కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 39 – నరకాసుర వధ

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి

<< 38 – మరో ఐదుగురు దేవేరులు

ఇప్పుడు కృష్ణుడు మరియు సత్యభామ కలిసి నరకాసురుణ్ణి ఎలా సంహరించారో ఆనందంగా అనుభవిద్దాం.

నరకుడు, వరాహ భగవానుడు మరియు భూమిదేవికి జన్మించినవాడని చెప్పబడుతుంది. కానీ దుష్ట సాంగత్యం వల్ల అతడు రాక్షస స్వభావం పొందాడు. అతడు మనుష్యులను మరియు దేవతలను బాధించసాగాడు. అనేక దేవకన్యలను బంధించి చెరలో ఉంచుకున్నాడు. ఇంద్రుడు మొదలైన దేవతలు క్షీరసాగరంలో యోగనిద్రలో విశ్రమిస్తున్న శ్రీమన్నారాయణుని వద్దకు వెళ్లి, “నరకాసురుణ్ణి సంహరించి మమ్మల్ని రక్షించండి” అని ప్రార్థించారు. అప్పుడు కృష్ణుడు వారిని ఓదార్చి, “సరైన సమయానికి నేను రక్షిస్తాను” అని చెప్పి పంపించాడు.

భగవానుడు కృష్ణుడిగా అవతరించినప్పుడు భూమిదేవి సత్యభామగా అవతరించింది అని మనం ముందే చూశాము. కృష్ణుడు సత్యభామ సహాయంతోనే నరకుణ్ణి సంహరిస్తాను అని సంకల్పించాడు. అప్పుడే ఇంద్రుడు ద్వారకకు వచ్చి, నరకుడు వరుణుని గొడుగును, అదితి దేవి (ఇంద్రుని తల్లి) చెవిపోగులను, దేవతల క్రీడాస్థలమైన మణిపర్వతాన్ని అపహరించాడు అని ఫిర్యాదు చేశాడు. వెంటనే రక్షించమని ప్రార్థించాడు. అప్పుడు కృష్ణుడు సత్యభామతో కలిసి తన రథంపై ఎక్కి నరకాసురుని రాజధానికి వెళ్లాడు.

నగర ద్వారంలో ముర అనే రాక్షసుడు వచ్చి కృష్ణుణ్ణి యుద్ధానికి ఆహ్వానించాడు. కృష్ణుడు తన సుదర్శన చక్రంతో మురుని శిరస్సును ఖండించాడు. ఈ విధంగానే కృష్ణుడికి “మురారి” అనే నామం వచ్చింది. తరువాత నరకాసురుడు స్వయంగా యుద్ధానికి వచ్చాడు. ఘోరమైన యుద్ధం అనంతరం కృష్ణుడు నరకుని తలను ఖండించి సంహరించాడు. ఇంకొక వృత్తాంతంలో, నరకుడు తన తల్లి చేత మాత్రమే మరణిస్తాడు అనే వరం పొందినవాడని చెప్పబడుతుంది. యుద్ధంలో నరకుడు కృష్ణుణ్ని గాయపరచగా, కృష్ణుడు మూర్ఛపోయినట్లు నటించగా. అప్పుడు సత్యభామ విల్లు, బాణాలు ఎత్తుకొని నరకాసురుణ్ణి సంహరించింది.

ఆ తరువాత కృష్ణుడు చెరలో బంధింపబడి ఉన్న పదహారు వేల వంద మంది దేవకన్యలను విముక్తులను చేశాడు. వారందరూ కృష్ణుణ్ణే తమ భర్తగా కోరుకున్నారు. అందువల్ల కృష్ణుడు వారందరినీ ద్వారకకు తీసుకొని వచ్చి, అనేక దివ్యరూపాలను ధరించి వారందరినీ వివాహం చేసుకున్నాడు.

నరకాసుర వధ గురించి అనేక ఆళ్వార్లు మంగళాశాసనం చేశారు. కులశేఖర ఆళ్వార్ తమ  పెరుమాళ్ తిరుమొళిలో “నల్ నారణన్ నరగాంతకన్ పిత్తనే” అని అన్నారు (నరకాసురుణ్ణి సంహరించిన శ్రీనారాయణుడు తన భక్తుల పట్ల అపారమైన ప్రేమ కలవాడు). నమ్మాళ్వార్ తమ తిరువిరుత్తంలో “నలియుం నరగనై వీట్టిఱ్ఱం” అని పేర్కొన్నారు (ఇతరులను బాధించిన నరకాసురుణ్ణి సంహరించినవాడు). తిరుమంగై ఆళ్వార్ పెరియ తిరుమొళిలో “వెనఱి మిగు నరగన్ ఉరం అదు అళియ వీశిఱుం విఱల్ ఆళిత్ తడక్కైయన్” అని అన్నారు. (వీరుడైన నరకాసురుణ్ణి సంహరించేందుకు తన శక్తివంతమైన చక్రాన్ని ప్రయోగించిన మహాబాహువు).

