శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః
29. శ్రీవైష్ణవ కులపతి
శ్రీవైష్ణవుడు అంటే భగవానుడు అయిన శ్రీమన్నారాయణుని మాత్రమే ఆరాధించేవాడు అని అర్థం. వారు శ్రీమన్నారాయణుడినే ‘ఉపాయం’ మరియు ‘ఉపేయం’గా భావిస్తారు. శ్రీవైష్ణవులు శరణాగతుల మరియు ముముక్షువుల కలయిక అని కూడా చెప్పవచ్చు. ‘శరణాగతుడు’ అంటే భగవానునే ఉపాయంగా అంగీకరించినవాడు; ‘ముముక్షువు’ అంటే శ్రీమన్నారాయణుడికి మాత్రమే శాశ్వత కైంకర్యం (సేవ) చేయాలని కోరుకునేవాడు. ఈ విధంగా, వారు భగవానుని ఉపాయం మరియు ఉపేయం రెండింటిగానూ భావిస్తారు. ఈ రెండు లక్షణాలు ఉన్నప్పుడే ఒక వ్యక్తిని శ్రీవైష్ణవుడిగా పరిగణించవచ్చు.
‘కులం’ అంటే వంశం లేదా సమూహం. వర్ణంతో (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య లేదా శూద్ర) సంబంధం లేకుండా, ఒక వ్యక్తి శ్రీవైష్ణవుడిగా మారినప్పుడు, అది అన్ని వర్ణాల వారితో కూడిన ఒక ప్రత్యేక కులంగా మారుతుంది. అటువంటి శ్రీవైష్ణవ కులానికి ‘నమ్మాళ్వార్లు’ పతిగా ఉంటారు. ‘పతి’ అంటే ప్రభువు లేదా స్వామి అని అర్థం. కాబట్టి, ‘శ్రీవైష్ణవ కులపతి’ అంటే శ్రీవైష్ణవ కులంలోని శ్రీవైష్ణవులందరికీ నాయకులు లేదా ప్రభువు అని అర్థం.
30. జ్ఞానప్పిరాన్
జ్ఞానప్పిరాన్ అనేది జ్ఞాన దేశికన్ అనే దివ్య నామాన్ని పోలి ఉంటుంది. జ్ఞానం అంటే అర్థ పంచక జ్ఞానం. అంటే జీవాత్మ స్వరూపం, పరమాత్మ స్వరూపం, ఉపాయ స్వరూపం, ఉపేయ స్వరూపం మరియు విరోధి స్వరూపం గురించిన సత్యాన్ని తెలుసుకోవడం.
ఈ జ్ఞానాన్ని మనకు అనుగ్రహించి సహాయం చేసేవారు జ్ఞానప్పిరాన్. పిరాన్ అంటే శ్రేయోభిలాషి (ఉపకారక). నమ్మాళ్వార్లు తమ దివ్య ప్రబంధాల ద్వారా మనకు అర్థ పంచకం అనుగ్రహించారు.
మన సంప్రదాయంలో, వరాహ పెరుమాళ్లను జ్ఞానప్పిరాన్ అని పిలుస్తారు.తిరువిరుత్తం 99వ పాశురంలో, నమ్మాళ్వార్లు ఇలా అంటారు “ఈనచ్చొల్లాయినున్మాగ ఎఱితిరై వైయమ్ ముర్ర్టుమ్ ఏనత్తురువాయ్ ఇడంన్ద పిరాన్ ఇరుమ్ కఱ్పగమ్ శేర్ వానత్తవర్క్కుమ్ అల్లాదవర్కుమ్ మర్ర్టెల్లాయవర్కుమ్ జ్ఞానప్పిరానై అల్లాల్ ఇల్లై నాన్ కణ్డ నల్లదువే ” నా మాటలు ప్రయోజనరహితమైనప్పటికీ, అలాగే కానివ్వండి; అయినా నేను ఈ మాటను చెప్పే తీరుతాను. ఉవ్వెత్తున లేచే అల్లకల్లోలమైన కెరటాల సముద్రాలతో నిండిన ఈ జగత్తులన్నింటినీ, అడవి వరాహ రూపంలో చీల్చి రక్షించిన ఆ శ్రీమన్నారాయణుడు తప్ప మనకు వేరే దిక్కు లేదు.” ఇది కఱ్పగమనే దివ్య వృక్షాన్ని చేరుకోవాలని ఆకాంక్షించే దేవతలకు వర్తిస్తుంది; ఇది దేవతల కన్నా భిన్నమైన నిత్యసూరులకు వర్తిస్తుంది; ఇది ఇతరులకు; మానవులు, జంతువులు మొదలైన సృష్టికి వర్తిస్తుంది. ఇది నేను నిర్ధారించుకున్న అభిప్రాయం). నమ్మాళ్వార్లకు వరాహ పెరుమాళ్ల పట్ల గొప్ప అనురాగం ఉంది. ఆళ్వార్ తిరునగరిలో భూవరాహ పెరుమాళ్లకి ఒక సన్నిధి ఉంది. మన పెద్దలు నమ్మాళ్వార్లకు కూడా వరాహ పెరుమాళ్ల నామమైన జ్ఞానపీరాన్‌ను ఇచ్చారు.
వీడియోలింక్: https://youtube.com/shorts/stVeOj9HWkg?si=TGiyF5W9-1sjRzFM
ఆంగ్లంలో: https://granthams.koyil.org/2026/07/24/nammazhwars-divine-names-srivaishnava-kulapathi-gyanappiran/
అడియేన్ దాసరి కేశవ కృష్ణ రామానుజ దాసన్
ప్రూఫ్ రీడింగ్ చేసినవారు – శ్రీ తేజ రామానుజ దాసి
https://granthams.koyil.org లో ఆర్కైవ్ ఉంచబడినది.
ప్రమేయం (లక్ష్యం) – https://koyil.org
ప్రమాణం (గ్రంధాలు) – https://granthams.koyil.org
ప్రమాతా(ఉపదేశకులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్యా/పిల్లల పోర్టల్ – https://pillai.koyil.org