శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః
ఐప్పసి (ఆశ్వీయుజ) మాసంలో అవతరించిన ఆళ్వార్లు మరియు ఆచార్యుల దివ్య వైభవాన్ని మనం అనుభవిస్తున్నాము. ఈ మాసం యొక్క విశేష వైభవాల గురించి తెలుసుకోవడానికి https://granthams.koyil.org/aippasi-thula-masa-anubhavam/ను సందర్శించండి. ఇప్పుడు, అత్యంత దయామయులైన పిళ్ళైలోకాచార్యుల వారిని మరియు వారి దివ్య గ్రంథమైన ‘శ్రీ వచన భూషణం’ని, ఆ అద్భుత గ్రంథానికి మణవాళ మామునులు అందించిన సుందరమైన ‘వ్యాఖ్యాన అవతారిక’ (వ్యాఖ్యాన పరిచయం) ద్వారా మనం దర్శించుకుందాం.ఈ గొప్ప గ్రంథం మరియు దాని ‘తనియన్ల’ గురించిన సంక్షిప్త పరిచయాన్ని మనం ఇప్పటికే https://granthams.koyil.org/2026/07/26/aippasi-anubhavam-pillai-lokacharyar-sri-vachana-bhushanam-thanians-telugu/ లో చూశాము. అలాగే, ఈ ప్రబంధానికి మామునులు అందించిన అవతారికలోని మొదటి భాగాన్ని https://granthams.koyil.org/2026/07/28/aippasi-anubhavam-pillai-lokacharyar-sri-vachana-bhushanam-1-telugu/ లో చూశాము.
ఇప్పుడు మనం ‘అవతారికై’ (పరిచయం) యొక్క రెండవ భాగాన్ని పరిశీలిద్దాం. పరిచయంలోని ఈ భాగంలో, మామునిగళ్ ఈ ప్రబంధానికి సంబంధించిన రెండు రకాల వర్గీకరణలను (6 విభాగాలు మరియు 9 విభాగాలు) వివరిస్తారు.

పిళ్ళైలోకాచార్యులు, మామునిగళ్ – శ్రీపెరుంబుదూర్
మొదట, ఈ ప్రబంధం ఆరు విభాగాలుగా ఎలా వర్గీకరించబడిందో చూద్దాం: ఈ ప్రబంధం pra ఆరంభంలో,
(సూత్రం 1) “వేదార్థం అఱుతియిడువతు” నుండి (సూత్రం 4) “అత్తాలే అతు ముఱ్పట్టతు” వరకు, ప్రమాణం (జ్ఞానానికి మూలం) యొక్క ప్రామాణికత స్థాపించబడింది. కాబట్టి, ఈ విభాగం ప్రబంధమునకు పరిచయం. (సూత్రం 5) “ఇతిహాస శ్రేష్ఠం” నుండి (సూత్రం 22) “ప్రపత్తి ఉపదేశం పన్నిర్ర్టుమ్ ఇవళుక్కాగ” వరకు పురుషకార వైభవం మరియు ఉపాయం వైభవం వివరించబడ్డాయి. పిరాట్టి యొక్క స్వరూపాన్ని పురుషకారం (మధ్యవర్తిత్వం/సలహా)గా వివరించారు – అంటే, దోషపూరితమైన జీవాత్మలను చూసి, భగవానునికి శరణాగతులైన వారిని ఉద్ధరించడం మరియు దయ చూపడం భగవానుని స్వరూపమని పిరాట్టి నిరంతరం భగవానునికి గుర్తుచేస్తూనే ఉంటుంది. అత్యంత దయామయుడైన ఎంపెరుమాన్ ‘ఉపాయం’ (మోక్ష సాధనం)గా వ్యవహరించడాన్ని కూడా ఈ భాగం వివరిస్తుంది; నిజానికి, ఎంపెరుమాన్ చూపించే ఈ దయ ‘పురుషకారం’ కంటే కూడా అత్యంత వైభవమైనది. (సూత్రం 23) “ప్రపతిక్కు” నుండి (సూత్రం 79) “ఏకాంతీ వ్యపతేష్టవ్య : ” వరకు, ప్రపతి స్వభావం వివరంగా వివరించబడింది. ప్రపత్తి అనేది భగవానుని ఉపాయంగా స్వీకరించే కార్యం. కింది అంశాలు వివరించబడ్డాయి :
- భగవానుని ఉపాయంగా స్వీకరించే ఈ కార్యముకు, స్థలం, సమయం, పద్ధతి, ప్రపత్తి చేసే వ్యక్తి యొక్క అర్హత మరియు ఫలితం ఆధారంగా ఎటువంటి పరిమితి లేదు.
