కృష్ణ లీలలు మరియు వాటి సారాంశం – 45 – శాల్వ మరియు దంతవక్త్రుల వధ

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి

<< 44 – శిశుపాల వధ

శాల్వుడు, రుక్మిణిని అపహరించుకొని వెళ్తున్నప్పుడు కృష్ణునితో జరిగిన యుద్ధంలో ఓడి పారిపోయిన రాజు. అప్పటి నుండి ఎలాగైనా కృష్ణుడిని మరియు యాదవులను సంహరించాలని సంకల్పించాడు. అతడు ఒక సంవత్సరం పాటు రుద్రుని ఆరాధిస్తూ ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుతో సంతోషించిన రుద్రుడు “ఏ వరం కావాలో కోరుకో” అని అన్నాడు. అప్పుడు శాల్వుడు ఆకాశంలో ఎగిరే ఒక నగరాన్ని కోరాడు. రుద్రుడు మయాసురునితో “సౌభ” అనే ఆకాశనగరాన్ని నిర్మింపజేసి శాల్వునికి ఇచ్చాడు. శాల్వుడు ఆ సౌభనగరాన్ని ఎక్కి ద్వారకాపై దండెత్తి దాడి ప్రారంభించాడు.

ప్రద్యుమ్నుడు, సాత్యకి మరియు అనేక యోధులు బయటకు వచ్చి శాల్వునితో యుద్ధం ప్రారంభించారు. ప్రద్యుమ్నుడు శాల్వునిని బాగా బాధించి, అతని ఆకాశనగరంపైన కూడా దాడి చేశాడు. దాంతో ఆ నగరం దిక్కుతోచని విధంగా ఎగిరిపోవసాగింది. అయితే శాల్వుని సైన్యంలో ఉన్న ద్యుమాన్ అనే యోధుడు ప్రద్యుమ్నుని ఛాతిపై బలంగా దాడి చేసి అతడిని మూర్ఛపోయేలా చేశాడు. అప్పుడు ప్రద్యుమ్నుని సారథి అతడిని యుద్ధభూమి నుండి బయటకు తీసుకెళ్లాడు. స్పృహలోకి వచ్చిన తరువాత ప్రద్యుమ్నుడు “నన్ను యుద్ధభూమి నుండి ఎందుకు తీసుకొచ్చావు?” అని కోపంతో తిరిగి యుద్ధరంగంలోకి వెళ్లి ద్యుమాన్‌ను సంహరించాడు. ఈ విధంగా ఇరవై ఏడు రోజుల పాటు యుద్ధం కొనసాగింది. అప్పుడు కృష్ణుడు ద్వారకకు తిరిగి వచ్చి వెంటనే యుద్ధరంగంలోకి ప్రవేశించాడు. కృష్ణుణ్ణి చూసిన శాల్వుడు దాడికి వచ్చాడు. వెంటనే కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి శాల్వుని తలను ఖండించి సంహరించాడు. ఆ సమయంలో దేవతలందరూ కృష్ణుని మహిమను స్తుతించారు.

ఆ తరువాత శాల్వుని మిత్రుడైన దంతవక్రుడు యుద్ధరంగంలోకి ప్రవేశించాడు. అతడు కృష్ణుణ్ణి దూషిస్తూ యుద్ధానికి వచ్చాడు. అప్పుడు కృష్ణుడు తన గద కౌమోదకీతో అతడిని సంహరించాడు. తరువాత అతని సోదరుడు విదూరథుడు వచ్చాడు. కృష్ణుడు తన చక్రంతో అతని తలను ఖండించి వధించాడు.

ఈ విధంగా కృష్ణుడు అనేక రాక్షసస్వభావం గల దుష్టులను సంహరించడంతో దేవతలు, యక్షులు, కిన్నరులు మొదలైన వారు ఆనందించారు.

పేయాళ్వార్ తమ మూన్ఱాం తిరువన్దాదిలో దంతవక్తృడి సంహారాన్ని గూర్చి మంగళాశాసనం చేస్తూ “పొంగరవ వక్కరనై కొన్రాన్న్ వడివు” (భారీ గర్జనలతో యుద్ధానికి వచ్చిన దంతవక్రుణ్ణి సంహరించిన ఎంబపేరుమాన్ మహిమ).

ఈ సంఘటన యొక్క సారాంశం:

  • ఈ సంసారంలో ఉన్న విష్ణులోకమైన క్షీరాబ్ధిలో ద్వారపాలకులుగా ఉన్న జయ, విజయులు బ్రహ్మదేవుని మానసపుత్రుల శాపం వల్ల భగవానునికి విరోధులుగా ఈ లోకంలో మూడుసార్లు జన్మించవలసి వచ్చింది. ఆ జన్మల్లో చివరివి శిశుపాలుడు మరియు దంతవక్త్రుడు.
  • భగవానుని అవతారాల ముఖ్య ఉద్దేశాలు: సజ్జనులను రక్షించడం, దుష్టులను సంహరించడం మరియు ధర్మాన్ని స్థాపించడం. ఆ లక్ష్యాలలో భాగంగా కృష్ణుడు అనేక దుష్టులను సంహరించి భూమి భారాన్ని తగ్గించాడు.

మూలం : https://granthams.koyil.org/2023/10/21/krishna-leela-45-english/

అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్

పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment