ, ఒక సంసారిలా జీవించడం ఎంపెరుమాన్‌కు అసంతృప్తిని కలిగిస్తుంది.

2. “ఇతర దేవతైగళైప్ పరతత్వమాగ బుద్ధి పణ్ణుగైయుమ్”

రెండవ విరోధి ఇతర దేవతలను పరతత్త్వంగా భావించడం.

ఇది అర్థ పంచకంలో వివరించిన పరస్వరూప విరోధితో సమానం.

శ్రీమన్నారాయణుడే పరస్వరూపం. ఆయన తప్ప మరెవరూ పరదేవత కాదు.

ఈ సత్యాన్ని తెలుసుకోకుండా ఇతర దేవతలను పరదేవతలుగా భావించడం విరోధి.

3. “ఇళితోళిల్గళై ఉపాయమాగ బుద్ధి పణ్ణుగైయుమ్”

మూడవది, తక్కువ స్థాయి ఉపాయాలను మోక్షానికి ఉపాయాలుగా భావించడం.

శాస్త్రం అనేక మార్గాలను ఉపాయాలుగా వివరిస్తుంది — కర్మయోగం, జ్ఞానయోగం, భక్తియోగం, దివ్యదేశవాసం, తిరునామ సంకీర్తనం, తిరువిలక్కు వెలిగించడం, తిరుమాల కట్టడం, పురుషోత్తమ విద్య మొదలైనవి.

అయితే వీటిలో అనేక ఉపాయాలు మనలో:

“నేను ఇవి చేశాను”

అనే భావాన్ని కలిగించవచ్చు.

శరణాగతి మరియు ఆచార్య అభిమానం మన స్వప్రయత్నాలపై ఆధారపడవు. అవి పూర్తిగా ఎంపెరుమాన్ మరియు ఆచార్యుల కృపపై ఆధారపడతాయి.

శరణాగతి మరియు ఆచార్య అభిమానం తప్ప, మిగిలిన ఉపాయాలలో “నేను చేశాను” అనే భావం కొంతవరకు ఉండే కారణంగా అవి తక్కువ స్థాయి ఉపాయాలుగా చెప్పబడతాయి.

వాటినే ప్రధాన ఉపాయాలుగా భావించడం కూడా విరోధి.

4. “అవఱ్ఱాలే విషయాన్తరన్గళై భోగ్యమాగ బుద్ధి పణ్ణుగైయుమ్”

నాల్గవ విరోధి:

కర్మయోగం చేసినప్పుడు దాని ద్వారా సంపద వంటి ఫలితాలను కోరుకోవడం; జ్ఞానయోగం చేసినప్పుడు కైవల్యం వంటి ఫలితాలను కోరుకోవడం.

ఇతర ఉపాయాలను ఆశ్రయించి, వాటి ద్వారా లభించే ఇతర ఫలితాలను కోరుకోవడం కూడా విరోధి.

5. “నిన్ఱ చేతనరై ఎల్లామ్ విరోధిగళాగ బుద్ధి పణ్ణుగైయుమ్”

ఐదవ విరోధి – ఇతర జీవాత్మలందరినీ విరోధులుగా భావించడం.

అన్ని జీవాత్మలకు ఎంపెరుమాన్‌తో సంబంధం ఉంది.

ఒకసారి మనం ఎంపెరుమాన్‌కు శరణాగతి చేసిన తరువాత, ఇతరులను చూసి భయపడకూడదు; అందరినీ మన శత్రువులుగా లేదా అడ్డంకులుగా భావించకూడదు.

“ఎంపెరుమాన్ నన్ను స్వీకరించాడు; నాకు ఆచార్యుడిని ప్రసాదించాడు” అనే నమ్మకంతో ఉండాలి.

ఈ అవగాహనతో ఎంపెరుమాన్‌కు, ఆయన అడియార్లకు కైంకర్యం చేస్తూ మన లక్ష్యం వైపు కొనసాగాలి.

ఇతర విషయాల గురించి ఎప్పుడూ భయంతో జీవించడం కూడా విరోధి.

ఒక ఆచార్యుడు, అడియార్ లేదా భాగవతుడు ఉత్తమ భాగవతుడని మనకు తెలిసినట్లయితే, వారితో సత్సంబంధం కలిగి ఉండవచ్చు.

ఇతర విషయాల విషయంలో, ముఖ్యంగా సంసారులతో, అవసరమైనంతవరకు మాత్రమే సంబంధం కలిగి, అనవసరమైన ఆసక్తి లేకుండా ఉండటం మంచిది.

ఎవరిని ఎప్పుడు, ఎలా స్వీకరించాలో ఎంపెరుమాన్‌కు తెలుసు. కాబట్టి ఇతర సంసారులను మనం అవమానించకూడదు; అదే సమయంలో వారిపై అతిగా ఆధారపడకూడదు.

భగవద్విషయంలో ఆసక్తి ఉన్నవారితో సత్సంగం చేయడం ఉత్తమం.

“స్వరూప విరోధి, ఉపాయ విరోధి, ఉపేయ విరోధి ఎన్ఱు మున్ఱు”

విరోధిని మరో విధంగా మూడు రకాలుగా వివరిస్తారు:

  1. స్వరూప విరోధి- స్వస్వరూపం మరియు పరస్వరూపం గురించి తప్పు అవగాహన.
  2. ఉపాయ విరోధి- మోక్షానికి సంబంధించిన ఉపాయం గురించి తప్పు అవగాహన.
  3. ఉపేయ విరోధి – చేరవలసిన అంతిమ లక్ష్యం గురించి తప్పు అవగాహన.

ఆచార్యులు ఒకే విషయాన్ని వివిధ విధాలుగా వివరిస్తారు; దీని ద్వారా మనకు ఆ విషయాన్ని సులభంగా అర్థం చేసుకుని, గుర్తుంచుకోవడం సాధ్యమవుతుంది.

“దేహాత్మాభిమానమ్, అన్యశేషత్వమ్, స్వస్వాతంత్రయమ్ ఇవై  స్వరూప విరోధి”

ఇక్కడ స్వరూప విరోధి వివరించబడుతోంది.

దేహాత్మాభిమానం

శరీరం మరియు ఆత్మ ఒకటే అని భావించడం.

నిజానికి శరీరం వేరు, ఆత్మ వేరు. ఆత్మ భౌతిక శరీరం, మనస్సు, ఇంద్రియాలు, ప్రాణం మొదలైన వాటికి భిన్నమైనది.

అన్యశేషత్వం 

మనం భగవంతునికి మరియు భాగవతులకు మాత్రమే శేషులుగా ఉండాలి.

ఇతరులకు శేషులుగా ఉండడం మన నిజమైన స్వరూపానికి విరుద్ధం. అందువల్ల అది స్వరూప విరోధి.

స్వస్వాతంత్రయమ్

మనల్ని మనం స్వతంత్రులుగా భావించడం; అన్ని నిర్ణయాలను మనమే తీసుకుంటున్నామని, అన్ని కార్యాలను మనమే చేస్తున్నామని భావించడం.

ఇది కూడా విరోధి.

“రక్షకాన్తరమ్, సాధనాన్తరమ్, సిద్ధోపాయతిల్ అవిశ్వాసమ్ ఇవై  ఉపాయ విరోధి”

ఇక్కడ ఉపాయ విరోధి వివరించబడుతోంది.

రక్షకాంతరం 

వేరొకరిని మన రక్షకుడిగా భావించడం.

రక్షకుడు అంటే మనలను కాపాడేవాడు, మన అడ్డంకులను తొలగించేవాడు, మనకు మేలు చేసేది ప్రసాదించేవాడు.

ఎంపెరుమాన్ మాత్రమే మన రక్షకుడు.

ఆయనే మనకు మేలు చేసేదాన్ని ప్రసాదిస్తాడు; మన అడ్డంకులను తొలగిస్తాడు.

కాబట్టి ఇతరుల వద్ద రక్షణను కోరడం లేదా వారిని రక్షకులుగా భావించడం ఉపాయ విరోధి.

సాధనాంతరం 

సాధనం అంటే ఉపాయం.

భగవంతుని తప్ప మరే ఇతర ఉపాయాలు – ఉదాహరణకు కర్మయోగం, జ్ఞానయోగం మొదలైనవి  సాధనాంతరం అని పిలవబడతాయి.

అవి మన నిజమైన స్వరూపానికి అనుగుణమైన ఉపాయాలు కావు.

సిధ్ధోపాయతిల్ అవిశ్వాసమ్

సిద్ధోపాయం అంటే మనకు సహాయం చేయడానికి ఇప్పటికే ఉన్న ఉపాయం.

ఎంపెరుమానే సిద్ధోపాయం.

దీనికి విరుద్ధంగా సాధ్యోపాయం అంటే మనం ఒక కార్యాన్ని చేసిన తరువాత ఉపాయం సిద్ధించేది. 

ఉదాహరణకు, కర్మయోగంలో అష్టాంగయోగం చేయాలి, ఇంద్రియాలను నియంత్రించాలి, యాగాలు, యజ్ఞాలు చేయాలి. ఇవన్నీ చేసిన తరువాతే కర్మయోగం పూర్తవుతుంది.

కానీ ఎంపెరుమాన్ అందరికీ సమానమైన వాడు; అందరి కోసం ఎల్లప్పుడూ ఉన్నవాడు. ఆళ్వార్, “పొదు నిన్ఱ పొన్నన్గళలే తొళుమిన్”  అంటారు, అంటే, ఎటువంటి భేదం లేకుండా అందరూ ఆరాధించగలిగే అద్భుతమైన దివ్య తిరువడులను కలిగినవాడు ఎంపెరుమాన్.

అవిశ్వాసం

అవిశ్వాసం అంటే నమ్మకం లేకపోవడం.

సిద్ధోపాయమైన ఎంపెరుమాన్‌పై మనకు విశ్వాసం లేకపోవడం విరోధి. ఒకసారి శరణాగతి చేసిన తరువాత, “ఆయన తిరువడులు నిజంగా నన్ను రక్షిస్తాయా?” అని ఎప్పుడూ సందేహించకూడదు.

దానికి బదులుగా మన స్వరూపానికి అనుగుణంగా జీవించాలి. మన వర్ణాశ్రమ ధర్మానికి అనుగుణమైన అనుష్ఠానాలను కొనసాగించాలి, జ్ఞానాన్ని సంపాదించాలి, కైంకర్యం చేయాలి.

మనలను రక్షించడం ఎంపెరుమాన్ బాధ్యత అనే పూర్తి విశ్వాసం మనకు ఉండాలి. ఆ విశ్వాసం లేకపోవడమే విరోధి.

ఆచార్యుని ద్వారా శరణాగతి చేసినప్పుడు, ఎంపెరుమాన్ మనలను రక్షిస్తాడని మనం అంగీకరిస్తాము. కాబట్టి శరణాగతి తరువాత ఎంపెరుమాన్ రక్షిస్తాడా, స్వీకరిస్తాడా అని సందేహించడం ఉపాయ విరోధి.

అయితే దీని అర్థం “ఎంపెరుమాన్ నన్ను స్వీకరిస్తాడు కాబట్టి నేను నా ఇష్టానుసారం ఏదైనా చేయవచ్చు” అని కాదు.

మనం మన అనుష్ఠానాలను తప్పక పాటించాలి. తెలిసి లేదా తెలియక అపచారాలు జరగవచ్చు. అలా జరిగినప్పుడు ఎంపెరుమాన్‌ను క్షమాపణ కోరుతూ, ఆయనపై సంపూర్ణ విశ్వాసంతో జీవించాలి.

“ఐశ్వర్యకైవల్యమ్, స్వానుభవమాన భగవత్ కైన్కర్యమ్ ఇవై  ఉపేయ విరోధి”

ఉపేయం అంటే సాధించబడిన తరువాత అనుభవించవలసిన ఫలం.

ఐశ్వర్యకైవల్యం 

ఐశ్వర్యం అంటే ప్రపంచ విషయాలలో లభించే అనుభవం. అది విరోధి. మనం సత్ప్రయోజనమైన భగవద్విషయాలలో కార్యాలు చేస్తున్నప్పటికీ, వాటి ద్వారా పేరు, ప్రతిష్ఠ, సంపద మొదలైన ఫలితాలను పొందాలని కోరుకోవచ్చు.

సంపద మాత్రమే ఐశ్వర్యం కాదు. పేరు, కీర్తి మొదలైన ప్రపంచ సంబంధమైన ఇతర విషయాలు కూడా ఇందులోకి వస్తాయి. అందువల్ల ఇలాంటి ఐశ్వర్యాన్ని కోరుకోకూడదు.