- ప్రపత్తికి లక్ష్యమైనవారు (ఎవరికి మనం శరణాగతి చేస్తామో లేదా ఎవరిని ఆశ్రయిస్తామో వారు) తగిన సామర్థ్యం కలిగి ఉండాలి
- ప్రపత్తిని ఆచరించే మూడు రకాలవ్యక్తుల వర్గీకరణలు
- ప్రపత్తిని (మోక్ష) సాధనంగా అంగీకరించడంలో ఉండే పరిమితులు (భగవానుడే అసలైన సాధనం – ప్రపత్తి అనేది కేవలం జీవాత్మ స్వభావానికి అనుగుణంగా ఉండే ఒక చర్య మాత్రమే)
- ప్రపత్తి యొక్క స్వభావం మరియు దాని అనుబంధ అంశాల గురించిన సమగ్ర వివరణ.
అందువలన, ఈ విభాగం భగవానుడే ఉపాయం అని మరియు భగవానుని వైభవములను నిర్ధారిస్తుంది. ఇందులో, (సూత్రం 70) “ప్రాపతిక్కు ఉగప్పానుమ్ అవనే” వరకు విషయం యొక్క ముఖ్యాంశం. 71-79 అనుబంధంగా ఉన్నాయి.
(సూత్రం 80) “ఉపాయతుక్కు” నుండి (సూత్రం 307) “ఉపేయ విరోధిగళాయిరుక్కుమ్” వరకు, ఒక ప్రపన్నుడి ప్రవర్తనా నియమావళి వివరించబడింది. ఈ విభాగం కింది అంశాలను చర్చిస్తుంది :
- ఇతర ఉపాయాల (మార్గాల) పట్ల ఉన్న ఆసక్తిని లేదా అనుబంధాన్ని వదిలివేయవలసిన ఆవశ్యకత
- మరియు అలాంటి వ్యక్తులు చేయవలసిన పనులు (విధి) మరియు చేయకూడని పనుల (నిషేధం) గురించిన సాధారణ నియమాలు.
(సూత్రం 308) “తాన్ హితోపదేశమ్ పణ్ణుమ్పోదు” నుండి (సూత్రం 365) “ఉగప్పుమ్ ఉపకార స్మృతియుమ్ నడక్క వేణుమ్” వరకు, ఆచార్యుల పట్ల శిష్యుని వైఖరి (శిష్య లక్షణం) సవివరంగా వివరించబడింది. ఈ విభాగం కింది అంశాలను చర్చిస్తుంది :
- సిద్ధోపాయ నిష్ఠుని (నిశ్చయమైన ఉపాయమైన భగవానునిపై పూర్తిగా ఆధారపడేవారి) స్వభావం.
- నిజమైన ఆచార్యుల స్వభావం
- నిజమైన శిష్యుని స్వభావం మరియు ఆచార్యులపై శిష్యుడు సంపూర్ణ ఆధారపడటం
- ఆచార్య-శిష్యుల మధ్య ఉండే పరస్పర సంబంధం
- తన ఉద్ధరణకు సహాయపడిన ఆచార్యుల పట్ల శిష్యునికి ఉండే కృతజ్ఞతాభావం.
(సూత్రం 366) “స్వదోషానుసంధానమ్ భయ హేతు” నుండి (సూత్రం 406) “నివర్తక జ్ఞానమ్ అభయ హేతు” వరకు, భగవానుని నిర్హేతుక కృప (కారణం లేని దయ) గురించి వివరించబడింది. భగవానుని ఈ నిర్హేతుక కృప వల్లే ఒకరు విభిన్న ఆధ్యాత్మిక దశలకు చేరుకుంటారు – అద్వేషం (భగవానుని పట్ల విముఖత లేకపోవడం) నుండి నిత్య కైంకర్యం (భగవానునికి శాశ్వతమైన సేవ చేయడం) అనే అంతిమ గమ్యం వరకు ఎదుగుతారు. జీవాత్మ యొక్క ఉద్ధరణకు పూర్తి భరోసా ఇచ్చే భగవానుని నిర్హేతుక కృపను దర్శించడం ద్వారానే, ఒకరు తమ సమస్త దుఃఖాల నుండి విముక్తి పొందుతారని ఇక్కడ నిరూపించబడింది.
