శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః

భగవాన్, గీతోపదేశం చేసిన తర్వాత యుద్ధం ప్రారంభమైంది. అనేక మంది మహా వీరులు పాల్గొన్న ఈ యుద్ధం అత్యంత విస్తారమైనది. ఈ యుద్ధం పద్దెనిమిది రోజుల పాటు కొనసాగింది. పగటి సమయంలో యోధులు యుద్ధం చేసి, రాత్రి సమయంలో విశ్రాంతి తీసుకునే విధంగా ఇది నిర్వహించబడింది.
పాండవుల సైన్యానికి ధృష్టద్యుమ్నుడు సేనాధిపతిగా నాయకత్వం వహించగా, కౌరవుల సైన్యానికి భీష్ముడు సేనాధిపతిగా ఉన్నాడు.
యుద్ధమంతా కృష్ణుడు పాండవులకు అత్యుత్తమ సహచరుడిగా, రక్షకుడిగా నిలిచాడు. తన అపూర్వమైన రథసారథ్య నైపుణ్యంతో అర్జునుడిని అనేక ప్రమాదాల నుండి కాపాడాడు. ఒక సందర్భంలో, అర్జునుని లక్ష్యంగా చేసుకుని భగదత్తుడు ప్రయోగించిన మహా అస్త్రాన్ని తన దివ్య వక్షస్థలంపై స్వీకరించి అతనిని రక్షించాడు.
ప్రతిరోజూ అనేక మంది మహావీరులు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. రోజులు గడుస్తుండగా భీష్ముని పరాక్రమం మరింత పెరుగుతూ వచ్చింది. ఒక రోజు అతడు అత్యంత ఉగ్రరూపంతో యుద్ధం ప్రారంభించాడు. ఒక దశకు వచ్చాక అర్జునుడు అతనిని ఎదుర్కోవడం కష్టమైపోయింది. అప్పుడు కృష్ణుడు భీష్మునిపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశాడు. వెంటనే రథం నుండి దిగి, విరిగిపోయిన రథచక్రాన్ని ఎత్తుకుని భీష్ముని వైపు దూసుకెళ్లాడు. అది చూసి భీష్ముడు పరమానందంతో, “తామర రేకులవంటి నేత్రములు కలిగినవాడా! రా, నన్ను సంహరించు!” అని అన్నాడు. ఆ మాటలు విన్న కృష్ణుడు తన కోపాన్ని శాంతింపజేసుకుని తిరిగి వచ్చాడు.
పదవ రోజు, శిఖండి సహకారంతో భీష్ముడు ఓడించబడ్డాడు. గత జన్మలో భీష్మునిచే అపహరించబడిన అంబా, తదుపరి జన్మలో శిఖండిగా జన్మించింది. యక్షుని అనుగ్రహంతో ఆమె పురుషత్వాన్ని పొందింది. యుద్ధ సమయంలో అర్జునుడు శిఖండిని తన ముందుంచుకుని భీష్మునిపై యుద్ధం చేశాడు. స్త్రీగా జన్మించిన ఆమె తో తాను యుద్ధం చేయనని భీష్ముడు తన ఆయుధాలను వదిలివేశాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని అర్జునుడు అనేక బాణాలను సంధించి భీష్ముని నేలకొరిగించాడు. అనంతరం భీష్ముడిని అంప శయ్యపై పడుకోపెట్టాడు. భీష్మునికి లభించిన వరప్రభావం వల్ల తన శరీరాన్ని ఎప్పుడు విడిచిపెట్టాలో తానే నిర్ణయించుకునే శక్తి కలిగింది. కృష్ణుని దివ్య సంకల్పం వల్లనే భీష్ముడు తరువాత పాండవులకు ఉపదేశం చేసి, ప్రపంచానికి పవిత్రమైన విష్ణు సహస్రనామాన్ని ప్రసాదించాడు. ఆ విశేషాన్ని తదుపరి వ్యాసంలో ఆస్వాదిద్దాం.
ఆళ్వార్లు మహాభారత యుద్ధాన్ని అనేక పాశురాలలో కీర్తించారు:
- పేపేయాళ్వార్ తమ మూన్ఱామ్ తిరువన్దాదిలో “ఐవర్క్కాయ్ అన్ఱు మిడైన్దదు భారత వెంపోర్” (ఆ ఐదుగురు పాండవుల కొరకు భగవాన్ ఆ భయంకరమైన భారత యుద్ధాన్ని నడిపించాడు.)
