కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 42 – ద్వారకా జీవనం మరియు నారదుని ఆనందం

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి

<< 41 – పౌండరీక సీమాలికుల వధ

సాంబుడు, శ్రీకృష్ణుడు మరియు జాంబవతుల కుమారుడు. దుర్యోధనుడి కుమార్తె లక్ష్మణా స్వయంవర సమయంలో, సాంబుడు ఆమెను అపహరించుకొని వెళ్లిపోయాడు. ఇది చూసి కౌరవులు అత్యంత కోపంతో విపులమైన సైన్యంతో సాంబునిపై దాడి చేయడానికి వచ్చారు. సాంబుడు ఒక్కడే ఆ మహాసైన్యాన్ని ఆశ్చర్య పరిచే విధంగా యుద్ధం చేశాడు. చివరకు అందరూ కలిసి ఎలాగో సాంబుని బంధించారు. ఈ విషయం విని బలరాముడు, దుర్యోధనుడు మొదలైన వారి వద్దకు వెళ్లి సాంబుని విడుదల చేయమని ఉపదేశించాడు. కానీ వారు గర్వంతో బలరామునితో మాట్లాడారు. దాంతో బలరాముడు తీవ్రకోపంతో వారిని సంహరించడానికి సిద్ధపడ్డాడు. చివరికి వారు భయపడి బలరాముని శరణు చేరారు. అప్పుడు దుర్యోధనుడు తన కుమార్తె లక్ష్మణాను సాంబునికి వివాహం చేసి, అనేక కానుకలతో ఆమెను పంపించాడు.

ఒకసారి నారదుడు, ద్వారకా నగరానికి వెళ్ళాడు. ద్వారకా అత్యంత సుందరమైన నగరం. అది ఉద్యానవనాలు, సరస్సులు, విభిన్న రకాల పక్షులు, పుష్పాలు, మేడలు మరియు రాజభవనాలతో నిండి ఉంది. శ్రీకృష్ణుడు తన దివ్యపత్నుల కొరకు పదహారు వేల నూట ఎనిమిది ప్రాసాదాలను నిర్మించాడు. ఆయన ప్రతి ప్రాసాదంలో ప్రత్యేక స్వరూపంతో తన సంతానంతో కలిసి గృహస్థాశ్రమ ధర్మాన్ని అనుసరిస్తూ నివసించేవాడు. ప్రతి భార్యతో ఆయనకు పది మంది కుమారులు మరియు ఒక కుమార్తె జన్మించారని చెప్పబడుతుంది.

నారదుడు ఒక్కో ప్రాసాదాన్ని దర్శించసాగాడు. ముందుగా ప్రధాన పట్టమహిషి రుక్మిణి దేవి గృహానికి వెళ్ళాడు. ఆమె శ్రీకృష్ణునికి అత్యంత ప్రేమతో సేవచేస్తూ ఉండింది. నారదుడిని చూసిన వెంటనే శ్రీకృష్ణుడు పరుగెత్తి వెళ్ళి, ఆయన పాదాలను కడిగి, సంపూర్ణంగా గౌరవ సత్కారాలు అందచేసాడు. తర్వాత మరొక గృహానికి వెళ్ళగా, అక్కడ శ్రీకృష్ణుడు తన భార్యతో మరియు ఉద్ధవుడుతో కలిసి క్రీడిస్తున్నాడు. ఏమీ తెలియనట్లుగా నారదుని క్షేమాన్ని అడిగి సేవ చేశాడు. ఇలాగే ప్రతి గృహంలో భిన్న భిన్న కార్యాలలో నిమగ్నుడై ఉన్నాడు. ఒకచోట గుర్రంపై విహరిస్తూ ఉండగా, మరొకచోట నిత్యకర్మలు ఆచరిస్తూ ఉన్నాడు. ఇంకొకచోట వేటకు వెళ్తూ, మరొకచోట బ్రాహ్మణులను ఆరాధిస్తూ కనిపించాడు. ఈ సమస్తాన్ని చూసిన నారదుడు శ్రీకృష్ణుని ఆశ్చర్యకరమైన వైభవాన్ని ధ్యానించి పరమానందాన్ని పొందాడు.

పెరియాళ్వార్ తమ పెరియాళ్వార్ తిరుమొళిలో ద్వారకాలో భగవానుని వైభవాన్ని ఇలా వర్ణిస్తున్నారు: “పదినా రాం ఆయిరవర్ దేవిమార్ పణిసెయ్య తువరై ఇన్నుం అదిల్ నాయగరాగి విఱ్ఱిరుంద మణవాళర్” (పదహారు వేల దేవీమణులు సేవచేస్తుండగా, ద్వారకానగరంలో స్వామిగా విరాజిల్లుతున్న వాడు).

ఈ సంఘటన యొక్క సారాంశం:

  • ఎంపెరుమాన్ పరమపురుషుడు కావడంతో, అనేక ఆత్మలు ఆయనను తమ భర్తగా పొందాలని ఆకాంక్షించాయి. అందువల్ల శ్రీకృష్ణావతారంలో ఆయన వారిని వివాహం చేసుకొని, గృహస్థాశ్రమ ధర్మాన్ని ఆచరించి వారికి పరమానందాన్ని ప్రసాదించాడు.
  • అలాగే, శ్రీభగవద్గీతలో ఆయన స్వయంగా చెప్పినట్లుగా, ఆయనకు ధర్మాన్ని ఆచరించాల్సిన బంధనం లేకపోయినా, లోకానికి ఆదర్శంగా ఉండుటకై ప్రతి ధర్మాన్నీ చక్కగా ఆచరించాడు.

మూలం : https://granthams.koyil.org/2023/10/18/krishna-leela-42-english/

అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment