శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః

అనిరుద్ధుడు ప్రద్యుమ్నుని కుమారుడు; ప్రద్యుమ్నుడు శ్రీకృష్ణుని కుమారుడు. అనిరుద్ధుడు కూడా అత్యంత సుందరుడు. బాణుడు మహాబలిచక్రవర్తి యొక్క నూరుమంది కుమారులలో పెద్దవాడు. అతడు శోణితపురాన్ని పాలించేవాడు. బాణుని కుమార్తె అయిన ఉష, అనిరుద్ధుణ్ణి ప్రేమించి వివాహం చేసుకుంది. దీనికి కోపగించిన బాణుడు వారిని చెరలో పెట్టాడు. ఆ సమయంలో ఒక మహాయుద్ధం జరిగింది. ఇప్పుడు ఆ ఘట్టాన్ని అనుభవిద్దాం.
బాణుడు రుద్రుని పట్ల అత్యంత భక్తి కలవాడు. అతనికి వెయ్యి చేతులు ఉండేవి. ఒకసారి రుద్రుడు ఆనందంతో తాండవం చేస్తుండగా, బాణుడు అద్భుతంగా మద్దెలు వాయించి రుద్రుణ్ణి సంతోషపరిచాడు. అప్పుడు రుద్రుడు “నీవు ఎప్పుడైనా ఆపదలో పడితే, నేను వచ్చి నీకు సహాయం చేస్తాను” అని వరమిచ్చాడు.
ఒకరోజు ఉష నిద్రలో ఒక అపూర్వ సుందరుడిని స్వప్నంలో చూసింది. వెంటనే అతనిపై ప్రేమ పుట్టింది. కానీ అతడు ఎవరో తెలియక బాధపడసాగింది. ఆమె స్థితిని గమనించిన స్నేహితురాలు చిత్రలేఖ సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. ఆమెకు అద్భుతమైన శక్తులు ఉండేవి. చాలా అందమైన చిత్రాలు గీయగలిగేది. ఉష చెప్పిన లక్షణాల ప్రకారం ముందుగా దేవతల చిత్రాలు, గంధర్వుల చిత్రాలు గీసింది. కానీ ఉష అంగీకరించలేదు. తరువాత శ్రీకృష్ణుని చిత్రం గీసింది. అది దగ్గరగా ఉన్నట్లనిపించినా పూర్తిగా సరిపోలలేదని ఉష చెప్పింది. తరువాత ప్రద్యుమ్నుని చిత్రం గీసింది. అది ఇంకా దగ్గరగా ఉన్నప్పటికీ సరిపోలలేదని తెలిపింది. చివరకు అనిరుద్ధుని చిత్రం గీయగానే, “ఇతడే అతడు!” అని ఉష ఆనందంగా చెప్పింది. వెంటనే చిత్రలేఖ ఆకాశమార్గంలో ద్వారకకు వెళ్ళి, అక్కడ నిద్రిస్తున్న అనిరుద్ధుణ్ణి, ఆయన పడుకున్న మంచంతో సహా ఎత్తుకుని వచ్చి, ఉష యొక్క అంతఃపురంలో ఉంచింది. ఉష తన ప్రేమను అనిరుద్ధునికి తెలిపింది. అనిరుద్ధుడు కూడా అంగీకరించాడు. వెంటనే వారు వివాహం చేసుకుని ఆనందంగా జీవించసాగారు.
ఇలా జరుగుతుండగా, ఉష సేవకుల్లో కొందరు ఆమె ప్రవర్తనలో మార్పులు గమనించి బాణునికి తెలియజేశారు. వెంటనే బాణుడు అంతఃపురానికి వచ్చి, వారిద్దరూ కలసి ఆనందంగా ఉండటం చూశాడు. అతనికి తీవ్రమైన కోపం వచ్చి, నాగాస్త్రంతో అనిరుద్ధుణ్ణి బంధించి చెరలో పెట్టాడు.
ఇక ద్వారకలో అందరూ అనిరుద్ధుడు కనపడక పోవటం చేత విచారంలో మునిగిపోయారు. అప్పుడు నారదుడు వచ్చి, అనిరుద్ధుడు శోణితపురంలో చెరలో ఉన్నాడని తెలిపాడు. వెంటనే శ్రీకృష్ణుడు మహాసేనతో శోణితపురానికి బయలుదేరాడు.