- నమ్మాళ్వార్ తమ తిరువాయ్మొళిలో ఇలా అంటారు: “కొల్లా మాక్కోల్ కొలై చేయ్దు భారతప్ పోర్ ఎల్లాచ్ సేనైయుం ఇరు నిలత్తవిత్త ఎంధాయ్” (ఓ నా స్వామీ! గుర్రాలను నడిపించడానికి మాత్రమే ఉపయోగించే కొరడాతోనే, “మయైవైతే నిహతాః” అని గీతలో ప్రకటించినట్లుగా, కేవలం నీ దివ్య సంకల్పం ద్వారానే మహాభారత యుద్ధంలో ( ధర్మక్షేత్రం- అని పిలవ బడే కురుక్షేత్రం లో) సమస్త సైన్యాలను (వారు శత్రు సైన్యమా లేదా పాండవ సైన్యమా అని తేడా లేకుండా) సంహరించి భూమి భారాన్ని తగ్గించావు.)
- పెరియాళ్వార్ తమ పెరియాళ్వార్ తిరుమొళిలో ఇలా అంటారు: “మెచ్చూదు సంగమిడత్తాన్ నల్వేయూది పొయ్చ్చూధిల్ తోఱ్ఱ పొఱైయుడై మన్నర్క్కాయ్ పత్తూర్ పెరాద అన్ఱు భారతం కైసెయ్ద అత్తూధన్ అప్పూచ్చి కాట్టుగిన్రాన్ అమ్మనే! అప్పూచ్చి కాట్టుగిన్రాన్” (అందరూ స్తుతించే పాంచజన్యాన్ని ఊదేవాడు, మధురమైన వేణువును వాయించేవాడు అయిన కృష్ణుడు, మోసపూరితమైన జూదంలో ఓడిపోయిన సహనశీలులైన పాండవుల కొరకు మహాభారత యుద్ధాన్ని నిర్వహించాడు. ఆ దివ్య దూత ఇప్పుడు తన కనురెప్పలను ముడుచుతూ పిల్లలను భయపెట్టే అప్పుచ్చి ఆటను చూపిస్తున్నాడు.)
- తిరుమంగై ఆళ్వార్ తమ పెరియ తిరుమొళిలో ఇలా అంటారు: “పన్నియ బారం పార్ మగట్కు ఒళియ పారత మాపెరుం పోరిలో మన్నర్గళ్ మడియ మణి నెడుంతిణ్ తేర్ మైత్తునర్క్కు ఉయ్త్త మామాయన్” (భూమిదేవి భారం తొలగిపోవడానికి, ఆ మహామాయుడైన కృష్ణుడు దృఢమైన, సుందరమైన రథంపై నిలిచి మహాభారత మహాయుద్ధాన్ని నడిపించి అనేక రాజులను సంహరింపజేశాడు.)
ఈ సంఘటన యొక్క సారాంశం
- కృష్ణుని దివ్య సంకల్పం ఎంత అద్భుతం అంటే తన సొంత ప్రతిఙ్ఞను పక్కన పెట్టాల్సి వచ్చినా, తన భక్తుని ప్రతిజ్ఞ నెరవేరేలా చేస్తాడు. తాను యుద్ధంలో ఆయుధం ఎత్తబోనని ప్రతిజ్ఞ చేసినప్పటికీ, కృష్ణుడు ఆయుధం ఎత్తేలా చేస్తానని భీష్ముడు చేసిన ప్రతిజ్ఞను సత్యం చేశాడు.
- కేవలం అర్జునునికి రథసారథిగా నిలిచినంత మాత్రం చేతనే యుద్ధంలో విజయాన్ని అందించాడు. అయినప్పటికీ ఆ విజయ కీర్తి అంతా అర్జునుడికే దక్కేలా చేశాడు.
- అర్జునుడు ఎప్పుడెప్పుడు ప్రమాదంలో చిక్కుకున్నాడో, అప్పుడు అప్పుడు కృష్ణుడు తన దివ్య ముఖం, దివ్య భుజాలు, దివ్య వక్షస్థలంపై బాణాలను స్వీకరించి అతనిని రక్షించాడు. ఆ కారణంగానే నేటికీ ఆయన అర్చారూపంలో “పార్థసారథి”గా విశేషంగా కీర్తించబడుతున్నాడు.
మూలం : https://granthams.koyil.org/2023/10/29/krishna-leela-53-english/
అడియేన్ ఆకాష్ రామానుజ దాసన్
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org