(సూత్రం 407) “స్వతంత్రనై ఉపాయమాగప్పర్ర్టిన పోతిఱే” నుండి గ్రంథం ముగింపు (సూత్రం 463) వరకు ఒకరి విశ్వాసం యొక్క అత్యున్నత దశను వివరించబడింది, అనగా ఆచార్యులపైనే పూర్తిగా ఆధారపడి ఉండడం (ఆచార్యాభిమానమే ఉత్తారకం). మధురకవి ఆళ్వార్లు తమ కణ్ణినుణ్ శిరుత్తాంబు (9వ పాశురం) “మిక్క వేదియర్ వేదత్తిన్ ఉట్పొరుళ్ ” లో వివరించినట్లుగా – ఇదే వేదాల యొక్క నిజమైన అంతరార్థం అని ఇక్కడ నిరూపించబడింది.
ఈ గ్రంథం “వేదార్థమ్ అఱుతియిడువతు” (శాస్త్రాల సారాంశం నిరూపించేది ఏంటంటే…) అని ప్రారంభమై, “చరమ పర్వ నిష్ఠై” (ఆచార్యునిపైనే సంపూర్ణంగా ఆధారపడి ఉండడం) తో ముగుస్తుంది. దీనిని బట్టి ఆచార్యుల కృపపై పూర్తిగా ఆధారపడడమే వేదాల యొక్క పరమ సారాంశం అని స్పష్టంగా నిరూపించబడింది.
శ్రీ గీతకు చరమ శ్లోకం (సర్వధర్మాన్ పరిత్యజ్య…) ఎలాగైతే సారాంశమో, ఈ ప్రబంధానికి (శ్రీవచనభూషణానికి) ఈ చివరి ప్రకరణం అలా సారాంశం. అక్కడ (శ్రీమద్భగవద్గీతలో), ఎంపెరుమాన్ మొదట వివిధ ఉపాయాలను (కర్మ, జ్ఞాన, భక్తి యోగాలు మొదలైనవి) చూపించారు. అయితే తనకు తానుగా సరైన మార్గాన్ని ఎంచుకునే స్వతంత్రతను చూసి అర్జునుడు భయపడుతున్నాడని గ్రహించి, ఇతర మార్గాలన్నింటినీ పక్కన పెట్టి సిద్ధోపాయాన్ని (తననే ఏకైక మార్గంగా) చూపించాడు. ఇక్కడ (ఈ ప్రబంధంలో), సిద్ధోపాయం (భగవానుడే మార్గం) యొక్క వైభవం సవివరంగా వివరించబడింది. అయితే భగవానుని స్వాతంత్ర్యం (ఆయన స్వతంత్రుడైనందున ఒక్కోసారి అనుకూలంగా లేదా ప్రతికూలంగా ప్రవర్తించవచ్చు అనే భయం) పట్ల జీవుడికి ఉండే భయాన్ని గమనించి, అన్నింటికంటే సురక్షితమైన మార్గమైన ఆచార్యులపై ఆధారపడే అత్యున్నత మార్గాన్ని (చరమ పర్వ నిష్ఠను) చూపడం జరిగింది. ఈ విధంగా, 6 ముఖ్యమైన సిద్ధాంతాలను విశదపరిచే ఈ ప్రబంధం యొక్క 6 ప్రకరణాలు (విభాగాలు) వివరించబడ్డాయి.
ఇప్పుడు ఈ ప్రబంధం 9 ప్రకరణాలుగా (విభాగాలుగా) ఎలా వర్గీకరించబడిందో చూద్దాం.
1 నుండి 22 సూత్రాలలో వివరించబడిన అవతారికై (పరిచయ విభాగం) మరియు పురుషకార/ఉపాయ వైభవం ఇంతకుముందు వివరించిన విధంగానే ఉంటాయి.
ఆ తర్వాత, (సూత్రం 23) “ప్రపత్తిక్కు” నుండి ప్రారంభమై (సూత్రం 114) “భగవద్విషయ ప్రవృత్తి శేరుమ్” తో ముగిసే విభాగం – మొదటి ప్రకరణంలో విశదపరిచిన ‘భగవానుడే ఉపాయం’ అనే సిద్ధాంతాన్ని మరింత సవివరంగా వివరిస్తుంది.
(సూత్రం 115) “ప్రాపకాంతర పరిత్యాగత్తుక్కు” నుండి (సూత్రం 141) “ఆగైయాలే సుకరూపమాయిరుక్కుమ్” వరకు, ప్రపత్తి మినహా ఇతర ఉపాయాలలో ఉండే లోపాలను వివరిస్తుంది. ఈ విభాగంలో ప్రపత్తి యొక్క గొప్పతనం గురించి చేసిన చర్చ అనుబంధంగా ఉంటుంది.