పెరియాళ్వార్ తన పెరియాళ్వార్ తిరుమొళిలో ద్వారకలో కృష్ణుడి వైభవాన్ని ఇలా వర్ణిస్తారు: “పదిన్ఱామ్ ఆయిరవర్ దేవిమార్ పనిసెయ్య తువరై ఇన్నుం అతిల్ నాయకరాగి విఱ్ఱిన్ద మణవాలర్” (పదహారు వేల రాణులు సేవచేస్తుండగా ద్వారకలో ప్రభువుగా కూర్చొని ఉన్న కృష్ణుడు).

నరకుడు అపహరించిన అనేక సంపదలతో కలిసి కృష్ణుడు మరియు సత్యభామ ఇంద్రుని స్వర్గలోకానికి వెళ్ళారు. నరకాసురుణ్ణి సంహరించినందుకు ఇంద్రుడు వారికి కృతజ్ఞతలు తెలిపాడు. ఇంద్రాణి కూడా వచ్చి నమస్కరించింది. ఆ సమయంలో ఇంద్రాణి సేవకులు పారిజాత పుష్పాన్ని తీసుకొని వచ్చి ఆమెకు సమర్పించారు. అది చూసిన సత్యభామకు ఆ పుష్పం కావాలనే కోరిక కలిగింది. ఆమె దానిని అడిగింది. అప్పుడు గర్వంతో ఇంద్రాణి ఇలా చెప్పింది: “ఇది దేవతల కొరకు మాత్రమే. మీలాంటి మానవులకు ఇది తగదు.” ఈ మాటలు విని సత్యభామ ఎంతో దుఃఖించింది. అది గమనించిన కృష్ణుడు తన వాహనమైన గరుడాళ్వారిని పిలిచి మొత్తం పారిజాత వృక్షాన్నే తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. అది చూసిన ఇంద్రుడు, కొద్దిసేపటి క్రితమే కృష్ణుడు తమను రక్షించిన విషయాన్ని మరిచి, కృష్ణుడితో యుద్ధానికి దిగాడు. కృష్ణుడు సులభంగా ఇంద్రుని మరియు అతని సైన్యాన్ని ఓడించి, పారిజాత వృక్షాన్ని తీసుకొని ద్వారకకు తిరిగి వచ్చాడు. ఆ వృక్షాన్ని వారి ఉద్యానవనంలో నాటించాడు.

పెరియాళ్వార్ తన పెరియాళ్వార్ తిరుమొళిలో సత్యభామ పారిజాతాన్ని కోరుకున్న విషయాన్ని ఇలా వర్ణిస్తారు:

“కఱ్పగక్కావు కరుదియ కాదలిక్కు ఇప్పొళుదు ఇవన ఎన్ఱు ఇందిరన్ కావినిల్ నిఱ్పన సేయ్దు నిలాత్తిగళ్ ముఱ్ఱత్తుల్ ఉయ్త్తవన్ ఎన్నై పుఱం పుల్గువన్ ఉంబర్ కోన్ ఎన్నై పుఱం పుల్గువాన్” (తన ప్రియమైన దేవేరి కోరిన పారిజాత వృక్షాన్ని వెంటనే ఇంద్రుని తోటనుండి తెచ్చి ఆమె ఉద్యానవనంలో నాటించిన కృష్ణుడు).

ఈ సంఘటనలోని సారాంశం:

  • నరకాసురుడు సంహరించబడిన రోజును, అతని ప్రార్థన ప్రకారం “నరక చతుర్దశి”గా, దీపావళిగా జరుపుకుంటారు.
  • ఇంద్రుడు వంటి దేవతలు భగవానుని అనుగ్రహంతో ఎన్నో వైభవాలను పొందినా, తాము దేవతలమనే గర్వంతో అప్పుడప్పుడు అపచారాలు చేస్తారు. అయినప్పటికీ భగవాన్ విశాలహృదయంతో వారిని క్షమిస్తాడు.
  • ద్వారకలో భగవంతుడు తన గృహస్థాశ్రమ ధర్మాన్ని అత్యంత అద్భుతంగా నిర్వహించాడు

మూలం : https://granthams.koyil.org/2023/10/15/krishna-leela-39-english/

అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment