కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 32 – సాందీపని ముని వద్ద గురుకుల వాసం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి

<< 31 – దేవకీ వాసుదేవ బంధ విమోచనం

వసుదేవుడు తన కులగురువుతో మాట్లాడి, కృష్ణుడు, బలరాముడు యొక్క ఉపనయన సంస్కారానికి తేదీ నిర్ణయించారు. నిర్ణయించిన రోజున, కృష్ణుడు, బలరాముడు ఇద్దరూ తమ ఉపనయనం చేసుకున్నారు. ఆ తర్వాత, వాళ్ళిద్దరూ ఒక గురువు దగ్గర నివసించి, శాస్త్రాలు నేర్చుకోవాలని నిర్ణయించారు. సర్వేశ్వరుడైన కృష్ణుడు, వేద ప్రాతిపాద్యుడు, ప్రతీ సృష్టి ప్రారంభంలో బ్రహ్మకు వేదాలు బోధించేవాడు, ఒక గురువు దగ్గర నేర్చుకోవాలని నిర్ణయించినప్పుడు, అవంతిలో నివసిస్తున్న సాందీపని ముని ఉత్తముడని తీర్మానించబడింది. అందుకే కృష్ణుడు, బలరాముడు అతని దగ్గరకు వెళ్ళి, శాస్త్రాలు బోధించమని వేడుకున్నారు. అతడు కూడా వాళ్ళ దైవిక స్వభావాన్ని గమనించి, సంతోషంగా 64 రకాల శాస్త్రాలను కేవలం 64 రోజుల్లో బోధించాడు. వాళ్ళిద్దరూ సుధామ వంటి ఇతర విద్యార్థులతో కలిసి సందీపని ముని ఆశ్రమంలో నివసించి, అత్యంత భక్తితో శాస్త్రాలు నేర్చుకుని, శాస్త్రాలలో నిపుణులయ్యారు.

గురువు దగ్గర జ్ఞానం పొందిన తర్వాత, శిష్యుడు గురు-దక్షిణ ఇవ్వాలి. ఈ కారణంగా, కృష్ణుడు, బలరాముడు అతని దగ్గరకు వెళ్ళి, “మీకు ఏమి కావాలో చెప్పండి, మేము తెస్తాము” అని అడిగారు. అతడు మోక్షాన్ని కోరినా, కృష్ణుడు సంతోషంగా ఇచ్చేవాడు. కానీ, అతడు తన భార్యతో కలిసి చర్చించి, చాలా కాలం క్రితం సముద్రంలో మరణించిన తన కుమారుడిని తీసుకురమ్మని కోరాడు. కృష్ణుడు వెంటనే సముద్ర తీరానికి వెళ్ళి, అక్కడ వెతికాడు. అప్పుడు సముద్రరాజు అక్కడికి వచ్చి, పంచజనుడు అనే శంఖ రూపం ధరించిన రాక్షసుడు ఆ బాలుడిని మింగాడని తెలిపాడు. కృష్ణుడు ఆ రాక్షసుడిని కనుగొని చంపాడు, కానీ బాలుడిని దొరకలేదు. ఆ తర్వాత కృష్ణుడు యమపురానికి వెళ్ళి, యముడిని, మృత బాలుడిని తిరిగి ఇవ్వమన్నాడు. యముడు అందుకు అంగీకరించి, బాలుడిని తిరిగివ్వగా, అతన్ని తీసుకుని గురువుకు అప్పగించాడు.

ఈ ఘటన తర్వాత, వాళ్ళిద్దరూ తమ ఊరుకు తిరిగి వచ్చారు.

తిరుమంగై ఆళ్వార్ తన పెరియ తిరుమోళిలో, “ఓదు వాయ్మైయుమ్ ఉవనియప్పిఱప్పుమ్ ఉనక్కు మున్ తంద అందణన్ ఒరువన్” (ఉపనయన సంస్కారం ద్వారా నిన్ను ద్విజుడిని చేసి, వేదం బోధించిన గొప్ప ఆచార్యుడైన సాందీపని ముని) అని కృష్ణుడు సాందీపని దగ్గర దీక్ష అందుకున్నాడని చెప్పాడు. ఈ ప్రబంధానికి వ్యాఖ్యాతగా ఉన్న పెరియవాచ్చాన్ పిళ్ళై, “ఆంధణన్ ఒరువన్” అనేదానిని వివరిస్తూ, సాందీపని ముని నంపిళ్ళై లాంటి గొప్ప ఆచార్యుడని చెప్పాడు [పెరియవాచ్చాన్ పిళ్ళై ఆచార్యుడు].

ఈ సంఘటనలోని సారాంశం:

  • భగవంతుడికి మనం ఏమైనా ఇవ్వవచ్చు. కానీ గురువుకు దక్షిణ ఇస్తున్నప్పుడు, గురువు కోరిక ప్రకారమే ఇవ్వాలి.
  • భగవంతుడు సహజంగా సమస్తం తెలిసినప్పటికీ, సరైన మార్గాన్ని చూపడానికి, గురువు దగ్గర వినయంగా అన్నింటినీ నేర్చుకుని, జ్ఞానం పొందడానికి ఇదే సరైన మార్గమని చూపించాడు.
  • భగవంతుడికి బోధించగల గొప్ప జ్ఞాని అయినా, శరీర సంబంధాలకు బద్దుడు అయితే, భగవంతుడిని చేరే అవకాశాన్ని కోల్పోతారు.

మూలం : https://granthams.koyil.org/2023/10/09/krishna-leela-32-english/

అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment