శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః
ఉపదేశం 7
సర్వాన్ శబ్ధాధి విషయాన్ సమానేవ విలోకయేత్ ||
సరళమైన వివరణ: అన్ని రకాల లౌకిక సుఖాలను సమానంగా చూసి, చివరికి వాటిని త్యజించాలని ఇక్కడ వివరించబడింది. శబ్దాధి విషయం అంటే చూడటం వలన కలిగే సుఖం, వినడం వలన కలిగే సుఖం, స్పర్శ వలన కలిగే సుఖం, వాసన వలన కలిగే సుఖం మరియు రుచి చూడటం వలన కలిగే సుఖం. కాబట్టి, ఈ పంచేంద్రియాలు అయిన కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక మరియు చర్మం – వీటన్నింటికీ వేర్వేరు సుఖానుభూతులు ఉన్నాయి.సంప్రదాయంలో, ఆధ్యాత్మికతలో మన పురోగతికి వాటన్నిటినీ సమానంగా ప్రతికూలమైనవిగా మనం చూడాలి.”మనం కళ్ళతో చూసి ఆనందించవచ్చు, కానీ ప్రతికూలమైన దాన్ని రుచి చూడటం మంచిది కాదు, కేవలం చూడటం మాత్రం సరియైనదే” అని కొందరు అనుకోవడం సరికాదు.అలాగే, కొందరు “మనం సంగీతం, వినోదం వినవచ్చు, అది ఫర్వాలేదు, అది మనల్ని అంతగా ఇబ్బంది పెట్టదు, కానీ మనం ఏదైనా చూస్తే అది మన ఆధ్యాత్మిక పురోగతికి మరింత ఆటంకం కలిగిస్తుంది” అని అనుకుంటారు.కానీ ఇక్కడ విషయం ఏమిటంటే, మనం వివక్ష చూపలేము. ఏ ఇంద్రియ సుఖమైనా మనల్ని సంసారంలో కిందికి లాగుతుంది.కాబట్టి, మనం అన్ని రకాల భోగాలను ఒకే విధంగా చూడటంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటన్నిటినీ చివరికి వదులుకోవాలి – పరిత్యజించాలి.మనం వెంటనే అన్నింటినీ వదులుకోలేకపోవచ్చు. కానీ, భౌతిక, ప్రాపంచిక సుఖాలన్నింటినీ, భోగాలన్నింటినీ వదులుకోవడమే మన లక్ష్యం కావాలి. ఎందుకంటే అవన్నీ మనల్ని భగవానుడి నుండి దూరం చేస్తున్నాయి.అందువల్ల, వాటన్నిటినీ సమానంగా చూడటం, వాటన్నిటి పట్ల ఉన్న మమకారాన్ని సమానంగా వదులుకోవడం చాలా ముఖ్యం.
వీడియో లింక్: https://youtube.com/shorts/Z_jV6T_WTTw?si=rleVLStWV_2ym23n
ఉపదేశం 8
పుష్ప చందన తాంబుల ద్రవ్యాదిషు సుగందిషు | వాసనా రుచి కార్యాని కధాచిన్నైవ కారయేత్ ||
సరళమైన వివరణ: పుష్పములు, చందనం, తమలపాకులు మరియు వక్కలు – ఇవన్నీ చాలా స్వల్ప కాలం పాటు స్వల్ప ఆనందాన్ని ఇస్తాయి.ఈ ఆనందదాయకమైన అంశాల పట్ల కోరిక కలిగి ఉండకూడదు.సాధారణంగా, ఒక ప్రపన్నుడు తన దృష్టిని భగవానుడు, భాగవతులు, ఆచార్యులు, ఆళ్వార్ల దివ్య ప్రబంధాలు, ఆచార్యుల స్తోత్రములు, వ్యాఖ్యానాలు మరియు రహస్య గ్రంథాలపైన కేంద్రీకరించాలి.అటువంటి వ్యక్తులు ఈ లోకంలోనే భగవానుడు మరియు భాగవతులకు సంబంధించిన విషయాలలో గొప్ప ఆనందాన్ని పొందుతూ ఉంటారు.వారు ఎల్లప్పుడూ శ్రేష్ఠమైన అంశాల గురించి ఆలోచిస్తూ ఉంటారు.వారు ఎల్లప్పుడూ భగవానుని కళ్యాణ గుణాల గురించి, ఆయన దివ్య రూపాల గురించి, ఆయన లీలల గురించి, ఆయన భక్తులందరి గొప్పతనం గురించి, వారు భగవానుని పట్ల చేసిన కైంకర్యం గురించి మొదలైన వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇవన్నీ ఒక ప్రపన్నుని మనస్సులో ఉంటాయి.అటువంటి వ్యక్తికి, కేవలం ప్రాపంచిక సుఖాలలో, ముఖ్యంగా పువ్వులు, చందనం, తమలపాకులు మరియు వక్కపలుకుల వంటి ఆనందదాయకమైన విషయాలలో నిమగ్నమవడం శ్రేయస్కరం కాదు. (ఆ రోజుల్లో ఇవే ఆనందానికి సంబంధించిన అంశాలుగా పరిగణించబడ్డాయి).ఎవరైనా చాలా సంతోషంగా ఉన్నప్పుడు, వారు తమలపాకులు, వక్కపలుకులు తెచ్చుకుని వాటిని నమిలేవారు. వారు చాలా పువ్వులు తెచ్చుకుని వాటితో తమను తాము అలంకరించుకునేవారు లేదా తమకు ఇష్టమైన వారికి వాటిని ఇచ్చేవారు.అదేవిధంగా చందనం విషయంలో కూడా. గతంలో ఇవి ఆనందానికి సంబంధించిన అంశాలుగా ఉండేవి.కానీ ఈ రోజుల్లో, మనకు అనేక కొత్త రకాల ఆనందాలు ఉన్నాయి, అవన్నీ వాటిలో చేరి ఉన్నాయి. చందనం, పువ్వులు, తమలపాకులు మరియు వక్కపలుకులు – ఇవన్నీ కేవలం ఉదాహరణలు మాత్రమే.మనం ఆనందంగా, సంతృప్తిగా ఉండటానికి పొందడానికి ప్రయత్నించే అన్ని లౌకిక సుఖాలకు ఇది వర్తిస్తుంది.కానీ అవన్నీ పరిమితమైన సంతృప్తిని, పరిమితమైన ఆనందాన్ని మాత్రమే ఇస్తాయి. అంతిమ ఆనందం కోసం మనం భగవానునితో మరియు ఆయనకు సంబంధించిన విషయాలలో నిమగ్నమవ్వాలి.
వీడియో లింక్: https://youtube.com/shorts/SYeD8cDrpaE?si=LwkbFE5q1KU4Oiwa
ఉపదేశం 9
యా ప్రీతిరాసీత్ సతతం భగవన్నామ కీర్తనే | సా స్యాత్ ప్రీతిర్ హి తద్భక్త నామ సంకీర్తనే చ వ: ||
సరళమైన వివరణ: భగవన్నామ సంకీర్తనం పట్ల – అంటే భగవంతుని దివ్య నామాలను కీర్తించడం పట్ల – ఒకరికి ఎంతటి కోరిక, ఉత్సాహం ఉంటాయో, అంతే కోరిక, ఉత్సాహం భగవంతుని భక్తులైన అడియార్ల లేదా భాగవతుల గొప్పలను గానం చేయడం పట్ల కూడా ఉండాలి.భగవంతుని గురించి జ్ఞానం పొంది, ఆయన నిజమైన గొప్పతనాన్ని – ఆయనే శ్రీమన్నారాయణుడని, ఆయనకు నిత్య విభూతి,లీలా విభూతి ఉన్నాయని, ఆయనకు దివ్య పత్నులు, నిత్యం సేవించే నిత్యసూరులు, ముక్తాత్మలు ఉన్నారని, అలాగే మనం కూడా శ్రీవైకుంఠాన్ని ,పరమపదాన్ని చేరుకునే అవకాశం ఉందని – అర్థం చేసుకున్నప్పుడు, సహజంగానే ఆ వ్యక్తి భగవంతుని దివ్య నామాలను గానం చేయడం ప్రారంభిస్తాడు, తద్వారా భగవంతుని కీర్తిస్తాడు.అయితే, భగవంతుని గొప్ప భక్తులైన ఆ భాగవతుల పట్ల కూడా ఆ వ్యక్తి సరిగ్గా అంతే ప్రేమ, ఆప్యాయతలను కలిగి ఉండాలి.
శాస్త్రాలలోనూ, అలాగే ఆళ్వారుల పాశురాలు, పూర్వాచార్యుల స్తోత్రాలు, వ్యాఖ్యానాల వంటి సంప్రదాయ గ్రంథాలలోనూ – ఇలా అనేక చోట్ల, భాగవతుల గొప్పతనం అత్యంత సుందరంగా వివరించబడింది.భాగవతులను భగవానుని పాదపద్మాలుగా భావించాలి.సహజంగా, ఒక భక్తుడు తన దృష్టిని భగవానుని పాదపద్మాలపైనే నిలుపుతాడు.భాగవతులే భగవానుని పాదపద్మాలు కాబట్టి, భక్తుల దృష్టి భాగవతులపై కూడా కేంద్రీకృతమై ఉండాలి.కాబట్టి, మనం భాగవతుల గురించి తలచుకొని, వారి దివ్య నామాలను కీర్తించాలి.ముఖ్యమైన భాగవతులు ఎవరు అనగా నిత్యసూరులు, ఆళ్వారులు, ఆచార్యులు, ముక్తాత్మలు – వీరందరూ ఉత్తమ భాగవతులు; వీరు భగవానుని గొప్ప భక్తులు.అదే విధంగా, భగవానుని పట్ల మరియు భాగవతుల పట్ల సంపూర్ణంగా అంకితభావంతో సేవలు అందిస్తున్న మన ప్రస్తుత ఆచార్యులు కూడా గొప్ప భాగవతులే.మనం వారి దివ్య నామాలను కూడా కీర్తించాలి. మనం భగవానునికి ఇచ్చే గౌరవంతో సమానంగా – అంతకంటే అధికంగా కాకపోయినా – కనీసం సమానమైన గౌరవాన్ని భాగవతులకు తప్పక ఇవ్వాలి.
వీడియో లింక్: https://youtu.be/p1Ggcp741Mo?si=CQmOk1RkIOzdXLyQ
ఆంగ్లంలో: https://granthams.koyil.org/2026/04/17/bhagavath-ramanujas-final-instructions-7-9-english/
అడియేన్ దాసరి కేశవ కృష్ణ రామానుజ దాసన్
ప్రూఫ్ రీడింగ్ చేసినవారు – దాసరి శ్రీ తేజ రామానుజ దాసి
https://granthams.koyil.org లో ఆర్కైవ్ ఉంచబడినది.
ప్రమేయం (లక్ష్యం) – https://koyil.org
ప్రమాణం (గ్రంధాలు) – https://granthams.koyil.org
ప్రమాతా(ఉపదేశకులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్యా/పిల్లల పోర్టల్ – https://pillai.koyil.org