కైవల్యం

కైవల్యం అంటే తన ఆత్మనే తాను అనుభవించుకోవడం. దానిపట్ల కూడా మనకు ఆసక్తి ఉండకూడదు.

స్వానుభవమైన భగవత్ కైంకర్యం

మనం కైంకర్యం చేస్తున్నప్పుడు, దాని ప్రధాన ఉద్దేశ్యం భగవంతుని ఆనందం కావాలి; మన ఆనందం కాదు.

దానికి బదులుగా మన ప్రాముఖ్యత పెరగాలని కోరుకుంటూ, మనకు నచ్చిన విధంగా కైంకర్యం చేయడం చాలా పెద్ద విరోధి.

ఇది చాలా ప్రమాదకరమైన విరోధి. ఎందుకంటే అది ఎంతో ఎత్తుకు ఎక్కి, అక్కడి నుంచి కింద పడిపోవడం వంటిది. కాబట్టి ఎంపెరుమాన్ సంతోషం కోసం మాత్రమే కైంకర్యం చేయాలి.

అందువల్ల:

  • ఐశ్వర్యాన్ని కోరుకోవడం,
  • కైవల్యాన్ని కోరుకోవడం,
  • స్వీయ ఆనందం కోసం భగవత్ కైంకర్యం చేయడం

ఈ మూడూ ఉపేయ విరోధులు.

ఆండాళ్ నాచ్చియార్ చేసిన ప్రార్థన

ఆండాళ్ నాచ్చియార్ తిరుప్పావై 29వ పాశురంలో,  మత్తెనమ్ కామన్గళ్ మాత్తేలో రెమ్బావాయ్” అని ప్రార్థిస్తుంది.

అంటే: “మాకు ఇతర విషయాలపై ఉన్న కోరికలను తొలగించి అనుగ్రహించాలి.” ఆండాళ్ నాచ్చియార్ ఎంపెరుమాన్‌ను అనుభవించాలని కోరుకుంటుంది. అయితే ఆ అనుభవం తన స్వీయ ఆనందం కోసం కాకుండా, ఎంపెరుమాన్ ఆనందం కోసం ఉండాలని ప్రార్థిస్తుంది. 

నమ్మాళ్వార్ కూడా తిరువాయ్మొళి 2.9.4లో, “తనక్కేయాగ ఎనైక్కొళ్ళుమ్ ఈదే” అని అంటారు. అంటే: “ఎంపెరుమాన్ నన్ను స్వీకరించినప్పుడు, తన ఆనందం కోసం మాత్రమే నన్ను స్వీకరించాలి; నేను ప్రార్థించినందుకో, నా కోరిక నెరవేర్చేందుకో కాదు.” “స్వరూప యాతాత్మ్య జ్ఞానమ్ పిఱవామైయాలే  దాన్తి పిఱక్కిఱదిల్లై” స్వరూప యాథాత్మ్య జ్ఞానం అంటే ఆత్మ యొక్క నిజమైన స్వరూపాన్ని లోతుగా తెలుసుకోవడం.

ఇక్కడ జ్ఞానం అంటే తెలుసుకోవడం; యాథాత్మ్య జ్ఞానం అంటే ఒక విషయం నిజంగా ఎలా ఉందో దానిని లోతుగా అర్థం చేసుకోవడం. ఆత్మ శరీరానికి భిన్నమైనది, ఆత్మ భగవంతునికి శేషమైనది అనే సత్యాన్ని లోతుగా తెలుసుకోవాలి. ఈ జ్ఞానం లేకపోతే దాంతి అంటే ఇంద్రియ నియంత్రణ, కలగదు. ఇంద్రియ నియంత్రణ లేకపోతే మనం ప్రపంచ విషయాల వైపు పదేపదే ఆకర్షితులవుతాము. కాబట్టి ఇంద్రియ నియంత్రణ లేకపోవడానికి ప్రధాన కారణం స్వరూప జ్ఞానం లేకపోవడం.

“విరోధి యాతాత్మ్య జ్ఞానమ్ పిఱవామైయాలే  అచ్చమ్ పిఱక్కిఱదిల్లై”

సంసారమే విరోధి అని మనం నిజంగా అర్థం చేసుకున్నప్పుడే, ఈ సంసారం పట్ల మనకు భయం / విరక్తి కలుగుతుంది. ఆళ్వార్ తిరువిరుత్తం మొదటి పాశురంలో, “పొయ్ నిన్ఱ జ్ఞానముమ్ పొల్లా ఒళుక్కుమ్ అళుక్కుడమ్బుమ్ ఇన్నిన్ఱ నీర్మై ఇనియామ్ ఉఱామై” అని అనుగ్రహించారు. అంటే, సత్యానికి విరుద్ధమైన తప్పు జ్ఞానం, చెడు ప్రవర్తన, మలినమైన శరీరం మొదలైన వాటితో కూడిన ఈ జన్మలను ఇకపై అనుభవించకూడదని ప్రార్థిస్తున్నారు. ఆళ్వార్‌కు సంసారం యొక్క నిజమైన స్వరూపం బాగా అర్థమైంది. అందువల్ల, “ఇలాంటి సంసారంలో నేను ఇంకా ఎలా జీవించాలి?” అనే భయం ఆయనకు కలిగింది.

మనకు సంసారం యొక్క నిజమైన స్వరూపం అర్థం కాకపోతే, దాని పట్ల భయం లేదా విరక్తి కూడా కలగదు. సంసారంలోని దుఃఖాలను, దోషాలను నిజంగా తెలుసుకున్నప్పుడే, దాని నుండి బయటపడాలనే తీవ్రమైన కోరిక కలుగుతుంది.

“ఉపాయ యాతాత్మ్య జ్ఞానమ్ పిఱవామైయాలే  వ్యవసాయమ్ పిఱక్కిఱదిల్లై” ఎంపెరుమాన్ యొక్క దివ్య తిరువడులే మన ఉపాయం. ఎంపెరుమాన్  యొక్క దివ్య తిరువడి అందరినీ, అర్హతలో తక్కువగా ఉన్నవారినీ కూడా, రక్షిస్తాయని మనకు స్పష్టమైన జ్ఞానం ఉండాలి. ఈ జ్ఞానం కలిగినప్పుడు, మనం ఆ మహోన్నతమైన దివ్య తిరువడి వద్ద శరణాగతి చేశామని తెలుసుకుంటాము. దాని ఫలితంగా మనకు విశ్వాసం మరియు దృఢనిశ్చయం కలుగుతాయి. దీనినే వ్యవసాయం అంటారు. ఎంపెరుమాన్ యొక్క దివ్య తిరువడి మహిమను, ఆయన కరుణ యొక్క గొప్పతనాన్ని లోతుగా తెలుసుకోకపోతే ఈ దృఢ నిశ్చయం కలగదు.  “భోగ యాతాత్మ్య జ్ఞానమ్ పిఱవామైయాలే  త్వరై పిఱాక్కిఱదిల్లై”  భోగం అంటే ఎంపెరుమాన్ యొక్క మాధుర్యం, ఆయన యొక్క మాధుర్యం (ఇనిమై).

ఆయన యొక్క మాధుర్యాన్ని లోతుగా తెలుసుకోకపోతే, ఆయనను త్వరగా చేరుకోవాలనే తీవ్రమైన కోరిక మనలో కలగదు. 

త్వరై అంటే ఎంపెరుమాన్‌ను త్వరగా చేరుకోవాలనే గాఢమైన ఆకాంక్ష.

ఎంపెరుమాన్ యొక్క మాధుర్యం, ఆనందం గురించిన జ్ఞానం మనకు జ్ఞానం కలిగినప్పుడే ఈ త్వర కలుగుతుంది. ఆ జ్ఞానం లేకపోతే, “ఎంపెరుమాన్‌ను త్వరగా చేరుకోవాలి” అనే తీవ్రమైన ఆకాంక్ష మనలో కలగదు. 

తదుపరి వ్యాసంలో పదిహేడవ వార్తై నుండి అనుభవిద్దాం. 

అడియేన్ ఉషా రామానుజ దాసి
అడియేన్ శ్రీకాంత్ రామానుజదాసన్

మూలం- https://youtu.be/LkLwsmS-w6Q
ఆడియో- https://1drv.ms/u/s!AnOSadexHn4jhBrcBL5INcqqUh_q?e=crCG6q

ఆంగ్లంలో – https://granthams.koyil.org/2026/08/09/varthamalai-part-5-english/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.or

Leave a Comment