(సూత్రం 142) “ఇవనైప్పెఱ నినైక్కుమ్ పోదు” నుండి (సూత్రం 242) “ఇడైచ్చియాయ్ పెర్ర్టువిడుదల్ శెయ్యుమ్పడియాయిరుక్కుమ్” వరకు, సిద్ధోపాయ నిష్ఠుల (భగవానుడే ఏకైక ఉపాయంగా పూర్తిగా అంగీకరించిన వారి) వైభవాన్ని వివరిస్తుంది.
(సూత్రం 243) “ఇప్పడి సర్వప్రకారత్తాలుమ్” నుండి (సూత్రం 307) “ఉపేయ విరోధికళాయిరుక్కుమ్” వరకు, ప్రపన్న దినచర్యను (శరణాగతి పొందిన భక్తుని దైనందిన విధులను) వివరిస్తుంది.
(సూత్రం 308) “తాన్ హితోపదేశమ్ పణ్ణుమ్ పోదు” నుండి (సూత్రం 320) “చేతనుడైయ రుచియాలే వరుగైయాలే” వరకు, సదాచార్య లక్షణాన్ని (నిజమైన ఆచార్యులకు ఉండవలసిన ఉత్తమ గుణాలను) వివరిస్తుంది.
(సూత్రం 321) “శిష్యనెంబదు” నుండి (సూత్రం 365) “ఉపకార స్మృతియుమ్ నడక్క వేణుమ్” వరకు, సచ్ఛిష్య లక్షణాన్ని (ఉత్తమ శిష్యుని గుణగణాలను) వివరిస్తుంది.
(సూత్రం 366) “స్వదోషానుసంధానమ్” నుండి (సూత్రం 406) “నివర్త్తక జ్ఞానమ్ అభయ హేతు” వరకు, ఎంపెరుమాన్ తన నిర్హేతుక కృపతో (కారణం లేని దయతో) జీవాత్మలను ఎలా వెన్నంటి ఉండి ఉద్ధరిస్తాడనే అంశాన్ని వివరిస్తుంది.
(సూత్రం 407) “స్వతంత్రనై” నుండి ముగింపు (సూత్రం 463) వరకు, ఆచార్యులే ఉపాయము (మార్గము) మరియు ఉపేయము (గమ్యము) అనే చరమ సిద్ధాంతాన్ని వివరిస్తుంది.
ఈ రెండు రకాల విభజనలకు అనుగుణంగానే, ఈ ప్రబంధం (శ్రీవచనభూషణం) యొక్క వైభవాన్ని కీర్తిస్తూ “పేఱు తరువిక్కుమవళ్ తన్ పెరుమై” (6 విభాగాలను వివరించే తనియన్) మరియు “తిరుమామగళ్ తన్” (9 విభాగాలను వివరించే తనియన్)లు సమర్పించబడ్డాయి. కాబట్టి ఈ ప్రబంధాన్ని ఈ రెండు రకాల వర్గీకరణల ద్వారా అర్థం చేసుకోవడం సర్వసమ్మతమైనది.
ఈ విధంగా, పిళ్ళైలోకాచార్యుల ‘శ్రీ వచన భూషణం’ గ్రంథానికి మామునిగళ్ అందించిన అద్భుతమైన పరిచయంలోని భాగాన్ని మనం చూశాము; ఇందులో ఈ ప్రబంధానికి సంబంధించిన రెండు రకాల వర్గీకరణలు వివరంగా వివరించబడ్డాయి.
పిళ్ళైలోకాచార్యుల అనుగ్రహించిన శ్రీ వచన భూషణం గ్రంథానికి మామునిగళ్ అందించిన ఈ అద్భుతమైన పరిచయం యొక్క కొనసాగింపును తరువాతి వ్యాసాలలో మనం చూస్తాము.
ఆంగ్లంలో: https://granthams.koyil.org/2013/11/07/aippasi-anubhavam-pillai-lokacharyar-sri-vachana-bhushanam-2/
అడియేన్ దాసరి కేశవ కృష్ణ రామానుజ దాసన్
ప్రూఫ్ రీడింగ్ చేసినవారు – శ్రీ తేజ రామానుజ దాసి
https://granthams.koyil.org లో ఆర్కైవ్ ఉంచబడినది.
ప్రమేయం (లక్ష్యం) – https://koyil.org
ప్రమాణం (గ్రంధాలు) – https://granthams.koyil.org
ప్రమాతా(ఉపదేశకులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్యా/పిల్లల పోర్టల్ – https://pillai.koyil.org