శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః
23. ముని వేందు
ముని అంటే మనన శీల-అంటే ఎప్పుడూ ధ్యానం చేస్తూ భగవానుని గురించి ఆలోచించేవాడు. నమ్మాళ్వార్లే స్వయంగా శఠకోప ముని అని చెబుతారు. నమ్మాళ్వార్లు ఎప్పుడూ భగవానుని గురించి ఆలోచిస్తూ ఉంటారు. “సిందై మత్తొన్నిన్ తిఱత్తదల్లాత్ తన్మై దేవ పిఱాన్ అఱియుమ్” తిరువాయ్మొళి – 7.10.10 – “నేను భగవానుని గురించి తప్ప మరెవరి గురించి ఆలోచించనని లేదా ధ్యానం చేయనని భగవానునికి బాగా తెలుసు” అని ఆళ్వార్లే స్వయంగా ప్రకటించారు. ఈ విధంగా, నమ్మాళ్వార్లు ప్రకటించినట్లుగా, ఆళ్వార్లు స్వయంగా ఒక ముని, శఠకోప ముని.
అయినప్పటికీ, ఆళ్వార్లు అన్ని మునులకు, ధ్యానులకు మరియు ఆలోచనాపరులకు వేందు (రాజు, ప్రభువు) కూడా. శ్రీవైష్ణవ సంప్రదాయంలో, ముని అని పిలువబడే కొంతమంది ఆచార్యులు శ్రీమాన్నాథముని (నాథమునిగళ్), యామున ముని (ఆళవందార్), రామానుజ ముని (భగవద్ రామానుజ), మరియు వరవర ముని (మణవాళ మామునులు). నమ్మాళ్వార్ (శఠకోప స్వామి), ఆ మునులందరికీ నాయకులు, రాజు మరియు యజమాని.
24. పావలర్ తంపిరాన్
‘పావలర్’ అంటే నిపుణులైన కవులు అని అర్థం. మన శ్రీవైష్ణవ సంప్రదాయంలో అటువంటి నిపుణులైన కవులు ఎందరో ఉన్నారు. వారందరిలోనూ నమ్మాళ్వార్ అగ్రగణ్యులు. ఆయన తిరువాయిమొళిలో, “మలక్కు నావుడైయేర్కు మాఱుళదో ఇమ్మణ్ణిన్ మిసైయే?” – తిరువాయిమొళి – 6.4.9 అని అంటారు. అంటే, “సాక్షాత్తు భగవానునినే ఆశ్చర్యచకితుడిని చేయగల సామర్థ్యం కలిగిన నాకు, ఈ భూమిపై సాటి ఎవరైనా ఉన్నారా?” అని అర్థం. ఆ విధంగా, ఆళ్వార్లే స్వయంగా ఒక గొప్ప కవి.
అంతేకాక, అటువంటి గొప్ప కవులకు ఆయన ఉపకారి, నాయకుడు మరియు ప్రభువు (తంపిరాన్) కూడా. మన శ్రీవైష్ణవ సంప్రదాయంలోని నిపుణులైన కవులలో తిరుమంగై ఆళ్వార్లు (పరకాల స్వామి), శ్రీ యామునాచార్యులు, కురేశాదులు ముఖ్యులు. తిరుమంగై ఆళ్వార్లు అనేక అద్భుతమైన ప్రబంధాలను రచించిన గొప్ప కవి మరియు నమ్మాళ్వార్ల యొక్క దివ్య ప్రబంధాలలో నిపుణులు; శ్రీ యామునాచార్యులు అనేక గ్రంథాలను, ముఖ్యంగా భగవానునిపై స్తోత్రములను రచించారు; కురేశ స్వామి ‘పంచస్తవాలు’ అనే ఐదు అందమైన కావ్య గ్రంథాలను రచించారు. ఈ విధంగా, మన శ్రీవైష్ణవ సంప్రదాయంలోని నిపుణులైన కవులందరికీ నమ్మాళ్వార్లు ఉపకారిగా, ప్రభువుగా మరియు నాయకుడిగా ఉన్నారు.
వీడియోలింక్: https://youtube.com/shorts/wbobuXPbBAc?si=B753qnBQ8Bn0TwHn
ఆంగ్లంలో: https://granthams.koyil.org/2026/07/22/nammazhwars-divine-names-muni-vendhu-pavalar-thampiran/
అడియేన్ దాసరి కేశవ కృష్ణ రామానుజ దాసన్
ప్రూఫ్ రీడింగ్ చేసినవారు – ప్రసూన రామానుజ దాసి
https://granthams.koyil.org లో ఆర్కైవ్ ఉంచబడినది.
ప్రమేయం (లక్ష్యం) – https://koyil.org
ప్రమాణం (గ్రంధాలు) – https://granthams.koyil.org
ప్రమాతా(ఉపదేశకులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్యా/పిల్లల పోర్టల్ – https://pillai.koyil.org