శ్రీకృష్ణుని విశాలమైన సేనను చూసి బాణుడు రుద్రుణ్ణి ప్రార్థించాడు. వెంటనే రుద్రుడు తన కుటుంబంతో సహా యుద్ధానికి వచ్చాడు. కానీ యుద్ధం ప్రారంభమైన తరువాత వారు శ్రీకృష్ణుడు మరియు యాదవుల పరాక్రమానికి తట్టుకోలేకపోయారు. రుద్రుడు, దుర్గ, స్కందుడు, జ్వరదేవత మొదలైన వారు ఓడి యుద్ధరంగం విడిచి పారిపోయారు. శ్రీకృష్ణుడు బాణాసురుని వెయ్యి చేతుల్లో నాలుగు తప్ప మిగిలిన అన్నింటినీ నరికివేశాడు. తరువాత బాణాసురుడు తన ఓటమిని అంగీకరించాడు. రుద్రుడు తిరిగి వచ్చి భగవానుని స్తుతించి క్షమాపణ కోరాడు.
అప్పుడు బాణుడు ఉషను, అనిరుద్ధుణ్ణి మరియు అనేక కానుకలను ద్వారకకు తిరిగి పంపించాడు.
ఆళ్వారులు అనేక సందర్బాలల్లో బాణాసుర వధన్ని ఆస్వాదించారు:
- పెరియాళ్వార్ తమ తిరుప్పల్లాండులో ఇలా అన్నారు: “మాయప్ పొరు పడై వాణనై ఆయిరం తోళుం పొళి కురుధి పాయ చుళత్తియ ఆళి వల్లానుక్కు పల్లాండు కూరుదుమే”. (వెయ్యి భుజాల నుండి రక్తం ప్రవహించేలా బాణాసురుణ్ణి సంహరించుటకు చక్రాయుధాన్ని ప్రయోగించిన ఆ భగవానునికి మేము పల్లాండు పలుకుతాం.”
- పేయాళ్వార్ తమ మూన్ఱాం తిరువందాదిలో ఇలా చెప్పారు: “మగన్ ఒరువరుక్కల్లాద మామేని మాయన్ మగనాం అవాన్ మగన్ తన్ కాదల్ మగనై సి ర్రై సెయ్త వానన్ తోల్ సెఱ్ఱాన్ కళలే నిఱై సెయ్తు ఎన్ నెంజే నిలై”. (ఓ నా మనసా! ఎవరికీ కుమారుడు కావలసిన అవసరం లేని పరమాత్మ, వసుదేవుని కుమారుడిగా అవతరించి, తన మనుమడైన అనిరుద్ధుణ్ణి బంధించిన బాణుని భుజాలను నరికివేశాడు. ఆ భగవానుని పాదాలను ధ్యానించు.)
- తిరుమళిశైయాళ్వార్ తమ తిరుచ్ఛంద విరుత్తంలో ఇలా వివరించారు: “మోదియోడం ఇలచ్చయ్యాయ్ శాబం ఏయిది ముక్కణాన్ కూడు సేనై మక్కలోడు కొండు మండి వెంజమత్తు ఓడ వాణన్ ఆయిరం కరం కళిత్త ఆదిమాల్ పీడు కోయిల్ కూడు నీర్ అరంగం ఎన్ఱ పేరాదే ” (సాత్త్వికులు దూరంగా ఉండే, దుర్గ తన కుమారులతో, సేనలతో వచ్చిన మూడు కన్నుల రుద్రుణ్ణి యుద్ధంలో పారిపోయేలా చేసి, బాణుని వెయ్యి చేతులను నరికివేసిన ఆదిమూర్తి నీటి ప్రవాహం సమృద్ధి గా ఉండే శ్రీరంగంలో నివసిస్తున్నాడు.)
- నమ్మాళ్వార్ తమ తిరువాయ్మొళిలో ఇలా చెప్పారు: “పరివిన్ఱి వాణనై కాత్తుమె న్రు అ న్రు పాడైయోడుమ్ వంధేదీర్నద తిరిపురం సెఱ్ఱవనుక్కుం మగనుమ్ పిన్నమ్ అంగైయం పోర్ తొలైయ పోరు సిఱ్ఱైపుళ్ళై కడావియ మాయనై ఆయనై పోర్ చక్కరత్తు అరియినై అచ్చుదనై పఱ్ఱియాన్ ఇరైయీనుమ్ ఇడర్ ఇలానే”. (త్రిపురాసుర సంహారంతో గర్వించిన రుద్రుడు, దేవతల సేనాధిపతి అనే పట్టం కలిగిన తన కుమారుడు, రుద్రుడితో కోపంలో పోలిన అగ్ని మొదలైన వారితో కలిసి బాణాసురుణ్ణి రక్షించడానికి వచ్చాడు. కానీ అద్భుత రూపం కలిగిన గోప బాలూరితో కలిసి పోయి, గరుడుడిపై విహరిస్తూ చక్రాయుధాన్ని ధరించిన కృష్ణుడు వారందరినీ యుద్ధరంగం నుండి పారిపోయేలా చేశాడు. అటువంటి శత్రు సంహారకుడు, మరియు భక్తుల చెయ్యి వదలని అచ్యుతుణ్ణి ఆశ్రయించిన నాకు ఇక దుఃఖమే లేదు.”
- తిరుమంగై ఆళ్వార్ తమ పెరియ తిరుమడల్ లో ఈ ఘట్టాన్ని అద్భుతంగా వివరించారు. “సూఴ్కడలుల్ పొన్నగరం సెఱ్ఱ పురంధరనోడు ఏరొక్కుం మన్నవన్ వాణన్, అవుణర్క్కు వాల్ వేంధన్; తన్నుడైయ పావై, ఉలగత్తు తనొక్కుం కన్నియరై ఇల్లాద కాట్చియాల్. తన్నుడైయ ఇన్నుయిర్ తో జి యాల్ , ఎంపెరుమాన్ ఈన్ తుళాయ్ మన్నుం మణివరై తోల్ మాయవన్ పావియేన్ ఎన్నై ఇదు విళైత్త ఈరిరండు మాల్ వరై తోల్ మన్నవన్ తన్ కాదలనై మాయత్తాల్ కొండు పోయి కన్ని తన్ పాల్ వైక్క మఱ్ఱవనోడు ఎత్తనైయో మన్నియ పేరిన్బం ఎయ్దినాల్ .” (సముద్రాలలోనికి ప్రవేశించి హిరణ్యపురంలోని అసురులను సంహరించి “పురంధరుడు” అనే కీర్తిని పొందిన ఇంద్రునితో సమానమైన మహారాజు బాణాసురుడు; అసురులలో ప్రకాశించే వీరాధివీరుడు. అటువంటి బాణాసురుని కుమార్తె ఉష — ఈ జగత్తులో ఆమె సౌందర్యానికి సమానమైన కన్య మరొకరు లేరు. తన ప్రాణసఖి అయిన చిత్రలేఖ సహాయంతో, తులసీమాలలతో అలంకరించబడిన, మణిపర్వతంలాంటి దివ్యభుజాలను కలిగిన శ్రీకృష్ణుని మనుమడు అయిన అనిరుద్ధుణ్ణి మాయాశక్తితో తీసుకువచ్చి, తన సమీపంలో ఉంచుకుంది. ఆ తరువాత అతనితో కలిసి అనేక స్థిరమైన, అపారమైన ఆనందాలను అనుభవించింది.)
ఈ సంఘటనలోని తాత్పర్యం:
- ఇతర దేవతల సహాయంతో భగవానునికి విరోధంగా నిలబడితే చివరకు నష్టమే కలుగుతుంది. కాబట్టి భగవానునిపట్ల సంపూర్ణ భక్తితో ఉండటం శ్రేయస్కరం.
- దేవతలు భగవానుని మహిమ తెలుసుకున్నప్పటికీ, రజోగుణం మరియు తమోగుణం ప్రబలినప్పుడు ఆయనకు విరోధంగా ప్రవర్తిస్తారు. కానీ కొంతకాలానికి తమ తప్పును గ్రహించి భగవానుని క్షమాపణ కోరుతారు.
- భగవానుడు పూర్వం ప్రహ్లాదునికి “నీ వంశస్థులను నేను సంహరించను” అని వాగ్దానం చేశాడు. అలాగే ఉష తన తండ్రిని కోల్పోయి బాధపడకూడదు. ఈ రెండు కారణాల వల్లే భగవాన్ బాణుని చంపకుండా, వెయ్యి చేతుల్లో నాలుగు మాత్రమే మిగిలేలా చేశాడు.
మూలం : https://granthams.koyil.org/2023/10/16/krishna-leela-40-english/
అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org